ఈసీ

21:08 - December 8, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభల్లో తగ్గించిన జిఎస్‌టిని ప్రచారం చేయవద్దని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. ఇటీవల 178 వస్తువులపై జిఎస్‌టిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తనకనుకూలంగా మార్చుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీ పేర్కొంది. వస్తువులు, సేవల పేర్లు తీసుకోకుండా పన్నును సరళీకరించినట్లు చెబితే అభ్యంతరం లేదని తెలిపింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్లరద్దు, జిఎస్‌టి అంశాలపై మోది ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు అంశాలు బిజెపి నష్టం కలిగించాయి. దీంతో నష్ట నివారణ కోసం జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం 178 వస్తువులపై టాక్స్‌ను తగ్గించింది. 

15:43 - November 23, 2017

చెన్నై : అన్నాడిఎంకె పార్టీ గుర్తుపై శశికళ వర్గానికి ఈసీ ఝలక్‌ ఇచ్చింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను డిసెంబర్‌ 31లోగా నిర్వహించాలని మద్రాస్‌ హైకోర్టు ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడిఎంకె పార్టీ గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి దక్కడం గమనార్హం. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక సమయంలో పార్టీ గుర్తు రెండాకుల కోసం శశికళ-దినకరన్, పళని, పన్నీర్‌ వర్గాలు ఈసీని ఆశ్రయించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో పళని, పన్నీర్‌ వర్గాలు ఏకమయ్యాయి.

14:20 - November 21, 2017

చెన్నై : ఆర్కేనగర్‌ ఉప ఎన్నికపై ఈసీకి మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 31లోగా ఉప ఎన్నిక ప్రక్రియ ముగించాలని ఆదేశించింది.  డిసెంబర్‌లో పండుగలు ఉండటంతో ఉప ఎన్నిక వాయిదావేయాలని ఈసీ కోరగా, ఈ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది. 

 

15:52 - November 15, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి 'పప్పు' అని వ్యాఖ్యనించడాన్ని ఎన్నికల కమిషన్‌ తప్పు పట్టింది. ఎన్నికల ప్రచారం, ప్రకటనల్లో పప్పు అనే పదాన్ని ఉపయోగించకుండా దానిపై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి... రాహుల్‌ను ఉద్దేశించి పప్పు అనే పదాన్ని ముద్రించింది. దాన్ని పరిశీలించిన ఈసీ...పప్పు అనే పదం అభ్యంతరకరంగా ఉందని... ఆ పదాన్ని తొలగించాలని సూచించింది. ఓ రాజకీయ నాయకుడిని అలా పిలవడమంటే... ఆయనను అవమానించడమేనని ఈసీ స్పష్టం చేసింది. గుజరాత్‌లో డిసెంబరు 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

13:28 - October 25, 2017

ఢిల్లీ : ఎట్టకేలకు ఈసీ గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 9 ,14 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయని, డిసెంబర్ 18న కౌంటింగ్ జరుగనుందని వెల్లడించింది. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు ఈవీంఎలను సిద్ధం చేయడం జరిగిందని, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా వీడియో గ్రాఫ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 50,128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, గుజరాత్ లో 4.43 కోట్ల మంది ఓటర్లున్నారని పేర్కొన్నారు.

ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన ఈసీ గుజరాత్ రాష్ట్రానికి ప్రకటించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటన నేపథ్యంలోనే ఈసీ ప్రకటించలేదనే విమర్శలు వినిపించాయి. గుజరాత్ లో మోడీ పర్యటన ఇటీవలే ముగిసిన సంగతి తెలిసలిందే. అనంతరం బుధవారం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడం గమనార్హం. 

2012 ఫలితాల బల బలాలు..
గుజరాత్ అసెంబ్లీ 2012 ఫలితాలు ఒక్కసారి చూస్తే బీజేపీ ఓట్ల శాతం 64.29 శాతం ఉండగా కాంగ్రెస్ ఓట్ల శాతం 32.42గా ఉంది. మొత్తం 182 సీట్లున్న రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ 120 సీట్లు..కాంగ్రెస్ 43..ఎన్సీపీ 2...జేడీయూ 1..ఇండిపెండెంట్ 1 బలంగా ఉంది. 12 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

20:12 - October 20, 2017

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో ఈసీ కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ప్రధాని మోది గుజరాత్‌లో తలపెట్టిన మెగా ర్యాలీ కోసమే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఈసీ జాప్యం చేసిందని ఆరోపించారు. ప్రధాని అన్ని రాజకీయ ప్రకటనలు చేసిన తర్వాత... గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు. అక్టోబర్‌ 12న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల కమిషన్.. గుజరాత్ తేదీలను మాత్రం వెల్లడించలేదు. 

13:11 - October 13, 2017

గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఈసీ వైఖరి ఏంటీ ? డిసెంబర్ 18 లోగా ఎన్నికలుంటాయని చెప్పడంలో ఆంతర్యం ఏంటీ ? దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలోనే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి స్పష్టంగా ఎన్నిక తేదీలను ప్రకటించింది. కానీ గుజరాత్ రాష్ట్ర విషయానికి వచ్చే సరికి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనితో ఈసీపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పీఎం మోడీ పర్యటన ఉండడం..అక్కడ వరాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, ఇప్పుడు తేదీలు ప్రకటిస్తే వరాలు కురిపించే అవకాశం ఉండదని..ఇది అందరకీ అర్థమయ్యే విషయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ విషయంలో ఎన్నికలను దృష్టి పెట్టుకుని వరాలు ప్రకటించడం..జీఎస్టీ విషయంలో కేంద్ర వైఖరి అందులో భాగమేనని తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంపై ప్రభావం చూపే వాటిపై తగ్గించారనే విమర్శలున్నాయి. పేరుకు స్వతంత్ర సంస్థలుగా ఉంచడం...ఆచరణకు వచ్చే వరకు ప్రభుత్వం పావులుగా వాడుకోవడం జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం ఉండడం దురదృష్టకరమని ఆరోపిస్తున్నారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లో 150 ఎమ్మెల్యేల బలం పెంచుకోవాలని కాషాయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ప్రస్తుతం నోట్ల రద్దు..జీఎస్టీ..తదితర అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మోడీ స్వస్థలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావడం...2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు వస్తుండడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఆ రాష్ట్రంలో పార్టీకి పలు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. పటేల్ వర్గం ఒబిసి కోటా ఉద్యమంతో మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇక గోవధ అంశంలో దళితులపై హింసాకాండ వంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ పై వ్యతిరేకత వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి.

మరి గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? అక్కడ మోడీ వరాలు కురిపిస్తారా ? లేదా? అనేది వేచి చూడాలి. 

21:51 - October 12, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 68 అసెంబ్లీ స్ధానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని పేర్కొంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 49 లక్షల మంది ఓటర్లున్న హిమాచల్‌లో మొత్తం 7521 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈవీఎంలతో పాటు వీవీపాట్‌ యంత్రాలు ఉపయోగిస్తామని సీఈసీ అచల్‌ కుమార్‌ జ్యోతి చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో  నేటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. అభ్యర్థులు భారీ స్ధాయిలో ఓటర్లకు పంపే ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లనూ  ఎన్నికల ప్రచార వ్యయం కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణం వల్ల గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ పెండింగ్‌లో పెట్టింది. ఆ రాష్ట్రంలో డిసెంబర్‌ 18లోపు ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

 

16:27 - October 6, 2017

ఢిల్లీ : ఒక దేశం ఒకే పన్ను విధానం తరహాలో ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే జమిలి ఎన్నికల నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఇందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్దం చేస్తుండగానే ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి లోక్‌ సభతో పాటు అన్నిరాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018 సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్‌వర్క్ యాప్‌ను ప్రారంభించిన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్..పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం నిధులను సమకూర్చిందన్నారు. అయితే జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగిన చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమని చెప్పారు. ఇప్పటికే వీవీపీఏటీల కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు కేంద్రం అందజేసిందని చెప్పారు.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు. 1951-52లో తొలి సార్వత్రిక ఎన్ని కల నుంచీ 1967లో నాలుగో లోక్‌సభకు ఎన్నికల వరకూ జమిలిగానే సాగాయి. 1968,69 సంవత్సరాలలో అస్థిరత చోటు చేసుకుంది. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. దాంతో జమిలి ఎన్నికల ప్రక్రియకు పూర్తి విఘాతం కలిగింది.

అయితే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. జమిలి ఎన్నికల విధానాన్ని 2024 నుంచి అమలుచేయాలని, రెండు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల విధానంపై విస్తృత చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. 2018 మార్చి నాటికి ఈసీ తుది నిర్ణయం ప్రకటించాలని తెలిపింది. తాజాగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీ ప్రకటించింది.

మరోవైపు లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో అవి రాష్ట్ర స్థాయిలోనైనా, లేదా కేంద్ర స్థాయిలోనైనా మెజారిటీ కోల్పోయిన పక్షంలో ఏం చేయాలి? ఒకసారి ఎన్నికైన ప్రభుత్వానికి మెజారిటీతో సంబంధం లేకుండా ఐదేళ్లు పాలించే అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

07:29 - August 24, 2017

హైదరాబాద్ : చంద్రబాబు మీద జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. జగన్‌పై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశించింది. ఈ మేరకు జగన్‌పై నంద్యాలలో కేసు నమోదైంది.
జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎన్నికల సంఘం
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ.. జగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కాల్చిచంపాలి, ఉరితీయాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జగన్‌ వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల సంఘం జగన్‌ మాటలు నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. వెంటనే జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
జగన్‌పై కేసు నమోదు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల త్రీటౌన్ పీఎస్‌లో జగన్‌పై కేసు నమోదైంది. ఐపీసీ 188, 504, 506 సెక్షన్లతో పాటు..ప్రజాప్రాతినిధ్య చట్టం 125 కింద జగన్‌పై కేసు నమోదు చేశారు. కాగా సీఈసీ ఆదేశాలపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఈసీ