ఉరి శిక్ష

16:07 - July 11, 2018

నిర్భయ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. కింద కోర్టు విధించిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించడం పట్ల హర్షాతిరేకలు వ్యక్తమౌతున్నాయి. నిర్భయ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు...ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై 2018 జూలైలో సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ అంశంపై న్యాయ సమస్యలు..సందేహాలను మానవి ' మై రైట్ ' కార్యక్రమంలో లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:23 - August 17, 2017

నెల్లూరు : జిల్లాలో సుత్తి సైకో హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ప్రభావతి అనే మహిళను హత్య చేసిన కేసులో వెంకటేశ్వర్లు అనే దోషికి నాల్గో అదనపు జడ్జి శ్రీనివాస్‌రావు ఉరిశిక్ష విధించారు. 2016లో జరిగిన ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. 

 

21:28 - January 30, 2016

కోల్ కతా : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కామ్‌దుని సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురుకి మరణ శిక్ష విధించింది. ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. ఇవాళ శిక్షలు ఖరారుచేసింది. ఈ కేసులో మరో ముగ్గురికి జీవిత ఖైదును విధించింది. 2013లో కామదునికి కెందిన ఓ కాలేజి విద్యార్థిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, ఆపై హతమార్చిన ఘటన సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో బాధిత కుటుంబీకులను పరామర్శించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయ విచారణకు ఆదేశించారు. అయితే ఇటీవల నిందితుల్లో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడం దుమారం రేగింది. వారిద్దరు పాలకపార్టీకి చెందినవారు కావడం వల్లే నిర్దోషులుగా బయటపడేలా పోలీసులు కేసు రూపొందించారని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్‌ బిమన్‌ బసు ఆరోపించారు.

13:28 - July 30, 2015

మహారాష్ట్ర : బుధవారం అర్థరాత్రంతా హైడ్రామా నడిచింది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. కాని చివరకు ప్రభుత్వ పట్టుదలే గెలిచింది. యాకుబ్ సుదీర్ఘ పోరాటం ఓడిపోయింది. చివరి ఘడియ వరకు ప్రయత్నించినా...యాకుబ్‌కు ఫలితం లేకపోయింది. చివరకు ఉదయం ఆరున్నర గంటలకు....పుట్టినరోజు నాడే....యాకుబ్ ఉరికొయ్యకు వేలాడాడు. ఈ నెల 29 ఉదయం నుంచి...మెమెన్‌ ఉరిశిక్ష అమలుపై హైడ్రామా కొనసాగింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు యాకుబ్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం పన్నెండున్నరకు యాకుబ్‌కు క్షమాభిక్షపెట్టవద్దని.. అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సాయత్రం నాలుగు గంటలకు మహారాష్ట్ర గవర్నర్ యాకుబ్ క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించారు. నాలుగున్నర గంటలకు యాకుబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి..
క్షమాభిక్ష పెట్టాలని యాకుబ్‌ రాష్ట్రపతిని కూడా కోరాడు. దీంతో 29న సాయంత్రం ఐదున్నరకు ...రాష్ట్రపతి క్షమాభిక్ష విజ్ఞప్తిని హోంశాఖకు పంపారు. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు రాజ్‌నాథ్‌ స్వయంగా రాష్ట్రపతిని కలిసి...క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించాలని అభిప్రాయాన్నిచెప్పారు. దీంతో రాత్రి 10.47నిమిషాలకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు.
మరోసారి సుప్రీం తలుపు తట్టిన మెమన్..
రాత్రి 10:37కు సుప్రీంలో మరోసారి యాకుబ్ లాయర్ పిటిషన్ వేశారు. రాత్రి 11 :16కి ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని చీఫ్‌ జస్టిస్‌ను కోరారు. క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత..ఉరితీత అమలుకు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిబంధనలు చెబుతున్నాయని లాయర్లు పిటిషన్ వేశారు. శిక్షను 14 రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. అర్ధరాత్రి 02: 30కి సుప్రీం కోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు ప్రారంభమయ్యాయి. హోరాహోరీ వాదనల తర్వాత..ఉదయం 04 :30కి సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఉదయం 04 :30 ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీంతో ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో యాకుబ్‌ను నాగ్‌పూర్ జైలు అధికారులు ఉరితీశారు. ఉదయం 7 గంటలకు యాకుబ్ మృతి చెందినట్లు జైలు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
రాత్రి భోజనం చేయని మెమన్..
యాకుబ్ మెమన్‌ 29న మధ్యాహ్నం రెండు చపాతీలు తిన్నాడు. రాత్రి భోజనం తినేందుకు నిరాకరించాడు. నిబంధనల ప్రకారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు యాకుబ్‌ను జైలు అధికారులు నిద్రలేపారు. ఆ తర్వాత స్నానం చేసి అధికారులు ఇచ్చిన కొత్త దుస్తులు ధరించాడు మెమన్‌. చివరిసారిగా తనకు ఇష్టమైన కిచిడీని అల్పాహారంగా తీసుకున్నాడు. రేపు అతని కూతురు పుట్టినరోజు కావటంతో...ఆమెతో మాట్లాడాలని చివరి కోరిక కోరాడు. కాని అందుకు జైలు అధికారులు నిరాకరించారు.
యాకుబ్‌ ఉరి నేపథ్యంలో నాగపూర్ సెంట్రల్ జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ముంబైతో పాటు దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

08:31 - July 30, 2015

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు విధించిన ఉరిశిక్షపై ఒకే అభిప్రాయం లేదని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. మెమన్ ఉరిశిక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొలువుల భర్తీలో కీలకమైన సిలబస్, పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
ఇక్కడి చట్టానికి..న్యాయవ్యవస్థకు సహకరించాడు..
1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా వందలాదికి గాయాలయై వికలాంగులగా మారారు. దీనికి సూత్రధారి, పాత్రధారి మెమన్. ఈ కేసులో టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహింలు పాక్ కు పారిపోయారు. కానీ మెమన్ మాత్రం భారతదేశానికి వచ్చాడు. ఇక్కడి న్యాయవ్యవస్థకు..చట్టానికి సహకరించాడు. 22 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. కానీ ఇతనికి ఉరిశిక్ష విధించడంతో భిన్నమైన వాదనలు వచ్చాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు మరణశిక్షను విధించడం లేదు. కొన్ని దేశాలు విధిస్తున్నాయి. అతి క్రూరమైన వాటికి ఉరిశిక్ష విధిస్తారు. దీనిని యావజ్జీవ శిక్షగా మార్చాలని, అందువల్ల దేశ చట్టాలకు సహకరిస్తే కొంత ఉపశమనం ఉంటుందని అభిప్రాయం పంపవచ్చనే వాదనలు వినిపిస్తున్నారు. నేరానికి ఎంత శిక్ష ఉండాలి. బాధితురాలి ఆవేదన దృష్టిలో పెట్టుకునే విధంగా ఉండాలి..ఘోరాతి ఘోరమైన నేరానికి భయపడే విధంగా శిక్ష ఉండాలి అనే వాదనలున్నాయి. అఫ్జల్ గురుకు ఉరి శిక్ష విధించారు. కానీ ఉగ్రవాదుల దాడులు ఆగాయా ? రాజకీయంగా పలుకుబడిన ఉన్న వారు తక్కువ..అల్పాదాయ, అణగారిన వర్గాలు, మైనార్టీలు ఎక్కువగా ఉరిశిక్ష విధించిన వారిలో ఉన్నారని ఓ సంస్థ అధ్యయనంలో తేలింది. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెట్టారు. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ ఒక్కడే చనిపోలేదు. ఆయనతో పాటు మరికొంతమంది చనిపోయారు. ఉరిశిక్ష అమలుకాకపోతే బాధితులు ఎప్పుడు భయపడుతుంటారు. అమలు చేయాలి..వద్దు అనే దానిపై చర్చ జరగాలి.'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. పోటీ విధి విధానాలు, సిలబస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్తగా గ్రూప్ 3 పోస్టుల భర్తీ అంశాలపై ఆయన విశ్లేషించారు. 

07:49 - July 27, 2015

మహారాష్ట్ర : 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన యాకూబ్ మెమన్ ఉరి శిక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఉరిశిక్ష అమలు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.22 లక్షలు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 30వ తేదీన మెమెన్ ను ఉరి తీయాలంటూ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ మెమెన్ మరోసారి దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టివేస్తే మెమన్‌ను ఉరి తీయడం దాదాపుగా ఖాయమైనట్టే అవుతుంది. అలాంటప్పుడు ఎక్కడ ఉరి తీస్తారు ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో ఉరి తీసే జైళ్లు రెండే ఉన్నాయి. ఒకటి ఎరవాడ జైలు. రెండోది నాగపూర్ సెంట్రల్ జైలు. ఇదిలా ఉంటే యాకూబ్ ను ఉరి శిక్ష తీసేది ఎవరు అనేది చర్చ జరుగుతోంది. గతంలో కసబ్‌ను ఉరి తీసిన తలారీయే ఉరి తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉరి కోసం వాడనున్న తాడును కూడా నాగపూర్ సెంట్రల్ జైలులోనే తయారు చేస్తారని తెలుస్తోంది. యాకూబ్ కు ఉరి పడుతుందా ? లేదా ? అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది. 

Don't Miss

Subscribe to RSS - ఉరి శిక్ష