ఉగ్రవాదులు

09:40 - September 15, 2018

జమ్మూ కాశ్మీర్ : అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత బలగాలకు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతుండడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా కుల్గాంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్ టెర్రరిస్టులుగా గుర్తించారు. 
గాలింపులో భాగంగా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారం మేరకు భారత బలగాలు గాలింపులు చేపట్టాయి. శుక్రవారం రాత్రి నుండి కొనసాగిన కాల్పులు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో భాగంగా బారాముల్లా, కాజీగండ్ ప్రాంతంలో రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది. 

20:49 - August 29, 2018

జమ్ము కశ్మీర్‌ : లోని షోపియన్ జిల్లాలోని అర్హామా గ్రామం వద్ద ఉగ్రవాదులు పోలీసులపై మెరుపు దాడి చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు అమరులయ్యారు. ఓ పోలీసు వాహనానికి మరమ్మతులు చేయడానికి డీఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిన ఎస్కార్ట్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం ఆయుధాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నలుగురు జవాన్లను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. కానిస్టేబుళ్లు ఇశ్వాక్‌ అహమద్‌ మీర్, జావేద్‌ అహమద్‌ భట్, మొహమ్మద్‌ ఇక్బాల్ మీర్, ఎస్‌పిఓ ఆదిల్‌ మంజూర్‌ భట్‌ మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

16:38 - August 7, 2018

బెంగళూరు : దేశంలో పలు ప్రాంతాలలో విధ్వంసానికి పాల్పడుతున్నారనే సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు పలు కీలక ప్రాంతాలపై కన్ను వేశారు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ ఐఏ అధికారులు నేడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో పలు కీలక పత్రాలతో పాటు కౌసర్ మున్నాను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్, పెన్ డ్రైవ్, ల్యాప్ టాప్ లను సీజ్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేసే లింక్, ఫేస్ బుక్ ఫేక్ ఐడీ, లాగిన, పాస్ వర్డ్ లను అధికారులు గుర్తించారు. భారత్ లోని పలు ప్రాంతాలలోని పలు ప్రాంతాలలో విధ్వంసాలను కౌసర్ మున్నా కుట్ర పన్నినట్లుగా ఎన్ ఐఏ అధికారులు గుర్తించారు. కౌసర్ కు సహకరించిన మరో తీవ్రవాది ముస్లాఫిజర్ రెహ్మాన్ అనే వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దని అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 

16:17 - August 7, 2018

జమ్ముకశ్మీర్ : గురేజ్‌ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. చొరబాటుదారులను అడ్డుకునే సమయంలో ముష్కరులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్‌తో పాటు ముగ్గురు సైనికులు అమరులయ్యారు. శ్రీనగర్‌కు 125 కి.మీ దూరంలో బందిపొరా జిల్లా గురెజ్‌ సెక్టార్‌లో ఎల్వోసి నుంచి ఎనిమిది మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భారత సైన్యం వారికి దీటుగా బదులిచ్చింది. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి అదనపు భద్రతా బలగాలు చేరుకున్నాయి. అమరులైన సైనికులను మేజర్‌ కేపీ రాణె, జామీ సింగ్‌, విక్రమ్‌జీత్‌, మణిదీప్‌లుగా గుర్తించారు.

09:31 - August 4, 2018

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పాలన వచ్చిన అనంతరం రంజాన్ మాసం తరువాత ఉగ్రవాదుల చొచ్చుక వచ్చారనే సమాచారం మేరకు భారత బలగాలు ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆయా సమయాల్లో ఉగ్రవాదులకు..జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లా కిల్లోరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు, బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. శుక్రవారం రాత్రి నుండి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల నుండి ఏకె 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన ఉగ్రవాదులు రియాజ్ అహ్మద్ దర్, కుర్షీద్ అహ్మద్ మాలిక్ లుగా గుర్తించారు. కానీ బారాముల్లా జిల్లాలో జరిగిన కాల్పుల్లో జవాన్ సావర్ విజయ్ కుమార్ వీరమరణం పొందారు. 

12:13 - July 10, 2018

కశ్మీర్ : దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. కుండలన్‌ గ్రామంలోని ఒక ఇంట్లో ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని చుట్టుముట్టాయి. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్‌ ఆఫిసర్‌ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య భీకర పోరాటం కొనసాగుతోంది. ఓ వైపు భారీ కాల్పులు జరుగుతుంటే అల్లరి మూకలు ఆ ప్రాంతానికి చేరి ఉగ్రవాదులను తప్పించేందుకు ప్రయత్నించాయి. వీరి ప్రయత్నాన్ని భద్రతా బలగాలు సమర్ధంగా తిప్పికొడుతున్నాయి. వీరిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించాయి. 

 

11:32 - July 10, 2018

శ్రీనగర్ : కశ్మీర్‌లో మరో సారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ కశ్మీర్‌ సోఫియాన్‌ జిల్లా కుందాలన్‌ గ్రామంలో ఓ ఇంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఇంటిని చుట్టుము ట్టాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ సహా మరో జవాన్‌ గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆర్మీబేస్‌ 92 ఆస్పత్రికి తరలించారు. 

08:29 - June 25, 2018

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. కుల్గాంలో ఆదివారం మరో ఎన్‌కౌంటర్‌.. అనంతనాగ్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి గ్రెనేడ్ల స్వాధీనం.. గత నాలుగు రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో జరిగిన ఘటనలు ఇవి . అమర్‌నాథ్‌ యాత్రపై భారీ దాడులు చేయాలని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్ర సంస్థలు కుట్రలు పన్నినట్లు వచ్చిన ఇంటెలిజెన్స్‌‌ సమాచారంతో... భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. అమర్‌నాథ్‌ యాత్రపై ఆత్మాహుతి దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ పిలుపునిచ్చాయన్న సమాచారంతో కశ్మీర్‌లో భద్రతాదళు అప్రమత్తం అయ్యాయి. ఉగ్రవాద ఫిదాయిలు కారుబాంబులను వినియోగించి దాడులు చేయొచ్చన్న ని భారత ఇంటిలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి.

ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రపై భద్రతాంశాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో పక్క అమర్‌నాథ్‌ యాత్ర బోర్డు ఛైర్మన్‌ స్థానంలో ఉన్న గవర్నర్‌ వోహ్రా కూడా శనివారం సమీక్ష నిర్విహించారు. యాత్రికుల కోసం విశ్రాంతి మందిరాలు, వసతులు, మంచినీరు, హెలిప్యాడ్లను ఆయన పరిశీలించారు. సైనిక బలగాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కూడా గవర్నర్‌ సమావేశమయ్యారు.

అమర్‌నాథ్‌ యాత్ర భద్రత కోసం దాదాపు 24,000 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, జమ్ముకశ్మీర్‌ పోలీసులను నియమించారు. వీరికి అండగా సైన్యం, ఇతర ప్రత్యేక దళాలు ఆపరేషన్‌ నిర్వహించనున్నాయి. 60రోజులపాటు జరగనున్న యాత్రలో అవసరాన్నిబట్టి మరిన్ని బలగాలు మోహరించనున్నాయి. మొత్తం 40వేల మందికిపైగా భద్రతా సిబ్బంది రక్షణ విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఉగ్రమూకలు యాత్రీకులను బందీలుగా పట్టుకుంటే వారిని విడిపించడానికి ప్రత్యేక ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక దళాలను ఇప్పటికే శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు వద్ద సిద్ధంగా ఉంచారు. వీరికి అండగా ఎన్‌ఎస్‌జీ స్నైపర్‌ బృందాన్ని కూడా రెడీగా ఉంచారు.

ఈ నేపథ్యంలో ఆదివారం కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ డివిజన్‌ కమాండర్‌ షుకూర్‌దార్‌తో సహా మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది లొంగిపోయాడు. ఇతని వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. అంతకు ముందు రెండు రోజుల క్రితం అనంతనాగ్‌లో ఐఎస్‌జేకీ చీఫ్‌ దావూద్‌ సోఫీతో సహా మరో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు తుదముట్టించాయి. మరోవైపు యాత్రా మార్గాన్ని పర్యవేక్షించేందుకు పలు అంచెల్లో భద్రతా వలయాలను నిర్మించారు. సీసీటీవీలను, జామర్లను , బుల్లెట్‌ప్రూఫ్‌ బంకర్లు, డాగ్‌స్క్వాడ్‌, క్విక్‌ రీయాక్షన్‌ బృందాలతోపాటు 15 డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు.మొత్తంగా భక్తులు ప్రయాణించే మార్గాలపై ఉపగ్రహాల సమాచారం ఆధారంగా భద్రతను పర్యవేక్షించనున్నారు.

14:46 - June 18, 2018

జమ్మూకశ్మీర్‌ : బందిపోరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బిజ్‌బేహరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టవద్దని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్స్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. జమ్ముకశ్మీర్‌లో కాల్పుల విరమణను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించడంతో మళ్లీ ఆర్మీ ఆపరేషన్లు మొదలయ్యాయి.

19:13 - May 5, 2018

జమ్ముకశ్మీర్‌ : జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ ఛత్తాబల్ ప్రాంతంలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉదయం కూంబింగ్ నిర్వహించాయి. ఓ ఇంట్లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.. భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. ముందు జాగ్రత్తగా ఛత్తాబల్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రాంతంలో ఓ పౌరుడు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఉగ్రవాదులు