అసెంబ్లీ ఎన్నికలు

21:10 - November 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వల్లే పోటీపై సందిగ్ధం ఏర్పడిందన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే.. తెలంగాణలో 25 అసెంబ్లీ స్థానాల్లో, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై..రెండు, మూడు రోజుల్లో పార్టీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు సన్నదత లేకపోవడంతో పోటీ గురించి సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు కొంతమంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోతున్నామని.. తమకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారని తెలిపారు.

 

15:11 - November 8, 2018

దంతేవాడ: నవంబర్ 12 ఎన్నికల జరగనున్న చత్తీస్ ఘడ్  రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చత్తీస్ ఘడ్ లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక రోజు ముందు మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. చత్తీస్ ఘడ్  రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బచేలి సమీపంలో గురువారం మావోయిస్టులు ఒక బస్సుపై  దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తో సహా ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
గడచిన 2 వారాల్లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు పాల్పడటం ఇది మూడోసారి.  అక్టోబర్ 30 న ఎన్నికల వార్తల కవరేజ్ కు  వెళ్లిన దూరదర్శన్ టీంపై పైదాడి చేయగా దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానందన్ మరణించారు.  వారికి రక్షణగా వెళ్లిన  మరో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 27న  ఆవపల్లి వద్ద జరిగిన మరో దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు  మరణించారు.
90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చత్తీస్ ఘడ్ లో తొలిదశ పోలింగ్  నవంబర్ 12న జరుగుతుంది.  తొలిదశలో  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాల్లోని 18 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, మిగిలిన  72 నియోజకవర్గాలలో నవంబర్  20న పోలింగ్ జరుగుతుంది. 

07:54 - October 31, 2018

ఢిల్లీ: ఎన్నికల ప్రచార వార్తలు కవర్ చేయటానికి వెళ్లి  ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టుల దాడిలో మరణించిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద సాహు కుటుంబాన్నిఆదుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ చెప్పారు. నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌ఘడ్ లోని దంతేవాడ జిల్లా ఆరాన్పూర్ లో ఎన్నికల ప్రచారవార్తలు కవర్ చేయటానికి వెళ్లిన  దూరదర్శన్ మీడియా సిబ్బందిపై మంగళవారం మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈఘటనలో కెమెరామెన్ సాహూతోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు పోలీసులను దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని,అదే సమయంలో దాడి జరిగిందని ఎస్పీ అభిషేక్ పల్లవ్ చెప్పారు.

15:56 - October 24, 2018

ఖమ్మం: వైరాలో ప్రస్తుతం సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బానోత్ మదన్ లాల్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ లభించడంతో ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన మదన్‌లాల్‌... ఆ తర్వాత టీఆర్‌ఎస్ గూటికి చేరారు. కొత్త పార్టీలోనూ పట్టు సాధించారు. ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు ఇంకా ఆశావహుల విషయంలో ఫీట్లు చేస్తుంటే మదన్‌లాల్‌ ప్రచారంతో దూసుకుపోతున్నారు.

* 2014లో వైరాలో విజయం సాధించిన బానోత్‌ మదన్‌లాల్‌
* వైసీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన మదన్‌లాల్‌

వైరాలో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బానోత్‌ మదన్‌లాల్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి ఈసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. మదన్‌లాల్‌కు మండలాల వారీగా ఉన్న పట్టు, పరిచయాలు కలిసొచ్చే అంశం. గ్రామ గ్రామాన బలమైన క్యాడర్ ఉంది. చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు ఎలాగైనా గట్టెక్కిస్తాయనే ధీమాతో ఉన్నారు.

Image result for banoth madanlal trsఅయితే.. బలమైన నాయకగణంతో ఉన్న ఎంపీ పొంగులేటి వర్గీయులతో సఖ్యత లేదు. మదన్‌లాల్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. మదన్‌లాల్ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం అవుతారా లేక బీ-ఫామ్ సమయంలో అభ్యర్ధిని మారుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. 

2014 ఎన్నికల్లో..
వైసీపీ నుంచి పోటీ చేసిన మదన్‌లాల్‌కు 59,318 ఓట్లు
టీడీపీ అభ్యర్థి బాలాజీ నాయక్‌కు 48,735 ఓట్లు
టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన బానోత్‌ చంద్రావతికి 7,704 ఓట్లు 

ఎస్టీ రిజర్వు స్థానమైన వైరాలో గత ఎన్నికల్లో మదన్‌లాల్‌ వైసీపీ నుంచి పోటీ చేసి 59వేల 318ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి బాలాజీ నాయక్‌ 48,735 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం బాలాజీ నాయక్‌ సైతం గులాబీ గూటికి చేరారు. ఇక సీపీఐ నుంచి పోటీ చేసిన నారాయణకు 27,071 వచ్చాయి. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన బానోత్‌ చంద్రావతికి 7,704 ఓట్లు పడ్డాయి. 

వైరా నియోజకవర్గంలో కొణిజర్ల, వైరా, ఏన్కుర్, జూలూరుపాడు, కామేపల్లి మండలాలున్నాయి. 1978 నుంచి 2009 వరకు సుజాతానగర్ నియోజకవర్గంగా ఉండగా.. ఇది రద్దై 2009లో వైరా పేరుతో ఎస్టీ నియోజకవర్గం ఏర్పడింది. సుజాతానగర్ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 8సార్లు ఎన్నికలు జరిగాయి. 4సార్లు సీపీఐ నుంచి మహ్మమద్ రజబ్ అలీ గెలుపొందారు. అంతకు ముందు రెండు సార్లు విజయం సాధించారు. జిల్లాలో అత్యధికంగా గెలుపొందిన నేతగా రజబ్ అలీ రికార్డు సొంతం చేసుకున్నారు. ఖమ్మంలో సీపీఎం పక్షాన ఒక్కసారి, సీపీఐ పక్షాన మరోసారి గెలుపొందారు. 1994 ఎన్నికల తరువాత రజబ్ అలీ మరణించటంతో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. 1999, 2004లో రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. మూడు సార్లు రెడ్డి, ఒక్క సారి కమ్మ, మూడు సార్లు ముస్లింలు ఇక్కడ ఎన్నికయ్యారు.

* వైరా నియోజకవర్గంలో ఐదు మండలాలు
* కొణిజర్ల, వైరా, ఏన్కుర్, జూలూరుపాడు,  కామేపల్లి మండలాలు
* 1978 నుంచి 2009 వరకు సుజాతానగర్ నియోజకవర్గంగా ఉన్న వైరా 
* సుజాతానగర్ నియోజకవర్గంలో ఒక ఉపఎన్నికతో సహా 8 సార్లు ఎన్నికలు 
* జిల్లాలో అత్యధికసార్లు గెలుపొందిన నేతగా రజబ్ అలీ
* 1999, 2004లో రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపు

2014లో వైరాలో వైసీపీ అభ్యర్ధి మదన్‌లాల్ తన సమీప టీడీపీ అభ్యర్ధి బాలాజీ నాయక్‌పై గెలుపొందారు. ఎన్నికల తర్వాత కొంత కాలానికి మదన్‌లాల్ అధికార టీఆర్ఎస్‌లో చేరారు. వైరాలో సిపిఐ తరుపున 2009లో గెలుపొందిన బానోత్ చంద్రావతి బీజేపీలోకి వెళ్లి అక్కడ నుంచి టీఆర్ఎస్‌‌లోకి మారి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం చంద్రావతి టీఎస్‌‌పీఎస్‌సీ సభ్యురాలిగా ఉన్నారు.

07:11 - October 24, 2018

ఉత్తరప్రదేశ్ : ఓ సీఎం కాళ్లపై మరో సీఎం కాళ్లమీద పడి నమస్కరించిన ఘటన చోటుచేసుకుంది. పాదాభివందనం చేస్తేనే రాజకీయాల్లో ఎదగగలం అనే ఉద్ధేశంతోనే ఏమో మరి ఓ సీఎం తనకంటే దాదాపు 20 సంవత్సరాల వయసు వున్న మరో సీఎం కాళ్లమీద పడి ఆశీస్సులు తీసుకున్న ఘటనతో రాజకీయాల్లో ఎదుగుదల కోసం నేతలు ఎంతటి స్థాయికన్నా దిగజారతారనే విషయం మరోసారి తేటతెల్లమయ్యింది. మరి కాళ్ల మీద పడిన సీఎం ఎవరు? ఏ సీఎం కాళ్లమీద పడ్డారో తెలుసుకుందాం..

