ఏసీబీ

18:05 - April 20, 2017

హైదరాబాద్‌ : ఏసీబీ అధికారులకు పట్టబడ్డ ఏపీఈడబ్ల్యూఐడీసీ సీఈ జగదీశ్వర్‌రెడ్డి ఆస్తులు రోజు రోజుకూ బయటపడుతూనే ఉన్నాయి. జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించిన బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించారు. బాగ్‌ అంబర్‌పేట్‌ ఆంధ్రా బ్యాంక్‌, ఉప్పల్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లలో ఐదు లాకర్లను తెరిచిన అధికారులు రెండు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను గుర్తించారు. 

13:32 - April 17, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అవినీతి అధికారి బయటపడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జగదీశ్వర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు చెన్నై, విజయవాడ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌సహా ఎనిమింది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. జగదీశ్వర్‌రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16 కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో మొత్తంగా 12 బృందాలు పాల్గొన్నాయి.

 

 

13:38 - April 12, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడ రిజిస్ట్రార్ బాలప్రకాశ్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. స్థల విషయంలో రిజిస్ట్రేషన్ కోసం రూ.40 వేలు తీసుకుంటూ ఏసీబీకి దోరికిపోయారు. అతన్ని ఏసీబీ అధికారులు  అదుపులోకి తీసుకుని, రాజమండ్రి మెజిస్ట్రేట్ లో హాజరు పరుచనున్నారు.

 

15:45 - April 4, 2017

విజయనగరం :పార్వతీపురంలో ఏసీబీకి అవినీతి చేప చిక్కింది. వాణిజ్యపన్నుల విభాగంలో డిసిటిఓగా పనిచేస్తున్న మన్మధరావు, ఎసిటిఓ నరసింహ్మ మూర్తి 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.

11:05 - April 4, 2017

విశాఖ : ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధర్ అక్రమాస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉందని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. గంగాధర్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి భారీగా ఆస్తుల్ని సంపాదించినట్లు తెలుస్తోంది. గంగాధర్ చిత్తూరు జిల్లాలో 19 ఎకరాల భూమిని, మరో 6 ఎకరాల డీ పట్టా భూమిని ఆక్రమించకున్నట్లు అధికారులు తెలిపారు. నేల్లూరు జిల్లాలో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ సోదాల్లో బయపడింది. అంతే కాకుండా హైదరాబాద్, విశాఖల్లో బ్యాంకు లాకర్లలో రెండు కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

 

 

10:51 - April 3, 2017

విశాఖపట్నం : అవినీతి అనకొండ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధర్ ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కాసేపట్లో గంగాధర్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. లాకర్లలో భారీగా బంగారం, ఆస్తుల పత్రాలు దాచినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంగాధర్ బినామీ అయిన కాంట్రాక్టర్ నాగభూషణంకు చెందిన 2 లాకర్లను తెరిచే అవకాశం ఉంది. గంగాధర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

11:54 - April 1, 2017

అమరావతి: అవినీతి అనకొండ గంగాధర్‌ నివాసాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి... ఏసీబీ తనిఖీల్లో కోట్ల కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయి.. ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్‌గాఉన్న గంగాధర్‌ నివాసాల్లో దాదాపు వందకోట్ల విలువైన ఆస్తుల్ని అధికారులు గుర్తించారు.. రోడ్డు కాంట్రాక్టర్‌ నాగభూషణం ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి.. బీమిలి 4లైన్ల రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గంగాధర్‌, నాగభూషణంపై ఆరోపణలున్నాయి.. ఏకకాలంలో విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..

10:51 - April 1, 2017
13:40 - March 17, 2017

విశాఖ : నగరంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విశాఖ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ముమ్మన రాజేశ్వరరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. 20 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 1990లో 1450 రూపాయల జీతంతో రాజేశ్వరరావు ఉద్యోగంలో చేరారు. 2012 నుంచి 2016 వరకు నాలుగేళ్ల కాలంలో అత్యధికంగా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించామని ఏసీబీ అధకారులు చెబుతున్నారు.  

 

17:53 - February 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజాయితీగా పనిచేసే సిన్సియర్‌ అధికారుల విషయంలో గత ప్రభుత్వాలకు... ప్రస్తుత టీఆర్ ఎస్ సర్కారుకు ఎలాంటి తేడాలేదంటూ విమర్శలొస్తున్నాయి. ఏసీబీ ఇంచార్జ్ చారుసిన్హా బదిలీ ఈ విషయాన్ని రుజువుచేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. 
ఏసీబీ అంటే అవినీతిపరుల గుండెళ్లో రైళ్లు
ఏసీబీ ఈ పేరు చెబితే చాలు.. అవినీతిపరుల గుండెళ్లో రైళ్లు పరుగెడతాయి.. అంతటి పవర్‌ఉన్న సంస్థ.. అధికారుల అవినీతిని కంట్రోల్ చేయలేని శాఖగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమూ మిగతా సర్కారుల్లాగే ఏసీబీనీ వాడుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. సిన్సియర్‌గా పనిచేస్తున్న అధికారుల ట్రాన్స్‌ఫర్లు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఏసీబీని స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్న ప్రభుత్వాలు
ఏసీబీ స్వయం ప్రతిపత్తిగల సంస్థ... సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది..... అలాంటి ఏసీబీని ప్రభుత్వాలు, తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవడం సర్వసాధారణమైపోయిందన్న వాదన వినిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా పనిచేసేవారిని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చాలా ప్రభుత్వాలు ఏసీబీని వాడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.. గతంలో సంచలనం సృష్టించిన లిక్కర్‌ సిండికేట్‌ వ్యవహారం ఇందుకు ఒక ఉదాహరణఅన్న అభిప్రాయాలూ ఉన్నాయి.. అప్పట్లో లిక్కర్‌ దందాపై ఏసీబీ జరిపిన దాడులవల్లే...  బొత్స సత్యనారాయణ... సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డితో రాజీకి వచ్చారన్న ప్రచారం జరిగింది.... ఈ కేసులో హడావుడిచేసిన అధికారులు.. ఇందులో పదిమంది ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు, విలేఖరులు, పోలీసుల పాత్ర ఉందని తేల్చారు.. కేసు నమోదుచేసి అరెస్టులూ చేశారు. ఈ చర్యతో, కొరకరాని కొయ్యలు తమ దారికి రావాలన్న అభీష్టం నెరవేరాక, ప్రభుత్వాధినేతలు, అధికారులను బదిలీచేసి కేసును నీరుగార్చారు..   
ఏసీబీ ద్వారా టీడీపీపై టీఆర్‌ఎస్‌ మొదటిదెబ్బ 
కాంగ్రెస్‌ హయాంలోనే కాదు.. కేసీఆర్‌ జమానాలోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదంటున్నారు. కేసీఆర్‌ వచ్చాక ఏపీ సీఎం చంద్రబాబు, రేవంతరెడ్డిలపై ఓటుకు నోటు తెరపైకివచ్చింది.. కేసును వేగంగా దర్యాప్తుచేసిన ఏసీబీ.. ఆడియో రికార్డులు, వీడియో ఫుటేజీ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసింది.. ఈ కేసువల్లే చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి ఏపీ వెళ్లిపోయారని ఇప్పటికీ కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యమున్న కేసు ఆ తర్వాత పెద్దగా ముందుకుసాగలేదు.. అసలు నిందితులను పట్టించే సాక్ష్యాల్ని ఏసీబీ సేకరించలేదు.. ఇలా ఏసీబీ ద్వారా టీఆర్‌ఎస్‌ టీడీపీపై తన మొదటిదెబ్బ వేసిందన్నది పరిశీలకుల వాదన. 
ఏకే ఖాన్‌ హయాంలో అధికారుల్ల ఉత్సాహం 
ఏసీబీ డీజీగా పనిచేసిన ఏకే ఖాన్‌ హయాంలో కొంతవరకూ అధికారులు ఉత్సాహంగా పనిచేశారు.. గత ఏడాది డిసెంబర్‌లో ఏకే ఖాన్‌ పదవీవిరమణ పొందారు.. ఆ స్థానంలో ఇంచార్జిగా ఐజీ చారుసిన్హ నియమితులయ్యారు.. సాధారణంగా ఏసీబీ డైరెక్టర్‌గా డీజీ స్థాయి అధికారి ఉండాలి.. అధికారులు అందుబాటులోలేక ఆ స్థానంలో ఇంచార్జ్‌గా చారుసిన్హకు అవకాశం ఇచ్చారు.. ఐజీ చారుసిన్హా ఎవరి మాట వినరు.. అన్యాయం అక్రమం జరుగుతుందని తెలిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించే తత్వం కాదని డిపార్ట్‌మెంట్‌లో చెప్పుకుంటారు.. ఏసీబీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక చారుసిన్హ... అవినీతి ప్రక్షాళనపై సీరియస్‌గా దృష్టిపెట్టారు.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కమర్షియల్‌ టాక్స్‌, రెవెన్యూ శాఖల్లో దాడులు పెంచారు.. ఈ దాడుల్లో నల్లగొండ జిల్లాలో కమర్షియల్‌ టాక్స్‌ అధికారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. 
రాజకీయ నేతల దగ్గరకు అధికారులు...?
కమర్షియల్‌ టాక్స్‌ అధికారి ఏసీబీ దొరికిపోవడంతో జిల్లాలోని పలువురు అధికారులు రాజకీయ నేతల దగ్గరకు వెళ్లారని సమాచారం.. ఉద్యమంలో పనిచేసిన తమను ఏసీబీ వేధిస్తోందంటూ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.. ఇదే సమయంలో కొందరు అధికారుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక పంపింది.. ఏసీబీ దాడులు ఇలాగే కొనసాగితే అధికారులకు ఇబ్బందితప్పదంటూ.. చారుసిన్హను ప్రభుత్వం అకస్మికంగా బదిలీ చేసిందని తెలుస్తోంది.. 
ఏసిబిలో పనిచేయాలంటే ప్రభుత్వం చెప్పిందే చేయాలి..
మొత్తానికి ఏసిబిలో పనిచేయాలంటే ప్రభుత్వం చెప్పిందే చేయాలి.. సమాజంలో మార్పు... అవినీతి అంతంకోసం పనిచేస్తే బదిలీలు తప్పవని ప్రభుత్వాల చర్యలు స్పష్టం చేస్తున్నాయి.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే కొనసాగుతోందని ఈ ట్రాన్స్‌ఫర్లు రుజువుచేస్తున్నాయన్నది పరిశీలకుల మాట. అవినీతి అంతంఅంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఊదరగొట్టే ఉపన్యాసాలు మాటలకే పరిమితమన్నది స్పష్టమవుతోందన్నది జనం మాట. మొత్తానికి అవినీతి నిరోధక శాఖ కాస్త.. అధికార పక్షం నియంత్రణ శాఖగా మారిందన్న వాదనలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఈ శాఖ చిత్తశుద్ధిని శంకించేలా చేస్తున్నాయి. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఏసీబీ