ఎన్నికల సంఘం

07:38 - December 7, 2018

కరీంనగర్ : జిల్లాలో ఎంపీ వినోద్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడారు....1952లో ఎన్నికలు జరిగాయని..అప్పుడు జనాభా మాత్రం 43 కోట్లు..ప్రస్తుతం 130 కోట్ల జనాభా ఉందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశం..భారతదేశమని..ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా..ఓటు శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారని...ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎంపీ వినోద్ పిలుపునిచ్చారు.

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

15:13 - November 30, 2018
తెలంగాణ ఎన్నికలు 2018 ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఇండిపెండెంట్, రెబెల్ అభ్యర్థులు 8-10 నియోజకవర్గాల్లో గెలవబోతున్నట్లు చెప్పి పార్టీల అభ్యర్థుల్లో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి పోలింగ్ ముగిసే డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి సర్వే ఫలితాలను ప్రకటించకూడదనే నిబంధన ఉంది. ఈ మేరకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. మరి లగడపాటి ఎలా చెబుతారు అనేది పాయింట్ అయ్యింది.
లగడపాటి ఎలా చెబుతారు.. రూల్స్ బ్రేక్ చేయటం కాదా?
తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి పొలిటికల్ సర్వేలపై కొందరికి గురి ఉంది. కచ్చితమైన రిజల్ట్ వస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇందు వల్లనే చాలా పార్టీలు సర్వే ఫలితాల కోసం ఆయన్ను ఆరా తీస్తుంటాయి. ఈసారి ఆయన పేరుతో బోలెడు వార్తలు వచ్చినా.. వాటిని స్వయంగా కొట్టిపారేశారు. నా నోటితో చెప్పిందే నిజం అని స్పష్టం చేశారు. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మాత్రమే ఏ పార్టీ గెలుస్తుంది అనేది వెల్లడిస్తాను అన్న ఆయన.. ఎవరూ ఊహించని విధంగా ఇద్దరి గెలుపును ప్రకటించేశారు. నారాయణపేట, బోధ్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్ గెలుస్తారని ప్రకటించటమే కాకుండా.. మరో 8 నియోజకవర్గాల్లో గెలవబోతున్న స్వతంత్రుల వివరాలు వెల్లడిస్తాను అని చెప్పటం సంచలనం అయ్యింది. 
లగడపాటి సర్వే ఫలితాలు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయా.. రావా అనే అందరిలో చర్చనీయాంశం అయ్యింది. పోలింగ్ కు వారం ముందు సర్వే ఫలితాలను ఎలా వెల్లడిస్తారని ప్రధాన పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లగడపాటి సర్వేలు ఓటర్లపై ప్రభావం చూపిస్తాయని.. ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం అని ఆయా నియోజకవర్గాల ప్రధాన పార్టీ అభ్యర్థులు అంటున్నారు. మిగతా అభ్యర్థుల వివరాలు వెల్లడించకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి పార్టీలు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కాదు అని లగడపాటి ఎలా సమర్ధించుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నాయి పార్టీలు. ఆయా నియోజకవర్గాల్లో ఫలానా అభ్యర్థి గెలుస్తున్నాడు అని పేర్లతో సహా ప్రకటించటం అంటే.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ప్రధాన పార్టీలు అంటున్నాయి. లగడపాటి సర్వే ఫలితాల ప్రకటను వెంటనే అడ్డుకోవాలని ఈసీని కోరనున్నట్లు సమాచారం.
15:27 - November 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. దేశంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసం ర్యాంప్‌ను అమర్చిన వాహనాలను సిద్ధం చేస్తోంది. దివ్యాంగులతో పాటు, గర్భిణులను కూడా ఈ వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రతి వెయ్యి పోలింగ్ కేంద్రాలకు ఒకటి చొప్పున ర్యాంప్ అమర్చిన వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ వాహన సేవలను వృద్ధులకూ అందించే ఆలోచనలో ఈసీ ఉంది. ఈ సేవను పొందాలంటే, ఆండ్రాయిడ్ ఆధారిత జీహెచ్ఎంసీ వాడా (GHMC VAADA) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యాప్ ద్వారా రెక్వెస్ట్ పంపగానే, అధికారులు దగ్గరలోని పోలింగ్ కేంద్రం లొకేషన్‌ని మ్యాప్ చేసి.. వాహనాన్ని పంపుతారు. ఈ సర్వీసుల కోసం జీహెచ్ఎంసీ తన సిబ్బందిని వినియోగించనుంది. ప్రస్తుతం, జంటనగరాల పరిధిలో 18వేల మంది దివ్యాంగులున్నట్లు అంచనా. 

11:26 - November 25, 2018

హైదరాబాద్: డిసెంబర్ 7న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు 23 వతేదీతో ముగియటంతో శనివారం నాటికి 1,821 మంది అభ్యర్ధులు బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.మొత్తం 119 నియోజక వర్గాల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో 42 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా, బోధ్, జుక్కల్,నర్సాపూర్ నియోజకవర్గాల్లో 7 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 
ఈవీఎంల విషయానికి వస్తే .........
ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఓటింగ్ యంత్రాలలో నోటాతో కలిపి 16 మంది అభ్యర్ధుల పేర్లు మాత్రం ఒక ఈవీఎంలో చోటు కల్పించడానికి అవకాశం ఉంటుంది. 32 కంటే ఎక్కువమంది అభ్యర్ధులు ఉన్న చోట 3 ఈవీఎంలు ఒక బ్యాలెట్ యూనిట్ గాను,16 కంటే ఎక్కువ ఉన్న చోట 2ఈవీఎంలు ఒక బ్యాలెట్ యూనిట్ గా వాడేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మల్కాజ్ గిరి  42,ఉప్పల్ లో 35, ఎల్బీనగర్ నుంచి 35, ఖైరతాబాద్ నుంచి32 మంది అభ్యర్ధులు  బరిలో ఉండటంతో ఇక్కడ 3 ఈవిఎంలు  ఒక బ్యాలెట్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. 


రెండు ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించే  నియోజకవర్గాలు
>అంబర్ పేట 31 మంది అభ్యర్ధులు
>శేరిలింగంపల్లి,మిర్యాలగూడ 29 మంది 
>రాజేంద్రనగర్,ముషీరాబాద్ 26 మంది 
>కరీంనగర్,గోషామహల్,సూర్యాపేట 25 మంది 
>యాకుత్ పురా,నిజామాబాద్ అర్బన్,మంచిర్యాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, 21మంది 
>కుత్బూల్లాపూర్,కూకట్ పల్లి,ఇబ్రహీం పట్నం,మలక్ పేట, నుంచి 20 మంది 
>కంటోన్మెంట్,నాంపల్లి  19మంది
>దుబ్బాక, జూబ్లీహిల్స్,కార్వాన్,పాలకుర్తి 18
>పెద్దపల్లి,మహేశ్వరం,నల్లగొండ,తుంగతుర్తి,కొత్తగూడెం, 17 మంది
>ములుగు, పినపాక,హుజూర్ నగర్,రామగుండం,పటాన్ చెరువు,చార్మినార్,నుంచి 16మంది పోటీ చేస్తున్నారు.

10:11 - November 25, 2018

హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నవారి సంఖ్యను ఎన్నికల సంఘం ఖాయం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర్నుంచి  విపక్షాల ఆరోపణలు, కోర్టు కేసులు నేపధ్యంలో అత్యంత జాగ్రత్తగా ఎన్నికల సంఘం ఓటర్ల లిస్టును రూపొందించటానికి కృషి చేసింది. డిసెంబర్ 7 న జరిగే ఎన్నికల్లో  2,80,64,684 మంది ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,41,56,182 మంది పురుషులుకాగా 1,39,05,811 మంది మహిళలు, 2,691 మంది ఇతరులు ఉన్నారు. రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,75,541 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా ఓటర్లు ఉన్ననియోజకవర్గం భద్రాచలంలో1,37,319 మంది ఓటర్లతో చివరి స్ధానంలో ఉంది.
ఇక స్త్ర్రీ, పురుష ఓటర్ల పరంగా చూస్తే మహిళా ఓటర్ల కంటే 2,50,371 మంది పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా వీరి సంఖ్య చూస్తే  కుత్బుల్లాపూర్  నియోజకవర్గంలో మహిళల కంటే పురుష ఓటర్లు 33,961 మంది అధికంగా ఉండగా, జూబ్లిహిల్స్ లో 24,839 మంది,కూకట్ పల్లిలో 21,846 మంది, మేడ్చల్ లో 20,654 పురుష ఓటర్లు మహిళల కంటే అధికంగా ఉన్నారు.