Image result for yogi adityanath and raman singhఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి  చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ నమస్కరించారు. చత్తీస్ గఢ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజ్ నంద్ గావ్ నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన వేళ సీఎం రమణ్ సింగ్ యోగి కాళ్ళకు నమస్కరించారు. తనకన్నా దాదాపు 20 సంవత్సరాలు చిన్నవాడైన ఆదిత్యనాథ్ కు రమణ్ సింగ్ పాదాభివందనం చేయడం గమనార్హం. 

14:27 - October 20, 2018

నిర్మల్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ చీఫ్ ఉతమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసాలో రాహుల్ గాంధీ ప్రజా గర్జన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తోందన్న ఉత్తమ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10సీట్లు తామే గెల్చుకుంటామన్నారు. నాలుగేన్నర ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించిన ఉత్తమ్.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వరికి ఎంఎస్‌పీ బోనస్ ఇచ్చి రూ.2వేలకు కొనుగోలు చేస్తామన్నారు. మొక్కజొన్నను రూ.2వేలకు.. పత్తిని రూ.7వేలకు.. మిర్చి, పసుపు రూ.10వేలకు కొనుగోలు చేస్తామన్నారు. అలాగే విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తామన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. నిర్మల్ జిల్లా భైంసాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, విజయశాంతి, రేవంత్ రెడ్డి, సబిత తదితరులు సభలో పాల్గొన్నారు.

11:42 - October 20, 2018
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ కరెన్సీ నోట్ల కలకలం చెలరేగింది. కరెన్సీ నోట్లు కట్టలుకట్టలుగా బయటపడుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో కోట్లాది రూపాయల హవాలా నగదు పట్టుబడుతోంది. భారీగా హవాలా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఓటర్లను కొనుగోలు చేసేందుకు ఏపీ నుంచి హవాలా డబ్బు తీసుకొచ్చారని, దీని వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని నమస్తే తెలంగాణలో కథనాలు వచ్చాయి. 
 
హైదరాబాద్ నుంచి జగిత్యాలకు కారులో డబ్బు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఆ కారు టీడీపీ నేతది కావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యదర్శి వల్లభనేని అనిల్‌కుమార్ కారులో తరలిస్తున్న రూ.59 లక్షల నగదు పట్టుబడటం సంచలనం రేపుతున్నది. అనిల్‌కుమార్ డ్రైవర్ మహేష్.. ఏజెంట్లకు అప్పగించేందుకు ఆ డబ్బుని తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నమస్తే తెలంగాణ కథనాల ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు అనిల్‌కుమార్ అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. తెలంగాణలో పంచేందుకు ఏపీ నుంచి ఆ డబ్బు తీసుకొచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. సొమ్మును క్షేత్రస్థాయిలోని నాయకులకు హవాలా మార్గంలో పంపి.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించారని చెబుతున్నారు.
Chandrababuకోఠీలోని పూజ ఫ్యాషన్స్‌లో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెబుతున్నారు. హవాలా దందాలో డబ్బు మార్పిడి చేసుకుంటుండగా సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి, ఐదుగురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో వల్లభనేని అనిల్‌కుమార్ డ్రైవర్ పుప్పల్ల మహేశ్, పూజ ఫ్యాషన్ షోరూం నిర్వాహకులు గమాన్‌సింగ్ రాజ్‌పురోహిత్, నేపాల్ సింగ్ అలియాస్ మైపాల్ (తండ్రీకొడుకులు), విజయవాడకు చెందిన దమాలూరి శ్రీనివాసరావు, బౌండరీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సిరిసిల్ల అవినాశ్ ఉన్నారు. వీరి నుంచి రూ.59లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
 
