ఏపీ సచివాలయం

20:17 - April 16, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని హామీల అమలు డిమాండ్‌తో.. విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రభావం.. ఏపీ సచివాలయంపైనా కనిపించింది. ఉద్యోగులు, సందర్శకులు బంద్‌ కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఏపీ బంద్‌ ప్రభావం.. రాష్ట్ర సచివాలయంపైనా పడింది. బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీంతో సచివాలయం సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు బాగా ఇబ్బందులు పడ్డారు. ఆటోలపై కార్యాలయాలకు తరలివచ్చారు. ఇదే అదనుగా ఆటోల డ్రైవర్లు.. 50 రూపాయలున్న చార్జీలను.. ఏకంగా 150 రూపాయలకు పెంచేశారు. పైగా ఆటోల్లో ఎక్కువమందిని కూరి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. హోదా కోసం తాము ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఎన్నైనా ఎదుర్కొంటామని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 
సచివాలయానికి తగ్గిన సందర్శకుల తాకిడి 
మరోవైపు బంద్‌ ప్రభావంతో.. సచివాలయానికి సందర్శకుల తాకిడి రోజుకన్నా కూడా కొంత తగ్గింది. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా.. మంత్రులు అధికారులు తరలిరావడంతో.. వారిని కలిసేందుకు వచ్చిన వారు.. కొంతమేర ఇబ్బందులు పడ్డారు. 

 

20:01 - November 28, 2017

గుంటూరు : ఏపీ సచివాలయం వద్ద అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షకీరా, ఫాతిమా అరే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తన తండ్రి చనిపోవడంతో కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కేటాయించాలని విజ్ఞప్తి చేసేందుకు సచివాలయానికి వచ్చారు. లోనికి అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు పురుగుల మందు తాగారు. అనేకసార్లు అధికారులను కలిసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వీరు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

 

13:19 - November 14, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశమయ్యారు. ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులు రద్దు చేస్తూ పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచన మేరకు కొత్తగా లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు అమలు చేస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. 

 

20:30 - November 10, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టేక్ హోల్డర్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్, పలు ఎలక్ట్రిక్ వాహన తయారీల కంపెనీలు, బ్యాటరీ తయారీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, నూతన పరిశోధనలపై సమావేశంలో చర్చ జరిగింది. తక్కువ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసే  స్టేషన్స్ ఏర్పాటుకు  కంపెనీలు ముందుకు వస్తే  ప్రభుత్వం పూర్తి సహకారాలు అందిస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. 

 

09:38 - November 3, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఉద్యోగుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. సచివాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్‌ చేశారనే కారణంతో ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దీంతో ఉద్యోగుల మధ్య విభేదాలు బయట పడ్డాయి.
ఆందోళనకు గురి చేస్తున్న సచివాలయ పరిణామాలు
అమరావతి సచివాలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు నెలల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి కుదిస్తున్నారని వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై స్పందించిన సీఎం అలాంటిదేమీ లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పైన ఉద్యోగుల నుండి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. దీంతో ఉద్యోగుల వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. 
సర్కార్‌పై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు
మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాది ఉద్యోగుల పక్షమని, గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌కు నష్టం కలిగించే చర్యలు ప్రభుత్వం తీసుకోదన్నారు. కావాలనే సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే కొందరు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేశారని ముఖ్యమంత్రి అనుమానించారు. దీంతో విజిలెన్స్‌ ఎంక్వైరీని ఏర్పాటు చేసి విచారణ జరిపించారు సీఎం. విజిలెన్స్‌ రిపోర్ట్‌లో ఇద్దరు ఉద్యోగులు, ఉద్యోగుల వయోపరిమితి డ్రాఫ్ట్‌ కాపీని బయటకు విడుదల చేశారని తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారమే వివాదాస్పదంగా మారింది. 
వయోపరిమితి డ్రాఫ్ట్‌ కాపీ లీక్‌ చేశారని ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్‌
వయోపరిమితి డ్రాఫ్ట్‌ కాపీ లీక్‌ చేశారంటూ ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్‌లను సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. న్యాయ శాఖలో పని చేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పతో పాటు, జలవనరుల శాఖ ఎస్వో వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేశారు. అయితే  ఉద్యోగ సంఘం నేత మురళీ కృష్ణ తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆందోళనకు దిగారు ఉద్యోగులు. ఎట్టకేలకు మురళీ కృష్ణ రావడంతో ఆయనతో చర్చించారు. తనపై ప్రభుత్వం కుట్ర చేసిందని సస్పెండ్‌ అయిన వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ శాఖలో పనిచేసే తిమ్మప్పకు ఇరిగేషన్‌ శాఖలో పనిచేసే నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్యోగులు తప్పుచేసి ఉంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామంటున్నారు అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీకృష్ణ. ఈ విషయమై ప్రభుత్వాన్ని విన్నవిస్తామన్నారు. 
సస్పెండ్‌ చేయడంపై ఆగ్రహం
అయితే సచివాలయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఉద్యోగుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇద్దరు ఎస్‌.ఓలను సస్పెండ్‌ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఉద్యోగులు ప్రభుత్వానికి కీలకమైన సమాచారాన్ని బయటకు పంపితే ఆ కారణాలు ముందే చెప్పాల్సిందంటున్నారు. 
డాక్యుమెంట్‌ లీకేజీతో భయాందోళనలో ఉద్యోగులు
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల వయోపరిమితి డాక్యుమెంట్ లీకేజీతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మొత్తం వ్యవహారంలో ఉద్యోగుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు బయటపడింది. ఒక వర్గం ప్రభుత్వం చర్యలను తప్పుపడుతుంటే, మరో వర్గం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని అంటున్నారు. మరి ఈ వివాదానికి ఫులిస్టాప్‌ ఎప్పుడు పడుతుందో చూడాలి. 

13:56 - November 1, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.. జలవనరుల శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది. ఉద్యోగుల వయోపరిమితి కుదింపు డ్రాఫ్ట్‌ కాపీ లీకేజీతో సంబంధం ఉందంటూ వెంకట్రామిరెడ్డి  సస్పెండ్‌ చేశారని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే ఇదే విషయంలో న్యాయశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పను కూడా అధికారులు సస్పెండ్‌ చేశారు. సచివాలయంలో జరుగుతున్న పరిణామాలపై ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. 

13:49 - October 6, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి..  తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త చాంబర్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత అని సోమిరెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక విధానాలను తాము అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతున్నామని.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. 

 

11:28 - October 5, 2017

గుంటూరు : తాత్కాలిక సచివాలయం పనులకు ఎక్కువ సమయం పడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేసి.. పాలన ప్రారంభించింది. అత్యాధునిక టెక్నాలజీతో.. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా సచివాలయాన్ని నిర్మించింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన 120 రోజుల్లోనే.. భవనాలను పూర్తి చేసి పాలన ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు రావడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక సచివాలయం అంటే కనీసం సంవత్సరం పైనే పడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన సమయానికి.. 4 నెలలు ఆలస్యంగా పూర్తి స్థాయిలో భవనాలు నిర్మించారు.  

మొత్తం సచివాలయాన్ని 5 బ్లాక్‌లుగా.. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మొదట 5వ బ్లాక్‌ను జూన్‌ 29న తాత్కాలికంగా ప్రారంభించారు. కానీ మొత్తం 5 బ్లాక్‌ల పనులు పూర్తి చేసి అందులోఅధికారికంగా ఉద్యోగుల పాలన ప్రారంభించింది మాత్రం అక్టోబర్‌ 3, 2016న. సచివాలయ ఉద్యోగులతో పాటు విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేసిన కమీషనరేట్స్‌, హెచ్‌వోడి కార్యాలయాలకు కూడా అదే రోజు ఉద్యోగులు తరలివచ్చారు. 

హైదరాబాద్‌లో ఉండే సచివాలయానికి.. అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి చాలా తేడా ఉంది. తాత్కాలిక భవనాలు అంటే సాదా సీదాగా  నిర్మిస్తారని అందరూ భావించారు. హైదరాబాద్‌లోని సచివాలయంతో ఏమాత్రం పోల్చలేని విధంగా.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని.. అమరావతి తాత్కాలిక సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మించింది. సచివాలయం భవనాల్లో సర్వత్రా సెంట్రల్ ఏసీని ఏర్పాటు చేసింది. సచివాలయం మొత్తం వైఫై ఏర్పాటు చేసింది. మహిళా ఉద్యోగులకు వసతి సౌకర్యం, ఉచిత బస్‌పాస్‌ సౌకర్యాలను కల్పించింది ఏపీ ప్రభుత్వం. 

సచివాలయంలో పని చేసే ఉద్యోగుల కోసం అత్యాధునిక భద్రతా ప్రమాణాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైనా బ్లాక్‌లో అగ్నిప్రమాదం జరిగితే ఉద్యోగులను అలర్ట్‌ చేయడానికి.. సెంట్రల్‌ ఫైర్‌ అలారం సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సచివాలయం లోపల ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతీ బ్లాక్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

15:46 - September 15, 2017

గుంటూరు : నిధులు వెచ్చిస్తే వృద్ధి జరుగుతుందనుకోవడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖాధిపతుల సమావేశంలో అన్నారు. సరైన విధానాలను సమర్ధవంతంగా అమలు చేస్తే ఫలితాలు కనిపిస్తాయన్నారు. ప్రభుత్వశాఖలు అమలు చస్తున్న పద్దతులను విశ్లేషించుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో ఆర్థిక వృద్ధిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడగలుగుతున్నామంటే సంపూర్ణంగా దృష్ఠి పెట్టడం, విధివిధానాలను మెరుగుపరుచుకోవడం వల్లే సాధ్యమయిందన్నారు. ఎక్కడా అలసత్వానికి తావేలేకుండా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యలను చేరుకోగలుగుతామని సీఎం అన్నారు. రెండంకెల వృద్ధి సాధించడంలో భాగమైన అందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 

 

07:36 - August 24, 2017

గుంటూరు : ఏపీ సచివాలయం భవనాల డిజైన్లలో సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించారు. ఫోస్టర్ బృందం నివేదిక, తన సూచనలపై మంత్రులు, కార్యదర్శుల అభిప్రాయాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు. గూగుల్, ఇన్ఫోసిస్ తరహా ఐటీ కార్పొరేట్ కార్యాలయాలకు ధీటుగా ఆఫీసు భవనాలు నిర్మించాలన్నారు. ఈ మార్పులన్నీ పూర్తిచేసి సెప్టెంబర్‌ 13కు ఫైనల్‌ డిజైన్లు అందిస్తామని.. ఫోస్టర్ బృందం చంద్రబాబుకు తెలిపింది.
వేగంగా భవనాల డిజైన్ల రూపకల్పన 
ఏపీ సచివాలయ భవనాల డిజైన్ల రూపకల్పన వేగంగా సాగుతోంది. వివిధ విభాగాల కార్యదర్శులు, హెచ్ ఓడీ ఆఫీసుల నిర్మాణంపై ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో భేటీఅయిన ఫోస్టర్‌ ప్రతినిధులు.. భవనాలు, కార్యాలయాల డిజైన్‌ వివరాల్ని తెలిపారు. గతంలో కార్యదర్శులు, హెచ్‌వోడీల స్థానాలు ఒకే ప్రదేశంలో ఉండాలన్న సీఎం ఆదేశాలప్రకారం భవనాల డిజైన్లలో మార్పులు చేశారు. 
అత్యుత్తమ భవంతులుగా డిజైన్‌ చేయాలని ఆదేశాలు
సచివాలయం, డైరెక్టరేట్లు, కమిషనరేట్ల ఏర్పాటును ఏదో ఒక నిర్మాణ ప్రక్రియగా చూడొద్దని ఫోస్టర్‌ ప్రతినిధులకు సీఎం సూచించారు.. ఉద్యోగులు, అధికారుల్లో సృజనను వెలికితీసేలా... చక్కని పని వాతావరణం కలిగించేలా ఆఫీసులు తీర్చిదిద్దాలన్నారు.. గూగుల్‌, ఇన్ఫోసిస్‌ తరహా ఐటీ కార్పొరేట్‌ కార్యాలయాలకు ధీటుగా భవనాలు నిర్మించాలని చెప్పారు.. వినోద, ఆహ్లాద, క్రీడా వసతులతో ప్రపంచంలోనే అత్యుత్తమ భవంతులుగా డిజైన్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పోస్టర్‌ బృందం నివేదికలు, తన సూచనలపై మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ అధికారుల్ని సీఎం ఆదేశించారు.. ఆ భేటీలో వచ్చిన అభిప్రాయాలును ఫోస్టర్‌ బృందానికి అందించాలన్నారు.. వాటికి అనుగుణంగా తుది ఆకృతులు సిద్ధం చేయాలన్నారు. మంత్రులు, అధికారుల సూచనలన్నీ తీసుకొని సెప్టెంబర్‌ 13కు ఫైనల్‌ డిజైన్లు అందజేస్తామని ఫోస్టర్‌ ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు..

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఏపీ సచివాలయం