ఎన్నికలు

20:55 - October 13, 2017

హైదరాబాద్ : బ‌ల్దియాలో  కార్మిక సంఘాల గుర్తింపు సంఘం ఎన్నిక‌లకు సిద్ధమవుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో విజయం తమదేనని ఆ సంఘం నాయకుడు గోపాల్‌ అంటున్నారు. జీహెచ్ఎంసీలో రెండు సార్లు కార్మికుల‌కు వేత‌నాలు పెంచి ప్రభుత్వం అమ‌లు చేసింద‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేశామని... ఇప్పుడు రాష్ట్రం సిద్ధించాక కార్మికులకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుందని అన్నారు. సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఇళ్లు గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని గోపాల్‌ కార్మికులను కోరారు. 

 

13:11 - October 13, 2017

గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఈసీ వైఖరి ఏంటీ ? డిసెంబర్ 18 లోగా ఎన్నికలుంటాయని చెప్పడంలో ఆంతర్యం ఏంటీ ? దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలోనే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి స్పష్టంగా ఎన్నిక తేదీలను ప్రకటించింది. కానీ గుజరాత్ రాష్ట్ర విషయానికి వచ్చే సరికి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనితో ఈసీపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పీఎం మోడీ పర్యటన ఉండడం..అక్కడ వరాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, ఇప్పుడు తేదీలు ప్రకటిస్తే వరాలు కురిపించే అవకాశం ఉండదని..ఇది అందరకీ అర్థమయ్యే విషయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ విషయంలో ఎన్నికలను దృష్టి పెట్టుకుని వరాలు ప్రకటించడం..జీఎస్టీ విషయంలో కేంద్ర వైఖరి అందులో భాగమేనని తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంపై ప్రభావం చూపే వాటిపై తగ్గించారనే విమర్శలున్నాయి. పేరుకు స్వతంత్ర సంస్థలుగా ఉంచడం...ఆచరణకు వచ్చే వరకు ప్రభుత్వం పావులుగా వాడుకోవడం జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం ఉండడం దురదృష్టకరమని ఆరోపిస్తున్నారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లో 150 ఎమ్మెల్యేల బలం పెంచుకోవాలని కాషాయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ప్రస్తుతం నోట్ల రద్దు..జీఎస్టీ..తదితర అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మోడీ స్వస్థలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావడం...2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు వస్తుండడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఆ రాష్ట్రంలో పార్టీకి పలు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. పటేల్ వర్గం ఒబిసి కోటా ఉద్యమంతో మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇక గోవధ అంశంలో దళితులపై హింసాకాండ వంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ పై వ్యతిరేకత వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి.

మరి గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? అక్కడ మోడీ వరాలు కురిపిస్తారా ? లేదా? అనేది వేచి చూడాలి. 

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

16:42 - October 6, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించినందుకు సింగరేణి కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. సింగరేణి ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సింగరేణి కార్మికులు పాత ఆలోచనల నుండి బయటకు రావాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయన్నారు. ప్రజాజీవితంలో..రాజకీయాల్లో మాట్లాడిన మాటలు కావన్నారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షాలు పూర్తి అబద్దాలు చెప్పారని, 1998-2000లో వారసత్వ ఉద్యోగాలు తొలగించడంలో గతంలో ఉన్న సంఘాలే కారణమన్నారు. వీటిని పునరుద్దరించేందుకు తాము ప్రయత్నించినట్లు, ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తమకు ప్రయత్నామ్నాయమని బీజేపీ నేతలు చంకలు గుద్దుకున్నారని, కానీ సింగరేణిలో ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవాలని ఏద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు ఏజెండా ఎత్తుకోవాల్సి వస్తలేదన్నారు. ప్రతిపక్షాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.

తాము చేసిన కార్యక్రమాలు..ఎన్నికల్లో గెలవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జర్నలిస్టులు కూడా ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమానికి మద్దతు తెలియచేయాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని ఎకరానికి రూ. 8వేలు ఇస్తామని, భూముల రికార్డు తీయాలని ప్రభుత్వం ఆదేశిస్తే ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాయన్నారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని, ఈ విమర్శలకు అర్థం ఉందా అని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితి విషయంలో కోర్టుకు వెళ్లాయని..స్థానిక సంస్థలకు ఈ విషయంలో సంబంధం లేదని కొట్టిపారేశారు.

ఇటీవలే గవర్నర్ దగ్గరకు వెళితే ప్రతిపక్షాలు చేసిన విమర్శలు..ఆరోపణలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ ఏదైనా జిల్లాలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని తాను కోరడం జరిగిందన్నారు. వెంటనే రెండు జిల్లాలను ఎంచుకున్న గవర్నర్ పర్యటన అనంతరం ప్రభుత్వాన్ని కొనియాడారన్నారు. కారుణ్య నియామకాల కింద తాము ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని, అంతేగాకుండా వీఆర్ఎస్ తీసుకునే విషయంలో డబ్బులు ఇస్తామని, ఇచ్చిన హామీలు తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. సింగరేణి 45 శాతానికి పైగా మెజార్టీ సాధించి గెలవడం శుభ పరిణామమన్నారు.

కాళేశ్వరం విషయంలో కూడా కోర్టుకు వెళ్లారని, పనులు ఆపాలని ఎన్జీటీ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం జరిగిందని దీని వెనుక మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ ఉన్నారని..ఇది అందరికీ తెలిసిందేన్నారు. రోజుకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి న్యాయవాదిని పెట్టుకొనే స్థోమత రైతుకు ఉంటుందా అని ప్రశ్నించారు.

ఇక సోషల్ మీడియాలో చిల్లర గ్యాంగ్ పెట్టుకున్నారని, ఎక్కువ వర్షం పడితే అవస్థలు రావా ? హైదరాబాద్ డల్లాస్ అయ్యిందంటూ ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. అంతేగాకుండా గొర్రెల పంపకంలో గొర్రె..బర్రె..దొర అంటూ ఇష్టమొచ్చినట్లు..కూతలు కూస్తున్నారని..ఇలానే చేస్తే అందర్నీ బుక్ చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాటిపాముల ఊరులో గడియ ఉందని.. ఉత్తమ్ దొర అని మండిపడ్డారు. నా ఇల్లు గడియ అంటారా ? ఇంత అసహనమా ? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కులాలు ఉంటాయా ? కులం విషయంలో టిపిసిసి అధ్యక్షుడు మాట్లాడవచ్చా ? అని నిలదీశారు. 

16:27 - October 6, 2017

ఢిల్లీ : ఒక దేశం ఒకే పన్ను విధానం తరహాలో ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే జమిలి ఎన్నికల నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఇందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్దం చేస్తుండగానే ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి లోక్‌ సభతో పాటు అన్నిరాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018 సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్‌వర్క్ యాప్‌ను ప్రారంభించిన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్..పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం నిధులను సమకూర్చిందన్నారు. అయితే జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగిన చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమని చెప్పారు. ఇప్పటికే వీవీపీఏటీల కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు కేంద్రం అందజేసిందని చెప్పారు.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు. 1951-52లో తొలి సార్వత్రిక ఎన్ని కల నుంచీ 1967లో నాలుగో లోక్‌సభకు ఎన్నికల వరకూ జమిలిగానే సాగాయి. 1968,69 సంవత్సరాలలో అస్థిరత చోటు చేసుకుంది. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. దాంతో జమిలి ఎన్నికల ప్రక్రియకు పూర్తి విఘాతం కలిగింది.

అయితే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. జమిలి ఎన్నికల విధానాన్ని 2024 నుంచి అమలుచేయాలని, రెండు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల విధానంపై విస్తృత చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. 2018 మార్చి నాటికి ఈసీ తుది నిర్ణయం ప్రకటించాలని తెలిపింది. తాజాగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీ ప్రకటించింది.

మరోవైపు లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో అవి రాష్ట్ర స్థాయిలోనైనా, లేదా కేంద్ర స్థాయిలోనైనా మెజారిటీ కోల్పోయిన పక్షంలో ఏం చేయాలి? ఒకసారి ఎన్నికైన ప్రభుత్వానికి మెజారిటీతో సంబంధం లేకుండా ఐదేళ్లు పాలించే అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

21:20 - October 5, 2017

పెద్దపల్లి/మంచిర్యాల/భూపాలపల్లి/కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ముగిశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి. సింగరేణి కాలరీస్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో పోలింగ్‌ నిర్వహించారు. ఎన్నికల కోసం 92 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగరేణలో ఓటు హక్కు ఉన్న 52,534 మంది కార్మికులకు గాను 49,873 మంది ఓటు వేశారు. మొత్తం 94.93 శాతం పోలింగ్‌ నమోదైంది.

బరిలో 15 కార్మిక సంఘాలు
మొత్తం 15 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సీపీఐ అనుబంధ ఏఐటీయూసే మధ్య ఉంది. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, కాంగ్రెస్‌ అనుంబంధ ఐఎన్‌టీయూసీ, తెలంగాణ టీడీపీ అనుంబంధ టీఎన్‌టీయూసీ కలిసి ఐక్య కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచిపెట్టారని, కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. అటు చివరి దశలో ఒక నిమిషం ఆలస్యంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన కొంతమంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించేలేకపోయారు. ఇలాంటివారు నిరుత్సాహంతో వెనుతిరిగారు. 

17:10 - October 5, 2017

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. అన్ని డివిజన్లలో భారీగా పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికలలో 15 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. పోలింగ్ పూర్తవడంతో ఓట్ల లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు నుంచి కౌటింగ్ ప్రారంభం కానుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:19 - October 5, 2017

భూపాలపల్లి : జిల్లా గణపురం మండలపరిధిలోని కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్టు 8 ఇంక్లైన్ మైన్ మీద టీజీబీకేఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:40 - October 5, 2017
12:00 - October 5, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - ఎన్నికలు