ఏపీ టూరిజం

14:10 - June 2, 2018

కర్నూలు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి అఖిల ప్రియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆళ్లగడ్డలో నవ నిర్మాణ దీక్షల కార్యక్రమంలో అఖిల ప్రియ పాల్గొని ప్రసంగించారు. ఏపీలో మహిళల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని..వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు. బాబు ఇలా చేస్తుంటే భారత ప్రధాని మోడీ మాత్రం మహిళలపై ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు చేయాలని..దాడులు చేయాలని రెచ్చగొట్టి ముందుకు పంపించడం జరుగుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

06:45 - April 26, 2018

విజయవాడ : ఏపీ టూరిజం మంత్రి అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. ఆళ్లగడ్డ ఫైట్‌పై మాట్లాడేందుకు రావాలని అధిష్టానం ఆదేశించినా మంత్రి సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనూ సమావేశానికి హాజరుకావాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు.. ఇద్దరు నేతలతో ఏం చర్చిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఆళ్లగడ్డలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య తలెత్తిన వివాదం ముదురుపాకాన పడింది. మంత్రి అఖిలప్రియ - ఏవీ సుబ్బారెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసలే ఉప్పు - నిప్పులా ఉన్న వర్గపోరు... ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడితో మరింత సీరియస్‌ అయ్యింది. పార్టీ పిలుపులో భాగంగా ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌ ర్యాలీ చేపడుతుండగా ఆయనపై రాళ్లదాడి జరిగింది. మంత్రి అఖిలప్రియ అనుచరులే చేశారన్నది ఏవీ సుబ్బారెడ్డి వాదన. ఇందుకు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆళ్లగడ్డ ఫైట్‌పై సీరియస్‌ అయ్యింది. నేతల మధ్య తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దేందుకు పార్టీ అధినాయకత్వం ఇద్దరినీ బుధవారం అమరావతికి రావాల్సిందిగా ఆదేశించింది.

అధిష్టానం పిలుపుతో ఏవీ సుబ్బారెడ్డి మాత్రం అమరావతికి వచ్చారు. అయితే మంత్రి అఖిలప్రియ మాత్రం హాజరుకాలేదు. శోభానాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమ ఉండడంతో రాలేకపోతున్నట్టు అధిష్టానానికి ఆమె సమాచారం ఇచ్చారు. దీంతో సమావేశం గురువారానికి వాయిదా పడింది. మంత్రి అఖిలప్రియ వ్యవహారంపై అధినాయకత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశానికి రావాల్సిందిగా ముందుగానే సమాచారం అందించినా... హాజరుకాకపోవడంపై గుర్రుగా ఉంది. చివరి నిముషంలో హాజరుకాలేకపోతున్నానని చెప్పడంపై అధిష్టానం సీరియస్‌గానే మందలించినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ తాను హాజరవుతానని చెప్పడంతో సమావేశం నేటికి వాయిదా పడింది.

ఇద్దరు నేతలతో ఇవాళ చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి తనపై జరిగిన రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలు అధిష్టానానికి అందజేశారు. అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ ఫైట్‌ విషయంలో ఇద్దరు నేతల మధ్య అధిష్టానం రాజీకుదిర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హైకమాండ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా చంద్రబాబు సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:20 - September 26, 2017

తూర్పుగోదావరి : దసరా వేడుకలకు ఏపీ పర్యాటక శాఖ ముస్తాబవుతోంది. గోదావరి తీరాన.. వీక్షకులను ఆకట్టుకునేలా... భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజమహేంద్రవరంలో గోదావరి డాన్స్‌ అండ్‌ లాంటర్న్‌ ఫెస్టివల్‌  పేరిట ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తొంది. 

దసరా శరన్నవరాత్రుల్లో గోదావరి తీరాన వేడుకలు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ టూరిజం విభాగం. ఈ నెల 27, 28వ తేదీల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఓ వైపు ఆధ్యాత్మికత, సంప్రదాయ నృత్యాల ప్రదర్శనతో పాటుగా.. మరోవైపు యువతను ఆకర్శించేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. 

దసరా పండుగను పురస్కరించుకొని 51మంది వేదపండితులచే గోదావరి తల్లికి మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే కథక్‌, మణిపురి నృత్య ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క యువతను ఉర్రూతలూగించే విధంగా మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ వాయిద్యకారుడు శివమణి డ్రమ్స్‌తో  అలరించనున్నారు. ఇవి కాకుండా ఫైర్‌ వర్క్స్‌ ప్రదర్శన స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండనుంది.
ఈ కార్యక్రమాల కోసం మూడు ప్రత్యేక స్టేజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు... తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని రకాల వంటకాలతో ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇవే కాకుండా జిల్లాకు చెందిన వివిధ రకాల వస్తువులు, చేతివృత్తుల ప్రదర్శనలు ఉత్సవాల్లో దర్శనమివ్వనున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఉత్సవాల రూపంలో జిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తొంది. దసరా సందర్భంగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పర్యాటకుల దృష్టి రాజమహేంద్రవరంపై పడేలా ప్రయత్నిస్తొంది. 

Don't Miss

Subscribe to RSS - ఏపీ టూరిజం