ఆంధ్రప్రదేశ్

21:06 - July 16, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండాదగా చేసిన కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రధాని మోదీ చేసిన మోసాన్ని ఊరూవాడా ఎండగట్టాలని ప్రతిపాదించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంటు సీట్లలో టీడీపీని గెలిపిస్తే.. ప్రధాన మంత్రి ఎంపికలో కీలక పాత్ర పోషిస్తానని చంద్రబాబు చెప్పారు. టీడీపీ నిర్ణయించే నేత ప్రధాని అయితేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయని గుంటూరు జిల్లా కొల్లూరులో జరిగిన గ్రామదర్శిని-గ్రామ వికాస ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని పోతర్లంకలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. వేమూరు నుంచి దోనెపూడి చేరుకున్న చంద్రబాబు.. గ్రామదర్శిని-గ్రామ వికాస కార్యక్రమంలో పాల్గొన్నారు. దళితవాడలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని పరిశీలించారు. గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు లేవనెత్తిన అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

కొల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు.. ప్రధాని మోదీ నేతృత్వలోని ఎన్డీయే సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకండా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ మోసం చేశారంటూ మండిపడ్డారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌, దుగరాజపట్నం పోర్టు మంజూరు చేయని అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాన్ని అన్ని విధాల దగా చేసిన కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదన్నారు. వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పైనా విమర్శనాస్త్రాలు సంధించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు. మోదీ పాలనలో దేశంలో బ్యాంకులు దివాలా దీశాయని విమర్శించిన చంద్రబాబు.. ప్రజలు దాచుకునే డిపాజిట్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎంల్లో నగదు అందుబాటులో లేని పరిస్థితిని ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తూనే రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు అన్ని నదులను అనుసంధానం చేసి.. రాష్ట్రాన్నిసస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామదర్శిని-గ్రామ వికాస కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రంలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు మాగంటి బాబు ఓ టిఫిన్‌ సెంటర్‌లో సరదాగా ఆమ్లేట్‌ వేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన గ్రామదర్శిని-గ్రామ వికాస కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పూర్తి చేసున్న నిరుద్యోగులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. అన్ని జిల్లాలో ప్రారంభమైన గ్రామదర్శిని-గ్రామ వికాస కార్యక్రమంల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాన్ని జనం దృష్టికి తెచ్చారు. 

20:27 - July 12, 2018

అన్నా క్యాంటీన్లు అని కొత్తయి కొలాయించిండ్రుగదా..? క్యాంటీన్లు గట్టెకాడ కోట్ల రూపాల అవినీతి అయ్యిందట..ఏ ప్రభుత్వమైనా పేదోనికి కనీసం అందించవల్సిన సేవ ఏంది..?తెలంగాణ ప్రజలారా ఇది మీరు బాగ జూడాలే ముచ్చట.. ఏం ప్రభుత్వమండి చంద్రశేఖర్ రావుగారు మీది..? ఇదో ప్రభుత్వమేనా.?.బోధకాలు రోగం లేని మన్షిలేడు ఆ ఊర్లె.. ఈ తెలంగాణ ఆప్కారోళ్లకు బుర్ర పనిజేస్తలేదా ఏంది..? ఏటీఎంల పైసల తీస్కుందానమి వొయ్యని ఒకాయనను ఏటీఎం సతాయించింది.. గుడి కొచ్చిన భక్తులకు శఠగోపం బెట్టో తీర్థం బోశే.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:50 - July 12, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వం చేపడుతున్న..చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు..పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని..నూతన టెక్నాలజీతో అరకొటి మందిని సభ్యత్వం తీసుకోవడం జరిగిందన్నారు. 2016లో సభ్యత్వం 70 లక్షల మందికి చేరుకోవడం జరిగిందని..గ్రామ కమిటీలు..మండల కమిటీలు..జిల్లా కమిటీలు ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగిందన్నారు. నాలుగు రీజియన్ సెంటర్స్ ఏర్పాటు చేసి, శిక్షణా శిబిరాలు ఏర్పాటయ్యాయన్నారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలనే దృష్టి బాబులో ఉందని..పటిష్టంగా ఉంటే 175 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందన్నారు. 5162 బూత్ కన్వీనర్ల నియామకం పెండింగ్ లో ఉందని..ఇవి వెంటనే పూర్తి చేసే విధంగా ప్రజాప్రతినిధులు చూడాలన్నారు.

అనంతపురం, కడప, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బూత్ కన్వీనర్ల సమస్యలున్నాయని..వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. సేవా మిత్రలను సాధికారిక మిత్రలతో ట్యాగింగ్ చేయాలని..ఇందులో ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగిందని, కుప్పంలో పైలట్ చేసినట్లు పేర్కొన్నారు. వచ్చేవారంలో 'గ్రామ దర్శిని' కార్యక్రమం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని..ప్రతి ఇంటికి వెళ్లాలని..బూత్ కన్వీనర్లు ప్రతొక్కరినీ కలిసి సమస్యలను గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యక్తిని అనుసంధానం చేయడం జరుగుతుందని..పార్టీ ఆఫీసులో ఉంటూ సమాచారం ఇతరులకు తెలియచేస్తారని లోకేష్ పేర్కొన్నారు. 

21:03 - July 11, 2018

విజయవాడ : సులభతర వాణిజ్య విధానంలో ఏపీకి మొదటి స్థానం దక్కడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రజలు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైనందన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేదుకాబట్టే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. సులభతర వాణిజ్య విధానంలో ఏపీకి మొదటి స్థానం రావడం మంచిపరిణామని,ఈ విజయం తనకు నూతన జవసత్వాలను ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. సుపరిపాలనతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జగన్‌ అవినీతితో ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిందన్న చంద్రబాబు.. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రతిష్టను పునరుద్ధరించిన అంశాన్ని గుర్తు చేశారు. సులభతర వాణిజ్య విధానంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి కృషి చేసిన అందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. 

18:32 - July 11, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని..ఈ విషయంలో రాజకీయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. బుధవారం ఆయన ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం బాబు..మోడీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి నీరు ఎంతో ప్రధానమైందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడీ సానుకూలంగా ఉన్నారని, ప్రస్తుతం తాను ఇక్కడకు వచ్చి పనులను పరిశీలించడం జరిగిందన్నారు.

 తాను పోలవరానికి రావడం ఇది రెండోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. పోలవరం పూర్తి చేయడానికి మోడీ కట్టుబడి ఉన్నారని, ప్రాజెక్టు ఏపీకి కొత్త జీవాన్ని ఇస్తుందని, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరడం జరగిందన్నారు. పోలవరం ఏపీకే కాదు..దేశానికి కీలకమైన ప్రాజెక్టు అని అభివర్ణించారు. పోలవరం రైతులకు జీవితాన్ని ఇస్తుందని, కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించామన్నారు. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తామని ప్రకటించారు. 

ప్రతి నెలా ఇక్కడకు వస్తానని హామీనివ్వడం జరిగిందని, కానీ కొన్ని సమస్యల వల్ల ఇక్కడకు రావడం జరగలేదన్నారు. ఈ విషయంలో తాను ఢిల్లీలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆర్థిక మంత్రితో చర్చించి బాబు కోరినట్లుగా నిధుల అడ్వాన్స్ వచ్చే విధంగా చూస్తానని, డబ్బుల సమస్య లేదన్నారు. గిరిజన ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని, ఈ విషయంలో రాజకీయం అవసరం లేదని..కేవలం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. 

06:31 - July 4, 2018

ఏలూరు : టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక ఉచిత సరఫరా విధానానికి తూట్లు పొడిచేందుకు దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఏలూరులో జరిగిన ఎస్వీఆర్‌ శత జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

రైతులకు ఒకేసారి 50వేల రుణమాఫీ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో 11 శాతం వృద్ధి రేటు సాధించింది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్నారు. అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఆదాయం పెరిగిందని, రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో రైతుల కోసం 80వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించామన్నారు.

ప్రతి ఒక్క పేదవారికి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు సీఎం. ఒక్కరూపాయి అవినీతి లేకుండా రాష్ట్రంలో అన్ని పనులూ చేపడుతున్నామని తెలిపారు. 2019 మార్చిలోగా పేదలకు 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణపై చంద్రబాబు మండిపడ్డారు. ఏలూరులో అమరావతి తరహాలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఏలూరు రూరల్‌ మండలం కలపర్రులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో జరిగిన ఎస్వీఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... సినిమాల్లో ఆయన నటన అద్భుతమని ప్రశంసించారు. సినీరంగంలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేశారు.

బీజేపీని ఏదైనా అడిగితే ఎదురు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు సీఎం. వైఎస్సార్‌, జనసేన పార్టీలు బీజేపీలో కలిసిపోయాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో టూరిజాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. టూరిజం అభివృద్ధితో జిల్లాలో యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం. 

21:06 - June 30, 2018

విజయవాడ : ఇటీవల కాలంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆకతాయిల వేధింపులు, దాడులు పెరిగిపోయాయి. ఆకతాయిల వేధింపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీ సర్కార్‌ ఒక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోనే మెదటి సారిగా గుంటూరు రూరల్‌లో సబల అనే ప్రత్యేక మహిళా పోలీసు విభాగాన్ని ప్రారంభించారు.

ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి గుంటూరు రూరల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆలోచనలకు అణుగుణంగా సబల అనే మహిళా విభాగాన్ని రూపొందించారు. ఆడపిల్లలకు మేమున్నామంటూ భరోసా కల్పించడానికి సబల షీ టీమ్స్‌కు శ్రీకారం చూట్టినట్లు రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు.

ఆకతాయిల వేధింపులనుంచి మహిళలను రక్షించడానికి సబల అనే మహిళా విభాగాన్ని ప్రారంభించామని రేంజ్‌ ఐజి గోపాలరావు తెలిపారు. తెలంగాణలో ఉన్న షీ టీమ్‌ మాదిరిగా సబల మహిళా విభాగం పనిచేస్తోందన్నారు. సబల టీమ్‌లో నూతనంగా 130 మంది మహిళా కానిస్టేబుళ్లును ఎంపిక చేశామన్నారు. వీరికి ప్రత్యేక డ్రస్‌ కోడ్‌ను ఉంటుందన్నారు. మహిళలు, బాలికలకు ఎటువంటి సమస్య ఎదురైనా 94409 00866 అనే వాట్సప్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే సబల టీం వారి సమస్యను పరిష్కరిస్తుందని రేంజ్‌ ఐజీ గోపాలరావు అన్నారు.

సబల విభాగం అధునిక సాంకేతికత పరిజ్ఞానంతో పాటు ప్రత్యేకమైన శిక్షణను పొంది... పలు ప్రాంతాల్లో సైకిళ్లపై పర్యటిస్తోంది. విద్యార్థులతో, మహిళలతో మాట్లాడి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తారని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. సబల కార్యక్రమానికి సంబంధించిన లోగోను, సైకిళ్లను మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, రూరల్‌ ఎస్పీ సతీమణి కిరణ్మయినాయుడు ప్రారంభించారు.

06:33 - June 24, 2018

విజయవాడ : అమలు కాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏదైనా పార్టీ వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. కేంద్రం సహకరించకున్నా.. ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో.. అంగన్‌వాడీ టీచర్లు.. చంద్రబాబును కలిశారు. తమ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు.. సీఎంకు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఈ సందర్భంలో.. విపక్షాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమలు కాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే.. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. ఏదైనా ఒకపార్టీ.. వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గ్రామాల్లో చాటాలని అంగన్‌వాడీ టీచర్లకు చంద్రబాబు సూచించారు.

ఎన్నో కష్టాలు ఉన్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా.. ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కినా.. ఎక్కడా వెనుకడుగు వేయకుండా అభివృద్ధి దిశగా సాగుతున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, తద్వారా.. అభివృద్ధి శరవేగం పుంజుకుంటుందని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాను కరవు కోరలనుంచి బయట పడేయగలుగుతున్నామని, ఆ జిల్లాలో మండువేసవిలో కూడా చెరువుల్లో నీరుందంటే అది తమ ప్రభుత్వ దూరదృష్టి, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గర్భిణులు, గర్భస్థ, నవజాత శిశువులు మరణించకుండా చూడడం కూడా అభివృద్ధిలో భాగమేనని అన్నారు. ఆ దిశగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ అంగన్‌వాడీలు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

స్విస్ బ్యాంక్ నుంచి నల్లడబ్బు తెచ్చి ప్రతి పౌరుడికీ 15 లక్షల రూపాయలు ఇస్తానన్న ఎన్నికల హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇరవై వేలకుపైగా విద్యావాలంటీర్ల ఉపాధిని దెబ్బతీసిందని ఆరోపించారు. కేంద్రం మాటలే తప్ప ఆచరణలో హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. 

06:44 - June 22, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఎట్టకేలకు ఆమోదం పొందాయి. ఏప్రిల్‌ 6న వారు ఇచ్చిన రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఉప వైసీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలపై ఉత్కంఠకు తెరపడింది. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి చేసిన రాజీనామాలను రెండున్నర నెలల తర్వాత స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ఎట్టకేలకు ఆమోదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది.బుధవారం నుంచే రాజీనామాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎంపీలు ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న విడివిడిగా రాజీనామా లేఖలను స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు అందించారు. అయితే అప్పటి నుంచి వాటిని ఆమోదించకుండా స్పీకర్‌ పెండింగ్‌లో ఉంచారు. ప్రత్యేకహోదా కోసం తాము పదవీత్యాగం చేశామని, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్‌, ఎంపీలు చెబుతూ వచ్చారు. కానీ ఆ రాజీనామాలు ఆమోదం పొందలేదు. అంతేకాదు.. కర్నాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ముగ్గురు ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌... అంతకుముందే రాజీనామాలు సమర్పించిన వైసీపీ ఎంపీలపై నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మే 29న రాజీనామాలపై చర్చించడానికి వైసీపీ ఎంపీలను ఆహ్వానించారు. భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో రాజీనామాలు చేశారని... పునరాలోచించుకుని రావాలని స్పీకర్‌ సూచించారు. ఈనెల 6న వారితో మరోసారి భేటీ అయ్యారు. అయితే రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. దీంతో ఎట్టకేలకు వారి రాజీనామాలు ఆమోదంపొందాయి.

ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించడంతో.. ఇప్పుడు వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయా... లేదా అన్నది సర్వత్రా విస్తృతంగా చర్చ నడుస్తోంది. అయితే ఉప ఎన్నికలు రావన్నదే నిపుణుల మాట. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 151 (ఏ)సెక్షన్‌ ప్రకారం ఎంపీల పదవీకాలం మరో ఏడాదిలోపు మాత్రమే మిగిలి ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించకూడదు. ఏ స్థానమైనా ఖాళీ అయిన 6 నెలల్లో ఉప ఎఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అది చివరి ఏడాదికి వర్తించదని అదే చట్టం చెబుతోంది. దీన్ని ఈసీ వర్గాలు కూడా ధృవీకరించాయి. గతంలోనూ లోక్‌సభ చివరి ఏడాదిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నడూ ఎన్నికలు జరుగలేదని గుర్తు చేస్తున్నాయి. దీని ప్రకారం జూన్‌ 5 తర్వాత ఖాళీ అయిన ఏ లోక్‌సభ సీటుకూ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేనట్లే. వైసీపీ ఎంపీల రాజీనామాలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి కాబట్టి ఈ స్థానాలకు ఎప ఎన్నికలు జరగవని అధికారవర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ ఐదుగురు ఎంపీలు మాజీలు కావడంతప్ప ఏమీ ఉండబోదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

06:42 - June 10, 2018

విజయవాడ : బీజేపీతోపాటు.. కాంగ్రెస్‌, వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీకీ, ఆ పార్టీతో కుమ్మక్కైన పార్టీలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు సీఎం. అక్రమంగా సంపాదించిన జగన్‌ ఆస్తులను ఎందుకు వేలం వెయ్యకూడదంటూ ప్రశ్నించారు. పౌర సేవలను ఎలా సులభతరం చేయాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఆంధ్రప్రదేశ్