కన్ను

07:43 - September 12, 2017

హైదరాబాద్ : పదిన్నర దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన విక్టోరియా మెమోరియల్‌ ట్రస్ట్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.. నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచి... ఆశ్రయం కల్పించిన ఆ విద్యానిలయం మనుగడ ప్రమాదంలో పడింది. పాలకులే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆ చరిత్రను సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని 1903లో దిల్‌సుఖ్ నగర్‌లో విక్టోరియా మహల్‌ను స్థాపించారు. ఆరో నిజాం నవాబు ఎతీమ్ ఖాన్ పేరుతో విక్టోరియా రాజులు సుమారు 74 ఎకరాల భూమిలో లక్షల చదరపు అడుగుల సువిశాలమైన సుందర భవనాలను నిర్మించారు.

ఎస్సీ అభివృద్ధి శాఖ...
విక్టోరియా నిలయం విద్యాభివృద్ధి కోసం పనిచేస్తూ ఎందరో విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చింది. విక్టోరియా మహల్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హాయాంలో 1994లో జీవో నెంబర్‌ 124 ద్వారా ఎస్సీ అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి డేస్కాలర్ పాఠశాలగా మార్చారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కార్యనిర్వాహాక చైర్మన్‌గా ఉన్న ఈ ట్రస్ట్‌లో సంబంధింత శాఖ కార్యదర్శితో పాటు విద్యా కమిషనర్‌ సాంకేతిక విద్యా, కార్మిక దేవాదాయ శాఖలను ట్రస్టులో సభ్యులుగా చేసింది. ఇంత పటిష్టంగా ఏర్పడిన ట్రస్టు కొన్నేళ్లగా నిరాధరణకు గురవుతుంది. వెయ్యిమంది విద్యార్థులతో పాటు 34 మంది టీచర్లు కలిగిన ఈ పాఠశాల భూములు నేడు అన్యాక్రాంతమవుతున్నాయి. నిబంధన ప్రకారం ట్రస్ట్‌ భూములను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించకూడదు. కానీ ప్రభుత్వాలు రూల్స్‌కు విరుద్ధంగా భూముల బదలాయింపులకు పాల్పడుతున్నాయి. 1997లో టీడీపీ ప్రభుత్వం ట్రస్టుకు చెందిన 20 ఎకరాలకు కూరగాయలు... పండ్లు మార్కెట్‌ కోసం లీజుకు కేటాయించారు. అలాగే రిలయన్స్‌ పెట్రోల్ బంక్, బాబు జగ్జీవన్‌రావ్‌ ఆడిటోరియం నిర్మాణాలకు కేటాయించారు. అలాగే రోడ్డు విస్తీర్ణంలో నాలుగు ఎకరాల భూమిని కోల్పోయింది. మరో రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైంది.

రాచకొండ పోలీస్ కమిషనర్‌ రేట్ నిర్మాణానికి
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కన్ను.. ట్రస్టు భూములపై పడింది.. జీ.వో నెంబర్ 48 ద్వారా 10 ఎకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనర్‌ రేట్ నిర్మాణానికి లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది... మరో 26 ఎకరాల భూమిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖకు లీజుకివ్వడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పాలకుల నిర్ణయంపై ప్రజా పక్షాలు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ప్రభుత్వ చర్యపై మండిపడుతున్నాయి. విక్టోరియా మహల్‌ను కాపాడుకోవడానికి పోరాటానికి దిగాయి. ఏదిఏమైన... ప్రభుత్వం...ఈ కట్టడం విశిష్టతను కాపాడి... దాని అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

15:55 - August 12, 2017

హైదరాబాద్ : నగర అభివృద్ధికి, కొత్త ప్రాజెక్ట్‌ల అమలుకు, జీతాల చెల్లింపులకు, రోజువారి మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులను సమీకరించేందుకు కొత్త వ్యూహాలకు బల్దియా పదును పెడుతోంది. ప్రాపర్టీ టాక్స్‌ వసూళ్లలో దూసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అంతే కాకుండా అధికారులతో వీక్లీ రివ్యూ పెట్టి మరీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే సునామీ సర్వే.. ఆస్తి పన్నులో ఉన్న లోపాలను రివ్యూ చేసి పన్నులు పెంచేందుకు ప్లాన్ చేశారు. బల్దియా ఎన్నికల సమయంలో 1200 రూపాయల లోపు ఉన్న ఆస్తిపన్నును రద్దు చేశారు. అయితే వాటికి అసలు పన్ను ఎంత ఉంటుందని రివిజన్ చేసిన బల్దియా అధికారులు.

60 కోట్ల పన్ను
30 శాతం నుంచి 500 శాతం వరకు పన్నును విధించారు. దాంతో మొదట్లో రద్దైన పన్ను కంటే ఎక్కువ మొత్తంలో పన్ను డిమాండ్‌ను పెంచారు. దీంతో పాటు ఈ ఏడాది లెక్కలోకి రాని ఆస్తులు.. ఖాళీ స్థలాలను కూడా పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బల్దియా తీవ్ర కసరత్తు చేస్తోంది. వాటిపై 60 కోట్ల పన్ను రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా.. ఈ ఏడాది 1450 కోట్ల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇప్పటికే 541 కోట్ల ఆస్తిపన్ను వసూలు అయ్యింది. మార్చి నాటికి 909 కోట్లు వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రతీ వారం పన్ను వసూళ్లపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతీ నెల 113 కోట్ల చొప్పున వసూలు చేయాలని టార్గెట్ ఫిక్స్‌ చేసుకున్నారు.

పన్నులు భారీగా పెంచనున్న జీహెచ్ఎంసీ
ఇక ట్రెడ్‌ లైసెన్స్‌ పన్ను ప్రకటనల పన్నులను కూడా భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో ఉన్న హోర్డింగుల నిర్వహణను స్ట్రీమ్‌ లైన్‌ చేయడం ద్వారా 100 కోట్ల ఆదాయం వస్తుంది. గతేడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా 50 కోట్ల ఆదాయం ఆర్జించిన జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది దానిని 100 కోట్లకు పెంచాలని చూస్తోంది. ఇందులో ఉన్న లోపాలను సవరించేందుకు ఇటీవలే స్టాండింగ్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో సిటీలో ఉన్న ప్రతీ వ్యాపారాన్ని లైసెన్స్ పరిధిలోకి తెచ్చి.. వారందరి నుంచి పన్ను రాబట్టాలని డిసైడ్ చేసింది. ఇక ప్రతీ యేటా టౌన్ ప్లానింగ్ ద్వారా వస్తున్న 600 కోట్ల ఆదాయాన్ని కూడా ఈ సారి భారీగా పెంచడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. సిటీ డెవలప్‌మెంట్ కోసం పలు భారీ ప్రాజెక్ట్‌లను ముందేసుకున్న బల్దియా.. వాటిని కంప్లీట్ చేసేందుకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అన్ని రకాల ప్లాన్స్ వేస్తుంది. ఈ ఏడాది కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు షెడ్యూల్‌ ప్రకారం పూర్తవుతాయా.. లేదా అనేది మార్చి చివరికి తేలిపోనుంది. 

20:36 - July 27, 2017

అఖండ భారతం..మాదే ప్రజల తీర్పు ఎలా ఉన్నా మాకున్న ఎత్తుగడలు మాకున్నాయి..బీహార్ రాష్ట్ర రాజకీయాల మార్పుతో నరేంద్ర మోడీ పంపిన సందేశమిది..మరి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి...బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామాచేశారు..మళ్లీ కొద్దిగంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు...24గంటల వ్యవధి లేకుండా జరిగిన పరిణామిలివి...నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలేంటీ ?..కారకులెవరు ? జరిగింది ఏంటీ ? ఈ అంశంపై ప్రత్యేక కథనం..పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

11:26 - June 22, 2017

విజయవాడ : ఏపీకే కీలకంగా మారిన బెజవాడలో భద్రతను పెంచి ... క్రైం రేట్‌ను తగ్గించే పనిలో పడ్డారు పోలీసులు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ... నేరాలను అరికడుతున్నారు. ఈ ప్రక్రియలో పోలీసుల దర్యాప్తుకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా మారాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగానే పోలీసులు సుమారు వెయ్యికిపైగా కేసులను పరిష్కరించగలిగారు.

సీసీ కెమెరాల కీలకం...
సీసీ కెమెరాల దృశ్యాలను ఆధారంగా చేసుకుని ఖాకీలు తమదైన శైలిలో సఫలీకృతులవుతున్నారు. గతేడాది నగరంలో సంచలనం సృష్టించిన ఎన్నో కేసులు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగానే పరిష్కరించారు. కానిస్టేబుల్ అయూబ్ మృతి కేసు.. బీఆర్టీఎస్ రోడ్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం కేసు... నాలుగు నెలల క్రితం కంకిపాడులో ఓ వివాహిత హత్య కేసు.. ఇలా నగరంలో సంచలనం కలిగించిన పలు కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగానే ఛేదించారు. అలాగే వీఐపీల పర్యటనలు, బందోబస్తు, ఆందోళనలు, ట్రాఫిక్ సమస్యలు, అల్లర్లు ఇలా ప్రతి అంశాన్నీ సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అలాగే వాహనాలతో ఢీ కొట్టి పరారవుతున్న వ్యక్తులను, చోరులను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగానే చెక్‌ పెడుతున్నారు.కాగా నేరాలను అరికట్టేందుకు అన్నిరకాలుగా కృషి చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.

అత్యంత జాగ్రత్తగా
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వివిఐపీల పర్యటనలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వివిఐపీల పర్యటనల్లో ఎలాంటి అవాంతరాలూ ఎదురుకాకుండా పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ పనిలోనూ వారు అత్యధికంగా సీసీ టీవీ ఫుటేజీపైనే ఆధారపడుతున్నారు. ఇంటెలిజెన్స్, విజయవాడ, గుంటూరు పోలీసులు సీసీ కెమెరాల డేగ కన్నుతో వివిఐపీల రూట్‌మ్యాప్‌ను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రమంత్రులు, సీఎం, రాష్ట్రమంత్రులు, వీవీఐపీలు తరచూ పర్యటిస్తుండడంతో వీటిని సైతం కెమెరాల్లో నమోదయ్యేలా ఎటాచ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. పోలీసుల వ్యవహారాల్లోనూ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నగరంలో దొంగతనాలు... దోపిడీలు.. హత్యలు.. తగ్గించేందుకు.. పోలీసులు సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారు.

 

 

21:48 - June 10, 2017

సౌదీ అరేబియా : ఇరాన్‌ పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇపుడు సౌదీ అరేబియాను టార్గెట్‌ చేసింది. సౌదీ అరేబియాలో దాడి చేస్తామని ఐసిస్‌ హెచ్చరించింది. SITE ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఈ వార్తను ధృవీకరించాయి. బుధవారం ఇరాన్‌ పార్లమెంట్‌, అయెతొల్లా ఖొమెని సమాధి వద్ద జరిపిన ఐసిస్‌ జరిపిన ఆత్మాహుతి దాడిలో 17 మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. దీనికి తామే బాధ్యులమని తెలిపిన ఐసిస్‌ షియా దేశాలపై మరిన్ని దాడులు జరుపుతామని హెచ్చరించింది. ఇరాన్‌పై దాడికి ముందు ఐసిస్‌ రికార్డ్‌ చేసిన వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియోలో మాట్లాడిన ఐదుగురు ఉగ్రవాదులు సౌదీ అరేబియాలోని షియాలపై దాడులు చేస్తామని బెదిరించారు. మేము ఎవరి ఏజెంట్లు కామని...అల్లా ఆజ్ఞాపించారని... ఇరాన్‌ తర్వాత మీపైనే దాడి చేస్తామని సౌదీకి ఐసిస్‌ ఓ సందేశాన్ని పంపింది.

11:45 - May 13, 2017

హైదరాబాద్: విస్తరణ పేరుతో వేలాది గ్రామాలు, లక్షల ఎకరాల భూమిని మింగేసి సింగరేణి కాలరీస్‌ కంపెనీ కళ్లు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై పడింది. ఉపరితల బొగ్గు గనుల కోసం కుమ్రం భీమ్‌ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టును పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు కూడా సింగరేణి భూకబ్జాలకు వత్తాసు పలికేలా ఉన్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. వేలాది ఎకరాలను నీరందిస్తున్న నిండుకుండలాంటి వట్టివాగు ప్రాజెక్టును మింగేయాలని చూస్తున్న సింగరేణి భూదాహంపై 10 టీవీ ప్రత్యేక కథనం....

కబ్జా కోరల్లో వట్టివాగు...

సింగరేణి కాలరీస్‌ కంపెనీ.... తెలంగాణలో నల్ల బంగారాన్ని వెలికితీస్తోన్న సంస్థ. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు విద్యుత్‌ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు విరజిమ్మేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు విస్తరణ ప్రణాళికలు రచిస్తున్న సింగరేణి కాలరీస్‌ కంపెనీ... ఇప్పటి వరకు వేలాది గ్రామాలను స్వాధీనం చేసుకుని, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. అడవులను ఆక్రమించుకుంది. వ్యవసాయ భూములను కబ్జా చేసింది. చెరువులు సింగరేణి కాలగర్భంలో కలిపేసిన సంస్థ కళ్లు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై పడ్డాయి.

పాతికవేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న వట్టివాగు

నీళ్లతో నిండుకుండలా కనిపిస్తున్న ఇది వట్టివాగు ప్రాజెక్టు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పాతిక వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలోనే డోర్లి ఉపరితల బొగ్గు గునులు ఉన్నాయి. ఓపెన్‌కాస్ట్‌లో తవ్వుతున్న మట్టిని వట్టివాగులో పోస్తున్నారు. దీంతో ఈ జలాశయం వట్టిపోయే పరిస్థితి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డోర్లి ఉపరితల బొగ్గు గనుల మట్టితో వట్టివాగు జలాశయాన్ని పూడ్చేస్తే తమ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతుందని ప్రాజెక్టు పరిధిలోని ఆయనట్టు రైతులు భయపడుతున్నారు.

వట్టివాగు ప్రాజెక్టు గర్భంలో అపార బొగ్గు నిక్షేపాలు

వట్టివాగు జలాశయంపై సింగరేణి కాలరీస్‌ కన్ను పడటానికి కారణాలు లేకపోలేదు. ఈ ప్రాజెక్టు గర్భంలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో జలాశయాన్ని పూడ్చేస్తే, ఈ భూములను కూడా ఉపరితల బొగ్గు గనుల కోసం తీసుకోవచ్చన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం ఉందని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు

నీటిపారుదల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మౌనప్రేక్షక పాత్ర

డోర్లి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు తవ్వకంలో వస్తున్న మట్టిని వట్టివాగు ప్రాజెక్టులో పోసి పూడ్చివేయడం నింబధనలను విరుద్ధం. ఇటు నీటిపారుదల శాఖ అధికారులకు, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా.... ఇద్దరూ కూడా మౌనప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై ఈ ప్రాంత ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం చట్టాలను ఉల్లంఘిస్తున్నా పాలకులు నోరు మెదపకపోవడాన్నిజనం తప్పుపడుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టును కొల్లగొట్టే ప్రయత్నాలను సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.

1998-2000 మధ్య నిర్మాణం పూర్తి

ఆసిఫాబాద్‌లో రెండు దశల్లో 190 కోట్ల రూపాయల వ్యయంతో వట్టివాగు ప్రాజెక్టు నిర్మించారు. 1998లో నిర్మాణం ప్రారంభించి, 2000 సంవత్సరంలో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందుతున్న సాగునీరుతో పంటలు పండించుకుంటూ వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు డోర్లీ ఉపరితల బొగ్గు గనుల మట్టిని వట్టివాగులో పోస్తుండటంతో తమ భవిష్యత్‌ పశ్నార్థకంగా మారుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2005లో ఒకసారి ఈ ప్రాజెక్టు కట్ట కొట్టుకు పోయింది. అయితే ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు భూములపై కన్నేసిన సింగరేణి కాలరీస్‌.... జలాశయాన్నికబ్జా చేసే క్రమంలోనే ఉద్దేశపూర్యంగా కరకట్టకు గండికొట్టిందన్న ఆరోపణలు వినిపించాయి. కబ్జాల పర్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు ఎవరూ అడిగేవారు లేరన్న ధీమాతో వట్టివాగు జలాశయాన్ని డోర్లి ఓపెన్‌కాస్ట్‌ మట్టితో నిపించేస్తోందన్నఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పాలకులు పట్టించుకుని సింగరేణి కబ్జా కోరల నుంచి వట్టివాగు జలాశయాన్ని కాపాడాలని కోరుతున్నారు. 

18:31 - April 24, 2017

విజయవాడ : అగ్రిగోల్డ్‌ ఆస్తులపై మంత్రి నారా లోకేశ్‌, టీడీపీ నేతల కన్ను పడిందని అందుకే సమస్యను పరిష్కరించడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. అగ్రిగోల్డ్‌లో 32లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాయని.. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వారికి ఇచ్చే మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నాయని.. వాటిని అమ్మితే సమస్య త్వరగా పరిష్కారమవుతుందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అంబటి డిమాండ్‌ చేశారు.

14:46 - November 14, 2016
17:25 - October 25, 2016

ఆదిలాబాద్ : దశాబ్దాల కాలం పోరాడి ఆదివాసీలు సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం కాలరాస్తోంది. జల్‌, జమీన్‌, జంగిల్‌ కోసం కొమరం భీమ్‌ పోరాడిన నేలపై సర్కారీ మార్కు దురాక్రమణ కొనసాగుతోంది. చట్ట ప్రకారం హక్కులు పొందిన అటవీ భూములను కూడా హరితహారం పేరుతో తిరిగి లాక్కోవడానికి అటవీశాఖ ఆదివాసీ గ్రామాలపై దండయాత్రలు చేస్తోంది.  
అటవీ భూములు ఖాళీ చేయాలని ఆదేశాలు
అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై సర్కారు కన్ను పడింది. హరితహారంలో భాగంగా ఈ భూముల్లో మళ్ళీ మొక్కలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించిందంటూ అటవీ శాఖ అధికారులు హడావుడి చేస్తున్నారు. అటవీ భూములు ఖాళీ చేయాలని ఆదేశిస్తూ గ్రామాలపై అటవీ శాఖ అధికారులు విరుచుకుపడుతున్నారు.  
ఆదివాసీల జీవన విధానంలో పోడు వ్యవసాయం అంతర్భాగం 
తెలంగాణలో 1,14,865 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండగా దీనిలో 29,242 కిలోమీటర్ల అటవీ భూమి ఉంది.  ఆదివాసీలు అధికంగా నివసించే  ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1700 చ.కి.మీ విస్తీర్ణంలో అడవులు వ్యాపించి ఉన్నాయి.  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,10,274 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉంది. మంచిర్యాల జిల్లాలో  4 వేల 56.36 చ.కి.మీ విస్తీర్ణం, నిర్మల్ జిల్లాలో 3వేల 562.51 చ. కి.మీ. వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాంతాలలో నాలుగు దశాబ్దాలుగా అటవీ భూముల్లో ఆదివాసీలు, దళితులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, జీవన విధానంలో పోడు వ్యవసాయం కూడా ఒక అంతర్భాగం. 
పదెకరాలకు క్లెయిమ్‌లు ఇవ్వడానికి ముందుకురాని ప్రభుత్వం  
ఆదివాసీల సుదీర్ఘ పోరాట ఫలితంగా 2006 లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2008 నుంచి అటవీ హక్కుల చట్టాలన్నిఅమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గుర్తింపు ప్రక్రియను నామమాత్రంగా కూడా చేపట్టలేదు. గరిష్ఠంగా పదెకరాల వరకూ  వ్యక్తిగత క్లెయిమ్‌లు ఇవ్వవచ్చని చట్టంలో పేర్కొన్నప్పటికీ పదెకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. అటవీ హక్కుల గుర్తింపు క్లెయిమ్‌లకు అటవీశాఖ అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. 
పోడు రైతులను వేధిస్తున్న అటవీ అధికారులు
హరితహారంలో భాగంగా అటవీ భూముల్లో మొక్కలు పెంచుతామంటూ అటవీ అధికారులు పోడు రైతులను వేధిస్తున్నారు. అటవీ హక్కుల కోసం  దరఖాస్తు చేసుకున్నా పెండింగ్‌ లో ఉన్నాయనే నెపంతో పోడు వ్యవసాయదారులను తమ భూమిలోకి అడుగు పెట్టనివ్వడం లేదు.  అవిభాజ్య ఆదిలాబాద్‌ జిల్లాల్లో అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు పొందిన వారిని కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. 
ఉద్యమానికి సన్నద్ధమవుతున్నఆదివాసీలు
అటవీహక్కుల చట్టం  ప్రకారం సామాజిక గుర్తింపు పొందిన భూముల్లో కూడా తామే అడవులు పెంచుతామంటూ ఆ భూమిని అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోడు భూములపై ఉద్యమ బాట పట్టేందుకు ఆదివాసీలు సన్నద్ధం అవుతున్నారు.

19:43 - November 1, 2015

గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరాతి లంక భూముల్లో రాజకీయ రాబందులు వాలిపోతున్నాయి. రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలను బెదిరించి బినామీ పేర్లతో భూములు రాయించుకుంటున్నారు. కొనుగోలు చేసిన భూములకు అక్రమంగా రిజస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారు. లంక భూములు కొన్న వారిని జైలుకు పంపుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి.
ఇప్పటివరకు 30 వేల ఎకరాలకు పైగా సేకరణ
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 30 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించింది. ఏడాదికి మూడు పంటలు పండే 13 లంక గ్రామాల్లో మరో 2159 ఎకరాలు సమీకరించాల్సి ఉంది. నేలను నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న బడుగుజీవులు ఈ భూములు ఇవ్వడం నిరాకరించడంతో ఇప్పుడు వారిని పై భూ సేకరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు.
బినామీ పేర్లతో భూముల కొనుగోలు
భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో కృష్ణానది చెంతనే ఉన్న లంక భూముల్లో రాజకీయ నాయకులు రాబందుల్లా వాలిపోతున్నారు. భూయజమానులను నయానో, భయానో బెదిరించి వారి నుంచి బినామీ పేర్లతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ డబ్బు ముట్టచెబుతూ సొంతం చేసుకుంటున్నారు. సేకరణకు ఉద్దేశించిన భూముల్లో జరీబు, అసైన్డ్‌ భూములున్నాయి. జరీబు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అసైన్డ్‌ భూములకు బినామీ పేర్లలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ లావాదేవీల్లో అధికార పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. నోటిఫికేషన్‌ ద్వారా భూ సమీకరణకు ప్రభుత్వ సిద్ధం కావడంతో ఎకరం 5 లక్షల రూపాయల విలువ ఉన్న భూములకు 25 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. పట్టా భూములను ఎకరం 45 నుంచి 50 లక్షల రూపాయకలు కొనుగోలు చేశారు. భూములు అమ్మిన రైతులు భవిష్యత్‌లో ఎదురు తిరుగుతారేమోన్న అనుమానంతో వీడియో చిత్రీకరణ కూడా చేశారు. అమరావతి ప్రాంతంలో లంక భూములు కొన్న వారిలో మంత్రులు, వారి అనుచరగణం ఉన్నట్టు వినిపిస్తోంది. లంక భూములు కొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు నోటి మాటలుగా మిగిలిపోయాయని ప్రతిపక్షనాయులు విమర్శిస్తున్నారు.
నోటిఫికేషన్‌ ద్వారా 2159 ఎకరాల సేకరణ
మరోవైపు రాజధాని కోసం నోటిఫికేషన్‌ ద్వారా 2159 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను కూడా సమీకరణ పద్ధతిలోనే తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. లంక భూముల కొనుగోలు వ్యవహారంపై మంత్రులు నోరు మెదపకపోవడాన్ని రైతులు, రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు.

 

 

Don't Miss

Subscribe to RSS - కన్ను