కడప

12:29 - February 27, 2017

కడప : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయంగా వేడెక్కింది. టిడిపి అభ్యర్థి బిటెక్ రవి నామినేషన్ వేశారు. వైసిపిలో గెలిచి టిడిపిలో చేరిన కౌన్సిలర్లు ఎలా తీసుకెళుతారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. వాగ్వాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. టిడిపి..వైసిపి నేతలు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలు విషయం తెలుసుకుని ఘటనా ప్రదేశానికి చేరుకోవడంతో పరిస్థితి ఇంకా ముదిరింది. ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఇరువురు పార్టీల నేతలతో ముచ్చటిస్తున్నారు.

16:43 - February 26, 2017

కడప: అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ , ప్రజావైద్యుడు డాక్టర్‌ గేయానంద్‌ను గెలిపించాలని ఎమ్మెల్సీ సూర్యారావు మాస్టారు కోరారు. శాసనమండలిలో రాయలసీమ ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న గేయానంద్‌ను మరోసారి గెలిపించాలని గ్రాడ్యుయేట్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన... గేయానంద్‌ గెలిస్తే రాయలసీమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. గేయానంద్‌తోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తోన్న కత్తి నరసింహారెడ్డిని కూడా గెలిపించాలని కోరారు.

13:46 - February 24, 2017

కడప : ప్రిన్స్ మహేశ్‌ బాబు కొత్త చిత్రాన్ని జూన్‌ 23న రిలీజ్‌ చేస్తామని... మూవీ డైరెక్టర్‌ మురుగదాస్‌ తెలిపారు. సినిమాకు ఇంకా పేరుపెట్టలేదని తెలిపారు. కడపలోని అమీన్‌పీర్‌ దర్గాను ఆయన దర్శించుకున్నారు. దర్గాలో పూల చదార్లనుఉంచి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మురుగదాస్‌కు స్వాగతంపలికిన దర్గా ప్రతినిధులు... ఆ ప్రాంతం విశిష్టతకు దర్శకునికి వివరించారు. దర్గాకువచ్చినప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని మురుగదాస్‌ తెలిపారు. అంతకుముందు గండికోటలో సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు.

 

12:53 - February 21, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాలైన విజయవాడ, గుంటూరు ప్రాంతాల రహదారులకు మహర్దశ పట్టనుంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు 11 జిల్లాల నుంచి తక్కువ వ్యవధిలో రోడ్డుమార్గం ద్వారా త్వరితగతిన గమ్యస్థానాలు చేరేలా ఏపీ ప్రభుత్వం రహదారులను విస్తరించనుంది. అందులో భాగంగానే అత్యంత ఆధునిక రీతిలో రాయలసీమ నుంచి అమరావతికి హైవేను నిర్మించాలని నిర్ణయించింది. దీంతో రాయలసీమ ప్రజలు తక్కువ సమయంలో అమరావతి చేరుకునే వీలుకలుగుతుంది.

కడప..అనంతపురం..కర్నూలు..
ఏపీలో అత్యంత వేగంగా ప్రయాణించడానికి రోడ్డు మార్గాలను విస్తరించే పనిలో పడింది ప్రభుత్వం. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల వాసులు అమరావతికి చేరుకోవడానికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రభుత్వం నిర్మించనుంది. ఆరు, నాలుగు లేన్ల ఈ రహదారిని 598 కిలోమీటర్లు నిర్మిస్తారు. ప్రస్తుతం అనంతపురం నుంచి అమరావతి వెళ్లాలంటే 472 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కర్నూలు నుంచి 311, కడప నుంచి 371 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. నూతన రహదారి ఏర్పాటుతో ఈ దూరం తగ్గనుంది. అనంతపురం నుంచి 101 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 28, కడప నుంచి 74 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ మార్గం ఏర్పాటుకు అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 26890 ఎకరాల భూమి, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 1,518.75 హెక్టార్ల అటవీ భూమిని ప్రభుత్వం సేకరించనుంది.

భూసేకరణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం..
గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో చేపట్టే రహదారితో రాజధాని నుంచి నాలుగైదు గంటల్లో సీమ జిల్లాలకు చేరే అవకాశముంది. కడప, కర్నూలు నుంచి వచ్చే రహదారుల అనుసంధానం అయ్యాక.. ప్రకాశం జిల్లా నుంచి ఆరు వరుసలుగా రహదారిని నిర్మిస్తారు. 29,557 కోట్లతో అత్యాధునిక రీతిలో ఆరు. నాలుగు లేన్లుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. రెండు మూడేళ్లలో ఈ మార్గాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే భూ సేకరణకు చర్యలు చేపట్టారు. ఈ మార్గం గనుక పూర్తయితే రాజధాని అమరావతి నుంచి తక్కువ సమయంలో రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చేరుకోనే వీలుకలుగుతుంది.

రూ. 5434.40 కోట్లు ఖర్చు..
అనంతపురం జిల్లాలో 72.850 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 1268 ఎకరాల భూమి, 86 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతుంది. ఇందుకు 5434.40 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక కిలోమీటర్‌కు 42.06 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్టుగా లెక్కగట్టారు. ఈ రహదారిలో ఏడు ఆర్వోబీలను నిర్మించనున్నారు.

కడప జిల్లాలో 104 కిలోమీటర్ల రహదారి నిర్మాణం..
కర్నూలు జిల్లాలో 78.60 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి 920.25 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఆరు వంతెనలు, ఒక ఆర్వోబీ, టన్నెళ్లను నిర్మించనున్నారు. ఈ జిల్లాలో రహదారి నిర్మాణానికి 7139.13 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ జిల్లాలో కిటోమీటర్‌ రహదారి నిర్మాణానికి 53.95 కోట్లు ఖర్చుగా అధికారులు అంచనా వేశారు. కడప జిల్లాలో 104 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 2,968 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. 824.25 హెక్టార్ల భూమితోపాటు.. 108 హెక్టార్ల అటవీ భూములు సేకరించాల్సి ఉంది. దీంతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని కడప, కర్నూలు, అనంతపురం జిల్లా వాసులు అతృతతో ఎదురుచూస్తున్నారు.

20:27 - February 19, 2017

కడప : ఈసారి బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా ఆధారంగా కేటాయింపులుండాలని... ఎమ్మెల్సీ గేయానంద్‌ ప్రభుత్వానికి సూచించారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాలు ఏర్పాటుచేసిన సదస్సుకు గేయానంద్‌ హాజరయ్యారు. ఎస్టీ, ఎస్టీ సబ్‌స్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీప్రకారం సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని గేయానంద్‌ కోరారు. 

 

12:32 - February 19, 2017

కడప : జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. వేంపల్లె మండలం పిరమిడ్ నగర్ లోని చోడేశ్వరి ఆలయంలో దోపిడికి పాల్పడ్డారు. వెండి కిరీటంతో పాటు హుండీలోని కానుకలను దోచుకెళ్లారు. ఖాళీ హుండీని ఓ ప్రాంతంలో వదిలి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయాన్ని సందర్శించారు. దొంగల కోసం గాలింపులు చేపడుతున్నారు.

16:39 - February 13, 2017

కడప : జలదీక్ష పేరిట పొద్దుటూరులో తాగునీటి కోసం మహిళలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఈ ఆందోళన జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

10:02 - February 12, 2017

కడప : అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. వధూవరులను ఉరేగింపుగా తీసుకెళ్తున్నారు. అంతలోనే విషాదం నెలకొంది. ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందాన్ని ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెండ్లిమర్రి మండలం ఎల్లటూరులో వివాహం వేడుక తర్వాత వధూవరులను ఉరేగింపుగా తీసుకెళ్తూ పెళ్లి బృందం  వెళ్తోంది. ఇంతలోనే ఓ టిప్పర్ పెళ్లి బృందాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమ్తితం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:17 - February 4, 2017
19:51 - February 4, 2017

కడప : ఎర్రచందన స్మగ్లర్లపై కడప జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో మూడు వేరు వేరు ప్రాంతాల్లో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు నిర్వహించిన దాడులలో 31 మంది తమిళ స్మగ్లర్లతో పాటు ముగ్గురు కావలి ఆర్టీసీ డీపోకు చెందిన డ్రైవర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.1 టన్నుల ఎర్రచందనం దుంగలతో పాటు 18 సెల్‌ ఫోన్లు, స్కార్పియో, టాటా సుమోను స్వాధీనం చేసుకున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - కడప