ఉద్యోగులు

18:47 - September 25, 2017

గుంటూరు : అమరావతిలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద.. సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాటికొండ అడ్డరోడ్డునుంచి బస్టాండ్‌ వరకూ పాదయాత్ర చేపట్టారు.. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయాలయానికి నాన్‌స్టాప్‌ బస్సులు ఏర్పాటు చేసినా... అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని మండిపడ్డారు.. నాన్‌స్టాప్‌ బస్సును ఆర్డినరీ బస్సుగా మార్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.. బయోమెట్రిక్‌ విధానం అమలులోకి రావడంతో ఆఫీసుకు ఆలస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

11:38 - September 25, 2017

గుంటూరు : ఏపీ సచివాలయ ఉద్యోగులు బస్సు కోసం ఆందోళన..నిరసన చేపడుతున్నారు. బస్సును ఎక్కడపడితే అక్కడ ఆపుకుంటూ రావడం వల్ల తాము పలు సమస్యలు ఎదుర్కొన్నామని పేర్కొంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సును ఆపిన ఉద్యోగులు కాలినడకన బయలుదేరారు.

ఏపీ రాజధాని అనంతరం వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యోగులు ఇక్కడకు తరలివచ్చారు. వీరు నివాసం ఉంటున్న ప్రాంతాల నుండి సచివాలయం చేరుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ, మంగళగిరి, తెనాలి ఇతర ప్రాంతాల మీదుగా నాన్ స్టాప్ బస్సులను నడుపుతున్నారు.

రోజులాగే సోమవారం కూడా గుంటూరు -వెలగపూడికి ఓ బస్సు బయలుదేరింది. కానీ ఈ బస్సును డ్రైవర్ ఎక్కడ పడితే అక్కడ ఆపడం..ప్రయాణీకులను ఎక్కించుకోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్సులో ఉన్న ఓ ఆర్టీసీ అధికారిని ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. బయో మెట్రిక్ విధానం ఉండడం వల్ల తాము సమస్యను ఎదుర్కొవాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోయారు. చివరకు తాడికొండ అడ్డా రోడ్డు వద్ద బస్సును ఆపివేసిన సచివాలయ ఉద్యోగులు కాలినడకన సచివాలయానికి బయలుదేరారు. సుమారు 30 కిలో మీటర్ల మేర వీరు నడువనున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

15:31 - September 7, 2017

వరంగల్ : తెలంగాణ అంటేనే నీళ్లు..నియామకాలు..నిధులు..చెప్పిన సర్కార్ తమ పట్ట నిర్లక్ష్యం చేస్తోందని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. వీరంతా ప్రస్తుతం రోడ్లెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినదిస్తున్నారు. పదేళ్లుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత కల్పించరా అంటూ ప్రశ్నించారు. వీరంతా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాము ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ డిమాండ్లు పరిష్కరించుకొనేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొంటున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:21 - September 1, 2017

రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యతిరేక పోరాటం మరింత తీవ్రమైంది. ఇవాళ సామూహిక సెలవులు పెట్టి, మహాధర్నాలు నిర్వహించేందుకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ సమాయత్తమవుతున్నారు. లక్ష మందికి పైగా సామూహిక సెలవులకు దరఖాస్తు చేసుకోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సంఘాలు పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. గత 14 ఏళ్లలో రిటైనవారి జీవితాలు అత్యంత దుర్భరంగా మారడం కళ్లెదుటే కనిపిస్తున్న సాక్ష్యం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లోని లోపాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పుప్పాల కృష్ణకుమార్ గారు, మాధురి పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:31 - September 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఒకరోజు విధులకు సామూహిక సెలవు ప్రకటించారు. కాంట్రీబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 30జిల్లాల కేంద్రాలతోపాటు రాజధాని హైదరాబాద్‌లోనూ ధర్నాలు, ధీక్షలు చేపడుతున్నారు. సెలవుల్లో లేని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు రానున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలపనున్నారు. 2004 సెప్టెంబర్‌ 9వ తేదీన నియమితులైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఈ నిరసనలో పాల్గొంటున్నారు. పాత పింఛను పథకాన్నే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగుల నిరసనలకు పలు ఉద్యోగ సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలిపాయి. 

07:36 - August 29, 2017

రిటైర్మెంట్ తర్వాతి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యతిరేక పోరాటం మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే విభిన్న రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. సెప్టెంబర్ 1 ఖిలావత్ దివాస్ గా పాటించేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 1న సామూహిక సెలవులు పెడుతున్నట్టు ఇప్పటికే సంఘాలు ప్రకటించాయి. ఇదే అంశంపై టెన్ టివి జనపథంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు స్థితప్రజ్ణ విశ్లేషించారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

15:44 - August 22, 2017

విజయవాడ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఆల్‌ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు విజయవాడలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్‌ కంపెనీల నుండి రుణాలు వసూలు చేయడానికి చట్టం తీసుకురావాలని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ ప్రసిడెంట్‌ అజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బ్యాంకింగ్‌ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉన్నందున నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేవిధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బ్యాంకుల సమ్మెకు సిఐటియూ, సీపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మద్దతు తెలిపారు. 

14:23 - August 22, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలోని బ్యాంకులన్నీ మూతబడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, కార్పొరేట్‌ రుణమాఫీ చేయడమే కాకుండా ఇటీవల ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు...12017ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని బ్యాంకు సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా నేడు సమ్మె చేపడుతున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర గుప్తా టెన్ టివి తో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:11 - August 22, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బ్యాంకింగ్‌ సంస్కరణలకు నిరసనగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్ల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాళాలు పడ్డాయి. ఆంధ్రా బ్యాంకు పరిధిలోని 2900 శాఖలన్నీ క్లోజ్ అయ్యాయి. లావాదేవీలు నిలిచిపోయాయి. 21వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని, లావాదేవీలన్నీ నిలిచిపోయాయని పలువురు పేర్కొన్నారు. బ్యాకింగ్ వ్యవస్థను జాతీయం చేయడం..ప్రస్తుతం ఉన్న పాలకులు ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:42 - August 17, 2017

హైదరాబాద్ : ఉద్యోగులు, వారి వేతన సంబంధిత విషయాల్లో ఇప్పటి వరకు కేంద్రంపై ఆధారపడ్డ తెలంగాణ సర్కార్ త్వరలో సొంత అస్థిత్వంతో అడుగులు వేయబోతోంది. రాష్ట్రంలో తొలిసారిగా పీఆర్సీ కమిషన్ నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం. అంతా కలిసి వస్తే వచ్చే ఏడాది జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇక పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్‌ చంద్రను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదో పీఆర్సీ అమలు సమయంలో, తెలంగాణ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ రూపకల్పనలోనూ ప్రదీప్ చంద్ర కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వేతన సంబంధిత వ్యవహారాల్లో ఆయనకి ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1998 జూలై నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నారు. దాని ప్రకారం పదో పీఆర్సీ కాల పరిమితి 2018 జూలై ఒకటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తేదీ కంటే ఏడాది ముందుగానే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అలా ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ ఆరునెలల పాటు కసరత్తు చేస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలను తీసుకుంటుంది. వాటన్నింటినీ అధ్యయనం చేసి సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. వీటిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అన్ని అంశాల్లో తనదైన ముద్రతో ముందుకు పోతున్న ప్రభుత్వం.. పీఆర్సీ విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఉద్యోగులు