ఏపీ

21:44 - December 16, 2017

గుంటూరు : ఏపీ కేబినెట్‌ ఐదున్నర గంటలుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మండలాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2017 ఏపీ పోలీస్‌ ముసాయిదా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ బిల్లుతో ముగ్గురు సభ్యులు ఉన్న ప్యానల్‌.. డీజీపీని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్‌ సమావేశంలో పోలవరంపై చర్చ జరిగింది. తాజాగా పిలిచిన 1,480 కోట్ల టెండర్లను తాత్కాలికం నిలిపివేయాలని నిర్ణయించారు. దీనిపై నెల రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. 

 

16:37 - December 15, 2017

ఢిల్లీ : ఏపీ స్పెషల్ ప్యాకేజ్‌కి చట్టబద్ధత కల్పించాలని ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్రాన్ని కోరుతామన్నారు టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం. పోలవరంపై ప్రతిపక్షాలు అవస్తవాలు చెబుతున్నాయని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ స్ధానాల పెంపు, రైల్వే జోను, కడపలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామంటున్నారు.

19:22 - December 12, 2017

కృష్ణా : ఏపీ దేవాదాయ అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో హైదరాబాద్‌, కదిరి, విజయవాడ, రాజమండ్రితో సహా 18 ప్రాంతాల్లో 21 బృందాలు సోదాలు నిర్వహించారు. చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. దాడులో భారీ ఎత్తున కూడబెట్టిన అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. విజయవాడ పటమటలో కోట్ల విలువ చేసే ఐదంతస్తుల భవనం,.. గొల్లపూడిలో కోటిన్నర రూపాయల విలువ చేసే భవనం, అనంతపురం జిల్లా కదిరిలో కుటుంబ సభ్యుల పేరున 32 ఎకరాల స్థలంలో సోలార్‌ ప్లాంట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

11:42 - December 8, 2017

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో తాము ఎన్నో సమస్యలు..ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏపీ విద్యుత్ కాంట్రక్టు కార్మికులు పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వారు భేటీ అయ్యారు. గత ఎన్నో ఏళ్లుగా న్యాయబద్ధమైన కోరికను ప్రభుత్వం తీర్చడం లేదని వారు పేర్కొన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పవన్ ఆసక్తిగా విన్నారు. విద్యుత్ రంగంలో కాంట్రాక్టు వ్యవస్థను తీసివేయాలని..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని..తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా వేతనం ఇచ్చే విధంగా చూడాలని కోరారు.

బాధలు..ఇబ్బందులు..సమస్యలు తెలుసుకోవడానికి టైం ఇచ్చిన జనసేన అధినేతకు 24వేల మంది కార్మికుల ఐక్యవేదిక తరపున అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 24వేల మంది విద్యుత్ కార్మికులున్నారని, 6-8-10-12 వేల వేతనం వస్తోందని...రెగ్యులరైజ్ లేదా..క్రమబద్ధీకరించాలని..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తాము కోరడం జరిగిందన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో నలుగురి చేత కమిటీ ఏర్పాటు జరిగిందని, 2/94 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు చట్టం అడ్డంగా ఉందని ఎలాంటి రెగ్యులరైజ్ చేయడం జరగదన్నారు.

మేనిఫెస్టోలో పేజీ 30లో వారు హామీనిచ్చారని, ఇందుకు సవరణ చేస్తే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందని ఆ విధంగా చేయాలని తాము కోరడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ముఖ్యమని..హుదూద్ తుపాన్ సమయంలో 24గంటల్లో విద్యుత్ ను పునరుద్ధరించామని, రాత్రింబవళ్లు పని చేశామన్నారు. ప్రభుత్వ పెద్దలే ఉన్నారని..గుండు గుత్తగా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి సంస్థను అప్పచెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, తమకు నేరుగా జీతాలు ఇచ్చే విధంగా చూడాలని..తెలంగాణలో అదే విధంగా ఇస్తున్నారన్నారు.

కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడేనన్నారు. 2003లో చట్టానికి సవరణలు చేసిందని..ఆనాడు సమయంలో తాము పోరాటం చేయడం జరిగిందన్నారు. దివంగత వైఎస్ ను ఆనాడు కలవడం జరిగిందని, ఇది పాలసీ స్టడీ చేయాలని చెప్పారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

22:01 - December 6, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు పంపింది. ఈనెల 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2018 డీఎస్సీ ద్వారా 12,370 టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి గంటా షెడ్యూల్‌ ప్రకటించారు. జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. 

డీఎస్సీ ప్రకటన కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018 డీఎస్సీపై  మంత్రి గంటా షెడ్యూల్‌ ప్రకటించారు. మొత్తం 12వేల 370 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌12 నాటికి టీచర్‌ పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 8 అని తెలిపారు.  

మార్చి 23,24,26 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు మంత్రి గంటా. మార్చి 9 నుంచి హాల్‌ టిక్కెట్లును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్‌ 9న ప్రాథమిక కీ విడుదల చేస్తామని..ఈ కీపై అభ్యంతరాలను ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్‌30న తుది కీ విడుదల చేస్తామన్నారు. మే 5న మెరిట్‌ లిస్ట్‌ ప్రకటిస్తామని చెప్పారు. మే 11న ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారమిస్తామన్నారు. మే 14 నుంచి 19 వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామన్నారు.  

ప్రకటించిన మొత్తం 12370 పోస్టుల్లో...స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313... మోడల్‌ పాఠశాల టీచర్ల ఉద్యోగాలు 1197, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 

 

12:03 - December 5, 2017

గుంటూరు : అమరావతిలోని ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో పాము కలకలం సృష్టించింది. హోంశాఖ సెక్షన్‌లో ఇది కనిపించింది. పారిశుధ్య కార్మికులు చెత్త తొలగిస్తుండగా కనిపించిన పాము కనిపిడచంతో హడలిపోయారు. ఆ తర్వాత దీనిని చంపేశారు. 

07:44 - December 4, 2017

గుంటూరు : కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్‌లో రగడ కొనసాగుతోంది. ఓ వైపు ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నా.. బీసీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, దీనిపట్ల టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. 
చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ 
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించినట్లు సీఎం చంద్రబాబు  చెప్పారు. చాలాకాలంగా ఉన్న కాపుల డిమాండ్‌ను నేరవేర్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడ్డామన్నారు. బీసీలకు రిజర్వేషన్లలో కోత పెట్టకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గతంలో చెప్పామని.. ఇప్పుడు చేసి చూపించామన్నారు. కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన, మంజునాథ కమిషన్‌ అంశాలపై నేతలకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించినప్పుడు మాట్లాడని ఆర్‌.కృష్ణయ్య కాపు రిజర్వేషన్లపై అనవసర విమర్శలు చేస్తున్నారని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
బీసీ సంక్షేమ సంఘం ధర్నా 
మరోవైపు బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను కాపులకు వర్తింపజేయడానికి వీల్లేదన్నారు బీసీ సంఘం నేతలు. ఈమేరకు కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాయి. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసినా.. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చడాన్ని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీసీలకు సమస్యలు ఎదురవుతుంటే కాపులను బీసీల్లో చేర్చి మరిన్ని సమస్యలు సృష్టించడం ప్రభుత్వానికి తగదని బీసీ నేతలు అంటున్నారు. ఈ చర్యను ప్రభుత్వం ఆపకపోతే రాబోయేకాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. 

 

19:46 - December 2, 2017

విజయవాడ : కాపులను బీసీల్లోకి చేరుస్తూ.. ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. వెనుకబడిన కులాల జాబితాలో.. కాపుల కోసం కొత్తగా ఎఫ్‌ అనే గ్రూప్‌ను సృష్టించి.. దానిద్వారా, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ఐదు శాతం మేర రిజర్వేషన్‌లు కల్పించనున్నట్లు తీర్మానంలో ప్రతిపాదించారు. రాజకీయాల్లో తప్ప, విద్య, ఉద్యోగావకాశాల్లో ఈ రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. రాజ్యాంగ సవరణ అవసరమైన దృష్ట్యా.. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. మరోవైపు, వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండు కీలక తీర్మానాలను ఆమోదించింది. కాపులను బీసీల్లోకి చేర్చే తీర్మానం ఒకటైతే.. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న తీర్మానం మరోటి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి మరీ.. ప్రభుత్వం ఈ తీర్మానాలను ప్రతిపాదించింది. కాపులను బీసీల్లో చేర్చే బిల్లును, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాపుల కోసం.. వెనుకబడిన కులాల జాబితాలో కొత్తగా ఎఫ్‌ కేటగిరీని సృష్టించారు. దీనికింద, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానంలో ప్రతిపాదించారు. అన్ని వర్గాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు వెల్లడించారు.

తీర్మానంపై మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నామన్నారు. ఎవరూ కోరకున్నా.. పాదయాత్ర సందర్భంగా.. కాపుల కష్టాలు చూసిన తానే.. రిజర్వేషన్‌ల ప్రస్తావన తెచ్చానన్నారు. బ్రిటిష్‌ హయాంలో బీసీలుగా ఉన్న కాపులు.. కాలక్రమంలో రిజర్వేషన్‌లను ఎలా కోల్పోయారో చంద్రబాబు వివరించారు. 2014లో ఇచ్చిన హామీకి కట్టుబడి.. 2016లో జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ వేశామని తెలిపారు. కమిషన్‌ నివేదిక మేరకే.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నామని, బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగబోదని చంద్రబాబు వివరించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్టాడిన తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ, సుప్రీంకోర్టు తీర్పును గమనంలో ఉంచుకుని.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పించే అంశంపై లోతుగా కసరత్తు చేశామన్నారు.

సుదీర్ఘ చర్చ అనంతరం.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పించే తీర్మానాన్ని.. ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వెంటనే.. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు.. ఈ తీర్మానం తరాలుగా అణగారిన బోయ, వాల్మీకుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తోందని అన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించడంతో, ప్రస్తుతం ఏపీలో రిజర్వేషన్ల శాతం 55కు చేరింది. రిజర్వేషన్‌లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. రాజ్యాంగ సవరణ కోరుతూ.. ఈ తీర్మానాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి పంపాలని శాసనసభ నిర్ణయించింది. 

14:14 - December 2, 2017
19:04 - December 1, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - ఏపీ