ఆత్మహత్య

14:40 - November 15, 2018

హైదరాబాద్ : ఆమ్లెట్ వేయలేదని భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఎంఐజికి చెందిన రేవడ మహేష్ (24), వనజ దంపతులు. మహేష్ వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో మహేష్ మంగళవారం రాత్రి మద్యం సేవించి, ఇంటికి వచ్చి భార్యను ఆమ్లెట్ వేయమన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.  ఈ విషయాన్ని ఫ్లాట్ యజమానికి చెప్పిన వనజ.. యజమాని ఇంట్లోకి వెళ్లింది. వనజ కొద్ది సేపటికి తిరిగి వచ్చి తన ఇంటి తలుపు కొట్టగా మహేష్ తలుపు తీయకపోవడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అక్కడి చేరుకున్న పోలీసులు రూమ్ తలుపు పగుల గొట్టి చూడగా మహేష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. 

 

22:17 - November 11, 2018

హైదరాబాద్ : నగరంలో విషాదం నెలకొంది. వెన్నునొప్పి భరించలేక ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  

గుంటూరు జిల్లా రెడ్డి పాలెంకు చెందిన ఇన్నమూరి శ్రీకాంత్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీకి చెందిన కల్లూరి రూపాదేవి (31)తో 2014లో అతనికి వివాహం జరిగింది. వీరికి కార్తికేయ అనే రెండున్నర ఏండ్ల బాబు ఉన్నాడు. ఫిలింనగర్ రోడ్ నం.5లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. రూపాదేవి యశోదా దవాఖానలో పల్మనాలజిస్టుగా పనిచేస్తున్నది. కాగా ... ఏడాదిన్నర క్రితం రూపాదేవికి వెన్నునొప్పి ప్రారంభమైంది. బెంగళూరు, గోవా, మైసూర్ ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రూపాదేవి శుక్రవారం రాత్రి భవనంలోని మొదటి అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకింది. ఇంట్లో మనవడితో ఆడుకుంటున్న రూపాదేవి తల్లి తులసి బయటకు వచ్చి చూడగా రూపాదేవి రక్తపుమడుగులో పడి ఉంది. స్థానికుల సహాయంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

 

21:50 - November 6, 2018

హైదరాబాద్: కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో రైల్వే స్టేషన్ పై నుంచి దూకి స్వప్న అనే వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ నగర్ లో ఉండే స్వప్న కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిసింది. కాగా....స్టేషన్ పై నుంచి దూకటంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె దూకినప్పుడు ఒక్క సారిగా పెద్ద శబ్దం రావటం గమనించిన స్ధానికులు, ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వప్న భర్త రాఘవేంద్ర సాఫ్టేవేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని వీరికి 2 సంవత్సరాల  బాబు ఉన్నాడని తెలిసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

11:28 - October 31, 2018

గుంటూరు : మంగళగిరిలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు వీడియో రికార్డ్‌ చేశాడు.
రత్నాల చెరువులోని సురేశ్‌ అనే వ్యక్తి ఇంట్లో 60 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారంటూ....గోపిరాజుతో పాటు అతని తల్లిని మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల వేధింపుల తట్టుకోలేక గోపిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు గోపిరాజు..తన తల్లితోపాటు తనను పోలీసులు దారుణంగా హింసించారని...ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వీడియోలో తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని....వాళ్ల వస్తువులు ఎక్కడో పొగొట్టుకొని తమను అనుమానిస్తున్నారని చెప్పాడు. తమను హింసించిన వారిని వదిలిపెట్టవద్దని వీడియోలో కోరాడు. చివరికి బంగారం అపహరణకు గురి కాలేదని ఇంటి యజమాని సురేశ్‌ పోలీసులకు తెలిపారు.

