ఆత్మహత్యలు

12:58 - February 21, 2017

ఈ మధ్యకాలంలో విద్యార్థినుల ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మానసిక వత్తిడి..మరోవైపు ఆకతాయిలు వేధింపులు..కారణమైదైనా అంతిమంగా బలైపోతోంది ఆడపిల్లలే. అసలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్న కారణాలేంటీ ? ఇందులో విద్యా సంస్థలు..ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ? విద్యార్థినుల ఆత్మహత్యలు ఆగాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ ? ఈ అంశంపై మానవి 'వేదిక' ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రా మహిళా సభ కాలేజీ రిటైర్డ్ ప్రిన్స్ పల్ డా.దుర్గ, సైకాలజిస్టు శైలజలు పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:52 - February 2, 2017

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం నేతలు విమర్శించారు. సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో 'రైతు ఆత్మహత్యలు - సుప్రీంకోర్టు ఆదేశాలు' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. 1997 నుండి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఉమ్మడి ఏపీలో గత 20 ఏళ్లలో లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని, 2014 జూన్ నుండి ఇప్పటి వరకు 2450 మంది బలవంతంగా ప్రాణాలు విడిచినట్లు జాతీయ నేరాల బ్యూరో రిపోర్టు తెలిపిందన్నారు. రైతు ఆత్మహత్యలపై ఆరు లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న పాలకులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు.

16:40 - January 28, 2017

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయమన్నారు తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. కోర్టు తీర్పుతోనైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని ఆయన అన్నారు. అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల మరణాలను ప్రభుత్వం వక్రీకరిస్తోందని షబ్బీర్‌ ఆర్ అలీ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు.

16:11 - January 28, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చేనేత కార్మికులు బలవంతంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌ చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఘనమైన చరిత్రకలిగిన మన చేనేతను కాపాడుతామని సీఎం కేసీఆర్‌ నిత్యం చెబుతున్నా.. నేతన్నలు దైన్యంగానే జీవితాలను వెళ్లదీస్తున్నారు.

మారని నేతన్నల బతుకులు .....

కేసీఆర్‌ సర్కార్‌ ఎన్ని తియ్యటి మాటలు చెబుతున్నా.. నేతన్నల బతుకు చిత్రం ఏమాత్రం మారడం లేదు. తెలంగాణలో దాదాపు 12 లక్షలకు పైగా పద్మశాలీ కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. చేనేత వృత్తిపై దాదాపు 15 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఏడు వేల మంది సొసైటీల కింద పని చేస్తుండగా.. మిగతావారు స్వతంత్రంగా చేనేత పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో 50 వేల పవర్‌లూమ్స్‌ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 39 వేల పవర్‌లూమ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. మిగిలినవి నల్లగొండ, వరంగల్‌, గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ.. ఈ వృత్తిని వదులుకోలేక నేతన్నలు అందులోనే కొనసాగుతూ ఇబ్బందులు పడుతున్నారు.

టెస్కోని పటిష్టం చేయాలని డిమాండ్‌ ...

కష్టాల్లోఉన్న చేనేత రంగాన్ని కాపాడడ్డానికి వెంటనే చర్యలు చేపట్టాలని కార్మికసంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం తక్షణమే రాష్ట్ర చేనేత సహకార సంఘం..టెస్కోని పటిష్టం చేయాలంటున్నారు. మిల్లు బట్టలకు ధీటుగా ఎదగడానికి చేనేత రంగానికి చేయూత నివ్వాలంటున్నారు.

చేనేత చైతన్యయాత్రకు సిద్ధం...

చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయేందుకు, చేనేత చైతన్య యాత్ర చేపట్టేందుకు కార్మికసంఘం నేతలు సిద్దమౌవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలిలోనుండి నల్లగొండ జిల్లా పోచంపల్లిలో వరకూ యాత్ర చేయనున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి నానాటికీ దిగజారుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని,గత బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదనే విమర్షలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మిక సమస్యలపై స్పందించి ... వచ్చే బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని చేనేతకార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

12:13 - January 11, 2017

ఢిల్లీ : ప్రకృతి ఎప్పుడు కన్నెర్ర చేసినా.. ఆ ప్రభావం రైతన్నల పైనే పడుతోంది. ప్రతిఏటా సంభవించే కరవు కాటకాలకు దేశవ్యాప్తంగా చిన్న రైతులే చితికి పోతున్నారు. కరవు, వర్షాభావ పరిస్థితులు అదే పనిగా అన్నదాతల పాలిట శాపంగా మారి ఉసురు తీస్తున్నాయి. 2015 ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం కరవు పీడిత ప్రాంతం మహారాష్ట్రలో అత్యధికంగా రైతులు మృతి చెందారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న కమతాల రైతులే అధికంగా ఉండటం శోచనీయం. ! 
కరవుతో రైతులు విలవిల 
గత ఏడాది క్రితం వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరవుతో రైతులు విలవిలలాడి పోయారు. వర్షాలు లేక మరట్వాడా ప్రాంతం పూర్తిగా ఎడారిని తలపించింది. ఒక్క మహారాష్ట్రలోనే కాదు .. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న, సన్నకారు రైతులే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. 
రైతులే అధిక శాతం ఆత్మహత్యలు 
నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి కలిగిన రైతులే అధిక శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా 2015లో 72 శాతం చిన్న రైతులే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 10 హెక్టార్లు ఆపై భూమి కలిగిన రైతుల్లో ఆత్మహత్య శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కోవకు చెందిన రైతుల్లో కేవలం 2 శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015లో 8 వేల ఏడు మంది రైతులు ఉసురు తీసుకుంటే.. ఇందులో నాలుగో వంతు మధ్యతరగతి రైతులు ఉన్నారు. 2 నుంచి 10 హెక్టార్ల భూమి కలిగిన రైతులను మధ్యతరగతి రైతులుగా పరిగణిస్తారు. 
మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతం 
2010-11 వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. హెక్టార్‌ కంటే తక్కువగా భూమి ఉన్న వారిలో 67.1 శాతం ఉండగా... 1 నుంచి 2 హెక్టార్లు భూమి కలిగిన రైతులు 17.9 శాతం ఉన్నారు. అదేవిధంగా 2 నుంచి 10 హెక్టార్లు కలిగిన మధ్యతరగతి రైతులు 14.3 శాతం ఉంటే.. 10 హెక్టార్లకంటే ఎక్కువ భూమి కలిగిన మోతుబరి రైతులు 0.7 శాతం ఉన్నారు. మొత్తానికి సాగులో ఉన్న భూమి చిన్న రైతులకు అల్పంగా ఉందని గణాంకాలు చాటుతున్నాయి. ఉపాంత రైతులు సాగులో ఉన్న భూమి కేవలం 22.5 శాతం కాగా, 22.1శాతం భూమి చిన్న రైతుల చేతుల్లో సాగవుతోంది. అదే సమయంలో మధ్యతరగతి రైతుల 44.8 శాతం సాగుబడిలో ఉండగా... మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతంగా ఉంది.   
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి..
కేవలం వ్యవసాయం పైనే కాకుండా..వ్యవసాయేతర రంగాలపైనా దృష్టి పెట్టినప్పుడే రైతన్నల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని భువనేశ్వర్‌కు చెందిన నవకృష్ణ చౌదరి సెంటర్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ సృజిత్‌ మిశ్రా  సూచించారు. అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు చితికిపోకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 
ఉపాంత రైతులు బలవన్మరణాలు
గణాంకాల ప్రకారం.. మొత్తం 2,195 అతి తక్కువ భూమి కలిగిన ఉపాంత రైతులు బలవన్మరణాలకు పాల్పడగా...వారిలో మహారాష్ట్రలో 834, ఛత్తీస్‌గడ్‌లో 354 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిలో ఉన్నారు. అంటే మహారాష్ట్రలో 38 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 16 శాతం ఉపాంత రైతులు బలవంతంగా ఉసురుతీసుకున్నారు.  మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న 3,618 రైతుల్లో...1,285 మంది చిన్న రైతులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే అత్యధిక శాతం అంటే.. 35.5 శాతం ఆత్యహత్యలకు పాల్పడ్డట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక కర్ణాటకలో 3,618 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే... అందులో అధికమొత్తంలో 751 మంది చిన్నరైతులే ఉండటం శోచనీయం. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో చిన్నరైతులే 20 శాతం ఉండటం చూస్తే చిన్న రైతుల దుస్థితి ఎలా ఉందో అర్ధం అవుతోంది. 2015లో మొత్తం 160 మంది 10 హెక్టార్లకు పైబడ్డ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో తెలంగాణలో అత్యధికంగా అంటే.. 79 మంది మోతుబరి రైతులున్నారు. 37 మంది రైతులతో ఛత్తీస్‌గఢ్‌ రెండోస్థానంలో నిలిచింది. 
ఆత్మహత్య చేసుకున్నవారిలో చిన్న రైతులే అధికం 
అత్యధికంగా.. 354 మధ్యతరగతి రైతుల ఆత్మహత్యలు ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకోగా.. వాటిలో చిన్న రైతులు 310 మంది చనిపోయారు. మొత్తానికి కరవు కాటకాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న రైతులే అధికంగా ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

15:13 - November 19, 2016

విజయవాడ : ఏపీలోని పలు కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై వేసిన కమిటీ నివేదికను బయటపెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావుపై కూడా రోజా ఘాటు విమర్శలు చేశారు. బీచ్ ఫెస్టివల్స్ పై వున్న శ్రద్ధ విద్యార్థులపై లేదని రోజా విమర్శించారు.కార్పొరేట్‌ కాలేజీల్లోని విద్యార్థుల ఆత్మహత్యలపై రోజా ఆందోళన వ్యక్తం చేశారు.

14:05 - November 8, 2016

ఆత్మహత్యలు..ఇది సాధారణంగా రోజు ఏదో క సందర్భంలో ఏదో ప్రాంతంలో ఏదోక విషయంలో వినిపించే మాట..ఈ మాట సర్వసాధరణంగా మారిపోయింది.విద్యార్థులు పరీక్ష తప్పితే ఆత్మహత్య..రైతుల ఆత్మహత్యలు..వరకట్న వేధింపులతో ఆత్మహత్యలు..ర్యాంగింగ్ లతో ఆత్మహత్యలు..ఇలా ఈ మాట సర్వసాధరణంగా మారిపోయింది. రోజురోజుకూ ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మానవి వేదికలో ఆత్మహత్యలు పెరటానికి కారణాలేమిటి అనే అంశంపై చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొన్నవారు ఏం అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

21:27 - June 20, 2016

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యల హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్స్ ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం తప్పుపట్టింది. జాబితాలో సగానికి పైగా పేర్లు ఇతరత్రా కారణాల వల్ల అత్మహత్యలు చేసుకున్నవారివేనని ఉన్నత న్యాయస్థానికి వివరణ ఇచ్చింది. అయితే అంకెలపై సంతృప్తి చెందని ధర్మాసనం.. రెండు వారాల్లో పూర్తి ఆధారాలతో ఆఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అదేశించింది. గత ఏడాది రుణభారం, కరవుతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణలో చాలామంది రైతన్నలు బలవన్మరణం చెందారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలంటూ  ప్రొఫెసర్ కొదండరామ్, వ్యవసాయ సంఘాల నేత శ్రీహరి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ పిటిషన్ వేశాయి. దీనిపై విచారణలో భాగంగా పిటిషనర్లు చూపినట్లుగా 345 మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు 113 మంది మాత్రమేనని తెలిపారు.

దర్యాప్తు కొనసాగుతోంది..
త్రిసభ్య కమిటీతో ఆత్మహత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రత్యేక న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు చెప్పిన 345 మంది జాబితాలో 40 మంది పేర్లు పునరావృతమయ్యాయని చెప్పారు. వరంగల్‌లో 5గురు రైతులు ఆత్మహత్య చేసుకోకుండానే చేసుకున్నట్లు పిటిషనర్స్ పేర్లు ఇచ్చారని వాదించారు. జాబితాలో 301 మంది రైతుల పేర్లను... ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పరిశీలించగా.. 188 మంది ఆత్మహత్య చేసుకోలేదని తెలిపారు. పాముకాటుకు, కరెంట్ తీగలు తగిలి చనిపోయినా కూడా ఆత్మహత్యల లెక్కలో జమ చేశారన్నారు. అధికంగా భార్య, భర్తల గొడవలతో మద్యం సేవించి చనిపోయిన వారు ఉన్నట్లు కమిటీ దర్యాప్తులో తెలిందని రాష్ర్ట ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.  ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో మరో 43 మంది నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 70 మంది అప్పుల బాధతో చనిపోతే 60 మందికి నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. ప్రభుత్వ లెక్కలు, పిటిషనర్ల జాబితాకు పొంతన లేకపోవడంతో... రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతకంటే ముందు... రైతుల ఆత్మహత్యలకు కారణమైన బ్యాంకులు... వారికి రుణాలు సరిగా ఇవ్వడం లేదని పిటిషనర్ శ్రీహరి ధర్మాసనానికి నివేదించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారంపై మాత్రమే విచారణ జరుపుతున్నామని.. సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులతో పని చేయించుకోవాలని న్యాయస్థానం సూచించింది. 

17:14 - June 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరవు నెలకొన్న పరిస్థితుల్లో ఎంతో మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యలకు నివారణ చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. తాజాగా హైకోర్టులో రైతు ఆత్మహత్యలపై విచారణ జరిగింది. 345 మంది ఆత్మహత్య చేసుకున్నారనేది అవాస్తవమని, 188 మంది నకిలీ ఆత్మహత్యలేనని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. పది కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. రెండు వారాల్లోగా పూర్తి ఆధారాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

11:52 - May 3, 2016

దంపతుల మధ్య గొడవలు..ప్రేమ వ్యవహారం..ఆర్థిక సమస్యలు..మధ్యలోనే ముగిసిపోతున్న నూరేళ్ల జీవితం..
అహం..ఆవేశం..క్షణికానందం..ఇవే మనిషి మనుగడను శాసిస్తున్నాయి..చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేజేతులార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జీవితమంటే పూలపాన్పు కాదన్న నగ్నసత్యం గ్రహించలేకపోతున్నారు. ఎలాంటి వారికైనా ఆటుపోట్లు తప్పవని తెలుసుకోలేక పోతున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇలాగే నల్లగొండ జిల్లాలో తల్లి బిడ్డల ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది. విషాదకరమైన ఈ ఘటనలకు సంబంధించిన వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆత్మహత్యలు