కర్ణాటక

06:15 - November 7, 2017

హైదరాబాద్:సెల్ఫీ సరదా ఓ ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌కు చెందిన ప్రకాష్‌ కుటుంబం కర్నాటకు వెళ్లింది. గంగావతి దగ్గర చెరువులో స్నానానికంటూ ఆరుగురు దిగారు. సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మృతులను పవిత్ర, పావని, పౌర్ణిక, ఆశిష్‌ ,ఘురాజన్‌గా గుర్తించారు. ఐదుగురి మృతితో సుల్తాన్‌బజార్‌లో విషాదం నెలకొంది.

21:49 - October 27, 2017

కర్నాటక : డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనలో కర్ణాటక మంత్రి కేజే జార్జ్‌పై కేసు నమోదైంది. గణపతి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలతో జార్జ్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్‌ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కొడగు జిల్లా డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గణపతి గత ఏడాది జూలైలో ఆత్మహత్య చేసుకున్నారు. తనను మంత్రి, ఇద్దరు సీనియర్‌ అధికారులు వేధిస్తున్నారని గణపతి చెప్పారు. ఈ ఘటనపై మంత్రితో పాటు ఇద్దరు పోలీసు అధికారులపై కేసు నమోదు చేశారు. గణపతి హత్యతో వీరికి సంబంధం లేదని పోలీసులు కేసు మూసివేశారు. దీంతో గణపతి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సిబిఐకి అప్పగించిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన సిబిఐ అధికారులు జార్జిపై చార్జిషీటు దాఖలు చేశారు.

 

15:57 - October 11, 2017

అనంతపురం : జిల్లాలోని అగలి మండలంలో ప్రవహించే స్వర్ణముఖీ నదీ జలాల విషయంలో.. మరోసారి ఆంధ్రా, కర్ణాటక రైతుల మధ్య వివాదం చెలరేగింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా నీరు ప్రవహించడంతో ఆంధ్రా చెరువులకు వచ్చే వంక కోతకు గురైంది. దీంతో అగలి మండల రైతులు వంకకు మరమ్మతులు చేప్టట్టడానికి కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న కర్ణాటక రైతులు అక్కడికి చేరుకొని.. మరమ్మతులు చేపట్టకూడదని ఆంధ్రా రైతులతో వాగ్వాదానికి దిగారు. కర్ణాటక రాష్ట్ర పోలీసులు అక్కడికి  చేరుకొని ఇరు రాష్ట్రాల రైతులను వారించారు. గతంలోనూ ఈ విషయమై రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగాయి.

 

20:06 - October 5, 2017

బెంగళూరు : బెంగళూరులో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. వరద నీటితో రోడ్లు నదులను తలపించాయి. వందలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నాళాలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల మధ్య 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీవర్షాలకు 4 భారీ వృక్షాలు కూలిపోయినట్లు 'బృహత్ బెంగళూరు మహానగర పాలికె' తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పలు సూచనలు చేసింది. మరోవైపు కర్ణాటకలో మాండ్య జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షానికి చెరకు తదితర పంటలు నీటిలో కొట్టుకుపోయాయి.

 

15:36 - September 21, 2017

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడు...కాఫీ డే కంపెనీ యజమాని వీజీ సిద్ధార్థ ఇళ్లపై ఐటి దాడులు నిర్వహించింది. బెంగళూరు విఠల్‌ మాల్యా రోడ్డులోని కేఫ్‌ చైన్‌ కేఫ్‌ కాఫీ డే ప్రధాన కార్యాలయంలో కూడా ఐటి సోదాలు చేస్తోంది. బెంగళూరుతో పాటు ముంబై, చెన్నై, చిక్‌మంగళూరులోని సిద్ధార్థకు సంబంధించిన 20 చోట్ల ఏకకాలంలో ఐటి తనిఖీలు చేపట్టింది. చెన్నైలో కృష్ణ కుటుంబానికి సంబంధించిన కంపెనీ సికల్‌ లాజిస్టిక్ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో కూడా సోదాలు నిర్వహించింది. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్‌ఎమ్‌ కృష్ణ ఇటీవలే బిజెపిలో చేరారు. ఆయన గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు

12:55 - September 10, 2017

బెంగళూరు : కర్ణాటకలో బ్యాంక్‌ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. నిన్న తెలుగు విద్యార్థులపై కన్నడిగులు దాడి చేయడంతో... పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు పహారాలో పరీక్ష కొనసాగుతోంది. కన్నడిగుల దాడి నేపథ్యంలో నిన్న జరగాల్సిన పరీక్షను అధికారులు వాయిదా వేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:18 - September 10, 2017

కర్ణాటక : కన్నడిగుల ప్రాంతీయాభిమానం తెలుగు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎంతో కష్టపడి బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమైన విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా అడ్డుకొని కన్నడ సంఘాలు వీరంగం సృష్టించాయి. పరీక్షా కేంద్రాలను రణరంగంగా మార్చాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ పరీక్షలు రాసేందుకు  వెళ్లిన ఏపీ అభ్యర్థులపై దాడులకు దిగారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. 
తెలుగువారిపై కన్నడీయులు దాడులు
కర్ణాటక రాష్ట్రంలోని.. హుబ్లీలో బ్యాంకింగ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అభ్యర్థులను పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకుని.. హాల్‌ టికెట్లను చించేశారు. వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ పరిణామంతో.. భయాందోళనకు గురైన చాలామంది అభ్యర్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు. హుబ్లీలోనే కాకుండా గుల్బర్గా, దావణగెరే, బెంగళూరులో కన్నడిగులు ఆందోళన నిర్వహించారు. 
తమ రాష్ట్రంలో పరీక్షలు రాయడానికి వీల్లేదంటూ కన్నడ సంఘాల ఆందోళన
పరీక్షలకు హాజరుకావద్దంటూ.. ముందుగానే ఫోన్లు
ఈ నెల 9,10, 16,17, 24 తేదీల్లో బ్యాంకు పోస్టుల భర్తీకి కర్ణాటకలో జరగనున్న పరీక్షలకు.. తెలుగు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 9తేదీన జరిగే పరీక్షకు తెలుగు విద్యార్థులు హాజరయ్యారు. అయితే తమ రాష్ట్రంలో.. వేరే రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఐబీపీఎస్‌ పరీక్షలు రాయడానికి వీల్లేదనే డిమాండ్‌తో  కన్నడ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పరీక్షలకు హాజరుకావద్దంటూ... అపరిచితుల నుంచి తెలుగు అభ్యర్థులకు ఫోన్లు కూడా చేశారు. 
ఘటనపై ఏపీ సీఎం సీరియస్‌
ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో తెలుగు విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. దీనిగురించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. దీంతో ఆదివారం, సోమవారం కూడా పరీక్షలు ఉన్నప్పటికీ  తెలుగు అభ్యర్థులు వెనక్కి వచ్చేశారు. మరోవైపు శనివారం పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఏపీ సీఎస్ దినేశ్ కుమార్ తెలిపారు. 

18:45 - September 9, 2017

గుంటూరు : కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడ సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రులకు చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న TDP సమన్వయ కమిటీ సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. 

17:58 - September 9, 2017

హైదరాబాద్ : కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్ష రాయకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.. AP మంత్రి చినరాజప్ప... ఈ విషయంపై కేంద్రంతోపాటు.. కర్ణాటక అధికారులతోనూ మాట్లాడతామని స్పష్టం చేశారు.. IBPS పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తారని గుర్తు చేశారు.. తెలుగు విద్యార్థులకు తాము అండగా నిలబడతామని చెప్పారు.. కర్ణాటక హుబ్లీలో ఐబీపీఎస్‌ పరీక్ష రాస్తున్న తెలుగు విద్యార్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి.. ఎక్కువ పోస్టులు ఆంధ్ర అభ్యర్థులకే వస్తున్నాయని ఆరోపించాయి. 

11:42 - September 9, 2017

బెంగళూరు: కర్ణాటక హుబ్లీలో బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన తెలుగు విద్యార్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. తమ ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల వాళ్లు కొల్లగొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Pages

Don't Miss

Subscribe to RSS - కర్ణాటక