ఉస్మానియా యూనివర్సిటీ

18:59 - December 8, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో గత ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మురళీ కుటుంబాన్ని కాంగ్రెస్‌ నాయకుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యుల బాధను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటానన్న జగ్గారెడ్డి... లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఉస్మానియాలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పరామర్శించారు. మురళి గురించి అతని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దేలాపూర్‌కు చెందిన మురళి చదువులో ముందుండేవాడని అతని కుటుంబసభ్యులు జగ్గారెడ్డికి తెలిపారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన మురళి ఉస్మానియా వర్సిటీ పీజీ ప్రవేశ పరీక్షలో టాపర్‌గా నిలిచాడన్నారు. ఎంఎస్సీలో ఫిజిక్స్‌ మెటీరియల్‌ సైన్స్‌ను ఎంచుకొని చదువు కోవాలనుకున్నాడు. కాని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు. 

తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మురళి తల్లి చెబుతోంది. తన కుమారుడి మరణంపై విచారణ జరపాలని కోరింది. మురళి ఆత్మహత్యపై స్పందించిన జగ్గారెడ్డి మురళి కుటుంబానికి ఆర్థిక సహాయార్థం లక్షరూపాయలను అందించారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్న యువకుల కలలు కల్లలయ్యాయని ప్రభుత్వంపై...జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. మురళి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సర్కార్ నిర్ణయాలతో... ఉద్యోగం రాదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు స్థానికులు.  

09:47 - December 4, 2017

హైదరాబాద్ : విద్యార్థి మురళీ ఆత్మహత్యతో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మీడియా ప్రతినిధులపైనా భాకీలు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇవాళ డీజీపీని జర్నలిస్టు సంఘాలు కలవనున్నాయి. గాంధీ ఆస్పత్రిలో మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. స్వగ్రామం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ కు మురళి మృతదేహాన్ని తరలించారు. మురళీ ఆత్మహత్యకు నిరసనగా ఓయూ జేఏసీ నేడు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. కొలువుల కొట్లాట సభ నేపథ్యంలో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని... దురుసుగా ప్రవర్తించారని వాపోమయారు. ఇది రాచరిక వ్యవస్థనా..ప్రజాస్వామ్య వ్యవస్థనా అని ప్రశ్నించారు. 

 

08:22 - September 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మద్యాన్ని సమూలంగా నిషేధించాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం డిమాండ్‌ చేశారు. మద్యం మహమ్మారితో మహిళల బతుకులు ఛిద్రం అవుతున్నాయన్నారు. తెలంగాణ సర్కార్‌ బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరలు పంచడం సంతోషకరమే అన్న ఆమె.. అదే మహిళలు మద్యంతో ఇబ్బంది పడుతోంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట మత్స్యకార్మికుల సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆమె... కాసేపు బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. 

 

18:51 - September 12, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్‌.. ఏ ప్లస్‌ గ్రేడ్‌ ఇచ్చింది. గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీని న్యాక్‌ బృందం సందర్శించింది. ఓయూ అధికారుల ప్రజంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాక్.. ఏ ప్లస్ గ్లేడ్ ఇచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

07:25 - July 16, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. నాన్‌బోర్డర్స్‌ను ఖాళీ చేయించేందుకు  అధికారులు పీజీ హాస్టళ్లకు విద్యుత్‌, మంచినీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ వీసీ రెసిడెన్సీ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. 

 

15:14 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ఉత్సవంలో మాట్లాడకపోవడంపై విద్యార్థులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏ గ్రౌండ్ నుంచి అర్ట్స్ కాలేజీ వరకు సుమారు 600 మంది విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. 100 ఏళ్ల ఉస్మానియాకు అవమానం జరిగిందని విద్యార్థులు ఆవేదన వెలుబుచ్చారు. సీఎం యూనివర్సిటీకి వరాలు ప్రకటిస్తారని ఎదురు చూసిన తమకు నిరాశ మిగిలిందని, కనీసం గవర్నర్ కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

06:41 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. యూనివర్సిటీ చాన్స్ లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు దాదాపు పదిహేనువేల మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో పాల్గొంటారని అంచనా. భారతదేశానికే ఒక ప్రధానిని అందించిన ఘనత వున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఉస్మానియా గత వైభవాన్ని నిలుపుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలోచర్చను చేపట్టింది. ఈ చర్చలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని, లేడీస్ హాస్టల్ కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఎస్ ఎల్ పద్మ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:47 - April 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి, మలి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది. దీంతో ఇప్పుడు వందేళ్ల పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు జరగనున్న శతాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఉండేందుకు.. మొత్తం 30 కమిటీలు పని చేస్తున్నాయని తెలిపారు.
రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ..
ఏడాది పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26న ఓయూ శతాబ్ధి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారని తెలిపారు. 27 న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావు పాల్గొంటారని.. మధ్యాహ్నం జరిగే ఉప కులపతుల సదస్సును కేంద్రమంత్రి జవదేకర్ ప్రారంభిస్తారని తెలిపారు. అయితే శతాబ్ధి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసిందని.. ఎక్కడా చిన్నలోటు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కడియం తెలిపారు. 

07:55 - April 19, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సెగ తగిలే విధంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ శాఖలతో పాటు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసి ఉద్యోగాల కేలండర్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశాయి. హైదరాబాద్‌ ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన విద్యార్థి, నిరుద్యోగ ధర్మయుద్ధం బహిరంగ సభలో పలువురు నేతలు పాల్గొన్నారు. 
కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన
కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారని.. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తానని నమ్మబలికి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు దుయ్యబట్టాయి. ఉస్మానియూ విశ్వవిద్యాలయంలో 35 విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన విద్యార్థి, నిరుద్యోగ ధర్మయుద్ధం బహిరంగ సభకు హాజరై.. తమ పూర్తి మద్దతు ప్రకటించాయి. 2019లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు, టీజేఏసీ.. విద్యార్థి సంఘాల మద్దతుతో కార్యాచరణ రూపొందిస్తున్నాయి. 
మాట మారుస్తున్న కేసీఆర్‌ : ఉత్తమ్
ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు మాట మారుస్తున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఖాళీలను ఎందుకు ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. 
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి : కోదండరాం 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల ప్రకటన కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందన్నారు. 
సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవాలి : చాడ 
శత జయంతి ఉత్సవాల లోపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే.. ఉత్సవాలకు హాజరు కానున్న సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. 
పోరాటాలతోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం : విమలక్క 
పోరాటాలతోనే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు విమలక్క. కేసీఆర్‌ మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని ఆమె విమర్శించారు. 
బహిరంగ సభకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు 
మొత్తానికి విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన విద్యార్థి, నిరుద్యోగ ధర్మయుద్ధం బహిరంగ సభకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే.. తమ జీవితాలను అంధకారం చేస్తున్న ప్రభుత్వ తీరుపై పోరాటం చేస్తామని విద్యార్థులంటున్నారు. 

 

18:38 - February 5, 2017

హైదరాబాద్ : ఉద్యమాల పురిటి గడ్డగా పేరున్న ఉస్మానియా యూనివర్సిటీ.. ఎందరో ప్రముఖులను ఈ దేశానికి అందించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు.. డాక్టర్లు, యాక్టర్లు మొదలుకుని.. ఎందరో రాజకీయ నేతలకు ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది. మేధావులకు నిలయంగా పేరున్న ఓయూ త్వరలోనే శతాబ్ది ఉత్సవాలను జరుపుకొనేందుకు సిద్ధమవుతోంది. ఎన్నో విశిష్టతలున్న ఉస్మానియా యూనివర్సిటీపై నిర్లక్ష్యపు నీలినీడలూ కమ్మకున్నాయి. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీపై 10టివి స్పెషల్ ఫోకస్‌....! 
ఎందరో మేధావులను అందించిన ఓయూ 
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రసిద్ధి. ఓయూలో చదవాలన్నది ప్రతి విద్యార్థి స్వప్నం. ఇక్కడ విద్యాభ్యాసం చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల నమ్మకం. వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలో ప్రత్యేక స్థానం సాధించిన ఘనత ఓయూ సొంతం. కవులు, గాయకులు, డాక్టర్లు, యాక్టర్లు.. వీరితో పాటు ఎందరో మేధావులను  ఈ దేశానికి అందించిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ. అంతేకాదు..సమకాలీన రాజకీయ నాయకుల్లో మరెందరో నేతలు ఈ విద్యాలయం నుంచే తమ భవిష్యత్తును  తీర్చిదిద్దుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు మొదలుకుని... ప్రముఖ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ వరకు.. అనేక మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధాన్ని పెనవేసుకున్నవారే. 
ఓయూలో చదవాలన్న ఆశయంతో ప్రణాళికలు 
మీరెక్కడ చదివారు.. అని ఎవరినైనా ఉన్నత విద్యావంతులను, అధికారులను ప్రశ్నిస్తే.. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ అనే చెబుతుంటారు. అంతేకాదు.. స్కూల్‌, కాలేజీ విద్యార్జనలో ఉండగానే చాలా మంది విద్యార్థులు..ఓయూలో చదవాలన్న ఆశయంతో ప్రణాళికలు రచించుకుంటారంటే ఓయూకు ఉన్న పేరు, ప్రతిష్టలు..ప్రత్యేకత ఎలాంటిదో చెప్పకనే చెప్పవచ్చు. 
1917లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన 
ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత పేరుందో... అంత చరిత్ర కూడా ఉంది. 1917లో 7వ నిజాం ప్రభువు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌.. ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఈ విద్యాలయం ఎందరో ప్రముఖులను దేశానికి అందిస్తూ వస్తోంది. అప్పటి నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన ఎందరో ప్రముఖులు ఇక్కడే ఉద్యమ ఓనమాలు శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత తెలంగాణ గడ్డపై జరిగిన ఎన్నో ఉద్యమాలకు ఈ యూనివర్శిటీ నాంది పలికింది. 
యూనివర్శిటీపై ప్రభుత్వాల ఉదాసీనత 
ఇంతటి ఘన చరిత్ర కలిగిన యూనివర్శిటీ రానూ రానూ ప్రభుత్వాల ఉదాసీనతకు గురవుతూ వచ్చింది. విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలతో పాటు నిధులు, వసతుల సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అనేక సార్లు విద్యార్థులు సమస్యలపై పోరుబాట పడుతూనే ఉన్నారు. అయినా సమస్యలను పట్టించుకుని పరిష్కరించిన దాఖలాలు లేవు.  
ఒకవైపు పేరుకుపోయిన సమస్యలు.. 
ఒకవైపు పేరుకుపోయిన సమస్యలు.. మరోవైపు వందేళ్లకు చేరుకుంటున్న యూనివర్సిటీ. ఏప్రిల్‌ 26న ఉస్మానియా యూనివర్సిటీ నెలకొని వందేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ నిధుల కొరత మాత్రం ఇంకా వేధిస్తూనే ఉంది. ఇప్పటికే నిధుల కొరత గురించి అటు కేంద్రానికి.. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకుండా పోయింది.  
ఉత్సవాలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ఆహ్వానం..?
మరోవైపు శతాబ్ధి ఉత్సవాలకు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆహ్వానించాలని సిద్ధమవుతున్నా.. నిధుల విషయంలో ప్రభుత్వాలు సానుకూలంగా లేకపోవడంతో యూనివర్సిటీ అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఉత్సవాల సమయం ముంచుకొస్తుండటంతో నిధుల కొరత కారణంగా నానా హైరానా పడుతున్నారు. 
సరైన సంఖ్యలో అధ్యాపకులు లేరు
సరైన సంఖ్యలో అధ్యాపకులు లేరు. ప్రతి ఏటా అనేక మంది ప్రొఫెసర్లు రిటైర్‌  అవుతున్నా..నియామకాలు మాత్రం చేపట్టడం లేదు. 2018 నాటికి ఉన్న ప్రొఫెసర్లందరూ పదవీ విరమణ చేయబోతున్నారు. కానీ ఇప్పటివరకు  డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టడం లేదు. దాదాపు సగానికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులతోనే బోధన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయడం లేదు. చివరికి కొన్ని శాఖల్లో హెచ్‌వోడీలు కూడా కాంట్రాక్టు అధ్యాపకులే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 
సంబరాల కోసం అనేక కమిటీల ఏర్పాటు 
యూనివర్శిటీ వందేళ్ల సంబరాల కోసం ఇప్పటికే అనేక కమిటీలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు కూడా నిధులు లేక యూనివర్సిటీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగినన్ని నిధులు విడుదల చేసి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఎంతో పేరు ప్రతిష్టలు గల యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఉస్మానియా యూనివర్సిటీ