ఆర్టీసీ

08:57 - May 26, 2018

విజయవాడ : మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు తయారైంది ఏపీఎస్‌ ఆర్టీసీ పరిస్థితి. పెరిగిన డీజిల్‌ ధరలతో సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పొదుపు చర్యలతో నష్టాలను పూడ్చుకోడానికి ఆపసోపాలు పడుతున్న ఆర్టీసీకి పెట్రోధరలు శరాఘాతంగా మారాయి. పరిస్థితి ఇలాగే ఉంటే టికెట్‌ చార్జీలు పెంచక తప్పదని యాజమాన్యం అంటోంది.

పెరుగుతున్న డీజిల్ ధరలతో కుదేలవుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ కుదేలవుతోంది. ఆర్టీసీ అభివృద్ధికి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలకు.. డీజిల్ ధరలు తూట్లు పొడుస్తున్నాయి. గత రెండు మాసాల్లోనే డీజిల్ పై లీటరుకు ఐదు రూపాయలు పెరగడంతో ఆర్టీసీకి పెనుభారంగా మారింది. దీంతో నెలకు పండున్నర కోట్ల మేర ఆర్టీసీపై అదనపు భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాది మొత్తం మీద నూటా యాభై కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

నాలుగు వందలా యాభై కోట్ల మేర నష్టం..
గతేడాది ఆర్టీసీకి సుమారు నాలుగు వందలా యాభై కోట్ల మేర నష్టం రాగా.. ఇందులో యాభై శాతం నష్టాలు డీజిల్ ధరలు పెరగడంతోనే వచ్చాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.. అంతర్గ సామర్థ్యాలు ఎంత పెంచుకున్నా.. విపరీతంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కలేకపోతోందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆర్టీసీపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ ఆర్టీసీ సంస్థకు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు.

డీజిల్ ధరల ఎఫెక్ట్ తో ట్రిప్స్ తగ్గించిన ఆర్టీసీ..
డీజిల్ ధరల భారాన్ని తట్టుకోలేక ఆర్టీసీ పలు రూట్లలో ట్రిప్పులు తగ్గించేసింది. ఈ లెక్కన రోజుకు 40 వేల కిలోమీటర్ల మేర బస్ లు నడపడాన్ని తగ్గించారు. లాభనష్టాలు బేరీజు వేసుకుని రూట్లలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగానే బస్ సర్వీసులను నడుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు రద్దీ సమయాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. ఇలా అరకొరగా నడపడంతో బస్సులు ప్రయాణీకుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. గంటలకొద్దీ బస్టాపుల్లో ప్రయాణీకులు పడిగాపులు పడాల్సి వస్తోంది.

డీజిల్‌ ధరలతో కుదేలవుతోందన్న ఆర్టీసీ..
ఆదాయం అంతంత మాత్రమే ఉన్న ఆర్టీసీ డీజిల్‌ ధరలతో కుదేలవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని బతికించాలంటే... చార్జీలు పెంచక తప్పదని అధికారులు యోచిస్తున్నారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి డీజిల్ రేట్ల పుణ్యమా అని ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. 

19:40 - May 17, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ జరుగుతుందా? సంస్థ అప్పుల్లో ఉంది, నష్టాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? గత వేతన ఒప్పందం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? పీఆర్సీ పట్ల ఆర్టీసీ యాజమాన్యం వైఖరేంటి? అధికార పార్టీకి చెందిన గుర్తింపు సంఘం ఏమంటోంది? ఇప్పటికే సమ్మె సైరన్ మోగించిన కార్మిక సంఘాలు ఏమంటున్నాయనే అంశంపై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆర్టీసీలో వేతన సవరణ గడువు ముగిసి ఏడాది గడిచింది. గత సంవత్సరం ఏప్రిల్‌ లో కొత్త పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. పే రివిజన్ కమిటీ వేసినప్పటికీ పీఆర్సీపై ఒక స్పష్టత రాలేదు. పద్నాలుగు నెలలుగా వేతన సవరణలో జాప్యం వల్ల కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ ఛలోబస్ భవన్ కార్యక్రమం చేపట్టింది. ఇతర కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పాటు చేసి పోరాటాలకు దిగడంతో ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్న టీఎంయూ.. ప్రభుత్వంపై, ఆర్టీసీ యాజమాన్యంపై యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం సహా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించింది. ఇదే సమయంలో సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల ఆశలపై నీళ్లు చల్లాయి.

గత వేతన సవరణ సందర్భంగా ఒక నెల ముందుగానే పీఆర్సీ ఇస్తామని సీఎం కేసిఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేతన సవరణ గడువు ముగిసి పద్నాలుగు నెలలయ్యింది. వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు కోరితే ఇప్పవటికే.. ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీతాలు పెంచాలని కోరడమేంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలకు కార్మిక నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ నష్టాలకు కారణాలపై చర్చకు సిద్ధమా అంటూ స్వయంగా గుర్తింపు సంఘం నేత అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆర్టీసీలో నష్టాలే లేవని నేతలంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సుమారు 60 డీపోలు లాభాల్లోకి వచ్చాయన్నారు. ఈ విషయాన్ని రవాణా శాఖా మంత్రి పలు సందర్భాల్లో చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. సంస్థ నష్టాలకు అసలు కారణాలు వేరే ఉన్నాయని వారంటున్నారు.

తెలంగాణలో ఆర్టీసీ నష్టాలకు డీజిల్ భారం ప్రధాన కారణం. టీఎస్ఆర్టీసీ ఏటా 20 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసిపై భారం పడుతూనే ఉంది. ఆర్టీసీకి ఈ నాలుగేళ్లలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సీఎం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ కొనుగోలు చేసిన డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టిన పన్ను రెండు వేల ఆరువందల 90 కోట్లరూపాయలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు డీజిల్ ధరలను పోల్చి చూస్తే లీటర్ కి 18 రూపాయలు పెరిగింది. ఆ భారం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీపై పడింది. మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం డీజిల్ పైనే ఆర్టీసి ఖర్చు పెట్టింది.

ఆర్టీసీ కార్మికులు వేతనాలు అడిగితే ఇతర రాష్ట్రాలతో సీఎం పోల్చడం తగదన్నారు. అలా పోల్చినట్టయితే.. కేరళ ప్రభుత్వం బడ్జెట్లో మూడువేల కోట్లు, తమిళనాడు ప్రభుత్వం తాజా బడ్జెట్ లో నాలుగు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో ఆర్టీసీకి కేటాయించింది 11 వందల కోట్ల రూపాయలు మాత్రమే. ఆర్టీసీకి సాయం చేయక పోగా ఆర్టీసీకి ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్ ను కూడా నెలల తరబడి ఇవ్వడం లేదు. ఆర్టీసీ కార్మికలు కష్టపడి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయలు నష్టం వస్తోందని సీఎం, రవాణా మంత్రి చేస్తోన్న వ్యాఖ్యలను కూడా నేతలు తప్పుపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు రోజుకు 12 కోట్ల రూపాయలు ఆదాయం తెస్తున్నారన్నారు. ఇందులో ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో కోటిన్నర రూపాయలు ప్రతీ రోజు చెల్లిస్తున్నారని వారంటున్నారు.

మరోవైపు సిఎం హాట్ కామెంట్స్ చేసిన తరుణంలోనే గుర్తింపు సంఘం నేతలతో మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షుడు మంత్రి హరీష్ రంగంలోకి దిగి నేతలను చల్లబరిచే కార్యక్రమానికి పూనుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పాటే తమకు కూడా తీపి కబురు అందుతుందని భావించిన టిఎంయూ నేతలకు ఆశాభంగమే మిగిలింది.

మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు ఎటూ తేల్చకపోవడం, సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం, గుర్తింపు సంఘం నేతల వేచి చూసే ధోరణి నేపథ్యంలో పది యూనియన్లతో కూడిన జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది. పద్నాలుగు నెలలుగా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న కార్మికుల ఆగ్రహం సమ్మె బాట పట్టే అవకాశం స్పష్ఠంగా కనిపిస్తోంది.

07:12 - May 14, 2018

తమ సమస్యలను పరిష్కరించే విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు యాజమాన్యం.. చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని తెలంగాణలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వివిధ రకాల సమస్యలపై అన్ని ప్రభుత్వ ఉద్యోగ కార్మిక సంఘాలతో చర్యలు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వం.... ఆర్టీసీలో మాత్రం ఒక్క గుర్తింపు సంఘాన్నే చర్చలకు పిలవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు.. వారిపట్ల ప్రభుత్వ విధానాలపై టెన్ టివి జనపథంలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:34 - May 14, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, వారి ఇబ్బందులన్నీ విన్నామని... రెండు రోజుల్లో వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం టీఎమ్‌యూ నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. ఈ చర్చలకు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. ఇక గుర్తింపు సంఘం టీఎమ్‌యూ తరుపున అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితో పాటు 21 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక వేతన సవరణపై ఎందుకు జాప్యం చేస్తున్నారని కార్మిక సంఘం సభ్యులు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చే వరకు తాత్సారం చేయడం సరికాదని కార్మిక సంఘం స్పష్టం చేసింది.

 

06:42 - May 10, 2018

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికవర్గాల్లో క్రమంగా పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. ఆర్టీసీలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇవ్వడం ద్వారా టీఆర్‌ఎస్‌, టీఎంయూ మధ్య అంతరం పెరిగినట్టు భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయంగా పట్టు సాధించిన టీఆర్‌ఎస్‌ కార్మిక సంఘాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. బలమైన కార్మికోద్యమంలో పట్టు సాధించి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకొంది. RTC లాంటి పెద్ద సంస్థల్లో కూడా సత్తా చాటింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా ఆ పట్టు కోల్పోతున్న సంకేతాలు కార్మిక సంఘాల నుంచి వస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఏర్పాటైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ టీఆర్‌ఎస్‌కు అనుంబంధ కార్మిక సంఘంగా అవతరించింది. ఇప్పుడు టీఎంయూ, టీఆర్‌ఎస్‌ మధ్య అంతరం పెరుగుతోంది. ఉద్యమ సమయంలో గులాబీ దళపతికి అండగా నిలిచిన ఈ సంఘం... ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తోంది. కార్మిక శ్రేయస్సు కోసం తాము పోరాటం చేస్తామని టీఎంయూ ప్రకటించడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్న టీఎంయూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

RTC కార్మికుల డిమాండ్ల సాధనకోసం ఇటీవల నిర్వహించిన బస్ భవన్ ముట్టడి సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినా.....ఆ ఫలాలు కార్మికులకు అందలేదన్నది టీఎంయూ నేతలు ఆరోపణ. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద కార్మికులు ఆధార పడడంలేదని....మీ అవసరం మాకు ఎంతో... మా అవసరం కూడా మీకు అంతే ఉంటుందని టీఎంయూ నేతలు వ్యాఖ్యానించడం ఆలోచించిదగ్గ పరిణామంగా భావిస్తున్నారు. ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా....ఉద్యమకారుల సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో TMU నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేనికి సంకేతమో అన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.

మంత్రి హరీశ్‌రావుకు ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గుతుందన్న ప్రచారం ఊపందుకోవడం.... అదే సమయంలో మరో ఉద్యమ నేత కోదండరామ్ టీజేఎస్‌ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ... ప్రభుత్వంపై తిరుగుబాటుకు పావులు కదపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి పూర్తి స్థాయి అండదండలు అందించిన కార్మిక సంఘం ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచడం రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. 

06:39 - May 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. వేతనాల సవరణపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జాప్యంపై మండిపడుతున్న కార్మికులు.. ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన నోటీసును కూడా ఆర్టీసీ యాజమాన్యానికి అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో.. మళ్లీ వేతన సవరణ రగడ ఉధృతమవుతోంది. కొన్ని నెలల పాటు స్తబ్దుగా ఉన్న కార్మిక సంఘాలు సర్కారుతో సమరానికి సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించక పోతే ఈ నెల 21 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని టిఎంయూ.. ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. కొత్త పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఉద్యమిస్తున్న వేళ.. ఆర్టీసీ యూనియన్లు కూడా ఇదే అంశంపై ఆందోళన బాట పట్టాయి. తమ డిమాండ్లను నెరవేర్చడంలోఆర్టీసీ యాజమాన్యం జాప్యానికి నిరసనగా.. టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం చలో బస్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది కార్మికులు బస్‌భవన్‌ను ముట్టడించారు.

నిరుడు మార్చి 31 నాటికి.. 2013 పీఆర్సీ గడువు ముగిసింది. 2017 ఏప్రిల్‌ ఫస్ట్‌ నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రావాలి. ఈ క్రమంలో.. ఆర్టీసీ యాజమాన్యం కూడా నాలుగు నెలల క్రితమే కొత్త పీఆర్సీ కమిటీని నియమించింది. అయితే ఓ రెండు మొక్కుబడి సమావేశాలు మినహా.. వేతనాలపై కమిటీ ఎటూ తేల్చలేదని కార్మికులు మండిపడుతున్నారు. వేతనాలు 50శాతం మేర పెంచాలంటూ టీఎంయూ పీఆర్సీ కమిటీకి విజ్ఞప్తి చేసింది. స్పందన లేకపోవడంతో కార్మికులు కన్నెర్ర జేస్తున్నారు.

ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్లకు పైగా ఆదాయానికి గండిపెడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలను నియంత్రించే నాథుడే లేడని ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన నిధులను ఎందుకు విడుదల చేయరని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లాలని వారు నిర్ణయించారు. 

16:48 - May 7, 2018

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. వేతన సవరణతో పాటుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. పే స్కేల్‌ అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను..యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీనితో ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో వి.ఎస్ రావు (ఎస్ డబ్ల్యూఎఫ్), కె.రాజిరెడ్డి (ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి), ఎం.థామస్ రెడ్డి (టీఎంయు వర్కింగ్ ప్రెసిడెంట్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:57 - April 12, 2018

హైదరాబాద్ : సీపీఎం అఖిల భారత 22వ మహాసభలు ఈనెల 18 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్నాయి. మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసభలు జరిగే ప్రధాన వేదికైన ఆర్టీసీ కల్యాణ మండపాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. సీపీఎం మహాసభల ఏర్పాట్లపై మరిన్ని వివరాలను చూద్దాం..

13:32 - April 2, 2018
13:26 - February 22, 2018

విశాఖ : జిల్లా కోట మండలంలో గరుడ బస్సు అదుపు తప్పింది. రహదారిపై లారీని తప్పించబోయి.. డివైడర్‌ పైకి బస్ దూసుకుపోయింది. వెంటనే డ్రైవర్‌ బస్సును అదుపులోకి తీసుకురావడంతో... ప్రమాదం తప్పింది. ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. వేరే బస్సులో ప్రయాణికులను విశాఖ తరలించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఆర్టీసీ