ఐక్యతారాగం

21:47 - September 13, 2017

హైదరాబాద్ : టీడీపీ.. కాంగ్రెస్‌..! ఈ రెండు పార్టీలూ మొన్నటి వరకూ వైరిపక్షాలు. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలూ తెలంగాణలో ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నాయి. సమస్య ఏదైనా.. విడివిడిగానో... ఐక్యంగానో ప్రభుత్వ తీరును ఎండగుడుతోన్న టీడీపీ, కాంగ్రెస్‌లు, ఇప్పుడు ఎన్నికల్లోనూ ఐక్యంగా బరిలోకి దిగాలని నిర్ణయించాయి. రానున్న సింగరేణి ఎన్నికల్లో దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. 

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలు ఐక్యతారాగం అందుకున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు, అదే కాంగ్రెస్‌తో జతకలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు.. ఈ రెండు పక్షాలూ తమ సిద్ధాంతాలను సైతం పక్కనబెట్టి ఏకమవుతున్న పరిస్థితి తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. 

తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అవ‌క‌త‌వ‌కల్ని ఎండగట్టేందుకు.. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. కొంతకాలంగా వివిధ సమస్యలపై ఈ రెండు పక్షాలూ ఉమ్మడి ఆందోళనల్లో పాల్గొన్నాయి. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ, మియాపూర్ భూస్కాం ఆరోప‌ణ‌లు, నేరెళ్ళలో ద‌ళితుల‌పై దాడి పైనా ఒకే వాణిని వినిపించిన విపక్షాలు.. కొన్ని సందర్భాల్లో ఒకే ఉద్యమ వేదికనూ పంచుకున్నాయి. తాజాగా, రైతు సమన్వయ సమితులపైనా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఐక్యగళాన్ని వినిపిస్తున్నాయి.  

సమగ్ర భూ సర్వే కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 39కి వ్యతిరేకంగా.. ఈ రెండు పక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. సీపీఐ, టీజేఏసీ నేతలను కూడా కలుపుకుని.. బుధవారం, జీవో 39 రద్దు కోసం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశాయి. జీవో నెంబర్‌ 39ను రద్దు చేసేలా చొరవ తీసుకోవాలంటూ ఈ పార్టీల నేతలు గవర్నర్‌కు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.  

సమస్యలపై ఐక్య పోరాటమే కాదు.. కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొనే దిశగానూ టీడీపీ, కాంగ్రెస్‌లు సాగుతున్నాయి. సింగరేణి ఎన్నికల్లో.. టిఆర్ఎస్ అనుబంధ యూనియ‌న్‌ను ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి అభ్యర్థులను నిలపాలని నిర్ణయించాయి. సింగ‌రేణిలో వార‌స‌త్వ ఉద్యోగాలు ఇస్తామన్న సర్కారు.... మాట తప్పిందన్న ఆరోపణలతో.. సింగరేణి కార్మికుల మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాల క్రమబద్దీకరణకు జీవో ఇచ్చిన ప్రభుత్వం... మళ్లీ జాగృతి నాయకుడితో దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేయించిందని ఆరోపిస్తున్నాయి. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. గులాబీ బాస్‌ను ఢీకొట్టాలన్న  వీరి ఐక్యతారాగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.. 

14:42 - January 12, 2017

హైదరాబాద్ : అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే కాంగ్రెస్‌నేతల్లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఆధిపత్యపోరుతో కస్సుబుస్సులాడే వారు దోస్త్‌మేరా దోస్త్ అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు చూసి సొంతపార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తమ్ కు దూరంగా సీనియర్లు...

పీసీసీ ఛీఫ్ గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి భాధ్యతలు తీసుకున్నప్పటి నుండి.. చాలా మంది సీనియ‌ర్లు పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ వ‌స్తున్నారు. ముఖ్యంగా న‌ల్గొండ జిల్లా నేత‌ల మ‌ధ్య ఉన్న గ్రూపిజం అంతా ఇంతా కాదు. ఈవిషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగు ముందే ఉంటారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ ఉన్నంతవరకు తాను గాంధీభన్‌లోకే అడుగుపెట్టనని అప్పట్లో శపథంకూడా చేశారు. కాని.. తాజాగా పీసీసీచీఫ్‌తో కోమటిరెడ్డి భుజం భుజం కలిపి తిరుగుతున్నారు.

రాజ‌న‌ర్సింహ్మ లో కూడా స్పష్టమైన మార్పు

అటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామొద‌ర రాజ‌న‌ర్సింహ్మ లో కూడా స్పష్టమైన మార్పు క‌నిపిస్తోంది. ఉత్తమ్‌కంటే ముందు పీసీపీ పీఠం తనకే దక్కుతుందని ఆశించి భంగపడిన రాజనర్సింహ కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కాని.. మల్లన్నసాగర్‌తోపాటు సాగునీటిప్రాజెక్ట్‌లపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లోనూ ఉత్తమ్‌కు చేదోడుగా మారిపోయారు. ఇక గద్వాల జిల్లాకోసం రాజీలేని పోరాటం చేసిన డీకే అరుణకూడా పీసీసీ చీఫ్‌తో చిటపటలుగానే ఉన్నా.. ప్రస్తుతం పార్టీలో ఉత్తమ్‌ సారథ్యంలో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వీరితోపాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల కూడా మొదట్లో ఉత్తమ్‌కు దూరంగానే ఉన్నా ప్రస్తుతం తిరిగి యాక్టీవ్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇక నిన్నటిదాకా జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో డిస్టెన్స్‌ మెయింట్‌నెన్స్‌ చేసిన మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం పార్టీకార్యక్రమాల్లో చురుగ్గా మారిపోయారు.

జానారెడ్డి ., ష‌బ్బీర్ అలీ .. భ‌ట్టి విక్రమార్కలు కూడా

ఇక ఉత్తమ్‌తో చిన్న చిన్న విభేదాలు ఉన్నా.. జానారెడ్డి ., ష‌బ్బీర్ అలీ .. భ‌ట్టి విక్రమార్కలు కూడా వాట‌న్నింటినీ పక్కన పెట్టి ప్రతి ఇష్యూలో పీసీసీ ఛీఫ్‌తో ముందుకు క‌దులుతున్నారు. అసెంబ్లీ సెష‌న్స్ లో ప్రతి చిన్న ఇష్యూలో కూడా వీరు స‌మ‌న్వయం ప్రదర్శించారు. ఇక పొన్నాల ఉండ‌గా గాంధిభ‌వ‌న్ కు దూరంగా ఉన్న మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కూడా .. ప్రస్తుతం ఉత్తం కుమార్ రెడ్డితో క‌లివిడిగా ఉంటున్నారు. ఇక పార్టీ ఓడిన త‌ర్వాత గాంధిభ‌వ‌న్ కు దూరంగా .. పార్టీ కార్యక్రమాలను ప‌ట్టించుకోని మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ ఈమ‌ధ్య తెగ హ‌డావిడి చేస్తున్నారు. మ‌రి ముఖ్యంగా ఉత్తమ్‌ను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారు. ఇక ఎపుడూ ఎవరో ఒకరిమీద చిటపటలాడే పాల్వాయి గోవ‌ర్ధన్‌ రెడ్డి సైతం ఉత్తమ్‌పై పల్లెత్తు మాటకూడా పడనీయడంలేదు.

ఢిల్లీనుంచి ఫోన్‌లో స్పెషల్‌ క్లాస్‌....

యితే ఢిల్లీనుంచి ఫోన్‌లో స్పెషల్‌ క్లాస్‌ లభించడంతోనే నేతలందరూ సెట్‌అయ్యారని పార్టీలో చెప్పుకుంటున్నారు. నిన్నటి దాకా ఉత్తమ్‌ను మార్చుతున్నార‌న్న ప్రచారంతో.. పీసీసీ ఛీఫ్ ను ఆశించిన నేత‌లు.. ఎవ‌రికి వారుగా త‌మ గ్రూప్ వార్ తో కాగిపోయారు. అయితే పీసీసీని మార్చేది లేద‌ని.. ఎన్నిక‌ల వర‌కు ఉత్తమ్‌ను కొన‌సాగించాల‌ని డిల్లీ పెద్దలు నిర్ణయించినట్టు స్పష్టంకావడంతో కాంగ్రెస్‌లో కస్సుబుస్సులకు కళ్లెం పడినట్టు తెలుస్తోంది. అందుకే తిట్టుకున్న నోటితోనే నేతలు తెగపొగుడుకుంటున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Don't Miss

Subscribe to RSS - ఐక్యతారాగం