వీడియో రికార్డులోని అంశాలు.. 
’పోలీస్ స్టేషన్‌కు వెళ్తే నానా హింస పెట్టారు. ఒక్క రోజులోనే చాలా బాధ పెట్టారు. నేను అందరి కాళ్లు పట్టుకున్నాను. అందరినీ బతిమిలాడాను. ఎవ్వరి దగ్గర నాకు ఏ న్యాయం జరగలేదు. తీరా నా చేత తప్పు ఒప్పిద్దామని చూశారు. మా మీద చాలా నింద వేశారు. అప్పటికీ ఒప్పుకున్నా.. చేయని తప్పుకు ఎంతో కొంత ఒప్పుకుంటానని చెప్పాను. నాకు బతకాలని లేదు.. నా కుటుంబానికి న్యాయం చేయాలి.. నాకు పెళ్లికి కాని చెల్లి ఉంది. ఆమెకు పెళ్లి అయ్యేటట్లు చూడాలి. మేము చాకలోళ్లం.. నాలుగు ఇళ్లళ్లోకి వెళ్లి పని చేసుకుంటాం. మమ్మల్ని పనులకు ఎవరూ రానివ్వలేదు. మా పై నింద వేసిన వారిని మీరు ఉచితంగా వదలిపెట్టవద్దు..మా అన్నయ్య (మా పెద్దమ్మ వాళ్ల అబ్బాయి), మా పెద్దమ్మ మాకు న్యాయం చేస్తారనుకుంటున్నాను.   

 

10:36 - October 16, 2018

కృష్ణా : విజయవాడలో విషాదం నెలకొంది. ఐటీ అధికారుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐటీ శాఖా జరిమానా లక్షల్లో వచ్చిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదాయ పన్ను బిల్లు చెల్లించాలని సాదిక్‌పై ఐటీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారుల వేధింపులు తాళలేక రెండ్రోజుల క్రితం బందరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడలోని సనత్ నగర్‌కు చెందిన సాధిక్ ఆటో మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. బాడీ బిల్డింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఐటీ శాఖ అధికారులు రూ.50 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించాలని సాదిక్‌కు నోటీసులు పంపించారు. అయితే తన అకౌంట్‌ ట్రాన్సాక్షన్స్‌ బట్టి ఇంత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని... వ్యాపారం కూడా అంతంతమాత్రంగా జరుగుతుందని ఐటీ అధికారుల దగ్గరికి వెళ్లి సాదిక్ తన గోడును విన్నవించుకున్నాడు. కానీ రూ.50 లక్షలు కాదు.. రూ.20 లక్షలైనా కట్టాల్సిందేనని.. లేనిపక్షంలో ఐటీకి సంబంధించిన చట్టాలు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో సాదిక్ ఒక్కసారిగా ఆందోళన చెందాడు. తన సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. గత రెండ్రోజుల క్రింతం నమాజ్ చేసుకున్న సాదిక్ బందరు రోడ్డులోని కాలువలోకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాదిక్ ఇంటికి రాకపోవడంతో ఎక్కడిక్కెలాడో తెలియడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చుచ్టుపక్కల అతని కోసం వెతికారు. ఇవాళ ఘంటసాల సమీపంలోని కాలువలో సాదిక్ మృతదేహం లభ్యం అయింది. కాగా, సాధిక్ చనిపోవడానికి ప్రధానంగా ఐటీ అధికారుల వేధింపులే కారణమని అతని భార్య, కుటుంబ సభ్యులు అంటున్నారు.  

08:40 - October 15, 2018

కువైట్‌ : కువైట్‌లో కడప జిల్లావాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యజమాని వేధింపులు, పని ఒత్తడి తట్టుకోలేక బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా సుండుపల్లి మండలం జీకే రాచపల్లికి చెందిన గండికోట ఆనంద్ జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. కువైట్ సేట్ వేధింపులు, పని ఒత్తిడి తట్టుకోలేక మహబుల్ల ఏరియాలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

 

11:46 - October 11, 2018

హైదరాబాద్ : దేవుడు వున్నాడా? అనే ప్రశ్న వారి వారి నమ్మకాలను బట్టి వుంటుంది. దీని గురించి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు వుండవ్. కానీ దుష్టశక్తులనే విషయంలో మాత్రం దేవుడంటే నమ్మకం లేనివారు కూడా ఒక్కోసారి వీటి విషయంలో డైలమాలో పడిపోతుంటారు. అసలు దేవుడే లేనప్పుడు దెయ్యాలెలా వుంటాయి? అసలు దెయ్యాల వున్నాయా లేవా అనేది పక్కన పెడితే దెయ్యం కంటే భయ్యం మాచెడ్డదబ్బా..అందుకే చీకటిలోకి వెళ్లాలంటే చాలామంది భయపడుతుంటారు. దెయ్యాలు భయపెడుతున్నాయనీ..ఆత్మలు వేధిస్తున్నాయని కొందరు నమ్ముతుంటారు. కానీ ఆత్మలు వేధిస్తున్నాయని ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో ఈ ఘటన కలకలం రేపింది. ఆత్మలు, కొన్ని దుష్ట శక్తులు తనను  వేంటాడుతున్నాయంటూ ఓ మహిళ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ డిప్రెషన్ లో భాగంగా భవనంపై నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. 
బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని జహీరానగర్‌కు చెందిన అతియా షకీర్ అనే 42 మహిళ భర్త మహ్మద్ షకీర్‌తో కలిసి కెనెడాలో నివాసం ఉంటున్నది. వారికి ఐదుగురు పిల్లలు. కాగా... కొన్ని నెలలు గా తనను దుష్టశక్తులు, ఆత్మలు వెంటాడుతున్నాయంటూ అతియా షకీర్ తీవ్రమైన ఆందోళనకు గురవటంతో తనను హైదరాబాద్‌కు పంపించాలంటూ భర్తకు చెప్పడంతో మూడు రోజుల క్రితం కెనెడా నుంచి పంపించాడు. 
టోలీచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న సోదరుడు జమీల్ ఉర్ రహ్మాన్ ఇంటికి వచ్చింది. రెండు రోజులుగా జహీరానగర్‌లోని సొంతింట్లో ఉంటున్న నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవనంలోని ఐదో అంతస్తు పైకి ఎక్కిన అతియా కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న అతియా షకీర్ సోదరుడు జమీల్ ఉర్ రహ్మాన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  షకీర్ మానసిక పరిస్థితి తెలుసుకున్న డిప్రెషన్‌తో బాధపడుతుండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

12:45 - October 10, 2018

చెన్నై :  ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన యువతిపై ఓ కానిస్టేబుల్ అనుమానం పెంచుకున్నాడు.అనుమానం పెనుభూతంగా మారి విచక్షణ మరిచాడు. ఆమె మరెవరితోనో సన్నిహితంగా వుంటుందనే అనుమానంతో, ఆమెను కాల్చి చంపి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై సమీపంలోని విల్లుపురం, అన్నియూరులో జరిగిన ఈ దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కార్తివేలు అనే యువకుడికి మెడిసిన్ చదువుతున్న సరస్వతి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. గత కొంతకాలంలో సరస్వతి తనకు దూరమవుతూ, మరెవరికో దగ్గరవుతోందన్న అనుమానం కార్తివేలులో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సరస్వతి పుట్టిన రోజురాగా, వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఆమె వద్దకు వచ్చాడు. ఆపై వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరుగగా, తుపాకితో సరస్వతిని కాల్చిచంపిన కార్తివేలు, ఆపై తనను తాను కాల్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

14:36 - October 8, 2018

గుంటూరు : జిల్లాలో వరకట్న వేధింపులకు వివాహిత బలి అయింది. అత్తింటి వరకట్న వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మంగళగిరిలో నివాసముంటున్న భార్గవ్, శిరీషలు నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్నం కోసం భార్గవ్‌తోపాటు అతని తల్లిదండ్రులు శిరీషను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శిరీష అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి అత్తింటి వేధింపులే కారణమంటూ...మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

10:47 - October 7, 2018

పాట్నా : భారతదేశంలో ప్రేమికుల హత్యలు..ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తమ కులం కాదని..దాడులు..దారుణాలకు పెట్రేగిపోతున్నారు. పరువు హత్యలు కూడా ఇందులో చోటు చేసుకుంటుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. పాట్నాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మైనర్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

బీహార్ లోని గర్దనీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విష్ణుపురి ప్రాంతంలో మైనర్ యువతి..మైనర్ యువకుడు ప్రేమించుకున్నారు. అమ్మాయి వయస్సు 16 కాగా..అబ్బాయి వయస్సు 17 ఏళ్లు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీనితో వారిని మందలించారు. దీనితో వారి నివాసాల నుండి పారిపోయి వేరే దగ్గర నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడదీయాలని కుటుంబసభ్యులు భావించారు. దీనితో తాము ఒక్కటిగా జీవించలేమని భావించి ఆ మైనర్ ప్రేమికులు విషం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు..ఇతరులు గమనించి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ చికిత్స పొందుతూ వారిరిరువురూ స్వల్ప వ్యవధిలోనే కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆత్మహత్య