ఈటెల రాజేందర్

13:48 - September 1, 2018

కరీంనగర్ : ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు మంత్రి ఈటెల తన యత్నాలకు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ళ అభివృద్ధిని ప్రజలకు ఈ సభ ద్వారా వివరిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. భారీ జన సమీకరణతో హుజురాబాద్ లో ట్రాక్టర్ ర్యాలీని ఈటెల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు టీఆర్ఎస్ సాధిస్తుందని..విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా 119స్థానాలు మావేనని ఈటెల ధీమా వ్యక్తంచేశారు. ఈ సభపై కాంగ్రెస్ ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేవని ఆయన స్పష్టంచేశారు. ప్రతీ ఇంటింటికి ప్రతీవారు ఈ సభకు రావాలనే సంకల్పంతో వున్నారని..దీని కోసం 100 ట్రాక్టర్లను, ప్రతీ గ్రామానికి రెండేసి బస్సుల చొప్పున 360 బస్ లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులలో 60 వేల మంది ప్రజలు..ఇంకా ఇతర వాహనాలలో కలిపి మా అంచనాలను మించి ప్రజలు కొంగరకలాన్ సభకు తరలిపోయేందుకు సిద్ధంగా వున్నారని..వారికి అన్ని ఏర్పాట్లను చేశామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  

14:21 - August 27, 2018

కరీంనగర్ : కొంగర కలాన్‌లో జరగబోయే ప్రగతినివేదన సభ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. సభకు భారీగా జనసమీకరణ చేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానానికి తమ సత్తాను చూయించేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ప్రగతి నివేదన సభకు జనసమీకరణ చేస్తూ మరో వైపు అభివృద్ధి మంత్రం జపిస్తూ అధికార పార్టీ నేతలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

జిల్లాలోని 13 నియోజకవర్గాలు 12 టీఆర్‌ఎస్‌వే కావడంతో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న జగిత్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున జనాలను సభకు తరలించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మొత్తం రెండున్నర లక్షల మందిని సభకు తీసుకెళ్లేందుకు మంత్రులు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం పార్టీ క్యాడర్‌ ను అలర్ట్‌ చేసి నేతలంతా విబేధాలు వీడి పని చేయాల్సిందిగా మంత్రులు ఉపదేశం చేస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలని రద్దు చేసే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ప్రగతి నివేదన సభకు జనసమీకరణ కోసం జరిగే సమావేశాలు, కార్యక్రమాలను ఎన్నికల సమాయత్తానికి కూడా వినియోగించుకోవాలని వ్యూహం రచించారు. గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి....నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని నిర్ణయించారు. అలాగే తాగు, సాగు నీటి ప్రాజెక్టుల ప్రగతిని వివరిస్తూ ప్రజలను ఓటర్లుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఈ సారి నలుగురు శాసనభ్యులకు టికెట్లు లభించకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు సీట్లు మార్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాల్సిందిగా జిల్లా మంత్రులు గులాబీ శ్రేణులకు సూచనలు చేస్తున్నారు. తమకు బలమైన పోటీనిచ్చే కాంగ్రెస్‌ నేతలను ప్రగతినివేదన సభల ప్రచారంలో తిప్పికొట్టాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్‌...

కేసీఆర్‌ సెంటిమెంట్‌ జిల్లాల్లో అధిక సీట్లు సాధించేందుకు పట్టు వదలకుండా టీఆర్‌ఎస్‌ ముందుగానే ప్రచారం మొదలు పెట్టింది. ప్రగతి నివేదన సభకు రెండున్నర లక్షల మందిని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న సభ ఏర్పాట్లు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ముందస్తు లేదంటూనే ప్రతిపక్షాలను మభ్య పెడుతూ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌ ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

21:08 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును యాథాతథంగా అమలు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అగస్టు ఒకటితో పంచాయితీల కాలపరిమితి ముగుస్తుండటంతో స్పెషల్ అఫీసర్లను వేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గఉప సంఘం అభిప్రాయపడింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్‌ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది.

ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈలోపు ఎన్నిక‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై కూడా సబ్‌కమిటీ చ‌ర్చించింది. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని...ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఈటల తెలిపారు.

జూలై 31 తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంద‌ని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యత‌లు అప్పగించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్నది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్లనేవి విద్యా, ఉద్యోగాలపై మాత్రమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. ఇక తమిళనాడు 69 శాతం ఉన్నపుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఎందుకు ఉండాలనే వాదనను సుప్రీం కోర్టులో వినిపిస్తామని చేప్తోంది.

06:46 - July 3, 2018

జగిత్యాల : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటానికి వచ్చిన మంత్రి ఈటెల రాజేందర్‌కు గంగపుత్రుల సెగ తగిలింది. మొన్న జనగామ జిల్లా కేంద్రంలో ఓ సభలో పాల్గొన్న ఈటెల.. రైతులకు, రజక, ముదిరాజ్ కులాలకు చెరువులపై పూర్తి హక్కులను కల్పిస్తామని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. గంగపుత్రులు భారీ ర్యాలీ చేపట్టారు. అటుగా వచ్చిన ఈటెల కాన్వాయిని గంగపుత్రులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గంగపుత్ర నాయకులను అరెస్ట్‌ చేశారు. నాయకులను అరెస్ట్‌ చేయటంతో గంగపుత్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగటంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెరగొట్టారు. చెరువులపై పూర్తిస్థాయి హక్కులను తమకే కల్పించాలని గంగపుత్రులు ఆందోళన అనంతరం డిమాండ్‌ చేశారు. 

12:44 - May 10, 2018

కరీంనగర్ : జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని మరింత అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. రైతులకు పాసు పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ కార్యక్రమం జిల్లాలోని హుజురాబాద్ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటెల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. 24గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతోందని, 12వేల కోట్ల రూపాయలు 58 లక్షల రైతాంగానికి అందించడం జరుగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభమైందని, రైతు బంధు పథకం కూడా ఇక్కడి నుండే ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. 

09:51 - March 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 11 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. మంగళవారం నాడు ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఈ చర్చలో అన్ని పక్షాల సభ్యులు పాల్గొంటారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేదనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కూడా రద్దు చేశారు. ఆమోదం పొందితే చట్ట సభలో వార్షిక బడ్జెట్ కు ఆమోద ముద్ర పడనుంది. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం మధ్యాహ్నం మండలిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. 

ఇదిలా ఉంటే రాష్ట్ర బడ్జెట్ లో 70 శాతం ఆదాయం హైదరాబాద్ నుండే వస్తుందని, మౌలిక సదుపాయల కల్పన చేయడం లేదని బిజెపి వాయిదా తీర్మానం ఇచ్చింది. పంచాయతీ రాజ్, కొత్త మున్సిపాల్టీ, ప్రైవేటు యూనివర్సిటీ బిల్లులను సభ ముందుకు తీసుకరావాలని..ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మధ్యాహ్నం బీఏసీ సమావేశం ఉంటుందని..ఇందులో సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

06:57 - March 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు మొండి చేయి చూపించింది. విశ్వనగరంగా చేస్తామని చెబుతోన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంలో విఫలమైంది. వేల కోట్లల్లో ప్రతిపాదనలు పంపినా ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగకపోవడంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మారుస్తాం...అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. కాని దాన్ని ఆచరణలో మాత్రం పెట్టడంలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాజధానికి పెద్దగా వాటా ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా HMDA, వాటర్‌బోర్డు, మెట్రో రైల్‌, మూసీ, రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు ఈ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

కొన్ని విభాగాలకు నిధులు పెద్ద మొత్తంలోనే కేటాయించినా కొన్ని సంస్థలకు మాత్రం మొండి చేయి చూపించింది బడ్జెట్‌. ఇందులో జీహెచ్‌ఎమ్సీకి బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. చట్టం ప్రకారం రావాల్సిన కొన్ని నిధుల్లో భారీ కోత విధించింది ప్రభుత్వం. నాలాల వైడనింగ్‌, సమగ్ర రోడ్ల అభివృద్ధి పథకం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన బల్దియాకు బడ్జెట్‌ నిరాశపరిచింది. అలాగే ఆస్తిపన్ను, మోటర్‌ వెహికిల్‌ టాక్స్‌, వృత్తిపన్ను, వేతనాల కోసం వందకోట్లకు మించి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఇక కొన్ని సంస్థలకు గ్రాంట్లు ఇవ్వకుండా కేవలం రుణాల రూపంలో నిధులు సమకూర్చింది ప్రభుత్వం. హైదరాబాద్‌ వాటర్‌ బోర్డుకు 1,420కోట్ల రూపాయ‌లు రుణం అందించ‌డానికి బ‌డ్జెట్ కేటాయింపులు చేశారు. అలాగే హెచ్‌ఎమ్‌డీఏకు 485 కోట్లు, మెట్రో రైల్‌కు 200 కోట్లు, మూసీ నది అభివృద్ధికి 377 కోట్లు కేటాయించారు. గ్రేటర్‌లో రోడ్డు కార్పొరేషన్‌కు గతేడాది 566 కోట్లు కేటాయించింది బడ్జెట్. ఇందులో 377 కోట్లు ఇప్పటికీ ఖర్చు కాలేదు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలోనూ తమ వాటా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భారాన్ని భరించడంతో బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువగా లేవన్నారు జీహెచ్‌ఎమ్ సీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా చివరి బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు చేయలేదు. అరకొర నిధులతో హైదరాబాద్‌ను ఎప్పుడు అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తారని సిటిజన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

11:27 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2018-19 బడ్జెట్ ను మంత్రి ఈటెల సమర్పించారు. గురువారం ఐదోసారి మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ రూ. 1.74, 453 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ. 1.25, 454 కోట్లుగా ప్రకటించారు. ప్రజల ఆకాంక్షల నెరవేర్చడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించడం జరిగిందని, ఈ ఏడాది వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సభకు తెలిపారు. వ్యవసాయ రంగంలో వృద్ధి 6.9 శాతానికి చేరుకుందని, ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది తలసరి ఆదాయం రూ. 1,75,534గా ఉంటుందని, ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 14.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2017-18లో పారిశ్రామిక వృద్ధి రేటు 7.6 శాతం, రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లుగా ఉందని, కేంద్రం వాట రూ. 29.041 కోట్లుగా ఉందన్నారు. రెవెన్యూ మిగులు రూ. 5520 కోట్లు అంచనా వేస్తున్నట్లు, ద్రవ్యలోటు రూ. 29,077 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

 • మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు
 • ఈ ఏడాది నుండి రైతులకు రూ. 5లక్షల బీమా పథకం. త్వరలో ధరణి వెబ్ సైట్ ఆవిష్కరణ.
 • రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు.
 • రైతుల పెట్టుబడి పథకానికి రూ. 12వేల కోట్లు.
 • పౌలీ హౌస్ నిర్మాణాలకు రూ. 120 కోట్లు.
 • బిందు, తుంపర సేద్యానికి రూ. 127 కోట్లు.
 • వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు.
 • నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు.
 • మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు.
 • పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు.
 • మైనార్టీల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు.
 • మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు.
 • ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు.
 • విద్యాశాఖకు రూ. 10,830 కోట్లు.
 • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు.
 • వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 7,375 కోట్లు.
 • గురుకులాలకు రూ. 2,823 కోట్లు.
 • దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీకి రూ.1469 కోట్లు.
 • బీసీల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు.
 • ఎస్టీ ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు.
 • ఎస్టీల సంక్షేమానికి రూ. 8,063 కోట్లు.
 • ఎస్సీల సంక్షేమానికి రూ. 12,709 కోట్లు.
 • ఎస్సీ ప్రగతి నిధికి రూ. 16,453 కోట్లు.
 • పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు.
 • గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు.
 • కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 1450 కోట్లు.
 • డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు.
 • ఆర్ అండ్ బికి రూ. 5,575 కోట్లు.
 • విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు
 • చేనేత, జౌళి రంగానికి రూ. 1,200 కోట్లు.
 • పరిశ్రమల శాఖకు రూ. 1,286 కోట్లు. 
 • పట్టణాభివృద్ధికి రూ. 7,251 కోట్లు.
 • రోడ్లు భవనాల శాఖకు రూ. 5,575 కోట్లు.
 • సాగునీటి ప్రాజెక్ట్ లకు రూ. 25వేల కోట్లు.
 • ఐటీ శాఖకు - రూ. 289 కోట్లు.
 • చేనేత, టెక్స్ టైల్ రంగానికి - రూ. 1,200 కోట్లు.
 • ఆరోగ్యలక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు.
 • మిషన్ భగీరథకు - రూ. 1,801 కోట్లు.
 • మిషన్ కాకతీయకు - రూ. 25వేల కోట్లు.
 • సాంస్కృతిక శాఖకు - రూ. 2వేల కోట్లు.
 • యాదాద్రి అభివృద్ధికి - రూ. 250 కోట్లు.
 • వేములవాడ దేవాలయం అభివృద్ధికి - రూ. 100 కోట్లు.
 • బాసర ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు.
 • ధర్మపురి ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు.
 • భద్రాచలం ఆలయ అభివృద్ధికి - రూ. 100 కోట్లు.
 • అర్చకుల జీతభత్యాలకు - రూ. 72 కోట్లు.
 • హోంశాఖకు - రూ. 5,790 కోట్లు.
 • పౌరసరఫరాల రంగానికి - రూ. 2,946 కోట్లు.
 • విద్యుత్ రంగానికి - రూ. 5,650 కోట్లు.
 • వైద్య ఆరోగ్యశాఖకు - రూ. 7,375 కోట్లు.
 • విద్యాశాఖకు - రూ. 10,830 కోట్లు.
10:20 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి తమను బలవంతంగా బయటకు పంపేశారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో గురువారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ వేటు వేయడం...ఇద్దరు సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో టెన్ టివితో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అభివర్ణించారు. గవర్నర్ ప్రసంగం మొత్తం వీడియో చిత్రీకరిస్తారని..స్వామిగౌడ్ పై దాడి జరిగితే పశ్చాతాపం వ్యక్తం చేస్తామని..కానీ దాడి జరిగిన ఘటన వీడియో ఫుటేజ్ ను బయట పెట్టాలన్నారు. బడ్జెట్ కేటాయింపులు ప్రధానం కాదని..ఖర్చు ప్రధానమైందన్నారు. రూ. 21వేల కోట్లు దళితుల సంక్షేమం కోసం వెచ్చించాల్సి ఉందని కానీ అలా చేయలేదన్నారు. ఆధారాలు ఉంటే తెలియచేయాలని..నిర్ణయం తీసుకోవడం అంటే ఏకపక్షమేనని జీవన్ రెడ్డి తెలిపారు. 

07:06 - March 15, 2018

హైదరాబాద్ : రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఇక మండలిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పీట వేస్తుందని సర్కార్‌ చెప్తున్న నేపథ్యంలో ఈటెల బడ్జెట్‌ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ పద్దును ఆయన ప్రతిపాదిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ఇప్పటికే బుధవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.

ఈ సారి రాష్ట్ర బడ్జెట్‌ లక్షా 73వేల కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతియేటా పద్దును 15శాంత పెంచి చూపుతున్న సర్కారు.. ఇప్పుడు కూడా అదేవిధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. దీంతో లక్షా 73 వేల నుంచి 75 వేల కోట్ల మధ్య బడ్జెట్‌ ఉండనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పూర్తిస్థాయిలో ప్రతిపాదించబోయే చివరి బడ్జెట్‌. వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్న దృష్ట్యా అప్పుడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇవాళ అసెంబ్లీలో ఈటల ప్రవేశపెట్టబోయే బడ్జెట్ టీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకం.

వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయానికి పెట్టుబడి పథకంతోపాటు సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశముంది. సాగునీటి రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశముంది. సంక్షేమ రంగానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తమది ప్రజాబడ్జెట్‌ అని చెబుతున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమంటున్నారు. ఈ నేపథ్యంలో.. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక అత్యంత కీలకమైన సామాజిక, ఆర్థిక సర్వేను ఇవాళే శాసనసభలో ప్రవేశపెట్టనుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - ఈటెల రాజేందర్