ఆదాయం

17:10 - October 4, 2017
17:20 - September 18, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఖజానా ఖాళీ అయ్యింది. బల్దియాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ముందువేసుకున్న ప్రాజెక్టులు వెక్కిరిస్తున్నాయి. పూర్తయిన పనులకు చెల్లింపులు కష్టంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు తప్పవు. బల్దియాలో నిధుల కొరతపై 10టీవీ కథనం.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ .. ఒకప్పుడు భారీగా ఆదాయం కలిగిన లోకల్‌ బాడీ. ఇదంతా ఒకప్పటి చరిత్ర. ఇప్పుడు బల్దియాలో నిధులకు కటకట ఏర్పడింది. బల్దియాకు ఆదాయం భారీగా ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పైన పటారం.. లోన లోటారం అన్నచందంగా తయారయ్యింది జీహెచ్‌ఎంసీ పరిస్థితి.

నిత్యం కాసులతో కళకళలాడే బల్దియా గల్లాపెట్టే ఇప్పుడు వెలవెలబోతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరం వరకు జీహెచ్‌ఎంసీకి 600 కోట్ల ఎఫ్‌డీలు ఉండేవి. దీనిపై వడ్డీ రూపంలోనే దాదాపు 100 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే జీహెచ్‌ఎంసీ ఆదాయాన్ని ఆర్టీసీ, వాటర్‌ బోర్డుతో పాటు ప్రభుత్వం నిర్వహించే ఇతర పండుగలకు ప్రభుత్వం మళ్లించింది. దీంతో ఉన్న నిధులు కాస్తా కరిగిపోయాయి. ఒక ప్రభుత్వం ప్రకటించిన స్ట్రాటర్జిక్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్లాన్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కూడా జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున నిధులను ఖర్చుచేస్తోంది. దీంతో బల్దియా ఖజానా ఖాళీ అయ్యింది.

గత రెండేళ్లలో ఆర్టీసికి 330 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. ఆస్తిపన్నులో 15శాతం నిధులను జలమండలికి బదలాయిస్తున్నారు. దీంతో బల్దియా ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడింది. మరోవైపు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులను మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అంతేకాదు.... రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వృత్తిపన్ను, ఆస్తిపన్ను, మోటార్‌ వాహనాల పన్ను, స్టాంప్‌ డ్యూటీ కూడా విడుదల కాలేదు. 2016-17లో ప్రభుత్వం బల్దియాకు 632 కోట్లు చెల్లిస్తామని ప్రకటించి... కేవలం 52 కోట్లు మాత్రమే విడుదల చేసింది. స్టాంప్‌ డ్యూటీ 240 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా... కేవలం 40 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
బల్దియాలో పరిస్థితి ఇలానే కొనసాగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చివరికి ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని ప‌రిస్థితి దాపురిస్తోంది.వరల్డ్‌ క్లాస్‌ సిటీ అంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం నిధుల విడుదలలో మాత్రం బల్దియాకు మొండి చెయ్యిచూపుతుంది. దీంతో బల్దియా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను మంజూరు చేసి ఆదుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి.

19:00 - September 11, 2017

ఢిల్లీ : ఆదాయానికి మించి అధిక సంపత్తి కలిగి ఉన్న ఏడుగురు లోక్‌సభ సభ్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 98 మంది శాసనసభ్యులపై విచారణకు రంగం సిద్ధమైంది. వీరి ఆదాయం లెక్కకు మించి ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గణనీయంగా ఆస్తులు పెంచుకున్న ఏడుగురు ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేలపై దర్యాప్తు జరపాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ని ఆదేశించింది. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితాను సీల్డ్‌కవర్‌లో మంగళవారం నాటికి సిబిడిటికి అందుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఐటి విభాగం అధికారులు ఎంపీలు... ఎమ్మెల్యేలపై జరిపిన ప్రాథమిక విచారణలో గణనీయంగా ఆస్తులు పెంచుకున్నట్లు సిబిడిటికి సుప్రీంకోర్టు తెలిపింది. లక్నోలోని ప్రముఖ ఎన్‌జీఓ సంస్థ 'లోక్‌ ప్రహరి' ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయింయించింది. ఈ ఆస్తులపై విచారణ జరపాలని కోరింది. 26 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 257 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టుకు అందించింది. 

10:27 - September 8, 2017

అవును మీరు వింటున్నది..చదువుతున్నది నిజమే. బీర్ల అమ్మకాల్లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందున్నది. దక్షిణాది రాష్ట్రాలన్నింటితో పోల్చుకుంటే రాష్ట్రంలో ఏ ఏడాది ఏప్రిల్ - జులై లో ఏకంగా రూ. 19.75 కోట్ల బీరు తాగేశారు. అంటే బీరు తాగేయడంలో దూకుడు కనిపిస్తోందన్నమాట. అమ్మకాలు పెరగడంతో అబ్కారీ శాఖ గల్లా గల గలా అంటోందంట.

రాష్ట్రంలో మొదటి నాలుగు నెలల్లో 1.20 శాతం అమ్మకాలు పెరిగాయని, రెండో స్థానంలో ఉన్న ఏపీ 2.92 శాతమే అమ్మకాలు పెరిగాయి. కేరళలో 5.31 శాతం, తమిళనాడులో 7.5 శాతం మేర మద్యం అమ్మకాలు జరిగాయి. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరు మీదున్నాయి. తెలంగాణ రాష్ట్రానితో పోల్చుకుంటే 2016-17 సంవత్సరం మధ్య ఆదాయం ముందటి ఏడాదితో పోల్చుకుంటే 11.65 శాతం పెరగడం గమనార్హం. పక్కనున్న ఏపీ రాష్ట్రంలో ఈ వృద్ధి 8.02 శాతం మాత్రమే. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 24.80 శాతం పెరిగాయన్నమాట. ఇక్కడ కేరళలో బీర్ల అమ్మకాలు 38.05, తమిళనాడులో 15.03 శాతం క్షీణించడం విశేషం. మొత్తంగా చెప్పుకొంటే తెలంగాణ రాష్ట్రంలో బీరు ఏరులై పారుతోందన్నమాట. 

15:55 - August 12, 2017

హైదరాబాద్ : నగర అభివృద్ధికి, కొత్త ప్రాజెక్ట్‌ల అమలుకు, జీతాల చెల్లింపులకు, రోజువారి మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులను సమీకరించేందుకు కొత్త వ్యూహాలకు బల్దియా పదును పెడుతోంది. ప్రాపర్టీ టాక్స్‌ వసూళ్లలో దూసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అంతే కాకుండా అధికారులతో వీక్లీ రివ్యూ పెట్టి మరీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే సునామీ సర్వే.. ఆస్తి పన్నులో ఉన్న లోపాలను రివ్యూ చేసి పన్నులు పెంచేందుకు ప్లాన్ చేశారు. బల్దియా ఎన్నికల సమయంలో 1200 రూపాయల లోపు ఉన్న ఆస్తిపన్నును రద్దు చేశారు. అయితే వాటికి అసలు పన్ను ఎంత ఉంటుందని రివిజన్ చేసిన బల్దియా అధికారులు.

60 కోట్ల పన్ను
30 శాతం నుంచి 500 శాతం వరకు పన్నును విధించారు. దాంతో మొదట్లో రద్దైన పన్ను కంటే ఎక్కువ మొత్తంలో పన్ను డిమాండ్‌ను పెంచారు. దీంతో పాటు ఈ ఏడాది లెక్కలోకి రాని ఆస్తులు.. ఖాళీ స్థలాలను కూడా పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బల్దియా తీవ్ర కసరత్తు చేస్తోంది. వాటిపై 60 కోట్ల పన్ను రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా.. ఈ ఏడాది 1450 కోట్ల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇప్పటికే 541 కోట్ల ఆస్తిపన్ను వసూలు అయ్యింది. మార్చి నాటికి 909 కోట్లు వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రతీ వారం పన్ను వసూళ్లపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతీ నెల 113 కోట్ల చొప్పున వసూలు చేయాలని టార్గెట్ ఫిక్స్‌ చేసుకున్నారు.

పన్నులు భారీగా పెంచనున్న జీహెచ్ఎంసీ
ఇక ట్రెడ్‌ లైసెన్స్‌ పన్ను ప్రకటనల పన్నులను కూడా భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో ఉన్న హోర్డింగుల నిర్వహణను స్ట్రీమ్‌ లైన్‌ చేయడం ద్వారా 100 కోట్ల ఆదాయం వస్తుంది. గతేడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా 50 కోట్ల ఆదాయం ఆర్జించిన జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది దానిని 100 కోట్లకు పెంచాలని చూస్తోంది. ఇందులో ఉన్న లోపాలను సవరించేందుకు ఇటీవలే స్టాండింగ్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో సిటీలో ఉన్న ప్రతీ వ్యాపారాన్ని లైసెన్స్ పరిధిలోకి తెచ్చి.. వారందరి నుంచి పన్ను రాబట్టాలని డిసైడ్ చేసింది. ఇక ప్రతీ యేటా టౌన్ ప్లానింగ్ ద్వారా వస్తున్న 600 కోట్ల ఆదాయాన్ని కూడా ఈ సారి భారీగా పెంచడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. సిటీ డెవలప్‌మెంట్ కోసం పలు భారీ ప్రాజెక్ట్‌లను ముందేసుకున్న బల్దియా.. వాటిని కంప్లీట్ చేసేందుకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అన్ని రకాల ప్లాన్స్ వేస్తుంది. ఈ ఏడాది కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు షెడ్యూల్‌ ప్రకారం పూర్తవుతాయా.. లేదా అనేది మార్చి చివరికి తేలిపోనుంది. 

16:57 - May 26, 2017

అస్సాం : 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున రైతుల ఆదాయం రెండింతలు పెరగడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వ్యవసాయరంగంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయ పడ్డారు. అస్సాంలో ఆగ్రో మెరైన్‌ ప్రాసెసింగ్‌ స్కీమును ప్రారంభించిన మోడీ సభనుద్దేశించి ప్రసంగించారు. తమ మూడేళ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో స్కీములు ప్రవేశపెట్టామని మోది చెప్పారు.

19:10 - May 17, 2017

ఖమ్మం: మండుతున్న ఎండలు.. మద్యం విక్రయాలను భారీ స్థాయిలో పెంచేశాయి. ముఖ్యంగా చల్లచల్లని బీర్‌ల కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. దీంతో ప్రస్తుత వేసవిలో.. కోట్లాది రూపాయల మద్యం అమ్ముడవుతోంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీర్‌లకు డిమాండ్‌

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ... భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉపశమనం కోసం వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ జాబితాలో చల్లచల్లని బీర్‌లు అగ్రస్థానంలో నిలిచాయి. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కోసం.. ప్రజలు బీర్‌ సేవనంపై అమితాసక్తిని కనబరుస్తున్నారు.

డిమాండ్‌కు సరిపడా బీర్‌ కేసులు లేకపోవడంతో..

ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు సరిపడా బీర్‌ కేసులు లేకపోవడంతో.. మద్యం విక్రయదారులు.. బీర్ల ధరలను అమాంతంగా పెంచేశారు. మద్యం ప్రియులు కూడా.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరను చెల్లించి మరీ బీర్‌ సీసాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాలు ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో, కేవలం బీర్లను విక్రయించడం ద్వారానే.. జిల్లా ఎక్సైజ్‌ శాఖ 45 కోట్ల 50 లక్షల రూపాయల మేర ఆదాయాన్ని సముపార్జించింది.

రెండు జిల్లాలో 144 వైన్‌ షాపులు, 44 బార్లు, 3 క్లబ్‌లు...

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 144 వైన్‌షాపులు, 44 బార్లు, మూడు క్లబ్‌ల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. రెండు జిల్లాలలోనూ.. మార్చిలో ఒక లక్షా 82 వేల 7 వందల 47 కేసుల బీర్‌ విక్రయం ద్వారా.. మొత్తం రూ.19.77కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్లో 2 లక్షల 34వేల 161 కేసుల బీర్‌ అమ్మకాల ద్వారా రూ.25.30 కోట్లు సమకూరింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 4 లక్షల 24 వేల 428 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 4 లక్షల 16 వేల 908 కేసులు విక్రయించారు.ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా టీఎస్‌బీసీఎల్‌ అధికారులు వైరాలోని డిపోకు గతంకంటే అదనంగా బీర్లను సరఫరా చేయిస్తున్నారు. గత ఏడాది రెండు నెలలతో పోలిస్తే.. ఈ సంవత్సరం దాదాపు ఏడు వేల 5 వందల 20 కేసుల బీర్‌ విక్రయాలు తగ్గాయి. కానీ మద్యం రేట్లను భారీగా పెంచడం వల్ల.. ఎక్సైజ్‌ శాఖకు ఆదాయమూ గణనీయంగా పెరిగింది.

మే నెలలో 16 రోజుల్లోనే అత్యధిక మద్యం విక్రయాలు...

ఉభయ జిల్లాలో కేవలం మే నెలలోని 16రోజుల్లోనే మద్యం విక్రయాలు చాలా అధికంగా జరిగాయి. అందులో రూ.14 కోట్ల వరకు బీర్‌ విక్రయాలు ఉండటం విశేషం. గతేడాది మే నెలలో ఉమ్మడి జిల్లాలో రూ.86 కోట్ల విక్రయాలు జరగ్గా ఈ ఏడాది ఆ మొత్తం వంద కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

19:40 - January 10, 2017

విజయవాడ : నోట్ల రద్దు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం 7శాతం మేర తగ్గిందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీంతో రెవెన్యూ లోటు 14వేల కోట్ల రూపాయలకు చేరిందని.. ఆర్థికలోటు 24వేల కోట్ల రూపాయలకు పెరింగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కంటే అదనంగా 23వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వెలగపూడి సచివాలయంలో రెండో రోజు వాణిజ్య, పరిశ్రమశాఖకు చెందిన ప్రముఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాకాలు ప్రతి మూడు నెలలకోకసారి అందించాలని చంద్రబాబు ఆదేశించారని యనమల అన్నారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమల రెన్యూవల్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని యనమల వెల్లడించారు. 

19:45 - December 7, 2016

ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం డొల్లేనా..? స్వచ్ఛందంగా బ్లాక్‌మనీని ప్రకటించేందుకు ఉద్దేశించిన ఐడీఎస్‌ తుస్సుమన్నట్లేనా..? 65వేల కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందన్న ప్రభుత్వ ప్రకటనలోనే వాస్తవమెంత..? అసలు ఈ పథకం ప్రవేశపెట్టి.. కేంద్రం ఏం ఉద్ధరించినట్లు..! ఏం లబ్దిపొందినట్లు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మేధావులు, ఆర్థిక నిపుణుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు..! ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శశికుమార్ (చార్టర్డ్ అకౌంటెంట్), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

20:26 - November 24, 2016

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ఆదాయానికి గండి పడుతుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత బి.వెంకట్, టీకాంగ్ నేత మల్లురవి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వక్తలు అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆదాయం