ఉత్తమ్

21:56 - September 24, 2017

హైదరాబాద్: పర్యావరణ, పబ్లక్‌ హియరింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు, ప్రజల నిరసనలపై తాము రివ్యూ నిర్వహించామన్నారు. కొద్ది రోజుల్లో తర్వాతి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. 

07:05 - September 13, 2017

నల్లగొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ టీపీసీసీలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. పీసీసీ చీఫ్‌ పేరు ఎత్తితే చాలు.. తోక తొక్కిన తాసుపాములా కస్సుమంటూ లేస్తారు. కోపంతో ఊగిపోతారు. శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా తరగతుల తర్వాత మరింత రగలిపోతున్నారు. ఈ సమావేశాల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమను అవమానించారన్న భావంతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు... టీపీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేశారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచే కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది.

గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నంత కాలం గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవకాశం దొరికనప్పుడట్టా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని టార్గెట్‌ చేస్తున్నారు. చాన్స్‌ వచ్చినప్పుడల్లా తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం పైరవీలు చేసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులు... శంషాబాద్‌ సమావేశం అనుభవంతో ఇక కాంగ్రెస్‌లో ఉండలేమన్న భావనుకు వచ్చారని సమాచారం. పార్టీ శిక్షణా తరగతుల్లో అవమానించారన్న కోపంతో రగలిపోతున్న కోమటిరెడ్డి సోదరులు.. ఆ రోజు వేదికపై ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితోపాటు ఐఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాకు ఇంగిత జ్ఞానంలేదంటూ వ్యాఖ్యానించడం రాజకీయం పెద్ద రచ్చతోపాటు చర్చకు దారితీసింది.

టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమకు కాంగ్రెస్‌లో పొగబెట్టారని బహిరంగంగా విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు.. టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమని ప్రకటించారు. సెప్టెంబర్‌లో పీసీసీలో మార్పులు ఉంటాయని అనుకున్న నల్గొండ బద్రర్స్‌ ఆశలపై కుంతియా నీళ్లు చల్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కెప్టెనంటూ కుంతియా స్పష్టం చేయడంతో.... కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. శంషాబాద్‌ షాక్‌తో కోమటిరెడ్డి సోదరులకు పార్టీలో కొనసాగలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై స్పష్టంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. తమ రాజకీయ భవిష్యత్‌పై అయోమయంలో ఉన్నారని వినిపిస్తోంది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి భవిష్యత్‌ పయనం టీఆర్‌ఎస్‌, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీరికి టీఆర్‌ఎస్‌ తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక బ్రదర్స్‌ బీజేపీ గూటికి చేరతారని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కూడా కోమటిరెడ్డి సోదరుల్లో స్పష్టతలేదని వినిపిస్తోంది. కమలం పార్టీపై ప్రజల్లో ఊపు కనిపించడంలేదని భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరు కలవరపడుతున్నారు. కమలదళంలో చేరితే భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందేమోన్న భయం వెంటాడుతోంది. అన్ని విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించే తాము బీజేపీలో ఇమడలేమన్న భావంతో కోమటిరెడ్డి సోదరులతోపాటు వీరి అనుచరులు ఉన్నారు. దీంతో బీజేపీలోకి వెళ్లే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా
మొత్తానికి పార్టీలో పట్టు పెంచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాటిని తట్టుకోలేక... కోటమిరెడ్డి సోదరులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు వేరు పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు వీరిపై వేటు పడకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎటూతేల్చుకోలేని పరిస్థితితుల్లో చివరి అవకాశంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వీరికి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా ? ఇవ్వకపోతే కోమటిరెడ్డి సోదరుల దారెటు ? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

19:04 - September 11, 2017

నల్లగొండ : రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీల రైతులు ఉండేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంటవేసిన ప్రతి రైతుకు ఎకరానికి 4 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జీవో 39ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ ఆందోళన నిర్వహించింది. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

 

20:15 - September 8, 2017

హైదరాబాద్ : సీఆర్‌ సర్కార్‌ తెచ్చిన జీవో-39కి వ్యతిరేకంగా ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని టీకాంగ్రెస్‌ నిర్ణయించింది. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సెక్రెటేరియట్‌ అంశంతోపాటు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు నిరసనగా అఖిలపక్షాలతో కలిసి పోరాటం చేయాలని టీ కాంగ్రెస్‌నేతలు నిర్ణయించారు.

21:47 - September 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త సచివాలయం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న కేసీఆర్ ప్రతిపాదనలతో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. బైసన్ పోలో గ్రౌండ్ ముందు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ష‌బ్బీర్ ఆలీ, వీహెచ్‌ కార్యకర్తలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.

నిర్మాణాన్ని అడ్డుకుంటాము
బైసన్‌పోలో గ్రౌండ్‌లోకి సచివాలయాన్ని మార్చాలనుకోవడం కేసీఆర్ తుగ్లక్ చర్య అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. వీహెచ్ కొత్త సచివాలయంపై అటువైపు వెళ్తున్న వాహనదారుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వాస్తు కోసం ప్రజాధనం వృథా చేస్తున్నారని వారికి వివరించారు. కేసీఆర్ రాజులా విలాసాలతో పాలన సాగిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయ నిర్మాణం చేపడితే అడ్డుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేతలు. అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

17:55 - September 6, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బైసన్‌ పోలో గ్రౌండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాల నుంచే పాలన సాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమించాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 

13:22 - September 1, 2017

బెంగళూరు : తెలంగాణ కాంగ్రెస్‌ నేతల బృందం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసింది. తెలంగాణకు నారాయణపూర్‌ జలాశయంనుంచి 7 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.. ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ బృందం సంతోషం వ్యక్తం చేసింది... సిద్ధరామయ్యను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

10:50 - August 29, 2017

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో వంద సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారే అవకాశం ఉందన్న అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి ఇలాంటి మైండ్‌గేమ్‌ అడుతున్నారన్నది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వాదన. ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికులు నిర్వహించాలని సవాల్‌ విసురుతున్నారు. సమగ్ర భూసర్వే గురించి చర్చించేందుకు ఈనెల 26న నిర్వహించిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో... వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేందరికీ సీట్లు ఇవ్వడంతోపాటు, గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి చెప్పడం రాజకీయంగా కలకలం సృష్టించింది. కేసీఆర్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పదిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ప్రబలిన నేపథ్యంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వాదన. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరు పార్టీ మారే అవకాశం ఉందన్న భయంతోనే కేసీఆర్‌ ఇలాంటి మైండ్‌గేమ్‌కు తెరతీశారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు హడావుడిగా చేపడుతున్న సమగ్ర భూ సర్వేపై కూడా కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి దీనికి పెద్ద తేడా ఉందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. సమగ్ర భూసర్వేపై విపక్షాల సూచనలు, సలహాలు తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరిని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. శాసనసభ, శాసనమండలిని సమావేశపరిచి, భూ సర్వేపై చర్చించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.

07:33 - August 16, 2017

హైదరాబాద్ : 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన తేనేటి విందు సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు హాజరయ్యారు. ఇద్దరు చంద్రులు రాజ్‌భవన్‌ వేదికగా మరోసారి కలిశారు. గవర్నర్‌ దంపతులు ఇద్దరు సీఎంలను ఆత్మీయంగా ఆహ్వానించారు. గవర్నర్‌ నరసింహన్‌ ఇద్దరిని వెంటతీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరితో కాసేపు ముచ్చటించారు.గవర్నర్‌ దంపతులు ఇతర అతిథులను ఆహ్వానించేందుకు వెళ్లగా ఇద్దరు చంద్రులకు కాసేపు ఏకాంతం దొరికింది. ఈ సమయంలో ఇద్దరు సీఎంలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపైనా చర్చించుకున్నారు.

సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ
రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ అంశాలపైనా ఇద్దరు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రుల సంభాషణలో పలుమార్లు చిరునవ్వులు విరబూసాయి. ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా సీఎంలు ఉల్లాసంగా కనిపించారు. గవర్నర్‌ తేనేటి విందులో అల్ఫాహార విందుకు తొలిసారిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. గవర్నర్‌ నుంచి ఆహ్వానం వెళ్లడంతో పవన్‌ హాజరయ్యారు. దీంతో గవర్నర్‌ విందులో పవన్‌ కల్యాణ్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆయనతో మాట్లాడేందుకు విందుకు వచ్చిన వారిలో కొందరు ప్రయత్నించారు.

అకర్షణగా పవన్ కళ్యాణ్
గవర్నర్‌ తేనీటి విందుకు రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏపీ స్పీకర్‌ కోడెల, తెలంగాణ ప్రతిపక్షనేత జానారెడ్డి, మంత్రులు కడియం, కేటీఆర్‌, నాయిని, మహమూద్‌ అలీ, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి పాల్గొన్నారు. వచ్చిన అతిథులందరినీ గవర్నర్‌ దంపతులు ఆత్మీయంగా పలకరించారు. 

11:23 - August 14, 2017

 

హైదరాబాద్ : సిరిసిల్ల ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. నేరెళ్ల ఘటన..ప్రొ.కోదండరాం అరెస్టు వ్యవహారాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దృష్టికి తెలంగాణ అఖిలపక్షం తీసుకెళ్లింది. గవర్నర్ తో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలు అనేక సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారని తెలిపారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, సిరిసిల్లలో ఇసుక మాఫియా బరి తెగించిందన్నారు. ముఖ్యమంత్రి ఫ్యామిలీ మొత్తం ఇసుక మాఫియాలో ఉందని, ఈ నేపథ్యంలో కొంతమందిపై థర్డ్ డిగ్రీని పోలీసులు ప్రయోగించారన్నారు. ఈ చర్యకు పాల్పడిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎస్పీతో సహా అందర్నీ సస్పెండ్ చేయాలని..బాధితులకు పరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. జరిగిన విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఉత్తమ్