ఆరోపణలు

20:10 - October 10, 2017

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చిక్కుల్లో పడ్డారు. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న అమిత్‌షా తన కుమారుడు జయ్‌ షా కు మేలు చేకుర్చేలా వ్యవహరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయ్‌షా వ్యాపారం మూడేళ్ల వ్యవధిలోనే 16 వేల రెట్లు పెరిగిందని ది వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ కీలక కథనాన్ని ప్రచురించింది. అంతే కాకుండా, జయ్‌షా తన తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని కోట్లాది రూపాయల బ్యాంక్‌ రుణాన్ని అక్రమ మార్గాల్లో పొందారని వైర్‌ పోర్టల్‌ వార్తను ప్రచురించింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. జయ్‌ షా వ్యాపారాభివృద్ధి విధానమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని విపక్షాలు  ప్రధాని మోదీని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేయబోతున్నారని తెలిపారు. వైర్‌ ప్రచురించిన వార్త అవాస్తవమని తోసిపుచ్చారు. మొత్తానికి ఈ కథనం పాలక బీజేపీని ఇరకాటంలో పడేసింది.

 

 

15:32 - October 6, 2017

చిత్తూరు : టీటీడీలో పని చేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌ చెప్పారు. ఉద్యోగులు, సిబ్బంది వరుసగా మూడు సార్లు తప్పులు చేసి పట్టుబడితే.. విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి.. డబ్బులు డిమాండ్‌ చేసిన క్షరకులపై త్వరలోనే వేటు పడనుందని ఈవో తెలిపారు. 80-90 మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందని, నోటీసులు త్వరలో వెళుతాయన్నారు. క్షురకులు డబ్బులు తీసుకుంటున్నారని, లగేజీ ఇతర సామాగ్రీ పెట్టే విషయంలో డబ్బులు అడుగుతున్నారని..మిగతా చిన్న చిన్న ఫిర్యాదులు చేశారని తెలిపారు. 

13:38 - September 6, 2017

సంగారెడ్డి : పేదల భూములపై పెద్దలు పంజా విసురుతుండడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం సంగారెడ్డిలో మూడు వేల ఎకరాల స్థలం వివాదాస్పదమౌతోంది. ఎంపీ బీబీ పాటిల్ అనుచరులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్టి మండలంలో రైతులకు చెందిన మూడు వేల ఎకరాలను ఢిల్లీకి చెందిన శర్మ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. ఎకరానికి రూ. 40 వేలు చొప్పున ఇస్తానని..అడ్వాన్స్ గా రూ. 10వేలు చెల్లిస్తానని..పూర్తి డబ్బు చెల్లించిన తరువాతే తాను భూమి తీసుకుంటానని..అప్పటి వరకు వినియోగించుకోవచ్చని శర్మ సూచించాడు. దీనితో గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. కానీ ఇటీవలే ఎంపీ బీబీ పాటిల్ కు చెందిన కొంతమంది అనుచరులు ఆ భూముల్లోకి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ చెందిన కంపెనీ పెడుతున్నామంటూ నిర్మాణాలు చేపట్టారు. భూములు తాము కొనడం జరిగిందని పేర్కొని రైతులను బలవంతంగా అక్కడి నుండి వెళ్లేవిధంగా చేశారని తెలుస్తోంది.

దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్లో ప్రజా ప్రతినిధి అనుచరులు నిర్మాణ కార్యక్రమాలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు మొత్తం డబ్బులు ఇవ్వలేదని, తొలినుంచీ తామే ఈ స్థలంలో ఉన్నామని, వాటిని ఎలా కబ్జా చేస్తారని నిలదీస్తున్నారు.

ఈ భూములను తనఖా పెట్టి వందల కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణ కొనసాగిందని కానీ నివేదిక బయటకు రావడం లేదని తెలుస్తోంది. రైతులకు అండగా సీపీఎం నిలబడింది. రైతులకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేసి హై కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. 

13:50 - September 4, 2017

హైదరాబాద్ : కంచె చేనుమేసినట్లుగా..టీఎన్ జీవోస్ హౌసింగ్‌ సొసైటీ భూములను అధ్యక్ష, కార్యదర్శులే కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క సొసైటీ భూములే కాదు.. మరో 30 ఎకరాల భూమిని కూడా స్వాహా చేసేందుకు పెద్ద స్కెచే వేశారట. పెద్దల అండదండలతో ప్లాట్లను విక్రయించేందుకు విఫలయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుని కోర్టులో కేసు వేసినా.. ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు.  

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పలు ఇండస్ట్రీలు హైదరాబాద్‌ శివారులో ఏర్పాటు కావడంతో..కాటేదాన్‌ భూములు కోట్లు పలికాయి. దీంతో టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల భూములపై కబ్జాసురుల కన్నుపడింది. పక్కనే ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి 130 ఎకరాల్లో ప్లాట్లు చేశారు. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రెవెన్యూ అధికారులు టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీపై కేసు వేశారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. వాస్తవానికి కేసు కోర్టులో ఉన్నప్పుడు సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇందులో ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 

కాటేదాన్‌ టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. పెంటయ్య నియామకంతోనే అక్రమాలకు తెరలేచినట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్లకోసారి హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నామమాత్రపు ఎన్నికలు నిర్వహించి ఆయనే ప్రధాన కార్యదర్శిగా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతని బంధువుల పేరు మీద 40 ప్లాట్లు ఈ సొసైటీలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగి అయిన పెంటయ్య సొసైటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాక కోట్లకు పడగెత్తాడన్న అరోపణలు ఉన్నాయి.

30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి ప్లాట్లు చేసిన సొసైటీ కమిటీ నిర్వాకాన్ని 2007లో సీపీఎం సభ్యులు నిలదీశారు.  ఈస్థలంలో 15 రోజులపాటు భూ పోరాటం చేశారు. పేదలతో గుడిసెలు వేయించగా.. వాటిని రెవెన్యూ అధికారులు, పోలీసులు తొలగించారు. 37 మంది సీపీఎం నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కబ్జాకోరులనుంచి తమ భూములను కాపాడాలని టీఎన్జీవో సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

 

17:36 - August 18, 2017

ఢిల్లీ : ఉగ్రవాద వ్యాప్తి, మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ జాతీయ దర్యాప్తు సంస్థపై ఆరోపణలు చేశారు. తాను ముస్లింను అయినందుకే ఎన్‌ఐఏ తనను టార్గెట్‌ చేసిందని నాయక్‌ ఇంటర్‌పోల్‌తో చెప్పారు. జకీర్‌ నాయక్‌కు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని ఎన్‌ఐఏ ఇంటర్‌పోల్‌ను కోరింది. 2016 జులైలో ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఎన్‌ఐఏ జకీర్‌ నాయక్‌పై నజర్‌ పెట్టింది. జకీర్‌ నాయక్‌ ప్రసంగాలు తమను ఉత్తేజ పరిచడంతోనే దాడులకు పాల్పడ్డామని అప్పట్లో ఉగ్రవాదులు పేర్కొన్నారు. ఈ ఘటనతో జకీర్‌ నాయక్‌ భారతదేశం విడిచి విదేశాలకు పారిపోయారు.  తన ప్రసంగాలు జిహాద్‌ను ప్రేరేపించవని...కేవలం శాంతికోసమే ఉపన్యాసాలిస్తానని జకీర్‌నాయక్‌ తెలిపారు.

 

06:48 - August 6, 2017

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌పై కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవిలో కొనసాగుతూనే ప్రైవేట్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఎలా కొనసాగుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మంత్రి పదవిలో కేటీఆర్‌ కొనసాగడం రాజ్యాంగ విరుద్దమని, తక్షణమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. లెఫ్ట్‌ పార్టీల నేతలు ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల కమిషన్‌ ముందు ఉంచారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. హిమాన్షు కంపెనీకి కేటీఆర్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తక్షణమే కేటీఆర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

విపక్షాల విమర్శలతో ఇరకాటంలో టీఆర్‌ఎస్‌

ఇటు వామపక్షాలు, అటు కాంగ్రెస్‌ పార్టీ కేటీఆర్‌ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించడంతో అధికారపార్టీ ఇరుకున పడింది. కేటీఆర్‌కు హిమాన్షు కంపెనీలో వాటా ఉన్న మాట వాస్తవమేనని... కానీ అది ఇప్పుడు యాక్టింగ్‌లో లేదని ఒకరు.... ఇప్పటికే దానికి రిజైన్‌ చేశారని మరొకరు గులాబీ నేతలు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆధారాలుంటే చూపాలని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు.

లెఫ్ట్‌ పార్టీల ఫిర్యాదుపై కదలిన ఈసీ

కేటీఆర్‌కు హిమాన్షు కంపెనీలో వాటాలు, డైరెక్టర్‌ పదవిలో ఆయన కొనసాగుతున్నారన్న దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లెప్ట్‌పార్టీలు ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. దీనిపై ఈసీ ఎట్టకేలకు కదిలింది. వామపక్షాల ఫిర్యాదుపై ఈసీ న్యాయ సలహా తీసుకుంటోంది. కేటీఆర్‌పై అందిన ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నట్టు ఈసీ భన్వర్‌లాల్‌ తెలిపారు. కేంద్రం కూడా ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఇచ్చే నిర్ణయాన్ని బట్టి తమ చర్యలుంటాయని స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణలో యువరాజుగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ను హిమాన్షు మోటార్స్‌ , నేరెళ్ల దళితుల ఘటన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ కేటీఆర్‌పై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

11:57 - July 30, 2017

ఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన ప‌రువు నష్టం కేసులో కేజ్రీవాల్‌కు న్యాయ‌వాదిగా ఉన్న రాంజెఠ్మలాని ఇపుడు రివర్స్‌ అయ్యారు. జైట్లీ బూతులు తిట్టాల్సిందిగా ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ చెప్పారని జెఠ్మలాని ఆరోపించారు. ఈ విషయంలో రాంజెఠ్మలాని తాజాగా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ఇదే అంశంలో జులై 20 న కేజ్రీవాల్‌కు ఉత్తరం రాశారు. మే 17న కోర్టు విచార‌ణ‌లో భాగంగా జెఠ్మలానీ త‌న‌పై అభ్యంత‌ర వ్యాఖ్య చేయ‌డాన్ని అరుణ్ జైట్లీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దీనిపై 10 కోట్లకు కేజ్రీవాల్‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేయడంతో జెఠ్మలానిని తొలగించారు. త‌మ ఇద్దరి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ల్లో కేజ్రీవాల్ మ‌రింత అభ్యంత‌ర‌క‌ర భాష వాడిన‌ట్లు కూడా జెఠ్మలానీ వెల్లడించారు. దీంతో కేజ్రీవాల్‌ మ‌రింత చిక్కుల్లో ప‌డ్డారు.

 

22:11 - July 24, 2017
22:10 - July 24, 2017

ఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. వెంకయ్యనాయుడు కుటుంబం నిర్వహించే స్వర్ణభారత్‌ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందారని ఆయన తెలిపారు. వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టయోటా నుంచి తెలంగాణ ప్రభుత్వం టెండర్‌ లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిందని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు.

 

07:22 - June 10, 2017

రంగారెడ్డి : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న దళిత యువతి శ్యామల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. శ్యామలను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.  ఇబ్రహింపట్నంలోని ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. 
శ్యామలది హత్యేనంటున్న కుటుంబ సభ్యులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యాచారంలో జరిగిన శ్యామల హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆమెది ఆత్మహత్య కాదు.... హత్యేననే వాదన వినిపిస్తోంది. స్థానికుల, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ సందేహం బలపడుతుంది. హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న.. సోమ నర్సింహ శ్యామలను గత కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు.  ఈ క్రమంలో నర్సింహ ఫోన్ నుంచి కాల్ వచ్చిన కొన్ని నిమిషాలలోపే శ్యామల మంటల్లో చిక్కుకుంది. స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించిన గంటలోనే మృతి చెందింది. 
నర్సింహే కిరోసిన్‌ పోసి ప్రాణాలు తీశాడంటూ ఆరోపణలు
అయితే..శ్యామలను బయటకు రమ్మని నర్సింహే...కిరోసిన్‌ పోసి ప్రాణాలు తీశాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.  శ్యామల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ..ఆమెను హత్యే చేశారని కుటుంబ సభ్యులంటున్నారు. హత్య చేసినప్పుడు  నర్సింహ చేతులు కూడా కాలాయని.. వెంటనే గోడ దూకి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటన అనంతరం నిందితుడి మేనమామ కూడా వచ్చి శ్యామల మొబైల్‌ ఇవ్వాలంటూ..  బేరసారాలాడడని బాధితులు చెబుతున్నారు.
ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బాధిత కుటుంబం
ఇదిలా ఉండగా యాచారం పోలీసులు 306, 354డీ, ఎస్సీ, ఎస్టీ న్యూ అమిడ్‌మెంట్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఇబ్రహీంపట్నంలో ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. నర్సింహను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా నర్సింహను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆరోపణలు