కర్నూలు

18:23 - November 23, 2017

కర్నూలు : ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబునాయుడు అనేక అబద్ధాలు చెప్పారని.. వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో... సాగుతున్న పాదయాత్రలో ఆయన ఏపీలోని చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయ్యాక.. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశాడని.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే.. పాలన సాగిస్తున్నారని జగన్‌ విమర్శించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాకనే.. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని జగన్‌ అన్నారు.

21:27 - November 22, 2017

కర్నూలు: వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 200 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించింది. బుధవారం 15వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముద్దవరం చేరుకోవడంతో 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బాలపూర్‌ క్రాస్‌రోడ్స్‌, పెండేకల్‌ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. గ్రామ, గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించారు. మహిళలు, యువకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలుసుకుని సమస్యలు ఏకరవు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డోన్‌ నియోజకవర్గంలో పూర్తైన జగన్‌ పాదయాత్ర... వెల్దుర్తి మండలం నర్సరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు 212 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

11:48 - November 22, 2017

కర్నూలు : పట్టణంలో నకిలీ ఆర్టీవోలను ఉల్లిందకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొద్ది రోజుల నుండి కర్నూలు శివార్లలో ముగ్గురు యువకులు వాహనాలను ఆపి బెదిరించి వారి వద్దనుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనదార్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్టీవో హోంగార్డులమని బెదిరిస్తున్న ముగ్గురు యువకులు సందీప్‌, రమేష్‌, వెంకటప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

 

09:53 - November 22, 2017

కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు మర్రికుంట క్రాస్‌రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు బాలాపురం క్రాస్‌రోడు చేరుకుంటారు. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 4.30 గంటలకు  పెండెకల్‌ చేరుకొంటారు.  సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం 7 గంటలకు వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. 

 

21:19 - November 21, 2017

కర్నూలు : ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్.జగన్ ఆరోపించారు. అబద్ధాలు చెప్పే వ్యక్తి సీఎం స్ధానంలో ఉన్నారని.. అలాంటి వ్యక్తిని పొరపాటున తిరిగి ఎన్నుకోవద్దని సూచించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు బేతంచర్లలో జరిగిన సభలో చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. 14వ రోజు డోన్‌ నియోజకవర్గంలోని బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి షేక్‌ షా వలీ దర్గాకు చేరుకున్న జగన్ డోన్‌ నియోజకవర్గం పార్టీ నేతలతో అనంతరం పాణ్యం నేతలతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్లకు చేరుకున్న జగన్‌ బస్టాండ్ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీడీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు, ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు ఆనాడు చెప్పిన విషయాలు అందరూ గుర్తు చేసుకోవాలన్నారు జగన్. అలాంటి నేతను తిరిగి ఎన్నుకునేముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా డయాలసిస్ చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు వైఎస్.జగన్. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిడ్నీ పేషెంట్లకు అండగా నిలబడటమే కాకుండా.. వారికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

18:26 - November 21, 2017

కర్నూలు : అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా సీఎం చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మంగళవారానికి 14వ రోజు చేరుకుంది. గోరుగుట్ల నుండి పాదయాత్ర మొదలైంది. షేక్ షా వలీ దర్గా వద్ద డోన్, పాణ్యం నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపారు. బేతంచర్ల బస్టాండు సర్కిల్ లో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యక్తిని మళ్లీ సీఎంగా ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు. రాత్రికి కోలుములెపల్లిలో జగన్ బస చేయనున్నారు. 

18:21 - November 21, 2017

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కడప, కర్నూలు జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు. అవి చేస్తాను..ఇవి చేస్తానంటూ జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. జగన్ తనకు తాను దైవాసంభూతుడని చెప్పుకుంటున్నారని తెలిపారు.

 

10:59 - November 21, 2017

కర్నూలు : సూపర్ స్టార్ రజినీకాంత్ మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రజినీకాంత్ కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. 

 

06:57 - November 21, 2017

కర్నూలు : వైసీపీ అధినేత జగన్‌పై కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్‌తోపాటు  వైపీసీ ఎమ్మెల్యే రోజా, మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంరెడ్డిపై కూడా  పోలీసులు కేసు నమోదు చేశారు. 13వ రోజు  పాదయాత్ర సందర్భంగా హుసేనాపురంలో అనుమతి లేకుండా మహిళా సదస్సు నిర్వహించారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు. 
 

21:28 - November 20, 2017

కర్నూలు : 13వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్ర కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రారంభమైంది. బాతులూరుపాడు, ఎన్నకొండల, హుసేనాపురం, పాలకూరు క్రాస్‌రోడ్స్, గోవిందదిన్నె మీదుగా సాగి, బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోకి జగన్‌ పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించిన జగన్‌... వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోవిందదిన్నెలో విద్యార్థి జేఏసీ ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పార్టీ ప్రకటించిన నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం
హుసేనాపురం వైసీపీ మహిళా సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని జగన్‌ తప్పుపట్టారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. మద్యం బెల్టు షాపులు, విద్యుత్‌ బిల్లుల మోత, నిరుద్యోగం, డ్వాక్రా రుణమాఫీ, రేషన్‌ షాపుల్లో 9 రకాల సరకులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను మహిళలు జగన్‌ దృష్టికి తెచ్చారు. వీటిపై తీవ్రంగా స్పందించిన జగన్‌.. ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు అధికారంలో కొనసాగడం ధర్మమా.. అని ప్రశ్నించారు. హుసేనాపురం మహిళా సదస్సులో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా... జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హుసేనాపురం నుంచి పాలుకూరు క్రాస్‌రోడ్స్‌, గోవిందదిన్నె మీదుగా సాగిన జగన్‌ పాదయాత్ర బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో జగన్‌ సమావేశమైన జగన్‌, వారి సమస్యలు తెలుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - కర్నూలు