ఈటెల

15:43 - January 29, 2018

కరీంనగర్‌ : జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ఇక్కడ ఒకే ఒక్కడుగా వెలిగిన మంత్రి ఈటెల రాజేందర్‌కు గట్టిపోటీ నెలకొంది. ప్రస్తుత టీడీపీనేత... మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈటెలకు చెక్‌ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. హుజురాబాద్‌ రసవత్తర రాజకీయాలపై టెన్‌టీవీ కథనం..హుజురాబాద్‌ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంతుచిక్కని రీతిలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇంతకాలం టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ ఇలా ముక్కోణ పోటీ ఉన్న హుజురాబాద్‌లో ఇప్పుడు సీన్‌ మొత్తం మారిపోయింది. మంత్రి ఈటెల వర్సెస్‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నట్టు పరిస్థితి మారిపోయింది. రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే పోటీ ఉంటుందన్న చర్చ సాగుతోంది.

మంత్రి ఈటల టార్గెట్‌గా పెద్దిరెడ్డి ఈ మధ్య బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనం భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో పెద్దిరెడ్డి మరోసారి ఇక్కడి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో... పెద్దిరెడ్డి కూడా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అందుకే ఇటీవల తన అనుచరులు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో పెద్దిరెడ్డి సమావేశం నిర్వహించి, అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం మంత్రి ఈటలకు గెలుపు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ క్షేత్ర స్థాయి క్యాడర్‌ అంతా ఆయనతో నడిచే అవకాశముంది. అంతేకాదు.. అటు టీ టీడీపీ కార్యకర్తలు సైతం పెద్దిరెడ్డికే అండగా ఉండనున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ద్విముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లే నేతల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. ఈనేపథ్యంలో వారంతా పెద్దిరెడ్డికే మద్దతిచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.... ఈటల బీసీ నేత కావడం కూడా మైనస్‌ పాయింట్‌గానే భావిస్తున్నారు.

ఈటెల ఇంతకాలం ఒకేఒక్కడుగా చక్రం తిప్పినా.. పట్టు మాత్రం సాధించలేదు.. అంతేగాక.. ఈటల తీరుతో విసిగిపోయిన జమ్మికుంట జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌కు రాజీనామా కూడా చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు వ్యతిరేక గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జడ్పీటీసీ వీరేశం ఈటల భవిష్యత్‌పై చెప్పిన జోతిష్యాన్ని ఓ సారి వీడియోలో చూడండి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నది కేసీఆర్‌ సంకల్పం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సుమారు 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని నిఘా వర్గాలు సీఎంకు నివేదికను ఇచ్చాయి.

అలాగే.. హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు.. కెప్టెన్‌తో ఈటలకు ఉన్న విబేధాలను బేరీజు వేస్తూ రిపోర్టు టీఆర్ఎస్ అధినేతకు అందించినట్లు సమాచారం. దీంతో ఈటలకు స్థానం అనుమానమే అన్నసాగుతోంది. ఎటొచ్చి ఎటుపోయినా... ఇంతకాలం ఉద్యమ పార్టీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి ఈటెలకు రానున్న ఎన్నికలు గట్టి సవాల్‌ విసరనున్నాయి. మరి రాజకీయ ఎత్తులను చిత్తు చేస్తారో... లేదా ప్రత్యర్థుల ధాటికి చిత్తవుతారో వేచి చూడాల్సిందే...

21:37 - January 1, 2018

కరీంనగర్ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక లోటుతో ఉన్న విద్యుత్‌ కాస్తా మిగులు విద్యుత్‌ గా మారిందని ఆయన అన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కేశారం గ్రామంలో ఈటెల పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి నేటి నుండి 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు రాత్రి సమయాల్లో కరెంట్‌ ఇచ్చి.. రైతులను ప్రమాదాలకు గురయ్యేలా చేశాయని మండిపడ్డారు. రైతు సమస్యలపై అవగాహాన ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఈటెల రాజేందర్‌ అన్నారు.

18:03 - December 30, 2017

కరీంనగర్ : తెలంగాణ చిత్రపటంపై కరీంనగర్‌ను నంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వస్తారని ఆయన చెప్పారు. కరీంనగర్ మానేరు నదిపై 149 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులు శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా కరీంనగర్ నుంచి సదాశివపల్లి వరకు 34 కోట్లతో ఫోర్ లైన్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్‌లు పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభ జరిగింది.  

07:32 - December 6, 2017

బీసీలు ఎదురు చూస్తున్న బీసీ సబ్ ప్లాన్ ఇక లేనట్టే. మూడు రోజుల పాటు బీసీల అభివృద్ధి..సంక్షేమంపై నిర్వహించిన సమావేశంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుపై చర్చకు వచ్చినా..ఆ అంశాన్ని పక్కన పెట్టాలని సర్కార్ సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో జూలకంటి (సీపీఎం), కాచం సత్యనారాయణ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:20 - November 15, 2017

హైదరాబాద్ : విపక్షాల ప్రశ్నలు.. మంత్రుల సమాధానంతో తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీగా సాగింది. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్‌, సీపీఎం పక్షాలు విమర్శించాయి. దాంతోపాటు హైదరాబాద్‌లో రోడ్లు, నాలాల దుస్థితిపై బీజేపీ, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్టీసీ నష్టాలపై కూడా సభలో చర్చించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులపై తెగ హడావిడి చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజు బకాయిలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శలు కురిపించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వ వైఖరిని శాసనసభలో విపక్షాలు ఎండగట్టాయి.

ఫీజు చెల్లింపులు పెండింగ్‌లో పెట్టడం వల్ల .. పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఉత్తమ్‌ కుమారెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఫీజు బకాయిలతో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న పేదవర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. దాదాపు 4వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఖచ్చితమైన హామీఅయినా ఇవ్వాలని సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు.

అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంలేదని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌అన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. చిన్న కాలేజీలకు మొదట, పెద్ద కాలేజీలకు తర్వాత ఫీజులు చెల్లిస్తున్నామని, 2016-17 విద్యాసంవత్సరానికి మరో వారం రోజుల్లో ఫీజు బకాయిలు పూర్తిచేస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటల.

అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్‌లో రవాణా, రోడ్లు, నాలాల పరిస్థితిపై విపక్షసభ్యులు ప్రశ్నలు సంధించారు. నగరంలో నాలాల పరిస్థితి అధ్వానంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేయించాలని బీజేపీ, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సమాధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్‌...సభ్యులు ప్రశ్నలు సుదీర్ఘంగా అడగడంపై సెటైర్లు వేశారు. నగరంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆధునిక యంత్రసామాగ్రిని జీహెచ్‌ఎంసీకి సమకూరుస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీవ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. 2015-16లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.39కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ రూ.336కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఆర్టీసీలో 4వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. అంతకు ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. విద్యార్థుల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సమస్యలను దాటవేస్తున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. 

17:18 - November 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఫీయి రీయింబర్స్ మెంట్ పథకంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. బుధవారం అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం నీరుగార్చిందని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఆయన ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు వేశారు. పేదవర్గాల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాకర్ల మధ్య ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా ? అని ప్రశ్నించారు. 13 లక్షల విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందని, 80 మైనార్టీ స్కూళ్లు మూతపడ్డాయా ? లేదా ? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని సూటిగా ప్రశ్నించారు. చివరి సంవత్సరం నుండి బకాయిలు ఎంతుందో చెప్పాలన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. రూ. 4వేల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీనివ్వాలన్నారు.

దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పెట్టడం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని..2016-17 విద్యా సంవత్సరానికి మరో వారంలో ఫీజులు బకాయిలు చెల్లిస్తామన్నారు. చిన్న కాలేజీలకు మొదట..పెద్ద కాలేజీలకు తరువాత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు తాము 52.35 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం జరిగిందన్నారు. 

21:17 - November 14, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం... తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై హాట్‌హాట్‌ డిస్కషన్ జరిగింది. అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి.. ఆరోపించారు. కార్పొరేషన్లు, కో ఆపరేటివ్‌ ఫెడరేషన్స్‌ కోసం ఎంత అప్పుతీసుకున్నారో ఆర్థికశాఖ దగ్గర లెక్క ఉందా అని ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్‌ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు 2 లక్షల 20 వేల కోట్లు అవుతుందని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సర్‌ప్లస్‌లో ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు...లెక్కలతో సహా చూపించాలన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి ఈటల ఖండించారు. రాష్ట్రం రెవెన్యూలో సర్‌ప్లస్‌లో ఉన్న మాట వాస్తవమే అని మంత్రి ఈటల అన్నారు. ఏ అప్పులు చేసినా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మధ్యాహ్నం నుంచి నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను మర్చిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి ఉద్యోగాలు ఇమ్మని అడిగే పరిస్థితి కల్పించకూడదన్నారు.

విపక్ష పార్టీల నేతలను మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల నియామకాలన్నీ వచ్చే 20 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తమ మేనిఫేస్టోలో ఉన్న అంశాలు 90 శాతం అమలు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 27, 744 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి ఈటల రాజేందర్ సభకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7, 266 పోస్టులు విద్యుత్‌ శాఖలో 1, 427, పోలీస్‌ శాఖలో 12, 157 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం సభ బుధవారానికి వాయిదాపడింది.

08:41 - November 11, 2017

జిఎస్‌టి అమలుపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువులను శ్లాబ్‌ నుంచి తప్పిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం శ్లాబు పరిధిలో కేవలం 50 వస్తువులకే పరిమితం చేశారు. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కాట్రగడ్డ ప్రసూన్న (బీజేపీ), కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

21:39 - September 10, 2017

కరీంనగర్/జగిత్యాల : నాడు కాంగ్రెస్‌ పాలనలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని..నేడు కేసీఆర్‌ పాలనలో రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్‌, ప్రాజెక్టుల కోసం లక్షా 50 వేల కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. జగిత్యాల్‌ జిల్లా కథలాపూర్‌లో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతు సమన్వయ సంఘాలు రానున్న రోజుల్లో సమర్థవంతంగా పనిచేసి అన్నదాతలకు అండగా నిలవాలని పోచారం పిలుపునిచ్చారు. 

17:34 - September 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ పౌరసరఫరాల శాఖ మరో ముందడుగు వేసింది. రేషన్‌ షాపుల సమస్త సమాచారాన్ని ఫోన్‌లో తెలుసుకునేలా సరికొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ సౌజన్యంతో తయారు చేసిన ఈ యాప్‌ను మంత్రి ఈటెల రిలీజ్‌ చేశారు. ఈ యాప్‌ ద్వారా సరుకుల నిల్వ... రాకపోకలు..... రేషన్‌ షాప్‌ ఎక్కడుంది? తెరచి ఉందా? మూసి ఉందా?లాంటి సమాచారం ప్రజలు తెలుసుకోవచ్చు.. పౌరసరఫరాలో ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ.. ప్రజలను మరింత చేరువ చేసేందుకు ఈ యాప్‌ రూపొందించామని ఈటెల తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఈటెల