ఇష్టారాజ్యం

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

16:30 - January 3, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ప్రైవేటు డైరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:43 - June 28, 2016

వరంగల్‌ : జిల్లాలో పత్తి కొనుగోలు దారులు , కమిషన్‌ ఏజెంట్ల మధ్య నెలకొన్న వివాదం రైతులకు ప్రాణ సంకటంలా మారుతోంది. ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరొందిన ఏనుమాముల మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్ల నిర్వాకంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. దళారీ వ్యవస్థ ఇంతలా మార్కెట్‌ను శాసిస్తున్నా మార్కెటింగ్‌ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. 
బోర్డు ఎత్తేసిన కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీ
వరంగల్‌ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీ సుమారు రెండున్నర కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసి బోర్డు ఎత్తేసింది. దీంతో తమకు బాకీ పడినందుకు గానూ కమీషన్‌ ఏజెంట్లు నిరసనగా ఏకంగా మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను నాలుగు గంటల పాటు నిలిపివేసారు. ఒక వైపు ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు కమీషన్‌ ఏజెంట్ల నిర్వాకం, అలాగే అధికారుల నిర్లక్ష్యంతో రైతులు లబోదిబోమన్నారు. 
సదరు కంపెనీపై కేసు నమోదు 
అయితే సదరు కంపెనీపై పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్వహణలోని మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్ల అజమాయిషీ ఎంతలా పెరిగిపోయిందో అద్దం పడుతోంది. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు, వ్యాపారులకు నడుమ కమీషన్‌ ఏజెంట్లు దళారులుగా ఉంటూ.. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూసేందుకు ఏర్పాటు చేసిన అడ్తిదారీ వ్యవస్థ ఇప్పుడు ఏకంగా మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరింది. 
మార్కెట్‌ను నిలిపివేయడం నిబంధనల ఉల్లంఘనే
ఇదిలాఉంటే మార్కెట్లో ముందస్తు అనుమతి లేకుండా ఖరీదులు నిలిపివేయడానికి ఎవరికీ అనుమతి లేదు. ఇవేవీ పట్టకుండా కమీషన్‌ ఏజెంట్లు కొనగోళ్లు నిలిపివేశారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మార్కెట్‌ను నిలిపివేయడం నిబంధనల ఉల్లంఘనేనని తేలింది. మరోసారి ఇలా చే‌స్తే కఠిన చర్యలకు వెనుకాడమని సంబంధిత మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు.

 

Don't Miss

Subscribe to RSS - ఇష్టారాజ్యం