ఆర్టీసీ కళ్యాణ మండపం

21:23 - April 18, 2018

హైదరాబాద్ : దేశంలో మతోన్మాద విధానాలు ప్రజ్వరిల్లుతున్నాయని సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తోన్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలపై కూడా కమ్యూనిస్టు అగ్ర నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కల్యాణమంటపం ప్రాంగణం వేదికగా మహాసభలను.. సీపీఎం సీనియర్‌ నాయకురాలు, సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. పార్టీ పతాకను ఆవిష్కరించి ప్రారంభించారు. పతాకావిష్కరణ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అమరుల స్తూపం వద్ద.. నేతలు నివాళులు అర్పించారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పరిశీలకులు మొత్తం 846 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు.

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అధ్యక్షతన ప్రారంభమైన మహాసభల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం నిర్ణయాలు ప్రజలను ఇక్కట్లపాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి, జీఎస్‌టీ అమలు తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏచూరి అన్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు సమాజంలో అసమానతలను పెంచుతున్నాయని, విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమన్న ఏచూరీ, పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఈ దిశగా నిర్దిష్ట రాజకీయ విధానంతో ముందుకు వస్తామన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ఈ మహాసభలు దోహదం చేస్తాయని ఏచూరి ఆశాభావం వ్యక్తం చేశారు. మహాసభల ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌.. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విభజించు పాలించు విధానాలతో దేశ ప్రజలు నడిరోడ్డు మీదకు వచ్చారని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యోద్యంలో ఏరకమైన పాత్ర పోషించని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శుక్తులు విశానకర విధానాలకు తెరతీశాయని మండిపడ్డారు.

బీజేపీ పాలనలో బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో స్వాగతోపన్యాసం చేస్తూ... దేశంలో మహిళలు,బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దళితులపై దాడులను ప్రస్తావించారు. ఇలాంటి దాడులు తెలుగు రాష్ట్రాల్లో తక్కువేమీ కాదన్నారు. పార్టీకి దశాబ్దాలుగా విశేష సేవలందించిన కురు వృద్ధులు తొంభై ఏడేళ్ల శంకరయ్య, తొంభై నాలుగేళ్ల వి.ఎస్‌.అచ్యుతానందన్‌లను మహాసభల సందర్భంగా సన్మానించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారికి జ్ఞాపికలను అందించి గౌరవించారు. 

18:44 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు హిమాచల్‌ ప్రదేశ్‌ సిపిఎం ఎమ్మెల్యే రాకేశ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది. దళితులు, మహిళల హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో గత 20 ఏళ్లుగా బూర్జువా పార్టీలు కాంగ్రెస్‌, బిజెపి అధికారాన్ని పంచుకుంటున్నాయని, దీంతో ప్రజల సమస్యలు తీరడం లేదన్నారు. ప్రస్తుతం బిజెపి అధికారంలోకి రావడంతో మతతత్వం మరింత పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యంతో ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు విద్యను కాషాయికరణం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాకేశ్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

15:13 - April 18, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు ప్రతిఘటించేందుకు ఐక్యపోరాటాలు అవసరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల్లో సీతారాం ఏచూరి.. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు ఆందోళన వ్యక్తం చేశారు. 

07:04 - April 16, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు ఎర్రదండు సిద్ధం అవుతోంది. ఊరూవాడా అరుణపతాకాలు కవాతు తొక్కుతున్నాయి. హైదరాబాద్ బహిరంసభకు ప్రజలు తరలిరావాలని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లో సీపీఎం శ్రేణులు ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీపీఎం జాతీయ మహాసభలకు తెలుగు రాష్ట్రాల్లో పార్టీశ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈనెల 22న భారీ బహిరంగసభకు తరలి రావాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఎర్రజెండాలు చేతబూనిన పార్టీ శ్రేణులు వాడవాలా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

ఈనెల 18 నుంచి 22వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సన్నద్ధం అవుతోంది. జాతీయ మహాసభలకు ఆర్టీసీ కల్యాణమండపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 18న ఉదయం 10 గంటలకు సీపీఎం సీనియర్‌ నేత కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం అరుణపాతకను ఆవిష్కరించనున్నారు. మహాసభల వేదికకు కామ్రేడ్‌ మహ్మద్‌ అమీన్‌ పేరును పెట్టామన్నారు.. పార్టీ పొలిటిట్‌బ్యూరో సభ్యులు బి.విరాఘవులు.

ఐదు రోజుల పాటు జరగనున్న జాతీయ మహాసభలకు 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు, మరో 8 మంది సీనియర్‌ నేతలు కూడా హాజరవనున్నారు. వీరితోపాటు ఐదు వామపక్షాల నుంచి జాతీయ నేతలు ప్రారంభసభలో పాల్గొంటారని బి.వి.రాఘవులు తెలిపారు. జాతీయస్థాయిలో వామపక్ష రాజకీయ వేదిక ఏర్పాటు, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలపై మహాసభల్లో చర్చలు జరుగుతాయన్నారు. దాంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు..రాష్ట్రాలకు దక్కాల్సిన నిధుల లాంటి అంశాలపై కూడా చర్చిస్తామన్నారు. ప్రస్తుతం అన్నిపార్టీలు సామాజిక న్యాయం గురించే మాట్లాడుతున్నాయంటే అది వామపక్షాల ఘనతే అన్నారు. సీపీఎం నేతృత్వంలో జరిగిన మహాజన పాదయత్ర ఫలితంగా ప్రజల్లో సామాజిక న్యాయంపై అవగాహన వచ్చిందన్నారు.

మహాసభల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు కదం తొదక్కుతున్నాయి. ఊరూవాడా ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో జరిగిన సెమినార్‌లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు. పార్టీ మహాసభలకు తరలి రావాల్సిందిగా సీపీఎం శ్రేణులకు పిలుపు నిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అతిపెద్ద అరుణపతాకాన్ని ప్రదర్శించారు. 22వ జాతీయ మహాసభల సందర్భంగా 22మీటర్ల ఎర్రజెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అటు మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభకు తరలి రావాలని ప్రజలకు సూచించారు.

రైతు ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, దళితులు, మైనార్టీలపై దాడులు, మహిళలపై అకృత్యాలతో దేశంలో అరాచకం రాజ్యంమేలుతోందని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారాయంటున్నారు. ఈపరిస్థితిని ఎదుర్కోడానికి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఆపార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధం అయ్యామని మార్క్సిస్టుపార్టీ నాయకత్వం అంటోంది. 

06:38 - April 2, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ అవినీతి పరులను కాపాడుతూ.. అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధారక్‌రెడ్డి విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు మోదీ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న ఎన్డీయే సర్కార్‌ను గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ఐక్యత సాధిస్తామన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగసభకు సురవరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అవినీతి ద్వారా పోగేసిన డబ్బుతోనే త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహాసభ ప్రారంభం రోజున నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఎర్రదండు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సురవరం సుధాకర్‌రెడ్డి ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ.. కార్పొరేట్లకు వంతపాడుతోందని విమర్శించారు. ఎన్డీయేను గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ఐక్యత సాధిస్తామన్నారు. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతిపేదవాడికీ 15 లక్షలు పంచుతామన్న మోదీ.. ఒక్క రూపాయికూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. అడ్డంగా అబద్దాలు చెప్పిన మోదీ... దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ సర్కార్‌పై సీపీఐ జాతీయ నాయకుడు నారాయన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపక్షపార్టీలన్నీ కేంద్రంపై అవిశ్వాసానికి పట్టుబడుతుంటే.. టీఆర్‌ఎస్‌ మాత్రం పార్లమెంట్‌లో శిఖండిపాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. అవిశ్వాసం చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ బీజేపీకి సహకరిస్తోందన్నారు. ఒకవైపు మోదీతో అంటకాగుతూ... మరోవైపు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. కేసీఆర్‌లాంటి దిగజారుడు సీఎం దేశంలో ఎక్కడా లేరని ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్‌కు.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

సీపీఐ మహాసభలు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో ప్రతినిధుల సభ జరుగనుంది. ఇక బహిరంగసభ వేదికపై నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి కాసేపు కళాకారులతో కలిసి కోలాటమాడి అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. 

16:43 - March 19, 2017

హైదరాబాద్: కేరళ సీఎం పినరై విజయన్ హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో మళయాళీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

12:28 - January 8, 2016

హైదరాబాద్ : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అఖిల భారత సమాఖ్య (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌) 8వ మహాసభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కళ్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. రెండో రోజు ఐసీడీఎస్ పరిరక్షణ..కనీస వేతనం..ఉద్యోగ భద్రత..రిటైర్ మెంట్ బెనిఫిట్స్..తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్ర అధ్యక్షురాలు టెన్ టివితో మాట్లాడారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఫుడ్ సెక్యూర్టీ, ఎడ్యుకేషన్ హక్కుగా ఉండేదని, దీనిని కాలరాయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సమాజంలో ఐసీడీఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని, 50 శాతం నిధులు తక్కువ చేశారని తెలిపారు. ఐసీడీఎస్ లో పోషకాహార ఆహార పదార్థాలు అందించడం లేదన్నారు. 

13:27 - January 7, 2016

హైదరాబాద్ : తమ హక్కుల సాధనకు అంగన్‌వాడీలు ఎంతవరకైనా పోరాడాలని సిఐటియు జాతీయ నాయకులు తపన్‌ సేన్ పిలుపునిచ్చారు. వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంగన్‌వాడీల జాతీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. 
దేశవ్యాప్తంగా మహిళలకు, పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలు జాతీయ మహాసభ జరుపుకుంటున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఎనిమిదవ మహాసభలు ప్రారంభమయ్యాయి. సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు తపన్ సేన్ ప్రారంభించారు. సేవకులుగా ఉన్న తమను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని.. ప్రతిక్షణం తమ డిమాండ్లపై పోరు చేయక తప్పటం లేదని వారంటున్నారు. ఈ జాతీయ మహాసభల్లో కేవలం తమ భవిష్యత్‌ గురించే కాకుండా.. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ నిర్వీర్యం చేసే దిశగా సాగుతున్న ప్రభుత్వ యత్నాలను అడ్డుకునే అజెండాపైనా చర్చించనున్నారు.

11:27 - January 7, 2016

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మహిళలకు, పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలు జాతీయ మహాసభ జరుపుకుంటున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఎనిమిదవ మహాసభలు ప్రారంభమయ్యాయి. సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు తపన్ సేన్ ప్రారంభించారు. సేవకులుగా ఉన్న తమను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని.. ప్రతిక్షణం తమ డిమాండ్లపై పోరు చేయక తప్పటం లేదని వారంటున్నారు. ఈ జాతీయ మహాసభల్లో కేవలం తమ భవిష్యత్‌ గురించే కాకుండా.. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ నిర్వీర్యం చేసే దిశగా సాగుతున్న ప్రభుత్వ యత్నాలను అడ్డుకునే అజెండాపైనా చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్ వాడీలు టెన్ టివితో మాట్లాడారు. ఏపీలో అంగన్ వాడీల జీతాలను పెంచుతామని ప్రకటించారని, అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని విస్మరించి ఎప్రిల్ నెల నుండి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఇటీవల ఏపీలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసిందని, నిర్భందాలపై మహాసభలో చర్చించి నివేదికను తయారు చేస్తామన్నారు.

 

Don't Miss

Subscribe to RSS - ఆర్టీసీ కళ్యాణ మండపం