ఎండాకాలం

11:53 - March 1, 2018

విజయవాడ : నిన్నటి దాకా అమ్మో చలి.. ఇక నుంచి అబ్బా ఎండలు.. ఏపీలో ఎండలు అపుడే ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణతాపం పెరిగిపోతోంది. మార్చినెల మొదలవడంతోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇప్పటికే 38 డిగ్రీలకు చేరుతున్న ఎండలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చలి గడపదాటిందో లేదో.. అపుడే సూర్యుడు మిడిసిపడుతున్నాడు. మండిపోతున్న ఎండలతో ఏపీలో ప్రజలు అవస్థలు మొదలయ్యాయి. ఏప్రిల్, మేలో తీవ్రమయ్యే ఎండలు, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే సెగలు కక్కుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఎండలు క్రమక్రమేణా మండిపోతుండటంతో రహదారులపై జనం లేక వెలవెలబోతున్నాయి.

వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు హడలిపోతున్నారు. గతేడాది వందలాది మంది ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యారు. దీనికితోడు వేసవిలో ఆయా జిల్లాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొవాల్సి వస్తోంది. ఎండలు మరింతగా ముదరక ముందే నీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత రెండు వారాలపైగా ఎండలు చిర్రెత్తిస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు రాజధాని ఏరియా విజయవాడలో ఎండలు సుర్రుమంటున్నాయి. మధ్యాహ్నం వేళ బెజవాడలో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి.

మొత్తానికి మార్చి నెల మొదట్లోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్‌,మే నెలలు ఊహించుకుంటేనే జనం విలవిల్లాడి పోతున్నారు. ఇప్పటికే 38 డిగ్రీలకు చేరుతున్న ఎండలు.. మరికొద్ది రోజుల్లో 40దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చి జల్లు పడితే తప్ప ఇప్పట్లో చల్లబడి చాన్సే లేదంటున్నారు. దీంతో ఈసారి ఎండలు తాటతీస్తాయనడంలో సందేహం లేదని జనం ఆందోళన పడుతున్నారు. 

19:26 - May 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గి.. పెద్ద ఎత్తున వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో చాలామంది అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల ధాటికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోనే రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో మృతిచెందారు.

తూ.గో జిల్లాలో నలుగురు మృతి

అలాగే వడగాల్పులకు తూర్పు గోదావరి జిల్లాలోనూ నలుగురు మృతి చెందారు. జిల్లాలోని 14 మండలాల్లో తీవ్ర ఎండలు ఉన్నాయని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా సూచించారు.

చిట్యాలలో తండ్రి, కొడుకులు మృతి...

అలాగే నల్గొండ జిల్లా చిట్యాలలో భానుడి ఉగ్ర రూపానికి తండ్రి, కొడుకులు బలయ్యారు. జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించే కొండే దశరథ, కొండే శివ వడదెబ్బ ధాటికి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు.

వరంగల్ లో ఓ బాలుడు మృతి...

అలాగే వరంగల్లో నగరంలో వడదెబ్బకు ఓ బాలుడు మృతి చెందాడు. పెరుక‌వాడ‌కు చెందిన ల‌క్ష్మీ, లక్ష్మణ్‌ల మూడో సంతానం శివ ఎండలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఎంజీఎం ఆస్పత్రిలో చూపించి... ఇంటికి తీసుకువ‌స్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు వదిలాడు.

47 డిగ్రీల వరకు....

మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలో, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ... అత్యధికంగా 47 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు నాలుగు రోజుల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులుంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

20:08 - May 18, 2017

అమరావతి: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ శేషగిరిరావు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని శేషగిరిరావు తెలిపారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:18 - May 7, 2017

ఎండకాలం వచ్చిందంటే చర్మ సంబంధిత సమస్యలతో పాటు చెమట కాయల సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చెమట కాయల నుండి బయటపడటానికి వివిధ పౌడర్లు..క్రీములు వాడుతుంటారు. ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చెమటకాయలకు చెక్ ఎలా పెట్టవచ్చో చూద్దాం...
టిష్యూ పేపర్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి చెమటకాయలున్న చోట అద్దాలి. ఇలా చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుముఖం పడుతాయి.
బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాసి చూడండి. చర్మానికి సంరక్షణ కూడా అందుతుంది.
కాటన్ బాల్ ని తీసుకుని లవంగనూనెలో ముంచి చెమటకాయలున్న చోట రాయాలి. ఇలా రోజు చేయడం వల్ల చెమట కాయల సమస్య నుండి బయటపడవచ్చు.
చల్లటి పాలలో కాటన్ బాల్స్ ను తడపి చెమటకాయలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ పొక్కుల వల్ల వచ్చే మంట తగ్గే అవకాశం ఉంది.
మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ వంటివి రోజూ తాగుతూ ఉంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
గంధం, రోజ్ వాటర్ కలిపి చెమటకాయలు ఉన్నచోట రాయాలి. అనంతరం పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

14:36 - March 29, 2017

ఫిబ్రవరి చివరి వారం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడం మొదలు పెట్టారు. మార్చి నెలాఖరు రోజుల్లో ఎండలు మరింత ముదురుతున్నాయి. దీనితో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండలో వెళ్లడం ద్వారా పలు చర్మ..ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వచ్చు.

  • ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల వరకు, బయటకు వెళితే మరో లీటరు వరకు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా జ్యూస్ లు తీసుకోవాలి.
  • ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోకండి. గొడుగు, సన్ స్ర్కీన్ లోషన్స్, క్యాప్..వదులైన దుస్తులు ధరించాలి.
  • తేలికైన వదులుగా ఉన్న లేత రంగుల వస్త్రాలు ధరించాలి.
  • ఆల్కాహాల్, కాఫీ, టీల వంటివి డీహైడ్రేషన్ కు కారణమవుతాయి. వీలైనంత వరకు వేసవిలో వాటికి దూరంగా ఉండాలి.
  • ఆరు బయట, ఎండలో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉంటే మంచిది.
  • రోజులో అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. వడదెబ్బ తగిలిన వెంటనే వైద్యుడిని సంప్రదించడి.
19:28 - March 15, 2017

ఎండాకాలం వచ్చేసింది. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. ఎండల వల్ల డీ హైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో ఎండకాలం నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది తాజా పండ్ల రసాలను తీసుకోవడం. క్యారెట్..బీట్ రూట్..దానిమ్మ..సంత్రా..ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వచ్చే కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ద్రాక్ష జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

19:12 - March 10, 2017

మహబూబాబాద్: తెలంగాణ పల్లెల్లో గొంతెండుతోంది. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో మంచినీటి కోసం జనం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండో పంటకు నీరివ్వడం వల్లే గ్రామంలో మంచినీటి కొరత ఏర్పడిందన్నారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తామన్న పాలకులు.. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల ప్రజల మంచినీటి కష్టాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

17:34 - March 7, 2017

హైదరాబాద్: ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసులకు తాగునీటి కష్టాలు తప్పవు. అయితే ఈ సారి మాత్రం తాగునీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ జలమండలి సంస్థ పక్కా ప్లాన్ రూపొందించామని చెబుతోంది.

గతేడాది 352 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా ...

గ‌తేడాది రోజుకు 352 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు స‌ర‌ఫ‌రా అయితే ఈ సారి ఇప్పటికే 372 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు స‌ర‌ఫ‌రా అయిందని.. ప్రస్తుతం నగర అవసరాల కోసం 602 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు అందుబాటులో ఉందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు.

సమ్మర్‌లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌....

ఇక‌ స‌మ్మర్‌లో ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించామ‌ని.. ఇందుకోసం 5.81కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. బోర్డు ప‌రిధిలో ఉన్న 900వాట‌ర్ ట్యాంక‌ర్లలో 338 ట్యాంక‌ర్లను నీటి ప్రాబ్లమ్ ఉండే ప్రాంతాల‌కు ప్రతిరోజు 1500 ట్రిప్పులు పంపిణి చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. తాగు నీటిక‌ష్టాలు ఉత్పన్నం కాకుండా 45మంది స్పెష‌ల్ అధికారులను నియ‌మించామని చెప్పారు.

రూ. 1900 కోట్ల హడ్కో రుణంతో చేపట్టిన పనుల్లో పురోగతి.....

శివారు ప్రాంతాలకు తాగు నీటిని అందించ‌డం కోసం 1900కోట్ల రూపాయల హడ్కో రుణంతో చేప‌ట్టిన ప‌నుల్లో పురోగతి ఉందన్నారు. 2600 కిలోమీట‌ర్ల ప‌నుల్లో ఇప్పటి వ‌ర‌కు 908 కిలో మీట‌ర్ల మేర పైపులైన్ ప‌నులు పూర్తి చేశామ‌న్నారు. ఆయా ప్రాంతాల్లో 10వేల న‌ల్లా క‌నెక్షన్‌లకు నూత‌నంగా ఏర్పాటు చేసిన లైన్ ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇప్పటి వ‌ర‌కు 19రిజ‌ర్వాయ‌ర్లు పూర్తయ్యాయ‌ని, ఏప్రిల్ నాటికి మ‌రో 15 పూర్తి చేస్తామ‌న్నారు. ప్రతిసారి ఎండాకాలం ముందు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ అధికారులు చెప్పడం మామూలేనని.. ఈసారైనా ఇబ్బందులు లేకుండా చూస్తారో లేదో చూడాలని నగరవాసులు కోరుతున్నారు.

12:57 - February 25, 2017

హైదరాబాద్ : మార్చి కూడా మొదలవకముందే ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వాతావరణం వేడిక్కెతుండటంతో రాబోయే నాలుగు నెలలు వేసవి భయంకరంగా ఉండబోతుందన్న ఆందోళన అందిరిలో కలుగుతోంది. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా వడగాల్పులతో పసిపిల్లలు, వృద్ధులు, తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్‌ సూచిస్తోంది. వడగాల్పులను ఎదుర్కొనేందుకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు ఎంసీహెచ్‌ఆర్డీలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. 
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో వర్క్‌షాప్‌ 
వేసవిలో ఎండలు మండే ప్రమాదం ముంచుకొస్తుండటంతో.. వడగాలులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. వడగాల్పులపై కార్యాచరణ ప్రణాళిక అనే అంశంపై విపత్తుశాఖ అవగాహన కల్పించింది. ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని ఎన్‌డీఎంఏ సభ్యులు ఆర్‌కే జైన్‌ తెలిపారు. 
వడగాడ్పులపై ముందస్తు హెచ్చరికలు 
వాతావరణశాఖ సహకారంతో వడగాడ్పులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు స్వీకరించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. గతేడాది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించాయని, ఉపాధి హామీ కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. 
మండుటెండలు, వడగాడ్పులపై అవగాహన 
ముఖ్యంగా మండుటెండలు, వడగాడ్పులపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం నివారించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలు, మిగతా ప్రణాళికతో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే అవి వేడిగాలులని, మన దేశంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే వడగాలులుగా పేర్కొంటామని ఎన్‌డీఎంఏ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం ద్వారా ఎండల బారిన నుంచి కాపాడుకునేలా చేయవచ్చని, ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ధరించాల్సిన దుస్తులు, జీవన విధానంలో మార్పు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని విపత్తు శాఖ అధికారులు నిర్ణయించారు.

 

09:30 - February 21, 2017

భానుడు అప్పుడే మొదలేట్టేశాడు..శివరాత్రి సమయానికి శివ శివా అంటూ చలి వెళ్లిపోతుందని ఓ నానుడి ఉంది. కానీ శివరాత్రికంటే ముందుగానే సమ్మర్ షురూ అయిపోయింది. భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇందుకు సోమవారమే ఉదహారణ. హైదరాబాద్ లో సోమవారం పగలు అత్యధికంగా 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఒక్కసారిగా ఐదు డిగ్రీల వరకు పెరగడంతో నగర ప్రజలు కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. నగరంలో గత పదేళ్లలో ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రత 2009 ఫిబ్రవరి 26న 39.1 డిగ్రీలుగా నమోదైనట్లు రికార్డులో ఉన్నట్లు తెలుస్తోంది. శీతాకాలం ముగిసి వేసవి ప్రవేశించిందని పలువురు పేర్కొంటున్నారు. పగలే కాకుండా రాత్రి వేళ సైతం అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంటోందని టాక్. నల్గొండలో సోమవారం తెల్లవారుజామున 14, ఖమ్మంలో 16 డిగ్రీలు నమోదయ్యాయి. సో..ఎండాకాలం..కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

Pages

Don't Miss

Subscribe to RSS - ఎండాకాలం