అనిల్‌కుమార్ తన వెర్నా కారు (ఏపీ 09సీఎఫ్ 1144)లో రూ.59 లక్షలుపెట్టి డ్రైవర్‌కు అప్పగించాడని, ఈ డబ్బును అనిల్‌కుమార్ స్నేహితుడైన వర్మ ఆదేశాలతో కోఠీలోని పూజ ఫ్యాషన్స్‌లో ఇచ్చేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి డ్రైవర్ మహేశ్ పూజ స్టోర్స్‌కు వెళ్లాడని పోలీసులు తెలిపారు. పూజ ఫ్యాషన్స్ నిర్వాహకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 0.6% నుంచి 08% కమిషన్‌తో హవాలా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నగదుతోపాటు డబ్బు తరలింపునకు వాడిన కారును స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన ఐదుగురిని ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నామని డీసీపీ వివరించారు. 
Ramana
 
కాగా, ఈ డబ్బు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు హవాలా మార్గంలో తరలిస్తున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని డీసీపీ చెప్పారు. అనిల్‌కుమార్ స్నేహితుడు వర్మ ద్వారా డబ్బుని జగిత్యాల జిల్లాకు తరలించేందుకు సన్నాహాలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది? అనిల్‌కుమార్‌కు ఆ డబ్బుతో సంబంధం ఉందా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు కనుగొనే పనిలో పోలీసులు ఉన్నారు. అనిల్‌కుమార్ డ్రైవర్‌ను విచారిస్తే హవాలాకు సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా డబ్బు తరలింపునకు టీడీపీ నేత వల్లభనేని అనిల్‌కుమార్ కారు వినియోగించడం అనేక అనుమానాలకు దారితీసింది.
19:36 - October 19, 2018

ఆదిలాబాద్‌: ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నోటుతో ఓటు కొనేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కసరత్తులు మొదలుపెట్టింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు నిఘా పెంచింది. ఈ నిఘాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. 

తాజాగా ఆదిలాబాద్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ.10కోట్ల నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. జైనథ్ మండలం పిప్పర్వాడ చెక్‌పోస్టులో తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో తరలిస్తున్న నగదుని పోలీసులు గుర్తించారు. నగదుని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానిపై ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో నగదుని హైదరాబాద్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

12:03 - October 17, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పక్షాలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అవకాశం ఉన్న అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులు తెలుసుకునేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దింపారు. ఈ విషయం బయటపడడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ కూడా అప్రమత్తమైంది. 
తెలంగాణ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌ పెద్దలు దృష్టి సారించారు. ఇక్కడి పరిస్థితులు, పరిణామాలపై ఎప్పటికప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు అక్కడి ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. నగరంలోని పలు హోటళ్లలో మకాం వేసి ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఏపీ అధికారుల కదిలికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టారు. 
అయితే.. ఏపీ నిఘా వర్గాలు నెల క్రితమే తెలంగాణలో దిగినట్లు సమాచారం ఉంది. తెలంగాణ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితి ఏంటి ? టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఇంకా అవకాశం ఉన్న ప్రాంతాలేంటి ? మహాకూటమిలో టీడీపీ చేరితే ఎన్ని సీట్లు కోరవచ్చు ? అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఆరా తీసినట్లు బయటకు పొక్కడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈ కార్యక్రమం మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు మరో అడుగు ముందుకేసి ప్రముఖ హోటళ్లలో బస చేస్తూ.. తెలంగాణ పోలీసు అధికారులపైనే రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఇంటిలిజెన్స్‌ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. 
సాధారణంగా ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు సమాచార గోప్యత, పని వెసులుబాటు కోసం ప్రైవేట్‌ చోట నుంచి పని చేసేందుకు తమ పరిధిలోని హోటళ్లను ఎంచుకుంటారు. అయితే ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలంగాణలో అనధికారికంగా దిగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ అధికారులు వ్యూహాత్మకంగానే కొన్ని హోటళ్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. రాజకీయ అంశాలపై ఆరా తీసే అధికారం ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులకు ఉండదని.. న్యాయవాదులంటున్నారు. మొత్తానికి దాదాపు 60 మంది నిఘా అధికారులను హైదరాబాద్‌కు పంపించినట్లు సమాచారం. అలాగే వందమంది ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు... నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో మోహరించినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఇంటెలిజెన్స్‌ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎవరికి దొరికిన సమాచారం వారు చేరవేస్తున్నారు. 
 

07:40 - May 15, 2018

బెంగళూరు : మరికొద్ది గంటల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. అయితే కర్నాటకలో గెలుపు ఎవరిదన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారంపై కాంగ్రెస్‌, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.... దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ మాత్రం హంగ్‌వైపే మొగ్గుచూపాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రారంభానికి ముందే తెరవెనుక మంతనాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు కౌంటింగ్‌ కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కర్నాటక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
మరికొద్ది గంటల్లో వెలువడనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదు కావడంతో గెలుపు ఎవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హంగ్‌ ఏర్పడే అవకాశముందని  మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేయడంతో.... అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ మరింత పెరిగింది. మధ్యాహ్నానికిగానీ ఉత్కంఠకు తెరపడే అవకాశముంది.
తమదే అధికారమంటూ కాంగ్రెస్‌, బీజేపీ ప్రకటనలు
ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బీజేపీ అధికారం తమదనే ప్రకటనలు చేస్తున్నాయి. తమకంటే తమకే మెజార్టీ స్థానాలు వస్తాయన్న ధీమాను ఆ పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. వీరి ధీమాలు, అంచనాలు ఎలా ఉన్నా... హంగ్‌ వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌, బీజేపీలు బయటకు తమకే ప్రజలు పట్టంగడతారని చెబుతున్నా.... లోలోనమాత్రం హంగ్‌ ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. 
హంగ్‌ ఏర్పడితే జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌
కర్నాటకలో హంగ్‌ ఏర్పడితే జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ అవుతుంది. అందుకే అటు కాంగ్రెస్‌గానీ... ఇటు బీజేపీగానీ.... జేడీఎస్‌కు గాలమేస్తున్నాయి. జేడీఎస్‌ పార్టీ అధ్యక్షుడు , మాజీ సీఎం కుమారస్వామితో ఇరుపార్టీల నేతలు అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తున్నారు. కుమారస్వామి ఉన్నపళంగా సింగపూర్‌ వెళ్లడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్య పరీక్షల కోసమని పార్టీ శ్రేణులు చెబుతున్నా... సింగపూర్‌ నుంచే ఆయన రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు సిద్ధరామయ్య జేడీఎస్‌తో పొత్తు విషయంపై సంకేతాలు ఇవ్వగా... మరోవైపు బీజేపీ కూడా దోస్తీకోసం ప్రతిపాదన పంపింది. అయితే గత అనుభాల దృష్ట్యా బీజేపీతో పొత్తు వద్దని కుమారస్వామి తండ్రి దేవేగౌడ ఇదివరకు హెచ్చరించారు. అయితే కుమారస్వామి మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మరోవైపు ఇరు పార్టీలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. నేటి ఫలితాల్లో హంగ్‌ ఏర్పడితే... జేడీఎస్‌ మద్దతు ఎవరికన్నది కీలకంగా మారింది. 
ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈసీ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 38 కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు జరుగనుంది.  అన్ని జిల్లా కేంద్రాల్లోనూ లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.  బెంగళూరు నగరంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.  స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్‌ దగ్గర 100 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు మొదలుకానుంది.
చెలరేగిపోతున్న బెట్టింగ్‌ రాయుళ్లు
కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్‌ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. మంత్రుల స్థానాలతోపాటు కీలక అసెంబ్లీ స్థానాలపై  బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది.ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది.. ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది.. కీలక నేతల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. అనే అంశాలపై పందెం రాయుళ్లు బెట్టింగ్‌లు కడుతున్నారు.  వాహనాలు, నగదు, ఆస్తులు, భూములు ఇలా అన్నింటిపైనా బెట్టింగ్‌లు కాస్తున్నారు. కర్నాటకతోపాటు తెలుగురాష్ట్రాలు, మహారాష్ట్రలో ఈ బెట్టింగ్‌లు వందకోట్లలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు పదుల సంఖ్యలో బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్‌ చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - అసెంబ్లీ ఎన్నికలు