అసెంబ్లీ

13:21 - June 9, 2017

గుంటూరు : అమరావతిలోని నూతన అసెంబ్లీ భవనంలోకి వర్షం నీరు రావడంపై 3వ రోజు సీఐడీ విచారణ కొనసాగుతోంది. వాటర్‌ లీక్‌ అయిన ప్రాంతాన్ని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. జగన్‌ చాంబర్‌ను జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. సివిల్‌ పనులను పరిశీలించి సీఐడీ అధికారులకు ప్రొఫెసర్ల బృందం రిపోర్టు ఇవ్వనుంది. 

09:59 - June 8, 2017

గుంటూరు : వెలగపూడిలోని ఏపీ సచివాలయం, అసెంబ్లీలోకి వర్షపు నీళ్ల లీకేజీ వ్యవహారం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీస్తోంది. నాసిరకం పనుల వల్లే వర్షపు నీళ్లు లీకేజీ అయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఇందులో కుట్ర కోణం దాగి ఉందని ప్రభుత్వమంటోంది. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఎలా లీక్‌ అయ్యాయో సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ను వివరణ కోరారు. అటు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు కూడా అసెంబ్లీని పరిశీలించారు.

లీకేజీలో కుట్ర....
వర్షపు నీళ్ల లీకేజీని పరిశీలించిన కోడెల ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఎవరో కావాలని జగన్‌ చాంబర్‌లోకి వెళ్లే ఏసీ పైప్‌ను కట్‌ చేశారన్నారు. ఆధారాలన్నీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించి విచారణ జరిపిస్తామన్నారు. అలాగే ఈ అంశంపై సీఐడీ ఎంక్వయిరీ వేస్తున్నట్లు.. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు కోడెల. జగన్‌ చాంబర్‌లో వర్షపు నీళ్లు లీకేజ్‌ కావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చెప్పేవన్నీ కట్టుకథలేనని వైసీపీ నేతలంటున్నారు. సాక్ష్యాలన్నీ తారుమారు చేసి సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించారన్నారు. ప్రభుత్వ తీరును, ఘటనాస్థలికి మీడియాను అనుమతించక పోవడాన్ని నిరసిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో వాస్తవాలన్నీ వెలుగు చూడాలంటే సీబీఐతో దర్యాపు చేయించాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి అధికార, ప్రతిపక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడమే కాదు.. వర్షపు నీళ్లు కూడా మాటల మంటలు పుట్టిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారంలో కుట్ర ఉందా.. లేక పనుల్లో నాణ్యతాలోపం తెలియాలంటే సీఐడీ నివేదిక వచ్చేదాకా వేచిచూడాల్సిందే !

19:04 - June 7, 2017

గుంటూరు : వెలగపూడిలోని ఏపీ సచివాలయం, అసెంబ్లీలోకి వర్షం నీరు రావడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఆర్డీఏ కమిషనర్‌ను చంద్రబాబు వివరణ కోరారు. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, స్పీకర్‌ కోడెలతో కలిసి కమిషనర్ శ్రీధర్‌ అసెంబ్లీని పరిశీలిస్తున్నారు. 

 

11:12 - June 7, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ గేట్ 2 వద్ద వైసీపీ చెందిన నలుగురు ఎమ్మెల్యేల ఆందోళన నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ ను పరిశీలించడానికి తమతో పాటు మీడియాను కూడా అనుమతించాలని ఎమ్మెల్యేలు పోలీసులను కోరారు. పోలీసులు మీడియాకు అనుమతి నిరాకరించారు. లోపల ఎలాంటి ఇబ్బంది లేకపోతే బయటకు చూపించడానికి ఇబ్బందేంటని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకుని తిరిగే చంద్రబాబు సచివాలయంతో ఆయన ఎంత అనుభవం ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. కేవలం 2 సెం.మీ వర్షం కురిస్తేనే ఇంత ఇబ్బంది ఎదురైతే భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలని వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారు.

 

06:35 - May 25, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో తెలంగాణ సచివాలయం, శాసనసభ, శాసనమండలి నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆర్మీ ఆధీనంలో ఉన్న బైసన్‌ పోలో గ్రౌండ్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో అక్కడ సచివాలయం, అసెంబ్లీ, మండలికి అద్భుత కట్టడాలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.

బైసన్‌ పోలో మైదానంలో కొత్త సచివాలయం-కేసీఆర్‌

హైదరాబాద్: రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమఖత వ్యక్తం చేసింది. దీంతో ఇక్కడ కొత్త సచివాలయంతోపాటు అసెంబ్లీ, శాసనసభ భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి పక్కనే ఉన్న పరేడ్‌ గ్రౌండ్‌ జోలికి వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారు.

అరవై ఏళ్లు ఉమ్మడి ఏపీ పాలనలో ...

అరవై ఏళ్లు ఉమ్మడి ఏపీ పాలనలో రాష్ట్రానికి సొంత పరేడ్‌ మైదానం కూడా లేకుండా పోయిందని కేసీఆర్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏ కార్యక్రమం జరుపుకోవాలన్న రక్షణ శాఖ నుంచి అనుమతి తీసుకునే పరిస్థితి ఉన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు.

రక్షణ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత..

బైసన్‌ పోలో మైదానాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత..ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, సచివాలయం, శాసనసభ, శాసనమండలి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తారు.

08:51 - May 18, 2017

గుంటూరు : ఏపీ కొత్త రాజధానిలో శాసనసభా భవనం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాజధాని నిర్మాణాల్లోనే తలమానికంగా ఉండేలా భవనాన్ని నిర్మిస్తామంటోంది ప్రభుత్వం. అందుకు 160 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో 140 ఎకరాలు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నారు. ప్రాంగణంలో జల, హరిత అవసరాలకోసం వదిలేస్తున్నారు. మొత్తం నగరానికే వన్నెతెచ్చేలా కొత్త అసెంబ్లీ బిల్డింగ్‌ నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అమరావతి నగర నిర్మాణంపై వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

90శాతం పూర్తయిన డిజైన్లు
కొత్త రాజధానిలో పరిపాలనా నగర ప్రణాళికలు, డిజైన్లు రూపొందించే పని 90శాతం పూర్తయిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈనెల 12 నుంచి 16 వరకు రాజధాని నగర నిర్మాణ డిజైన్లపై లండన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యంగా అసెంబ్లీ బిల్డింగ్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌, జలవనరులపై నార్మన్‌బృందంతో విస్తృతంగా చర్చించినట్టు అధికారులు చెప్పారు. అటు ఈనెల 20న మలివిడత ఆకృతులు కూడా అందుతాయని సీఆర్‌డీయే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. క్రిస్‌బెర్గ్‌ ఆధ్వర్యంలో అమరావతి నగర నిర్మాణ ప్రణాళిక ఇప్పటికే 90 శాతం పూర్తయినట్టు చెప్పారు. రాజధాని నగర నిర్మాణంలో సచివాలయ భవనం మరింత ప్రతిష్టాత్మకంగా ఉండేలా డిజైన్లు ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. సెక్రెటేరియట్‌ బిల్డింగ్‌ 8 నుంచి 10 అంతస్తుల్లో కనీసం 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 26 వేల మంది ఉద్యోగులకు కార్యస్థానంగా ఉండేలా సచివాలయ నిర్మాణం ఉంటుందన్నారు. సచివాలయం పరిసరాల్లో జల, హరిత ఆకర్షణలు కనువిందు చేస్తాయని తెలిపారు. భవిష్యత్తులో రాజధానిలో ఎలక్ట్రికల్‌ కార్లునడుస్తాయన్నారు. హైపర్‌లూప్‌ టెక్నాలజీ, మెట్రోరైలు , జలరవాణా, బిఆర్‌టీఆస్‌ వ్యవస్థలు ఉండేలా ప్రజారవాణా వ్యవస్థకు బృహత్‌ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

మౌలిక సదుపాయాలు...
రాజధాని నగర నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలతో త్వరలో అమరావతి పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. దాంతోపాటు నగరంలో సౌరవిద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక పద్ధతులపై కూడా అధ్యయనం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కి తెలిపారు. మరోవైపు రాజధానితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సౌరవిద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి సంకల్పిస్తున్నట్టు ముఖ్యమత్రి తెలియజేశారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు అన్ని సన్నాహాలు పూర్తిచేయాలని ఇంధనశాఖ కార్యదర్శిని ఆదేశించారు సీఎం చంద్రబాబు. 

18:28 - May 16, 2017

విజయవాడ : ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నిరసనలు, నినాదాల మధ్యే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. జీఎస్‌టీ బిల్లుతోపాటు రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన టెన్నిస్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్‌ వన్‌ సర్వీసులో ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ 45 నిమిషాల్లో ముగిసింది. ఉదయం 9.45 గంటలకు ప్రారంభమైన సభ పదిన్నర గంటలకు ముగిసింది. ముప్పావు గంటపాటు జరిగిన సభలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. జీఎస్‌టీ బిల్లుతోపాటు, ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అలాగే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు దేవినేని నెహ్రూ, ఆరేటి కోటయ్య, రుక్మిణి, బీ నారాయణరెడ్డిలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.

చర్చలో పాల్గొనని వైసీపీ..
రైతు సమస్యలను సభలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లిన ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్‌టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ, టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ముందుగా రైతు సమస్యలను చర్చించాలని పట్టుపడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న వైసీపీ సభ్యులు చర్చలో పాల్గోలేదు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ఈ బిల్లుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఈ బిల్లును ఆమోదించింది.  జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన తర్వాత ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి యనమల సభలో ప్రవేశపెట్టారు. రియో ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు గ్రూప్‌ వన్‌ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నినాదాల మధ్యే ఈ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.

12:44 - May 16, 2017

గుంటూరు : ప్రతిపక్ష వైసీపీ సభ్యుల నిరసనలు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. జీఎస్‌టీ బిల్లుతోపాటు, టెన్నిస్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్‌ వన్‌ ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదించేందుకు ప్రత్యేక భేటీ జరిగింది. అయితే రైతుల సమస్యలపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మర్చి రైతులకు న్యాయం చేయాలని నినిదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

09:57 - May 16, 2017
09:35 - May 16, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - అసెంబ్లీ