ఎదురుదెబ్బ

11:49 - June 13, 2018

హైదరాబాద్‌ : హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేక్‌ ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను... ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా పునర్విచారణ జరపాలని సింగిల్‌ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు తాజా ఉత్తర్వులతో  వివేక్ మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోల్పోనున్నారు. 
అంబుడ్స్‌మన్‌ తీర్పును సమర్ధించిన హైకోర్టు
హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ పదవికి వివేక్‌ అనర్హుడన్న అంబుడ్స్‌మన్ తీర్పును హైకోర్టు సమర్థించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే తాజా ఉత్తర్వులతో వివేక్‌ ప్రత్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులూ వివేక్‌ అడ్డదారిలో హెచ్‌సీఏలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. 
వివేక్‌ ఎన్నిక చెల్లదన్న అంబుడ్స్‌మన్‌ 
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఎన్నికల్లో వివేక్‌పై పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌... వివేక్‌ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ హెచ్‌సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు, చట్టానికి విరుద్ధమంటూ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్‌మన్‌ లోదా సంస్కరణలకు అనుగుణంగా వివేక్ ఎన్నిక చెల్లదని తేల్చిచెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వివేక్‌ హై కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్‌ అంబుడ్స్‌మన్‌ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సింగిల్‌ జడ్జ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ అజారుద్దీన్‌ ధర్మాసనంకు అప్పీలు చేశారు. అయితే తాజాగా అంబుడ్స్‌మన్‌ తీర్పునే తాజాగా ధర్మాసనం సమర్ధించింది. అయితే 2017లో హెచ్‌సీఏకు ఎన్నికలు జరిగినప్పటి నుండి అధ్యక్ష, కార్యదర్శులు ఈ ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా వివేక్‌ను ఎన్నిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంబుడ్స్‌మన్‌కు వేలాదిగా ఫిర్యాదులు చేరాయి. 
వివేక్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు
వివేక్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు....ఇది కేబినేట్‌ మంత్రి స్థాయి పోస్టు. జస్టిస్‌ లోదా సిఫార్సుల ప్రకారం వివేకానంద హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అనర్హుడు. అయినప్పటికీ స్టేడియం స్పాన్సర్‌షిప్‌ కోసం హెచ్‌సీఏపై కోర్టులో పోరాటం చేస్తున్నారు. గతంలో హెచ్‌సీఏ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చిన రోజునే వివేక్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యర్థులు ఆయన విషయాన్ని ఎన్నికల అధికారి రాజీవ్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వాటిని ఖాతరు చేయకుండా పక్కన పెట్టారు. 
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానన్న అజారుద్దీన్‌
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ తెలిపారు. వివేక్‌పై అంబుడ్స్‌మెన్‌ తీసుకున్న నిర్ణయమే సరైందన్నారు. మొదటి నుండి తాము వివేక్‌ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని చివరకు న్యాయమే గెలిచిందన్నారు. ఇక హెచ్‌సీఏలో ఏం జరగాలన్న దానిపై జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయిస్తామన్నారు. 

 

13:04 - June 12, 2018

హైదరాబాద్ : హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌ వివేక్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును నిలిపివేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారిచేసింది. అయితే మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. అప్పటి వరకు హెచ్‌సిఏ పదవిలో కొనసాగొద్దని ఆదేశాలు జారీ చేసింది.

19:53 - June 7, 2018

ఢిల్లీ : జెడియూ మాజీ నేత శరద్‌యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నుంచి అనర్హత వేటుకు గురైన ఆయనకు ప్రస్తుతం లభిస్తున్న వేతనం, అలవెన్స్‌లు, ఇతర సదుపాయాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ తీర్పు చెప్పింది. శరద్‌ యాదవ్‌కు  రైలు, విమాన టికెట్ల వంటి ఇతర సౌకర్యాలు కూడా నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జులై 12 వరకూ ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయకుండా ఆయనకు ఊరట కల్పించింది. రాజ్యసభ నుంచి తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ శరద్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు సూచించింది.

 

08:27 - June 1, 2018

ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలిందని వక్తలు అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ పాలనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత కైలాష్, కేఎస్.లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:30 - March 18, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ బలపరిచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఓటమి చెందింది. బీఎంఎస్ అధ్యక్షుడు యూనియన్ శంకర్ విజయం సాధించారు. 5570 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ యూనియన్ కార్మిక సంఘం నేతలు సంబరాలు జరుపుకున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 9 సంఘాలున్నా ఎన్నికల బరిలో నాలుగు సంఘాలు నిలిచాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:31 - March 2, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలిందని... నాలుగేళ్లయినా ఆ గాయాలు మానలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ పోయింది... వీళ్లూ అన్యాయం చేస్తారా అనేది ప్రజల ఆవేదన అన్నారు. 'హోదా వద్దని మనం ఎక్కడా, ఎప్పుడూ అనలేదు' అని చంద్రబాబు అన్నారు. హోదాకు అడ్డంకులు ఉన్నాయని అన్నందువల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించామని తెలిపారు. వేరే రాష్ట్రాలకు కూడా హోదా ఉండదని చెప్పినందువల్లే ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. ఎంపీల ఒక్కొక్కరి అభిప్రాయాలు చంద్రబాబు తెలుసుకుంటున్నారు. 
 

07:17 - January 23, 2018

ఢిల్లీ : మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రహ్మణి ఇండస్ట్రీస్‌లో డీఆర్‌ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి చెందిన 189 కోట్ల రూపాయల యంత్రపరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 2009లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్రపరికరాలకు కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించలేదని డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన నోటీసులను గాలి జనార్దన్‌రెడ్డి బేఖాతర్‌ చేశారు. కడపలోని బ్రహ్మణి స్టీల్‌ ఇండస్ట్రీస్‌తోపాటు ఓబుళాపురం మైనింగ్‌ యంత్రపరికరాలను సీజ్‌ చేశారు.  గాలి జనార్దన్‌రెడ్డితోపాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు బెయిల్‌ నిబంధనలను సడలించాలన్న గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ నిబంధనల్లో మార్పులు ఉండవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 
 

22:06 - December 9, 2017

ఢిల్లీ : జెరుసలేం అంశంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ రాజధానిగా జెరుసలేంను ప్రకటించడాన్ని తిరస్కరించింది. ట్రంప్‌ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది.  15 సభ్య దేశాలకు గాను 8 దేశాలు ప్రపంచ శాంతి, భద్రతకే ప్రాధాన్యత నిచ్చాయి. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. జెరూసలేం ఇజ్రాయిల్, పాలస్తీనాలకు రాజధానిగా పేర్కొంటూ... దీనిపై చర్చల ద్వారానే ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని యురోపియన్ యూనియన్‌కు చెందిన అయిదు దేశాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో అమెరికా ఈ అంశంలో ఒంటరిగా మారింది. అమెరికా దౌత్యవేత్త నిఖ్కీ హేలీ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం ఇజ్రాయిల్ పట్ల తమ శత్రుత్వాన్ని చూపుతన్నదని ఆరోపించారు.

 

21:56 - October 30, 2017

ఢిల్లీ : ఆధార్‌ కార్డు విషయంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మమత సర్కార్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పార్లమెంట్‌ ఆదేశాలను ఓ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ధిక్కరిస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై కేంద్రానికి, మొబైల్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యక్తులు పిటిషన్‌ వేయొచ్చు కానీ... రాష్ట్రాలు వేయకూడదని కోర్టు సూచించింది. మమతాబెనర్జీ వ్యక్తిగతంగా పిటిషన్‌ వేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. 

 

18:32 - September 13, 2017

ఢిల్లీ : భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్...అండరవరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌లో దావూద్‌కు చెందిన 43 వేల కోట్ల ఆస్తులను జప్తు చేశారు.  దావూద్‌కు చెందిన బ్రిటన్‌లో పలు భవనాలతో పాటు ఓ హోటల్‌ను కూడా జప్తు చేసినట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. దౌత్యపరంగా విదేశాల్లో  భారత్‌కు ఇది పెద్ద విజయం. దావూద్‌ పేరిట వార్విక్‌షైర్‌లో ఓ హోటల్‌తో పాటు మిడ్‌ల్యాండ్స్‌లో నివాస స్థలాలున్నాయి. దావూద్‌కు లండన్‌లో ఆస్తులున్నట్లు 2015లో ఈడీ గుర్తించింది. 1993 ముంబై వరుసు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. పేలుళ్ల అనంతరం దేశం విడిచి వెళ్లిపోయిన దావూద్‌ పాకిస్తాన్‌లో దాక్కున్నట్లు సమాచారం. దావూద్‌కు 21 మారుపేర్లు ఉన్నాయి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎదురుదెబ్బ