11:43 - November 10, 2018

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక్లలో  ఓటర్లు లిస్టులో పేరు లేని వారు తమ పేరు నమోదు  చేసుకునే గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. ఆన్ లైన్ ద్వారాను, పోలింగ్ బూత్లు, మాన్యువల్ గాను  వచ్చిన దరఖాస్తులను, ఎన్నికల సిబ్బంది స్వయంగా పరిశీలించి అర్హుల జాబితాలో పేరు పొందుపరుస్తారు. ఈనెల 19న తుది జాబితా వెలువరించునున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
అక్టోబరు 12న ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసింది. బోగస్ ఓట్లు తొలగించేందుకు, ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికలసంఘం తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈఆర్వో నెట్ సాఫ్ట్ వేర్ వల్ల కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సంఘం మళ్లీ ఓటర్ల నమోదుకు అవకాశం ఇవ్వటంతో పేర్లు గల్లంతైనవారు తమపేర్లు నమోదు చేయించుకునే అవకాశం దొరికింది. ఈనెల 19న వెలువడే తుది ఓటర్ల జాబితాతో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

09:48 - October 26, 2018

హైదరాబాద్: కేంద్ర ఎన్నికలసంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతేదీ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105మంది అభ్యర్ధులను కూడా ప్రకటించింది. బీజేపీ మొదటి విడతగా 38మంది పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆపధ్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులతో సమావేశాలు నిర్వహించి వారికి ఎన్నికల్లో విజయం సాధించటంపై దిశానిర్దేశం కూడా చేశారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలోని 19 వార్తా చానళ్ల కార్యక్రమ ప్రసారాలపై ఎన్నికలసంఘం నిఘా పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని వారిలో ఒక్కోరికి 2వార్తాచానళ్ల భాధ్యత అప్పచెప్పింది. వీరు 19 తెలుగు వార్తా చానళ్లు 24 గంటలు ప్రసారం చేసే రాజకీయపార్టీల వార్తలను పరిశీలిస్తారు. వీరు రాజకీయపార్టీల ప్రచారంతో పాటు ఎన్నికల్లో జరిగే ప్రతి చిన్నవిషయాన్ని రికార్డుచేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారు. వీటితోపాటు సోషల్ మీడియాలో వచ్చేవార్తా కధనాలను రికార్డుచేసి, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారి పైనా,ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపైనా నిఘాపెట్టి వారిపై కేసులుపెట్టి కఠినచర్యలు తీసుకోనుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించాయనే  ఫిర్యాదులు వస్తే వాటిని ఈసీ రికార్డు చేసిన వాటితో సరిపోల్చుకుని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఈప్రక్రియ వలన ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణి నిరోధించవ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది.

16:47 - October 23, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ఓట్లు తొలగింపులో ఎన్నికల సంఘం చర్యలు కంటితుడుపుగానే ఉన్నాయని, హైకోర్టును ఎన్నికలసంఘం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈఅంశంపై న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తమదగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సాఫ్ట్ వేర్ ఉందని చెప్పిన ఎన్నికల సంఘం కంటితుడుపు చర్యగా బోగస్ ఓట్లను తొలగించిందని అన్నారు. రాష్ట్రానికి ఆడిట్ బృందాన్ని ఈసీ ఎందుకు పంపలేదని మర్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే  ప్రకటించిన షెడ్యూల్ కు అనుగుణంగా తమ షెడ్యూల్ ఉండేలా అమలు చేయటానికి ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 

15:41 - October 23, 2018

హైదరాబాద్: ప్రొ.కోదండరామ్ ఆధ్వర్యంలో వచ్చిన తెలంగాణ జనసమితి పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. టీజేఎస్‌ ఎన్నికల గుర్తుగా ''అగ్గిపెట్టె'' కేటాయించారు. ఇవాళ సాయంత్రం అధికారికంగా  సీఈసీ ప్రకటించనుంది. తెలంగాణ జనసమితి పార్టీ నూతనంగా ఆవిర్భవించడంతో ఆ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించాలని సీఈసీని గతంలో కోరారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఈసీ టీజేఎస్‌కు గుర్తును కేటాయించినట్లు తెలుస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - ఎన్నికల సంఘం