ఎండలు

16:57 - June 19, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండల కారణంగా పాఠశాలకు ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు బేఖాతరు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు తెలిస్తే గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి గంటా ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యాలు పెడచెవిన పెట్టాయి. పాఠశాలలు తెరచి తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల యాజమాన్యాలకు సెలవు విషయాన్ని సోమవారమే చేరవేశామని మండల విద్యాశాఖాధికారులు తెలిపారు. 

10:44 - June 19, 2018

విజయవాడ : ఊరించిన రుతుపవనాలు ముఖం చాటేశాయి. మండు వేసవి చల్లబడిందని బడిబాట పట్టిన చిన్నారులకు.. ఎండలు కష్టం తెచ్చిపెట్టాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ఏపీలోని పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఏపీ సర్కార్‌. ఈనెల 21 తర్వాతే మళ్లీ పాఠశాలలు తెరుచుకుంటాయని  మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వంతోపాటు అన్ని ప్రైవే స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని మంత్రి గంటా చెప్పారు. ఉత్తర్వులను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే  పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. 

 

21:17 - June 18, 2018

అమరావతి : ఏపీలో అధిక ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా మూడు రోజుల పాటు అన్ని పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల‌కు రేప‌టి నుంచి ఈ నెల‌ 21 వ‌ర‌కు సెల‌వులు ఇస్తున్న‌ట్లు రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఈరోజు ప్ర‌క‌టించారు. అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వేడిగాలులు నేప‌థ్యంలో పాఠశాల‌ల‌కు సెల‌వుల ఇస్తున్నామ‌ని చెప్పారు. మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రికలు చేసిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయ‌ని, వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌లు, హెచ్చ‌రింపుల‌ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌కు సెల‌వుల ప్ర‌క‌టిస్తున్నామ‌ని మంత్రి గంటా తెలిపారు. త‌ప్ప‌నిస‌రిగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠ‌శాల‌లు కూడా విద్యార్థుల‌కు సెల‌వులు ఇవ్వాల్సిందేన‌న్నారు. సెల‌వుల్లో ప్రైవేట్, కార్పోరేట్ పాఠ‌శాల‌లు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే గుర్తింపు ర‌ద్దు చేస్తామ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు హెచ్చరించారు. 

06:39 - May 14, 2018

విజయవాడ : ఉప‌రితల ఆవ‌ర్తనం ప్రభావంతో కురుసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఉరుములు పిడుగుల‌తో కూడిన వ‌ర్షానికి పలుప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు. పిడుగు పాటుకు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మ‌రో రెండు రోజుల పాటు ఉప‌రిత ఆవ‌ర్తన ప్రభావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ అధికారులు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్రాలోని ప‌లు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిక‌లు జారీ చేసింది. ఝార్ఖండ్‌ నుంచి ఒడిశా వరకు ఏర్పడిన ద్రోణి వల్ల ఉత్తరాంధ్రాతో పాటు తెలంగాణలోను వర్షాలు కురుస్తున్నాయి..

శ్రీకాకుళం జిల్లాలో గాలివానతోపాటు పిడుగులు ప‌డ‌టంతో వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సిక్కోలును అతలాకుతలం చేసింది. పిడుగుపాటు వల్ల పాతపట్నం మండలం తిడ్డిమిలో ఇద్దరు, మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం బస్టాండ్‌ వద్ద ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎల్‌.ఎన్‌.పేట మండలం పెద్దకొల్లివలసలో చెరువులో చేపలవేటకు వెళ్లిన యాభై ఐదేళ్ళ అప్పలనర్సయ్య మరణించాడు. జలుమూరు మండలం కరకలస వద్ద యాభై మూడేళ్ళ మత్య్సకారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు హిర మండలం అంబావల్లికి చెందిన బొడ్డేపల్లి రాములుగా గుర్తించారు. పాలకొండ, రేగిడి, వంగర, సంతకవిటి, బూర్జ, పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, జలుమూరు, సంతబొమ్మాళి, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

అటు కాకినాడలోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వ‌ర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. గ‌త వారం రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకం ఒక్కసారిగా వాతావ‌ర‌ణం చ‌ల్లబడంతో సేదతీరారు. అటు విశాఖ నగరంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

మ‌రోవైపు కడప జిల్లాలో ప‌లుచోట్ల భారీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో వీరబల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం, కరప, బిక్కవోలు, విశాఖ రూరల్‌, విశాఖ అర్బన్‌, రోలుగుంట, చోడవరం, దేవరాపల్లి, విజయనగరం జిల్లా జామి, వేపాడ మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ ప్రకటించింది. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉండటంతో ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. 

20:45 - May 2, 2018

ఎండలు మండుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రాణ..ఆస్తి నష్టం సంభవంచింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో వింతవాతావరణం ఎందుకు నెలకొంది ? అనే అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో వాతావరణ నిపుణులు వై.కె.రెడ్డి పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:29 - April 29, 2018

చిత్తూరు : తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. భానుడి దెబ్బతో నగర వాసులు విలవిల్లాడిపోతున్నారు. గత 10 రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులు సైతం సూర్యప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. గత పది రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇదే పరిస్థితి. ఇక మిట్ట మధ్యాహ్నం భానుడు టాప్ గేర్‌లో కాకపుట్టిస్తున్నాడు. దీంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తిరుమలకు యాత్రికుల తాకిడి భారీగా పెరిగింది. అయితే ఎండల తీవ్రతతో శ్రీవారి భక్తులు బెంబేలెత్తుతున్నారు. కొండపైకి వెళ్ళడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే...ఇక మే నెల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల తప్పనిసరి అయితే తప్ప ఎండలో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. మంచినీటితోపాటు.. తలమీద టవల్‌, నీడకోసం గొడుగు లాంటివి వాడాలంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బతో ఇబ్బందుల పాలవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

16:59 - April 26, 2018

శ్రీకాకుళం : సిక్కోలు ప్రజలను భానుడు వణికిస్తున్నాడు. ఎండల తీవ్రతతో నదులన్నీ ఎడారిలను తలపిస్తున్నాయి. నీటి వనరులు, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ప్రజలంతా నీటి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. ఎండల దాటికి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మండిపోతున్న ఎండలు..
శ్రీకాకుళం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఆముదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ మున్సిపాలీటిలు, రాజం, పాలకొండ నగరపంచాయతీల్లో నీటి సమస్య తీవ్రమైంది. మూగ జీవాలకు సైతం నీరు దొరకని పరిస్థితి మొదలైంది. ఇచ్ఛాపురం, మందస, భీమిని, పాతపట్నం, బూర్జ, రణస్థలం మండలాల్లో తాగునీటి సమయ్య విపరీతంగా ఉంది. మత్స్యకారులు సైతం చలిమలు తవ్వి గొంతు తుడుపుకుంటున్నారు. పలు కాలనీలకు మాత్రం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి గొంతు తడుపుతున్నారు.

ఎండిన బావులు,కుంటలు,ఎడారులను తలపిస్తున్న నదులు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నీటివనరులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులు ఎడారులను తలపిస్తున్నాయి. హిర మండలంలోని గొట్టా జలశయం, తొటపల్లి, నారాయణపురం లాంటి తాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోడంతో నీటి సమస్య తీవ్రమైంది.

ఎడారులను తలపిస్తున్న వంశధార, నాగావళి, మహేంద్రతనయ
సిక్కోలు జిల్లా మునుపెన్నడూ లేనంతగా వేడెక్కిపోయింది. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయు. ఎండ తీవ్రత వల్ల శ్రీకాకుళం వాసులు అడుగు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు.ఇక వృద్ధులు, చిన్న పిల్లలు పరిస్థితిని చెప్పక్కరలేదు. దీనికితోడు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందో అని శ్రీకాకుళం వాసులు హడలిపోతున్నారు. 

15:48 - April 20, 2018

నిజామాబాద్ : భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఎండలు విపరీతంగా పెరగడంతో బయటకు రావాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. ఏప్రిల్‌ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని నిజామాబాద్‌ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎండ తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:04 - March 31, 2018

మహబూబ్ నగర్ : వేసవి మొదలయిందో లేదో తెలంగాణ వ్యాప్తంగా తాగునీకష్టాలు ప్రారంభమయ్యాయి. గుక్కెడు మంచినీటీ కోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. పట్టణాలు దాహంతో విలవిల్లాడుతున్నాయి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి పాలమూర్ జిల్లా తాగునీటి కష్టాలపై టెన్‌టీవీ ఫోకస్‌.

పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరొందిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. జూరాల పై ఆధాపడిన జలాశయాలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి.. దీంతో జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు ముంచుకొచ్చాయి. 42 లక్షల జనాభా గల ఉమ్మడి పాలమూర్ జిల్లాలో సగానికి పైగా జూరాల ప్రాజెక్ట్ ఆధారంగానే తాగునీటి సరఫరా జరుగుతోంది. కానీ జూరల జలాశయంలో నీరు అడుగంతుండంతో రామన్ పాడు, కోయిల్ సాగర్, జమ్ములమ్మ రిజర్వాయర్ల పరిస్దితి ఆందోళనకరంగా మారింది.

ఉమ్మడి జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల , వనపర్తి, నారాయణపేట, షాద్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, అయిజ, కల్వకుర్తి మున్సిపాలిటీలు , నగర పంచాయతీలకు వివిధ వాటర్ స్కీంల ద్వారా నీటి సరఫరా అవుతోంది. జూరాల, రామన్ పాడు, కోయిల్ సాగర్ రిజర్వాయర్ల ద్వారా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి జములమ్మ రిజర్వాయర్ తో గద్వాల మున్సిపాలిటీకి రామన్ పాడు రిజర్వాయర్ నుంచే వనపర్తి తో పాటు నాగర్ కర్నూల్, అచ్చంపేట నగరపంచాయతీలకు నీటి సరఫరా జరుగుతోంది. నారాయణపేట మున్సిపాలిటీ, కల్వకుర్తి, షాద్ నగర్ మున్సిపాలిటీలకి మాత్రం బోర్లే దిక్కుగా మారింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బోర్లు ఎండిపోవటంతో తాగునీటి కటకటగా మారింది.

కల్వకుర్తి జనాభా 35 వేలు. పట్టణంలో బోర్లు ఎండిపోవటంతో జనానికి నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయిజ మున్సిపాలిటీ పరిధిలో 35 వేల జనాభా ఉండగా.. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్ళు సరిపోవట్లేదు. అచ్చంపేట జనాభా 25 వేలుంటే ఈ మున్సిపాలిటీకి కూడా రామన్‌పాడు ప్రాజెక్టు ఆధారం. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర్లోనే ఉన్నా క్రిష్ణానది పక్కనే పారుతున్నా అచ్చంపేటకు నీరు సప్లయ్ కావడం లేదు.

అటు వనపర్తి పట్ట ప్రజలను తాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. తాగునీటి అవసరా కోసం రెండు స్కీంలు పెట్టామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. వీటిలో ఒకటి పడకేసి ఏడాదైంది. రెండో దానికి ఎప్పుడూ ఏదో సమస్య వస్తూనే ఉంది. ఇక్కడి తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రామన్‌పాడు పాత స్కీం గత ఏడాది కాలంగా నిరుపయోగకంగా మారింది. ఇంటెక్విల్, ఎర్రగట్టు, కానాయపల్లి వద్ద పనిచేయాల్సిన మూడు మోటార్లు చెడిపోయినా వాటి గురించి పట్టించుకునే వారు లేరు. కొత్త మోటారుల కొనుగోలుకు రూ. 40 నుంచి 50 లక్షలు వెచ్చిస్తే పథకం దారిలో పడుతుందని స్ధానికులు అంటున్నారు. నాయకులు, అధికారులు ఎప్పటికప్పడు హామీల వరదలు పారిస్తున్నా.. గొంతు తడుపుకోను గుక్కెడు నీరులేక పాలమూరుజిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. 

12:50 - March 31, 2018

విజయవాడ : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో రోడ్లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. నిజాబామాద్‌ జిల్లాలో మార్చి నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంలో జనాలు బెంబేలెత్తుతున్నారు.

వేసవి కాలం ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు మూడు డిడ్రీల ఉష్ణోగ్రతలు పెరిపోయాయి. నిజామబాద్, కామారెడ్డి జిల్లాలో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ నెల 26న ఏకంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం వచ్చేసరికి వాతావారణం అగ్నిగుండంగా మారుతోంది.

2013 మే నెలలో 45.6 డిగ్రీలు, 2014లో మార్చిలో 43.6 డిగ్రీలు, 2016లో ఏప్రిల్‌లో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 13వ తేదీన 36,14న 36, 15న 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి 26వ తేదీ నాటికి 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఇలా మండిపోతుంటే రాబోయే రోజులను తలుచుకొని జనం భయపడుతున్నారు. భౌగోళిక పరిస్థితులరిత్యా వేసవి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావారణ నిపుణులు అంటున్నారు. ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు ప్రజలు కొబ్బరిబొండాలు, నిమ్మరసం, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఎండలు