ఆధిపత్యం

07:33 - August 5, 2018

వరంగల్ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గం వర్గపోరుకు అడ్డాగా మారుతోంది. అటు అధికార టీఆర్‌ఎస్‌లోనూ.... ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలోనూ నాయకత్వం వర్గాలుగా విడిపోయింది. దీంతో ఆధిపత్యపోరు కోసం ఎప్పుడూ కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. వర్గపోరుతో తరచూ వార్తల్లోకెక్కుతున్న స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గంపై కథనం...

స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గం పార్టీల ఆధిపత్య పోరుకు అడ్డాగా మారుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ధర్మసాగర్‌ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఈ వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని ప్రారంభించడానికి సింగపురం ఇందిర వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న విజయరామారావు వర్గానికి చెందిన నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. స్థానికంగా ఉండే తమను కాదని.... మీరెలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ఇందిరను నిలదీశారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి తోపులాట వరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా.... ఒకరి ఫ్లెక్సీలు ఒకరు చించివేసుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి కూడా చేసుకున్నారు.

సింగపురం ఇందిర వర్గానికి చెందిన నాయకులు డీజే సౌండ్‌తో ఊరేగింపుగా పంక్షన్‌హాల్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుపడ్డారు. అనుమతి లేదంటూ ఆ ఫంక్షన్‌ హాల్‌కు తాళం వేశారు. అయితే ఇదంతా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే రాజయ్య చేయిస్తున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఫంక్షన్‌హాల్‌లో సమావేశం జరుగకుండా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిర్వహించారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఇందిర హెచ్చరించారు.

కాంగ్రెస్‌లోని మరోవర్గం నేత విజయరామారావు అనుచరులు కూడా సమావేశంలో ప్రసంగించారు. పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తులు. స్థానికంగా ఉన్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేపట్టడమేంటని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు సృష్టించవద్దని హెచ్చరించారు. మొత్తానికి స్టేషన్‌ఘణపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాలు ఆధిపత్యంకోసం పోటీ పడుతున్నాయి. ఇరువర్గాల మధ్య పోరు రోజురోజుకు ముదురుతోంది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్‌ కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు లొస్తున్నాయి. దీంతో నియోజకవర్గ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

08:30 - June 13, 2018

నిర్మల్ : ఆ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనారిటీ ఓటర్లే అధికం. కానీ పాలకులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడు ఆ నాయకులు గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ముథోల్‌ నియోజకవర్గంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికం
నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికంగా ఉన్నారు. కానీ ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో దళిత, బహుజన, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో బహుజనులకు అధికారాన్ని కట్టబెట్టాలనే యోచనలో నియోజకవర్గ  ప్రజలు ఉన్నారు. 
ముథోల్‌.. 117 గ్రామాలు, 49 తాండాలు 
ముథోల్‌ నియోజకవర్గంలో ముథోల్‌తో పాటు కుంటాల, కుబీర్, లోకేశ్వరం, తానూర్, భైంసా మండలాలున్నాయి. ఈ మండలాల్లో 117 గ్రామాలు, 49 తాండాలు ఉన్నాయి. గత ఎన్నికల ప్రకారం మొత్తం 2,06,230 మంది ఓటర్లు ఉన్నారు. వీరీలో ఎస్సీ ఓటర్లు 20 శాతం, ఎస్టీ ఓట్లరు 9 శాతం, బీసీలు 31 శాతం, మైనారిటీలు  14 శాతం ఉండగా..  ఇతర ఓటర్లు 24 శాతం ఉన్నారు. 
రెడ్డి, రావు సామాజికవర్గం ఆధిపత్యం 
ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలు ఉన్నా ముథోల్‌ నియోజకవర్గంలో రెడ్డి, రావు సామాజిక వర్గాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయి. 1957 ఎన్నికల్లో గోపిడి గంగిరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1962లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1967లో గడ్డన్నరెడ్డి ముథోల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన వరుసగా 1972, 1978,1983 ఎన్నికల్లో గెలిచారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గడ్డన్నపై టీడీపీ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి విజయం సాధించారు. తిరిగి 1989 ఎన్నికల్లో గడ్డన్న తన పదవిని చేజిక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో గడ్డన్న మరోసారి ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్‌ ఆయనపై విజయం సాధించారు. మళ్లీ 1999లో గడ్డన్న గెలవగా.. 2004 ఎన్నికల్లో నారాయణరావు పటేల్‌ని ప్రజలు గెలిపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేణుగోపాలచారి అనూహ్య విజయం సాధించారు. ఇక 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి రమాదేవీపై 14,837 ఓట్లతో విజయం సాధించారు. 
బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తారా ? 
ఇప్పటి వరకు ఏ పార్టీ చూసినా రెడ్డి, రావు సామాజిక వర్గానికి తప్ప ఇతర సామాజిక వర్గానికి టికెట్‌ ఇచ్చిన దాఖలు లేవు. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవ్వటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత, బహుజనుల కేంద్రం అయినప్పటికీ....  రెడ్డి, రావు సామాజిక వర్గాలకు చెందినవారు ఎమ్మెల్యేలుగా ఉండటంతో అభివృద్ధిలో ముథోల్‌ నియోజకవర్గం వెనుకపడిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో ముథోల్‌ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. గోదావరి నది పక్కనే ప్రవహిస్తున్నా... వ్యవసాయానికి చుక్కనీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఉపాధి కరువై దుబాయ్‌, ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే.. వచ్చే ఎన్నికల్లో బహుజనులనే ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీలు ఈ సారి కూడా ఆ సామాజిక వర్గాలకే టికెట్‌ ఇస్తాయో... ప్రజలు కోరుతున్నట్టు బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.

09:34 - January 26, 2018

దక్షిణాఫ్రికా : వాండరర్స్‌ టెస్ట్‌ రెండో రోజు సైతం బౌలర్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. తొలి రోజు భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోగా...రెండో రోజు భారత బౌలర్ల ధాటికి సఫారీ  బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. డీన్‌ ఎల్గార్‌, ఐడెన్‌ మర్కామ్‌, డివిలియర్స్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ బోల్తా కొట్టించగా...నైట్‌ వాచ్‌మన్‌ రబడను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు.కెప్టెన్‌ డు ప్లెసీ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.క్రీజ్‌లో పాతుకుపోయిన హషీమ్‌ ఆమ్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టెస్టుల్లో 37వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన ఆమ్లా 121 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు.లోయర్ ఆర్డర్‌లో వెర్నోర్‌ ఫిలాండర్‌  కీలక  ఇన్నింగ్స్‌ ఆడాడు.194 పరుగులకు ఆలౌటైన  సఫారీ టీమ్‌ ..7 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా...భువనేశ్వర్‌ 3 వికెట్లు తీశాడు.

 

07:53 - November 19, 2017

కోల్ కతా : భారత్‌, శ్రీలంక తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు కష్టాలు కొనసాగుతున్నాయి.ఇండియన్‌ క్రికెట్‌ మక్కా కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతోన్న 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో శ్రీలంక జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా...టీమిండియా స్టార్స్‌ మాత్రం తేలిపోతున్నారు.తొలి ఇన్నింగ్స్‌లో లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన భారత్‌...బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోతోంది.మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచాలని లంక జట్టు పట్టుదలతో ఉంది.
తొలి టెస్ట్‌లో తేలిపోతోన్న భారత జట్టు  
కోల్‌కతా టెస్ట్‌లో పటిష్టమైన భారత్‌పై శ్రీలంక జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇండియన్‌ క్రికెట్‌ మక్కా..ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య భారత జట్టు తేలిపోతోంది. సిరీస్‌కు ముందు బలహీనంగా కనిపించిన శ్రీలంక టీమ్ డామినేట్‌ చేస్తుండగా .... టీమిండియా స్టార్స్‌ మాత్రం విఫలమవుతున్నారు. 5 వికెట్లకు 74 పరుగులతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌...ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 98 పరుగులు మాత్రమే జోడించగలిగింది.తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన లంక జట్టు...లహిరు తిరిమాన్నే,ఎంజెలో మాథ్యూస్‌ హాఫ్‌ సెంచరీలతో భారత్‌కు ధీటుగా బదులిచ్చింది.
శ్రీలంక 165/4 
తిరిమాన్నే, మాథ్యూస్‌ వెంటవెంటనే ఔటైనా...చాందిమల్‌, డిక్వెల్లా భారత బౌలింగ్‌ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఇంకా 7 పరుగులు వెనుకబడి ఉన్న లంక జట్టు...తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచాలని పట్టుదలతో ఉంది. నాలుగో రోజు అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తేనే భారత్‌ జట్టు పోటీలో నిలువగలుగుతుంది. 

 

12:55 - May 5, 2017

తూర్పు గోదావరి : జిల్లా రామచంద్రాపురం రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే జరిగిన మున్సిపల్‌ వార్డు ఎన్నికల సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గ కేంద్రంలో 3 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే మూడు చోట్లా వైసిపికి కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. దీంతో వైసీపీలో ముసలం మొదలైంది. ఓటమికి అధికార పార్టీ టిడిపియే కారణమంటూ ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో రామచంద్రాపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

ఇద్దరి నేతల మధ్య హోరాహోరి
1989 నుంచి ఇక్కడ ఇద్దరి నేతల మధ్య హోరాహోరి పోటీనెలకొంది. ప్రస్తుతం టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అటు అధికార టిడిపి తరపున తోట త్రిముర్తులు ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇద్దరు నేతలు పార్టీలు మారినా..స్వతంత్ర్యంగా పోటీచేసినా పోరుమాత్రం తీవ్రస్థాయిలో ఉంటుంది. 2019లో ఐదోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తోట త్రిమూర్తులు భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఆయన ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. అటు వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్రంగా కృషిచేస్తున్నారు..అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసుడు సూర్యప్రకాశ్‌ను రంగంలోకి దింపాలని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే దీనికి అడ్డుకట్ట వేయాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

22:14 - February 23, 2017

పూణె : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆరంభ టెస్ట్‌ మొదటి రోజు ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. పూణే టెస్ట్‌ తొలి రోజు భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో  కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. 205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన ఆస్ట్రేలియా జట్టును మిషెల్‌ స్టార్క్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు.

పూణే టెస్ట్  తొలి రోజు టీమిండియా డామినేట్‌ చేసింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో ఆతిధ్య భారత జట్టు శుభారంభం చేసింది.

ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, షాన్‌ మార్ష్‌ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.భారత స్పిన్నర్లు, పేసర్లు సమిష్టిగా రాణించడంతో  కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు.

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా ఓపెనర్‌ రెన్‌షా టెస్టుల్లో 2వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి... ఆస్ట్రేలియాకు శుభారంభాన్నిచ్చాడు. 

ఉమేష్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో....ఆస్ట్రేలియా జట్టు తేలిపోయింది. స్టీవ్‌స్మిత్‌,షాన్‌ మార్ష్‌,హ్యాండ్స్‌ కూంబ్‌ కొద్దిసేపు పోరాడినా భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం విఫలమయ్యారు.

205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన జట్టును మిషెల్‌ స్టార్క్‌ ఆదుకున్నాడు. ఆఖరి వికెట్‌కు హేజిల్‌వుడ్‌తో కలిసి పోరాడిన మిషెల్‌ స్టార్క్‌  టెస్టుల్లో 9వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసి...ఆస్ట్రేలియా జట్టు పరువు కాపాడాడు.
 
తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 256 పరుగులు చేసింది.భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.... రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.

రెండో రోజు ఆరంభ ఓవర్లలోనే ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేసి....తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించి ప్రత్యర్ధికి సవాల్‌ విసరాలని భారత్‌ పట్టుదలతో ఉంది. టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా....పూణే టెస్ట్‌లో నెగ్గి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని తహతహలాడుతోంది.

07:31 - January 14, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీకి టీజాక్ సవాళ్లు విసురుతోంది. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా  జేఏసీ కూడా  గులాబి పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా... అధికార పార్టీని మాత్రం  ఇరుకున పెడుతున్న టీజాక్ వ్యవహారం గులాబి పార్టీకి కొత్త సమస్యలు సృష్టిస్తోంది.
జేఏసీ.. ప్రధాన ప్రతిపక్షపాత్ర 
తెలంగాణాలో ఏకపక్షంగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ రాజకీయాలకు టీజాక్ చెక్‌పెడుతోంది. ఉద్యమంలో కలిసి అడుగులు వేసిన టీజాక్ టీఆర్‌ఎస్‌లు వైరిపక్షాలుగా మారిపోయాయి. ప్రతిపక్షపార్టీలకంటే.. జేఏసీనే ప్రధాన ప్రతిపక్షపాత్రను పోషిస్తోంది. 
టీఆర్‌ఎస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరి 
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గులాబి పార్టీ ఏజెంట్‌ గామారారన్న విమర్శలను కోదండరాం ఎదుర్కొన్నారు.   కాని ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ధీటైన కౌంటర్లను ఇస్తోంది టీజాక్‌. దీంతో టీజాక్‌ తీరు మింగుడుపడక అధికారటీ ఆర్‌ఎస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోదండరాంను టార్గెట్‌ చేస్తూ గులాబీ లీడర్లు విమర్శలు చేసినా.. ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో జేఏసీ స్పీడ్‌ను అడ్డుకోలేక పోతున్నారు. రైతుల సమస్యలు, భూసేకరణ వంటి కీలక అంశాల్లో న్యాయపోరాటానికి   శ్రీకారం చుట్టారు జేఏసీ నేతలు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తూ....గులాబి పార్టీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా  జాక్ మారింది.  
టీఆర్ ఎస్ పై జేఏసీ సూటిగా విమర్శలు 
అటు రాజకీయంగా కూడా గులాబి పార్టీని టార్గెట్‌ చేస్తున్న జేఏసీ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై సూటిగా విమర్శలు ఎక్కుపెడుతోంది. మొత్తానికి పదేపదే ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న టీజాక్‌ ను ఎలా కంట్రోల్‌ చేయాలన్న దానిపైనే ఇప్పుడు గులాబీపార్టీలో చర్చలు నడుస్తున్నాయి. 

22:00 - December 10, 2016

ముంబై టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఆతిధ్య భారత జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రెండు రోజులు ఇండియాకు గట్టి పోటీనిచ్చిన ఇంగ్లండ్‌ ...మూడో రోజు మాత్రం భారత బ్యాట్స్‌మెన్‌ జోరు ముందు తేలిపోయింది. ఒక వికెట్‌ నష్టానికి 146 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌....మురళీ విజయ్,విరాట్‌ కొహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో పోటీలో నిలిచింది.విరాట్‌,పుజారాలతో కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన విజయ్‌ ...231 బంతుల్లో టెస్టుల్లో 8వ సెంచరీ పూర్తి చేశాడు. 136 పరుగులకు విజయ్‌ ఔటైనా... మరో ఎండ్‌లో క్రీజ్‌లో పాతుకుపోయిన కొహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో సూపర్‌ సెంచరీ నమోదు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో జడేజా,జయంత్‌ యాదవ్‌లతో హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాలు జోడించిన కొహ్లీ...టెస్టుల్లో 15వ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 7 వికెట్లకు 451 పరుగులు చేసింది.విరాట్‌ 147, జయంత్‌ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ,ఆదిల్‌ రషీద్‌, జో రూట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 51 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.... తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు పైగా ఆధిక్యం సాధిస్తేనే మ్యాచ్‌పై పట్టు బిగించగలుగుతుంది. 

 

09:48 - September 7, 2015

హైదరాబాద్ : అమెరికన్‌ ఓపెన్‌ ఉమెన్స్‌ డబుల్స్‌లో ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియామీర్జా-మార్టినా హింగిస్‌ జోడీ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో తిమియా బాస్కింజ్కీ,చువాంగ్‌ జోడీతో తలపడ్డ సానియా జోడీకి పోటీనే లేకుండా పోయింది. ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌గా, హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగిన హింగిస్‌-సానియా జోడీకి బాస్కింజ్కీ,చువాంగ్‌ అసలే మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వరుసగా 6-1, 6-1తో రెండు సెట్లలో నెగ్గిన టాప్‌ సీడ్‌ జోడీ మూడో రౌండ్‌కు అర్హత సాధించారు.

Don't Miss

Subscribe to RSS - ఆధిపత్యం