ఆసుపత్రి

13:27 - August 16, 2017

నిర్మల్ : జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రికి వాణిజ్యపరంగా 13 దుకాణాలు ఉన్నాయి. బస్‌స్టాండ్‌కు సమీపంలో ఉండటంతో వాటి మధ్య తీవ్ర పోటి నెలకొంటుంది. 1997లో టెండర్లు నిర్వహించిన తరువాత... మళ్లీ వాటికి టెండర్లు చేపట్టలేదు. అప్పట్లో నిర్ణయించిన అద్దెనే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఆదాయానికి భారీగా గండి పడుతోంది. టెండర్లు దక్కించుకున్న దుకాణదారులకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటి కోసం ప్రతి మూడేళ్లకు ఓసారి టెండర్లు నిర్వహించి అద్దె పెంచుతారు. నెలనెల అద్దె చెల్లించని పక్షంలో 18శాతం వడ్డీ చెల్లించాలని అలాగే వేలం పాటలో పాల్గొన్న వ్యక్తే అక్కడ వ్యాపారం చేసుకోవాలని నిబంధన ఉంది. అయితే 2వేల 500 నుండి 5వేల అద్దెకు దుకాణాలు దక్కించుకుని... ఎక్కువ ధరకు బయటి వ్యక్తులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఒక్కో దుకాణానికి నెలకు 12 వేల నుండి 15 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇవన్ని తెలిసినా అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

2 కోట్ల 16 లక్షల అద్దె
అయితే ఇప్పటికీ అద్దెదారులు నెలనెల అద్దె కూడా చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో 2 కోట్ల 16 లక్షల రూపాయలు అద్దె బాకీ ఆసుపత్రికి రావాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు లోపాయికార ఒప్పందాలు చేసుకొని... టెండర్‌లు నిర్వహించకుండా చేస్తున్నారని స్థానికులు, విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి.. ఆసుపత్రి ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని... ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

09:51 - August 16, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికెన్‌గున్యా, డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ లాంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విషజ్వరాల బారినపడి అవస్థలు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో ప్రైవేటు , ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులకు గురవతున్నారు. క్యూలైన్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో..జ్వర పీడితులు అసహనం చెందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం
అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. హైదరాబాద్‌లో సీజనల్‌ జ్వరాలు ప్రబలడంతో.. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు క్యూకడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని రోగాల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏకొద్దిపాటి జలుబు, దగ్గు అనిపించినా చిన్న పిల్లల్ని వైద్యులకు చూపించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. వర్షాలు జోరుగా పడుతుండటంతో దోమలు విజృభిస్తున్నాయి. జనం రోగాలభారిన పడి విలవిల్లాడుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి..పారిశుద్ధ్యకార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దోమల నివారణకు పాగింగ్‌ చర్యలు విస్తృతంగా చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.  

15:53 - August 12, 2017

నిర్మల్ : జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో పసికందు మృతి కాంగ్రెస్‌, TRS నేతలమధ్య వాగ్వాదానికి దారితీసింది.. డెలివరీకోసం లలిత అనే గర్భిణీ గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరింది.. ఉదయం సిజేరియన్‌చేసిన వైద్యులు శిశువు మృతిచెందిందని తెలిపారు.. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. రోగి బంధువుల తీరుతో ఆగ్రహించిన డాక్టర్లు సామూహికంగా సెలవుపెట్టారు.. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు బాధితుల్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు.. అదేసమయంలో శిశువు మృతిపై విచారణకోసం వచ్చిన DCHS డాక్టర్‌ సురేశ్‌ను అడ్డుకున్నారు.. శిశువు మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ గులాబీ నేతలు కాంగ్రెస్‌ నేతలకు అడ్డుతగిలారు.. రెండు వర్గాలమధ్య వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం రెండువర్గాలకు నచ్చజెప్పిన పోలీసులు నేతల్ని ఇంటికి పంపేశారు.

06:55 - August 12, 2017

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి.

నిర్మల్‌ జిల్లా బైంసా మండల కేంద్రంలో అర్ధరాత్రి ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్నా... ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో నిద్రపోతున్న నర్సులకు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన సిబ్బంది... కుటుంబ సభ్యులపై చిందులు వేస్తూ ఏవో ఇంజక్షన్లు చేశారు. తర్వాత నొప్పులు తగ్గాయి... ఉదయం ఆపరేషన్‌ చేయగా... మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో మరో శిశువు మృతి చెందాడు. ప్రసవం కోసం గత మంగళవారం జ్యోతి అనే గర్బిణీ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. సిజేరియన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే... అనస్తషీయ రాలేదని ఆపరేషన్‌ను వాయిదా వేశారు. శుక్రవారం రోజున నొప్పులతో మళ్లీ ఆస్పత్రికి రావడంతో... వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో... ఆ తల్లి మృత శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నవోదయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే... వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో... యువతి చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు... యువతి మృతికి కారణమైన డాక్టర్లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు కాపాడుతారని ఎంతో నమ్మకంగా రోగులు ఆస్పత్రికి వస్తే... వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

19:01 - August 11, 2017

నిర్మల్ : జిల్లా బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లాక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి నుంచి ఆసుపత్రి సబ్బంది పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:58 - August 3, 2017

ఉద్యోగం కోసం వెళితే ముందు దరఖాస్తు ఫారం నింపాల్సి ఉంటుంది. అందులో పేర్కొన్న అంశాలను నింపి దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఓ ప్రాంతంలో ఉద్యోగాల భర్తీ దరఖాస్తులో ఉన్న అంశాలను చూసి షాక్ తినాల్సిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. కొన్ని కాలమ్స్ లో ఉన్న అంశాలను చూసి దరఖాస్తుదారులు షాక్ తిన్నారంట. ఇలాంటి ఆప్షన్స్ ఏమిటి? అని దరఖాస్తు దారులు మండిపడుతున్నారు. 'కన్య' అనే ఆప్షన్ ఇచ్చారు. అసలు 'కన్య'నా? కాదా? అనే అప్షన్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పాలని పేర్కొనడం కరెక్టు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి విడ్డూరమైన ఆఫ్షన్స్ ఇంకా ఉన్నాయి. 'నేను బ్రహ్మచారిని / వితంతువు / కన్య’ అనే ఆప్షన్లు ఇచ్చారు. 'నాకు ఒకే భార్య ఉంది'/ నాకు పెళ్లైంది/ ఒకరి కన్నా ఎక్కువమంది భార్యలున్నారు’/ ‘నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి మరో భార్యలేదు/ ‘నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి మరో భార్య కూడా ఉంది’ అనే అప్షన్లను కూడా ఇచ్చారు.

ఈ ఆఫ్షన్ ను ఆసుపత్రి వర్గాలు సమర్థించుకుంటున్నాయంట. ఉద్యోగం వచ్చాక ఎవరైనా అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే దానిపై విచారణకు దరఖాస్తు దారులోని వివరాలను ఉపయోగపడుతాయని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. తీవ్ర విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

15:51 - July 31, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర కార్మికులకు అందుబాటులో ఉండేలా 500 పడకల ఈఎస్ఐ అసుపత్రిని ఏర్పాటు చేయాలని సీఐటీయు ఆందోళనకు దిగింది. విశాఖలోని ఈపీఎఫ్‌ ఆఫీసు ముందు జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ పాల్గొన్నారు. కార్మికుల నుంచి వసూలు చేస్తున్న డబ్బును మెడికల్‌ కాలేజీలు కట్టడానికి ఉపయోగిస్తున్న ప్రభుత్వం... వారి సంక్షేమాన్ని మరిచిందని గఫూర్‌ విమర్శించారు. కార్మికుల అవసరాలను గుర్తించి వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

21:32 - July 13, 2017

విశాఖ : తూర్పు ఏజెన్సీలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి స్థితిగతులపై వైద్యుల్ని ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల్ని నిశితంగా పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

18:36 - July 9, 2017
19:05 - July 8, 2017

అనంతపురం : అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పరిటాల సునీత తనిఖీ చేపట్టారు. చంటిబిడ్డలతో ఆస్పత్రులకు వచ్చి ఇబ్బందులు పడుతున్న బాలింతలకు అవసరమైన మౌళిక సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆసుపత్రి