కష్టాలు

18:53 - October 14, 2017

అనంతపురం : అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు కనబడటం లేదు. బాండ్ల పరిశీలన కోసం బాధితులు పోలీస్‌స్టేషన్ల ఎదుట బారులు తీరారు. కొంత మంది బాధితుల వద్ద రశీదులు లేకపోవడంతో.. ఆధారాలు లేవని పోలీసులు వెనక్కిపంపుతున్నారు. మరోవైపు రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లాపాపలతో వచ్చి ఎండలో అవస్థలు పడుతున్నామని... రద్దీ తగ్గించేందుకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. 

 

20:36 - August 29, 2017

అనంతపురం : ప్రభుత్వాలు మారుతున్నా నాయకులు మారుతున్నా అక్కడి ప్రజల బతుకులు మాత్రం మారటం లేదు. ఆ కాలనీ పంచాయితీగా ఏర్పడి 15 సంవత్సరాలైనా అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అనంతపురం జిల్లా రాజీవ్‌ కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 10 టీవీ ప్రత్యేక కథనం...
కాలనీలో కనిపించని అభివృద్ధి
అనంతపురము నగరానికి కూత వేటు దూరంలో ఉండే రాజీవ్ కాలనీ పంచాయితీలో ఎక్కువ శాతం కూలీ నాలీ చేసుకునే వారే నివాసం ఉంటున్నారు. రాజీవ్ కాలనీ పంచాయితీ ఏర్పడి 15 సంవత్సరాలు కావస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడింది.  ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్‌ భారత్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా రాజీవ్ కాలనీని అనంతపురము ఎమ్మెల్యే వైకుంటం ప్రభాకర్ చౌదరి దత్తత తీసుకున్నారు. కాని పంచాయితీ పరిధిలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని ఏదో చుట్టపుచూపుగా అలావచ్చి ఇలా పోతారేగాని అభివృద్ది గురించి పట్టించుకునే వారే లేరని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
వర్షం పడితే ఇంట్లోకి చేరుతున్న నీరు
వర్షం వస్తే కాలనీలోని నీళ్ళన్నీ ఇళ్లలోకి వస్తాయని గత వారం రోజులనుంచి వర్షాలు ఏకదాటిగా కురుస్తుండటంతో ఇళ్లలోకి వర్షపు నీటితోపాటు మురుగు నీరుకూడా చేరుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మురుగు నీటితో దోమల బెడద ఎక్కువైందని ..డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులబారిన పడుతున్నామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరూ తమని పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అంటున్నారు. 
నీటి సమస్యతో అల్లాడుతున్న జనం
కాలనీలో గత మూడు నెలలుగా త్రాగు నీటి సమస్యఎక్కువగా ఉందని వారానికి ఒక్కసారి మాత్రమే ఇంటికి నీటి సరఫరా అవుతుందంటూ మండిపడుతున్నారు. దీని వల్ల కాలనీలో గొడవలు జరుగుతున్నాయని  ఇంతకు ముందు ట్యాంకర్లతో త్రాగునీటి అందించేవారని.. ఇప్పుడు ట్యాంకర్లు కూడా రావటం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దీంతో తమ సమస్యలను ఎవ్వరికి చెప్పుకున్నా తీర్చేవారు లేరని గ్రామ పంచాయితీ వారు మాత్రం నీటి బిల్లులు వసూల్ చేస్తున్నారని అంటున్నారు. 
వర్షం పడితే కరెంట్ కూడా ఉండదని 
వర్షం పడితే కరెంట్ కూడా ఉంటదని చీకటిలో ఇంటినుంచి బయటికి రావాలన్నా బురదలో ఎక్కడ కింద పడతామో అని బయటికి రావాలంటే బయమేస్తోందని కాలనీ వాసులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజీవ్ కాలనీ లోని త్రాగు నీటి సమస్యను, రోడ్లను వేసి తమ సమస్యలను తీర్చాలని కాలనీవాసులు వేడుకుంటుంన్నారు.

 

16:36 - August 8, 2017

హైదరాబాద్ : మెట్రో పనుల కారణంగా గ్రేటర్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు పెరిగిపోయాయి. ప్రధానంగా మైత్రీవనం, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:39 - August 8, 2017

హైదరాబాద్ : మిర్చిధరలు పెరిగాయి.. రైతుగుండెలు మండుతున్నాయి. కర్షకుడి నోట్లో మట్టిగొట్టారని రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంటకు ధర పెరిగితే సంతోషించాల్సిన అన్నదాతలు ఎందుకు కుమిలిపోతున్నారు..? మిర్చి రైతుల ఆగ్రహానికి కారణం ఏంటి..?  మార్కెట్‌ మాయాజాలంలో ప్రభుత్వాల పాత్ర ఎంత..? వాచ్ దిస్‌ స్టోరీ..
దారుణంగా నష్టపోయిన మిర్చి రైతులు 
క్వింటా మిర్చి ధర ఏకంగా 13వేల రూపాయలకు పైగా పలుకుతోంది.. సరిగ్గా ఇదే ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో  కర్షకుల కంట కన్నీరు పెట్టిస్తోంది. గత సీజన్‌లో తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులు దారుణంగా నష్టాలయ్యారు. క్వింటా మిర్చి ధర కేవలం 3వేల దిగువన పలకడంతో  లక్షలాది రూపాయల అప్పుల్లో కూరుకు పోయారు. అంతకు ముందు సీజన్‌లో 10వేల రూపాయల వరకు రేటు ఉంటంతో ఏపీ, తెలంగాణల్లో రైతులు పెద్ద ఎత్తున మిర్చి పంటను సాగు చేశారు. ఇబ్బడి మబ్బడిగా దిగుబడి వచ్చింది. దీంతో ధరలు ఒక్కసారిగా  పడిపోయాయి.  దీంతో  పండిన పంటను నిల్వ చేసుకునే వీలు లేక.. అప్పుల వాళ్ల ఒత్తిడికి తాళలేక వచ్చినకాడికే పంటను తెగనమ్మకున్నారు. ఆలస్యంగా మేలుకున్న ప్రభుత్వం క్వింటాలుకు 5వేల మద్దతు ధరను, మరో 15వందలు ఖర్చుల కింద మొత్తం 6,500 రూపాయలను రైతుకు చెందేలా ఆదేశాలు జారీ చేసింది. కాని అప్పటికే పంటంతా చేజారి పోవడంతో రైతులు ఉసూరుమన్నారు. అగ్గువ ధరలకే మిర్చిని కొనుకున్న వ్యాపారులు సొంత గోడౌన్లలో రైతుల శ్రమను పోగేసుకున్నారు. చివరికి  రైతుకు దక్కాల్సిన మద్దతు ధరలు కూడా వ్యాపారుల జేబుల్లోకే చేరాయని  రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.  
వ్యాపారుల కొమ్ముగాస్తున్న ప్రభుత్వాలు..! 
ఇదంతా పాతకథేకదా.. ఇపుడు కొత్తగా రైతుగుండెలు ఎందుకు మండుతున్నాయో అంటే.. కర్షకుల చేతిలోనుంచి పంటంతా వ్యాపారుల గోడౌన్లలోకి చేరిపోయాక ఇపుడు ధరలు మిర్చిఘాటుతో పోటీ పడుతున్నాయి. నిన్నటిదాకా ఎక్స్‌పోర్టు లేదనే పేరుతో ధరలను తొక్కిపట్టిన వ్యాపార వర్గాలు .. ప్రస్తుతం  ఎగుమతులు పెరిగాయంటున్న వ్యాపారులు   తమ వద్ద నిల్వ చేసుకున్న మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లరూపాయలు గడిస్తున్నారు.  ప్రస్తుతం మార్కెట్లో తేజ, బాడిగ, 334రకం మిర్చికి  13,500 రూపాయల వరకు పలుకుతోంది.  దీంతో రైతన్నలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. తమకూ పంట నిల్వ చేసుకునే గోడౌన్ల సౌకర్యం ఉంటే.. ఆమేరకు తమ శ్రమఫలితాన్ని పొందేవారమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధరలు పతనమైన సమయంలో రైతుకు ఏదో మేల చేస్తున్నట్టు నటిస్తున్న ప్రభుత్వాలు  పరోక్షంగా వ్యాపారుల కొమ్ముకాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
మిర్చిరైతులను ఊరిస్తున్న పెరిగిన ధరలు 
ఇక పెరిగిన ధరలు ఊరిస్తుంటే  మరోసారి  తెలుగు రాష్ట్రాల రైతన్నలు మిర్చిపంటను పెద్ద ఎత్తున సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు. మంచి ధరలు పలికితే ఈసారన్నా అప్పుల బాదల నుంచి బయటపడొచ్చన్న ఆశాభవవంతో ఉన్నారు. అయితే తీరా పంట చేతికొచ్చేనాటికి  మళ్లీ ఎప్పటిలాగే ధరలు తగ్గుతాయేమోనన్న ఆందోళన కూడా అన్నదాతల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాపారుల మాయాజాలానికి అడ్డుకట్ట వేయాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

 

17:53 - August 5, 2017

ప్రకాశం : ఇది ఎండాకాలం కాదు... అయినా అక్కడ ప్రజల గొంతులెండుతున్నాయి. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు అవస్థలు పడుతున్నారు.  నీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా  పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. దీంతో తాగునీరు కోసం వారంతా పోరుబాట పట్టారు.  ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నీటి కష్టాలపై కథనం...
మంచినీరు దొరకక అల్లాడుతోన్న జనం 
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం మంచినీరు దొరకక అల్లాడుతోంది. ప్రజల దాహం కేకలు మొదలయ్యాయి. యర్రగొండపాలెంలో కొంతకాలంగా తాగడానికి నీరులేక ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు.  ఎస్‌టీ కాలనీ, మసీదు వీధుల్లో తాగునీరు లేక జనం అవస్థలు పడుతున్నారు. దాహంతో అల్లాడుతున్నారు. ఒకరోజు కాదు.. రెండు రోజులుకాదు... కొన్ని నెలలుగా ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. 
తాగునీటి సమస్య తీర్చాలి : స్థానికులు
తమ కాలనీల్లో తాగునీటి సమస్య తీర్చాలంటూ స్థానికులు ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నారు. తాగడానికి గుక్కెడు మంచినీరు లేక అల్లాడుతున్నామంటూ గోడు వెల్లబోసుకున్నారు. అధికారులచుట్టూ తిరిగారు. అయినా వారి సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.  దీంతో వారంతా పోరుబాట పట్టారు.  పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.  సర్పంచ్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
మహిళల ఆందోళనతో ట్రాఫిక్‌ జాం
మహిళల ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు వారించడంతో మహిళలంతా ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయానికి వెళ్లారు.  అక్కడ అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడారు.  తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. వారంలోగా సమస్య పరరిష్కారం కాకపోతే... మళ్లీ ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.

 

21:28 - July 27, 2017

మహారాష్ట్ర : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కష్టాలు తీరేలా కనిపించడం లేదు. వీఐపీ స్టేట‌స్ వ‌ల్లే సంజ‌య్‌ద‌త్‌ను ముందుగానే జైలు నుంచి విడుద‌ల చేసిన‌ట్లు భావిస్తే.. అత‌న్ని తిరిగి జైలుకు పంపొచ్చని మ‌హారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు స్పష్టంచేసింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో జైలుకు వెళ్లిన సంజయ్‌దత్‌- సత్‌ప్రవర్తన కారణంగా 8 నెలల ముందే విడుదలయ్యారు. ద‌త్ ప్రవ‌ర్తన బాగున్నట్లు అధికారులు ఎలా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు? అత‌ను శిక్షా కాలంలో స‌గం పెరోల్‌పై బ‌య‌టే ఉన్నపుడు అత‌ని ప్రవ‌ర్తన‌ను ఎలా అంచ‌నా వేశారని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం- సంజయ్‌ విడుదలపై నిబంధనలు అతిక్రమిస్తే మళ్లీ అతనికి జైలుకు పంపడంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టుకు తెలిపింది. 1993 బాంబు పేలుళ్ల సంద‌ర్భంగా సంజ‌య్‌ద‌త్ అక్రమంగా ఆయుధాలు క‌లిగి ఉన్నాడ‌న్న కేసులో సుప్రీంకోర్టు అత‌నికి ఐదేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. సంజయ్‌ను 8 నెలలు ముందుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త ప్రదీప్‌ భాలేకర్ ముంబై హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

22:09 - July 21, 2017
17:12 - July 21, 2017

మహబూబ్ నగర్ : ప్రాజెక్ట్‌ జలకలతో నిండుకుండలా మారింది. కానీ రైతులకు మాత్రం కడుపు నిండడం లేదు.. జీవనాధారమైన ప్రాజెక్ట్‌ నుంచి ఈ ఏడాది చుక్కనీరు బయటకు రావడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆయకట్టు రైతుల పొలాల్లోకి నీరు పారడం లేదు. దీంతో అన్నదాతలంతా లబోదిబోమంటున్నారు.. పాలమూరు కర్షకుల కడగళ్లపై ప్రత్యేక కథనం. 
రైతుల వరప్రదాయిని జూరాల ప్రాజెక్ట్‌ 
ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు జూరాల ప్రాజెక్ట్‌ వరప్రదాయిని. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తెలుగు  నేలను ముద్దాడుతూ మొదటగా చేరేది ఈ ప్రాజెక్టుకే. కొన్ని వేల రైతు కుటుంబాలు ఈ జలాశయాన్నే నమ్ముకునే సాగు చేస్తున్నాయి. దశాబ్దానికి పైగా ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తొలగిస్తోంది. ఇదంతా గతం. చెంతనే కృష్ణమ్మ పారుతున్నా పంటపొలాలకు నీరందక బీడుభూములుగా మారుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తోంది. 
నీటిని విడుదల చేయని ప్రభుత్వం
జూరాల ప్రాజెక్ట్‌ కింద కొన్నేళ్లుగా  కుడి, ఎడమ కాల్వల కింద లక్ష ఏడువేల ఎకరాలలో రైతులు సాగుచేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు కళకళలాడాల్సిన సమయంలో.. చుక్క నీరులేక  వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది కుడి ఎడమ కాల్వలకు ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు..దీనికి ప్రధాన కారణం ఇసుక రవాణా కోసం నీటిని నిలుపుదల చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన  రైతులు ఆందోళనబాట పట్టారు. రాస్తారోకోలు చేస్తూ జూరాల డ్యాంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతన్నలకు బాసటగా విపక్షాలు భాసటగా నిలుస్తున్నాయి. 
పంటలను కాపాడాలి : రైతులు 
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయ కట్టు రైతులు కోరుతున్నారు. ఇసుక రవాణా నిలిపివేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం నాటికి నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తామే గేట్లు ఎత్తివేస్తామని డీకే అరుణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఉత్కంఠ రేపుతోంది. 

 

17:09 - July 20, 2017

అనంతపురం : వరుస కరువులతో అనంత రైతు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో ఒకేసారి వర్షం కురిపించి వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో రైతులు పూర్తిగా సంక్షభంలో కూరుకుపోయారు. రోజురోజుకీ దీనావస్థలో కూరుకుపోతున్న అనంత రైతన్నపై 10టీవీ ప్రత్యేక కథనం. 
అతి తక్కువ వర్షాపాతం 
అనంతపురం జిల్లాలో ఎప్పుడూ అతి తక్కువ వర్షాపాతం నమోదవుతుంది. దీంతో జిల్లాలో వ్యవసాయం దినదినగండంగా మారుతోంది. ఏటా అరకొర వర్షాలతో వేసిన పంటల దిగుబడి చేతికి రాక రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. దీంతో పంటలు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా లక్షల హెక్టార్ల భూములు బీళ్లుగా మారుతున్నాయి. జిల్లాలో ఎక్కువ శాతం వేరు శనగ పంటపై ఆధారపడే రైతుకు.. ఈ ఏడాది కూడా ఆశాభంగం తప్పలేదు. 
8 లక్షల హెక్టార్లలో పంటలు సాగు 
అనంతపురం జిల్లాలో 8 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంది. కానీ 47 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు పంట సాగుకు ఇష్టపడుతున్నారు. ఇది అధికారులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ఇంకా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని.. పంట సాగుకు అనుకూల వాతావరణం ఉందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన  కంది, రాగి, జొన్న, కొర్ర, పొద్దుతిరుగుడు సాగు చేసినా.. కేవలం 87 వేల హెక్టార్లలో మాత్రమే పండించే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడితే.. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి సాధించవచ్చని.. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు. విత్తన కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు వస్తే.. ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాల సహకరిస్తామంటున్నారు. 
ఇక పంట సాగు కష్టమే : రైతులు
అయితే ప్రతీ యేటా వేరు శనగ సాగు చేస్తూ నష్టాలను చూస్తున్న అనంత రైతు మాత్రం.. ఇక పంట సాగు కష్టమేనంటున్నాడు. 10 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా వ్యవసాయ కూలీగా మారాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. గతేడాది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన రెయిన్‌ గన్‌ల ద్వారా అయినా.. వేసిన పంటను కాపాడాలని రైతులు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతు కనుమరుగు కాక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

20:12 - June 9, 2017

నిర్మల్ : జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు 25 రోజులుగా మార్కెట్ యార్డులలో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోతుంటే ఆందోళన చెందుతున్నారు. నిబంధనల పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. కొత్త పంటలేసుకునే సమయం వచ్చినా ఇంకా మార్కెట్ యార్డులలోనే మగ్గిపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీనిపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

Pages

Don't Miss

Subscribe to RSS - కష్టాలు