కరీంనగర్

16:45 - February 11, 2017

హైదరాబాద్: కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఏఎస్సై పదోన్నతి శిక్షణ కోసం వచ్చి కానిస్టేబుళ్లు మృత్యువాతపడుతుండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. కఠినతరమైన శిక్షణ వల్లే చాలామంది కానిస్టేబుళ్లు అనారోగ్యం బారిన పడటంతో పాటు.. ప్రాణాలు కోల్పోతున్నారని సహచరులు అంటున్నారు. అయితే ఇటీవల చనిపోయిన పోలీసులంతా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ విభాగానికి చెందినవారే కావడంతో పోలీసు శాఖలో వివక్ష కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

1980 దశకంలో పోలీసుశాఖలో ఏఆర్‌ విభాగంలో ..

1980 దశకంలో పోలీసుశాఖలో ఏఆర్‌ విభాగంలో చేరిన 372 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించడంతో జనవరి 18న కరీంనగర్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు శిక్షణకు వచ్చారు. వీరిలో చాలామంది వయస్సురీత్యా, ఆరోగ్యం సహకరించక రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న హెడ్‌ కానిస్టేబుళ్లు అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే.. ఉన్నతాధికారులు వయస్సును పట్టించుకోకుండా శిక్షణ ఇవ్వడంతో.. పోలీసులు చనిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యే మీర్జాత్‌ అజ్మత్‌అలీ, మధుతో పాటు.. యాదవ్‌రావు పరేడ్‌ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు వదిలారు. మరికొంత మంది కఠోర శిక్షణ చేయలేక అనారోగ్యం పాలవడం.. ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే.. ఇవేమీ బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు

సివిల్‌ పోలీసులకు లేని నిబంధనలు మాకెందుకు...

అయితే.. సివిల్‌ పోలీసులకు లేని నిబంధనలు మాకెందుకు అని ఏఆర్‌ పోలీసులు వాపోతున్నారు. శాంతి భద్రతల విధులు నిర్వహించని తమకు కఠినతరమైన శిక్షణ ఎందుకు అంటున్నారు. రిటైర్మెంట్‌ వయసు దగ్గరకు వచ్చినా.. హోదా పెరిగితే జీతం పెరుగుతుందనే ఆశతో శిక్షణకు వస్తే.. కఠినతరమైన శిక్షణతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు శిక్షణతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

పదోన్నతి కోసం వచ్చే హెడ్‌కానిస్టేబుళ్లకు కఠినతరమైన శిక్షణ...

ఇదిలావుంటే.. పదోన్నతి కోసం వచ్చే హెడ్‌కానిస్టేబుళ్లకు కఠినతరమైన శిక్షణ ఏమీ ఇవ్వడం లేదని పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ అంటున్నారు. వారికి ముందు నుంచే అనారోగ్యం ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్నారు. ఈ మధ్య మృతి చెందిన యాదవరావు.. రన్నింగ్‌ చేస్తూ చనిపోవడంలో వాస్తవం లేదన్నారు. నాలుగేళ్ల క్రితం గుండె ఆపరేషన్‌ చేయించుకున్న యాదవరావు.. ఈ విషయాన్ని దాచిపెట్టి తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాడంటున్నారు. అయితే.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రిటైర్మెంట్‌కు దగ్గరున్న తమకు.. కఠిన తరమైన శిక్షణ లేకుండా ప్రమోషన్లు కల్పించాలని ఏఆర్‌ కానిస్టేబుళ్లు కోరుతున్నారు.

19:25 - February 7, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహదేవపూర్ మండలం అన్నారం మలుపు వద్ద 2 వాహనాలు అదుపుతప్పిన ఘటనలో... 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:44 - February 6, 2017
19:00 - January 30, 2017

కరీంనగర్ : గతమెంతో ఘన చరిత్ర కలిగిన చేనేత పరిశ్రమ ఇప్పుడు నేత కార్మికుడికి కంటతడి పెట్టిస్తోంది. రోజంతా కష్టపడినా కడుపు నిండని పరిస్థితి. కుటుంబ పోషణ భారం అవుతుండటంతో కార్మికుడు విలవిల్లాడుతున్నాడు. పెద్దనోట్ల రద్దు వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేయడంతో నష్టాల ఊబిలో నుంచి చేనేత పరిశ్రమ ఒడ్డున పడే పరిస్థితి కనపడడం లేదు. కరీంనగర్ జిల్లాలో బోసిపోతున్న చేనేత పరిశ్రమపై 10టీవీ ప్రత్యేక కథనం..! 
ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న చేనేత కార్మికులు
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో చేనేత పారిశ్రామిక, సహకార ఉత్పత్తి, విక్రయ కేంద్రానికి 67ఏళ్ల చరిత్ర ఉంది. అనాడు చేనేత పరిశ్రమ వందల మంది నేతన్నలకు ఉపాధి చూపింది. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రస్తుతం చేనేత పరిశ్రమ కుదేలైంది. రోజంతా కష్టపడ్డా ఆదాయం లేకపోవడంతో నేతన్నలకు పూట గడవడం కష్టాంగా మారింది. దీంతో వారు ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
కార్మికులకు పని దొరకని పరిస్థితి
1949లో పల్లెర్ల లక్ష్మీపతి స్థాపించిన ఈ సంఘంలో ఎంతోమంది నేత కార్మికులకు ఉపాధి దొరికింది. 1983లో ఎన్టీ రామారావు ప్రవేశ పెట్టిన జనత వస్త్రాల ఉత్పత్తితో సంఘం వ్యాపారం ఊపందుకుంది. పరిశ్రమ ఆరంభంలో 1500 మంది కార్మికులతో కళకళలాడిన చేనేత సంఘం ప్రస్తుతం 221 మంది కార్మికులతో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్మికుల్లో కనీసం 120 మందికిపైగా పని లేదు. కరీంనగర్ జిల్లా పరిధిలోని రామడుగు, గంగాధర, చొప్పదండితో పాటు 37 గ్రామాలకు చెందిన కార్మికులు యారన్లు తీసుకెళ్లి, బట్టలను నేసి సంఘానికి అందించేవారు. ప్రస్తుతం క్యాష్ క్రెడిట్ ద్వారా యారన్, కూలీలకు డబ్బులు చెల్లిస్తూ.. పాలక మండలి సంఘాన్ని భుజాన వేసుకొని నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ కేంద్రంలో ఆరు నెలలుగా 60 లక్షల వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. 
ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొంటున్న సంఘం
గతంలో ఆప్కో కొనుగోలు చేసిన వస్త్ర నిల్వలకు సరైన చెల్లింపులు చేయకపోవడంతో సంస్థ ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటోంది. నూతన వస్త్రం తయారీకి అవసరమైన యారన్ లేక, కార్మికుల వేతనాలు చెల్లించకలేక సంఘం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికీ ఆప్కో నుంచి 10 లక్షల బకాయిలు వస్తే సంస్థకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. నిల్వ ఉన్నవస్త్రాలను క్లియర్ చేసేందుకు డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ కొనుగోలుదారుల నుంచి స్పందన లేదు. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయం వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో... ప్రస్తుతం చేనేత పరిశ్రమ కొలుకునే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వమే ఆదుకోవాలని నేతన్నలు వేడుకుంటున్నారు. 
చేనేత వస్ర్తాలకు ఆదరణ కరువు
చేనేత వస్ర్తాలకు ప్రజల నుంచి కూడా ఆదరణ కరువవుతోంది. నేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం... పాలిస్టర్ వస్త్రాలను ఆర్డర్ ఇచ్చినప్పటికీ వాటి నుంచి సరైన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చేనేత కార్మికులకు ఉపాధి చూపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

19:19 - January 19, 2017

కరీంనగర్ : జిల్లాలో టీఆర్‌ఎస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లాలోని ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. దీంతో కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన విభేదాలపై  ప్రత్యేక కథనం..  
ఎమ్మెల్యే రమేష్ బాబుపై బోడిగె శోభ తీవ్ర అసహనం
కరీంనగర్‌ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లాల విభజనతో ఈ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు తీరు పట్ల చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే బోడిగె శోభ తీవ్రఅసహనం వ్యక్తంచేస్తున్నారు.  బోయినపల్లి మండలం ఉప మార్కెట్ యార్డు నిర్మాణం ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణమని కార్యకర్తలు భావిస్తున్నారు.  బోయినపల్లి ఉప మార్కెట్ యార్డు.. వేములవాడ మార్కెట్ యార్డు పరిధిలోకి వచ్చినప్పటికి  నియోజకవర్గం మాత్రం చోప్పదండి లో ఉంది. దీంతో యార్డుల్లో పాలనపరమైన అంశాల్లో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడంలో మునిగిపోయారు. 
నా విషయాల్లో రమేష్‌బాబు అడ్డుతగులున్నారని శోభ ఆరోపణ
బోయినపల్లి మండల కేంద్రంలో కొంత కాలంగా వ్యవసాయ మర్కెట్ నిర్మాణం, రైతులకు తగిన వసతులను కల్పించడానికి ఎమ్మెల్యే శోభ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నానికి ఎమ్మెల్యే రమేష్ బాబు ఆటంకాలు కలిగిస్తున్నారనేది శోభ  ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మార్కెట్ యార్డు నిర్మాణం వద్దంటు రమేష్ బాబు ప్రభుత్వ పెద్దలకు లిఖిత పూర్వకంగా లేఖ రాయడం, మార్కెట్ కు సంబందించిన పాలనపరమైన అంశాలు, గోదాంల ప్రారంభ విషయంలోనూ రమేష్‌బాబు అడ్డుతగులుతున్నారని ఆమె చెబుతున్నారు. 
అయోమయంలో కార్యకర్తలు 
గతంలో వేములవాడ మార్కెట్ కమిటి డైరెక్టర్ల నియామాకాలకు సంబంధించి ఇద్దరి మధ్య విబేధాలు రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. నేతల మధ్య విభేదాలతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇకనైనా పార్టీ అధిష్టానం ఈ విషయంలో కలుగుజేసుకుని ఇద్దరి మధ్య విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. 

 

09:52 - January 19, 2017

కరీంనగర్ : పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. ఆకాశమే హద్దుగా ఎగిరే పతంగులు తెలియని అనుభూతిని కల్గిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ గాలి పటాలతో సందడిచేసేవారే..కానీ మారుతున్న కాలంతో పతంగుల పండుగ కనుమరుగు అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంస్కృతి సంప్రాదాయల పండుగకు జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం...పర్యాటక శాఖ ఆధర్యంలో కైట్ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టింది . ఇందుకు కరీంనగర్ జిల్లా కేంద్రం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు వేదికగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్‌కు కరీంనగర్ జిల్లాలో అనూహ్యస్పందన లభించింది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అంగరంగా వైభవంగా జరిగింది. 30 దేశాలకు చెందిన విదేశీ కైట్ రైడర్స్ భారీ పతంగులను మైదానంలో ఎగురవేస్తూ సందడి చేశారు. ఆకాశమే హద్దుగా ఎగుర వేసిన పతంగులు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు.

ఫస్ట్ టైమ్..
కరీంనగర్‌లో మొదటి సారి నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. రెండు దశాబ్దల క్రితం కరీంనగర్ జిల్లాలో పతంగుల పండుగను నిర్వహించేవారు. కాలక్రమేణ ఈ వేడుకలు కనుమరుగవడంతో చాలా ఏళ్ల తరువాత తిరిగి జిల్లాలో పతంగులు సందడి మొదలైంది. మనదేశంలో జరిగే పతంగుల పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని విదేశీ కైట్ రైడర్స్ అంటున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న పతంగుల ఉత్సవానికి ప్రత్యేకత ఉంది. బాలికలను విద్య వైపు ప్రోత్సహిస్తూ ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లాలన్న భావస్పూర్తితో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేస్తూ... ఈ కైట్ ఫెస్టివల్‌ని ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకున్నట్లుగా స్థానిక మేయర్ అంటున్నారు. పతంగుల వేడుకతో పండుగ వాతవరణం నెలకొంది. ఈ సందర్బంగా చేనేత, తెలంగాణ వంటకాలకు సంబంధించిన స్టాళ్ల తో పాటు సాంస్కృతిక కార్యాక్రమాలను ఏర్పాటు చేశారు.

18:40 - January 18, 2017

కరీంనగర్‌ : నగరంలో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ ఘనంగా కొనసాగుతోంది.. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. 30 దేశాలకుచెందిన కైట్‌ రైడర్స్‌ ఇందులో పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

17:39 - January 16, 2017

కరీంనగర్ : అడవిలోకి వెళ్లి అన్న అయ్యాడు...అంచెలంచెలుగా ఎదిగాడు...ఆపై సహచరులనే హతమార్చి కోవర్ట్‌గా మారాడు... దందాలలో ఆరితేరాడు...అంతలోనే అదృశ్యమయ్యాడు.. అతడే మాజీ నక్సలైట్‌ జడల నాగరాజు. ఐదేళ్లుగా అతని ఆచూకి లేదు..దాని వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. జడల నాగరాజు...అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరి.. నక్సల్‌గా మారాడు. కీలక కేడర్‌కు గన్‌మెన్‌గా పనిచేశాడు. ఎనిమిదేళ్ల పాటు పార్టీలోనే కొనసాగాడు. ఆ తర్వాత పోలీస్‌ కోవర్ట్‌గా మారాడు. ఇందులో భాగంగా అప్పటి జిల్లా కమిటీ కార్యదర్శి విజయ్‌ను రామగిరి గుట్టల వద్ద హతం చేసి... 2000 సంవత్సరంలో పోలీస్‌లకు ఆయుధాలతో లొంగిపోయాడు.

ప్రాణహాని ఉండడంతో పోలీస్‌ అండదండలు..
వనం వీడి జనంలోకి వచ్చిన నాగరాజు... పార్టీకి సంబంధించిన సమాచారాన్ని.. కీలక నిర్ణయాలను... ముఖ్యమైన నేతల ఆచూకిని పోలీసులకు చేరవేసి... పలు ఎన్ కౌంటర్లకు సహకరించాడు. అనతికాలంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని సెటిల్ మెంట్లు, దందాలు కొనసాగించాడు. ఈ మేరకు పోలీసుల అండదండలు నాగరాజుకు ఉండేవి. అలాగే నక్సలైట్ల నుంచి నాగరాజుకు ప్రాణహాని ఉండడంతో అతనికి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్‌లు ఆశ్రయం కల్పించారు.

రామకృష్ణాపూర్‌ ఎంపీటీసీగా విజయం..
నాగరాజు కోవర్టుగా పనిచేస్తూనే మరోవైపు రాజకీయంగా ఎదిగెందుకు వ్యూహ రచనలు చేసుకున్నాడు. మొదట టీడీపీలో చేరాడు.. రామకృష్ణాపూర్ ఎంపీటీసీగా నాగరాజు.. ముత్తారం జడ్పీటీసీగా భార్య రాణి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నాగరాజు ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులతో సన్నిహితంగా మెలిగాడు. ఈ నేపథ్యంలో 2011 డిసెంబర్ 17న నాగరాజు అనుహ్యంగా మాయమయ్యాడు. నాగరాజుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయింది.

విచారణ జరుగుతుందని చెబుతున్న పోలీసులు..
నాగరాజు బంధువు తోట రాములు ఆయుధాలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో నాగరాజు మిస్సింగ్‌ మిస్టరీ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకూ సెటిల్ మెంట్లకు మాత్రమే పాల్పడ్డాడని భావించిన పోలీసులకు అతని అక్రమ ఆయుధాల వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో ఆశ్యర్యపోతున్నారు. కాగా నాగరాజు అదృశ్యంపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎప్పుడో దాచిపెట్టిన డంప్‌లను వెలికి తీసే పోలీసులకు... జడల నాగరాజు మిస్సింగ్ మాత్రం అంతుచిక్కకుండా తయారైందనే చెప్పాలి.

21:26 - January 14, 2017

కరీంనగర్ : అక్రమ దందాలతో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధాలు లేవని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ లో పొలీసులు తయారు చేసిన డేగకన్ను యాప్ ను, వన్ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మట్కా, గుట్కా దందాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. శాంతి భద్రతలు సాఫీగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించామని, అందుకే పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మించనున్నామని చెప్పారు.

18:12 - January 11, 2017

కరీంనగర్‌ : జిల్లాలో జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు వేదికైంది. కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఈ పోటీలను ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో 15 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామని మంత్రి ఈటల అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కరీంనగర్