కాంగ్రెస్

14:48 - February 25, 2017

హైదరాబాద్: పదిహేనేళ్లుగా మణిపూర్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ భ్రష్టుపట్టించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. మణిపూర్‌ని తూర్పున ఉన్న స్విట్జర్లాండ్‌ అనేవారని, కానీ అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ఇంఫాల్‌లో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ప్రధాని కాంగ్రెస్‌ పాలనను ఎండగట్టారు. బిజెపికి మణిపూర్‌ ఆదరణ పెరిగిందని మోది అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ను గద్దె దింపినట్లే మణిపూర్‌లోనూ కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని మోది ఓటర్లకు పిలుపునిచ్చారు. మణిపూర్‌ రైతులకు నష్టం కలిగించిన కాంగ్రెస్‌కు అధికారంలో ఉండే అర్హత లేదని విమర్శించారు. గత 6 నెలల్లో కాంగ్రెస్‌ నుంచి పలువురు మంత్రులు, నేతలు బిజెపిలో చేరారు. 60 మంది సభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీకి మార్చి 4, 8 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది.

21:30 - February 24, 2017

ముంబై : స్థానిక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంపై శివసేన భగ్గుమంది. గెలుపే లక్ష్యంగా డబ్బుతో పాటు ప్రభుత్వ యంత్రంగాన్ని బిజెపి దుర్వినియోగం చేసిందని శివసేన ఆరోపించింది. బిఎంసి పీఠం తమదేనన్న ధీమా వ్యక్తం చేసిన శివసేన- బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని తెలిపింది. అవసరమైతే కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాలని చూస్తోంది. మరోవైపు బిజెపి-శివసేన కలవడం తప్ప మరో మార్గం లేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి స్పష్టం చేశారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బిజెపి అనూహ్య విజయం సాధించడంపై శివసేన మండిపడుతోంది. స్థానిక ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ధనబలంతో పాటు కేంద్రం అన్నిరకాల సహకారం అందించడంతోనే బిజెపి విజయం సాధించగలిగిందని సామ్నా పత్రికలో శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే ఓటర్‌ లిస్టులో 12 లక్షల మంది మరాఠీ ఓటర్ల పేర్లను తొలగించారని తెలిపింది. కాంగ్రెస్‌ పాలనలో కూడా తమపై ఇలాంటి కుట్రలు జరగలేదని.... తమను ఓడించడానికి కమలం ఎన్ని ప్రయత్నాలు చేసినా నెంబర్‌ వన్‌గా తామే నిలిచామని శివసేన పేర్కొంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బిజెపిపై తమ పోరు కొనసాగుతుందని బ్రిహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి తమదేనని శివసేన స్పష్టం చేసింది.

227 వార్డులు..
బీఎంసీలోని 227 వార్డులకు గాను శివ సేనకు 84, బిజెపికి 82, కాంగ్రెస్‌కు 31, ఎన్సీపీకి 9, ఎంఎన్‌ఎస్‌కు 7 స్థానాలు దక్కాయి. బీఎంసీ మేయర్‌ పదవి దక్కాలంటే 114 స్థానాలు అవసరం. గత 25ఏళ్లుగా బీఎంసీని ఏలుతున్న శివసేన- ఈసారి కాంగ్రెస్‌ మద్దతుతో తిరిగి మేయర్‌ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు కాంగ్రెస్‌ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి శివసేనను తమ దారికి తెచ్చేకునే విధంగా పావులు కదుపుతోంది. శివసేన కోసం తమ తలుపులు తెరిచే ఉంచామని.... రెండు పార్టీలు మళ్లీ ఏకం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రావ్‌సాహెబ్‌ దనవే పిలుపునిచ్చారు. శివసేన పునరాలోచించుకుని తమవైపు మళ్లాలని బిజెపి పేర్కొంది. అయితే బిజెపి ముందు తలవంచడానికి శివసేన ఒప్పుకునే ప్రసక్తే లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. శివసేనకు బదులు ఎన్సీపీ, ఎంఎన్‌ఎంస్ తదితర చిన్న పార్టీల సహకారంలో మేయర్‌ పదవి దక్కించుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అనూహ్య విజయం సాధించడం ద్వారా శివసేనకు ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయి. 1980-90 ప్రాంతంలో బాలథాకరే సహకారంతో ముంబైలో చిన్నపార్టీగా కొనసాగిన బిజెపి- తమ కోటను బీటలు వారేలా చేస్తుందని శివసేన అస్సలు ఊహించలేదు. మొత్తానికి ముంబై మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

19:42 - February 23, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల వెంకన్నకు సమర్పించిన ఆరభణాల డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో లెక్క చెప్పాలని కాంగ్రెస్‌ నేత వీ హనుమంతరావు డిమాండ్‌ చేశారు. మొక్కులు చెల్లించుకోడానికి సొంత డబ్బు ఖర్చు చేయకుండా ప్రజా ధనం వెచ్చిస్తే రాబోయే  ముఖ్యమంత్రులకు  ఇదొక ఆనవాయితీగా మారే అవకాశం ఉందన్నారు. 

 

19:53 - February 21, 2017

యూపీ :రాహుల్‌, అఖిలేశ్‌ సభలో అపశృతి చోటు చేసుకుంది. అలహాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఎన్నికల ప్రచారంలో రోడ్‌షో నిర్వహిస్తున్న రాహుల్‌.. కాసేపట్లో వేదికపైకి రావాల్సి ఉంది. ఈలోపే ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యకర్తలు ఒక్కసారిగా వేదికపైకి రావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది.

21:09 - February 19, 2017

వికారాబాద్ : కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శల వర్షం కురిపించారు. హస్తం నేతలు రోజుకోమాట మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తికాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌లపై మహబూబ్‌నగర్‌లో హర్షవర్దన్‌ లాంటి వారితో దావాలు వేయిస్తున్నారని మండిపడ్డారు. గత సీఎంలు వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేవెళ్ల, ప్రాణహితను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.

 

08:33 - February 19, 2017

మన్సులకు క్షుద్రపూజలు జెయ్యంగ జూశ్నంగని..? పార్టీలకు జెయ్యంగ సూశిండ్రా మీరు ఎన్నడన్నా..? నేనైతె ఎన్నడు సూడలే..? ఏకంగ కుందూరు జానాలు ఎగిరేశిన కాంగ్రెస్ పార్టీ జెండాకు క్షుద్రపూజలు జేశిండ్రంటే.. సూడుండ్రిగ.. మరి జానాలు పనిజేస్తందుకా..? లేకపోతె జానాలు పార్టీని ఆగం జేస్తందుకా అనేది తెల్వదిగని.. మరి ఎక్కడా..ఎవరు చేసిండ్రు..ఇంకా విషయాలకు వీడియో క్లిక్ చేయుండి.

06:44 - February 18, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తమ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ.. పార్టీలు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన ఎంవీఎస్.శర్మ స్థానంలో ఈసారి కార్మిక నాయకుడు అజాశర్మ పోటీలో నిలిచారు. అటు కార్మిక వర్గాలలోనూ, ఇటు ఉపాధ్యాయ, యువతలోనూ అజాశర్మకు మంచి పట్టు ఉండటంతో.. మరోసారి గెలుపు తనదే అంటున్నారు పీడీఎఫ్‌ నాయకులు. అజా శర్మ గతంలో ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కార్యదర్శిగా పనిచేశారు..ఆ సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపై పాదయాత్ర కూడా చేశారు. ఆజాశర్మకు 210 సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అందరికంటే ముందుగా నామినేషన్‌ వేసిన అజాశర్మ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వివాదాలకు దిగిన టీడీపీ, బీజేపీలు ఎట్టకేలకు ఒక అవగాహనకు ..

అటు నిన్నటిదాకా ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై వివాదాలకు దిగిన టీడీపీ, బీజేపీలు ఎట్టకేలకు ఒక అవగాహనకు వచ్చాయి. ఎమ్మెల్సీగా బీజీపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి.. భవిష్యత్తులో జరగనున్న గ్రేటర్‌ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సహకరించేలా రెండుపార్టీలు అంగీకారానికి వచ్చాయి. దీంతో బీజేపీ నేత పీవీ మాధవ్‌ కు సీటు కేటాయించడంతో ఆయన ఆలస్యంగా ప్రచారంలోకి దిగారు.

వామపక్షాలు బలపరుస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థి..

ఓవైపు వామపక్షాలు బలపరుస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థి.. మరోవైపు టీడీపీ బలపరుస్తున్న బీజేపీ అభ్యర్థి రంగంలో ఉండటంతో.. ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన స్థానాన్ని నిలబెట్టుకోడానికి పీడీఎఫ్‌-ఇతర ప్రజాసంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక ఆలస్యంగా బరిలోకి దిగిన టీడీపీ-బీజేపీ అభ్యర్థి విశాఖ నగరంలోని కళాశాలల యాజమాన్యాల ద్వారా ఇప్పటికే పలు ఓట్లను నమోదు చేయించారు. మొత్తం లక్షా అరవై వేల పట్టబద్రుల ఓట్లు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం విశాఖ నగరంలోనే ఉండటంతో.. అందరు అభ్యర్థులు విశాఖపైనే ఎక్కువగా దృష్టిపెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాంగ్రెఅభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు..

కాంగ్రేస్ పార్టీకూడా విజయనగరం డీసీసీ అద్యక్షుడిగా ఉన్న యడ్ల ఆదిరాజును తమ అభ్యర్ధిగా రంగంలోకి దించింది. ఇదిలావుంటే ఈసారి ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. వారిలో లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తి తన విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక..ఇంతవరకు తమ అభ్యర్ధిని ప్రకటించని వైసీపీ .. స్వతంత్రులకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల కోసం ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంధ్ర రాష్ర్ట ప్రభుత్వాల పనితీరుపై ఈ ఎన్నికలు రెఫరెండం అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అటు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీలు తమ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పోరు పోటా పోటిగా సాగే అవకాశం ఉంది.

22:06 - February 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారుస్తున్నారని... పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు... అప్పుల కోసమే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.. ఇలా రుణాలు తీసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.. 

 

06:43 - February 15, 2017

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లో 69 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా... యూపీలో రెండో విడత పోలింగ్‌లో 11 జిల్లాల పరిధిలోని 67 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. యూపీ ఎన్నికల్లో 720 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 సీట్లుండగా 69 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ 10 వేల 685 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 75 లక్షల 13 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కర్ణప్రయాగ్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. 69 అసెంబ్లీ స్థానాల కోసం 628 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌-బిజెపిలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా... బిఎస్పీ 68, ఉక్రంద్‌ కె 53, ఎస్పీ 21, వామపక్షాలు పది స్థానాల్లో పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్‌, బిజెపిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

11:05 - February 12, 2017

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై స‌ర్కార్ చేస్తున్న ప్రచారాన్ని గ‌ట్టిగా తిప్పికొట్టాల‌ని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్. తాము క‌ట్టిన ప్రాజెక్టుల‌ను టిఆర్ఎస్ నిర్మాణం చేపట్టినట్లు క‌ల‌ర్ ఇస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్‌ల పేరుతో ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తున్నారు. 
స‌ర్కారు విధానాలను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక 
ఇప్పుడు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రాజెక్టుల వార్‌ నడుస్తోంది. అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైన్‌పై ఎక్కువ ఫోకస్‌ చేసింది ప్రభుత్వం. ప్రాజెక్టులపై తమకే చిత్తశుద్ధి ఉందని ప్రచారం కూడా చేసుకుంటుండటంతో కాంగ్రెస్‌ అలర్ట్‌ అయ్యింది. త‌మ హ‌యాంలో నిర్మించిన ప్రాజెక్టుల‌ను రాష్ర్ట ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్‌ల‌పై కేసీఆర్‌ చెబుతున్నదొక‌టి... చేస్తున్న దొక‌ట‌ని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. స‌ర్కారు విధానాలను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికతో ముందుకెళ్తోంది. 
ప్రభుత్వ తీరును ఎండగడుతున్న కాంగ్రెస్ 
మిడ్‌మానేరు ప్రాజెక్టు విష‌యంలో గ‌తంలో కేసీఆర్ చెప్పిన మాటలను ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి ఇప్పటికే గట్టిగా తీసుకెళ్లారు కాంగ్రెస్‌ నేతలు. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. పాల‌మూరు..రంగారెడ్డి ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాకు జ‌రుగుతున్న అన్యాయంపై త్వర‌లోనే ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌ కూడా ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు.
పెండింగ్‌లో ప్రాజెక్టులను పూర్తి పూర్తి చేయాలి : డీకే అరుణ 
ఇటు పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీ.కే అరుణ ఉద్యమిస్తూనే ఉన్నారు. తమ హయంలో ప్రారంభించిన ప్రాజెక్టులను.. తామే తీసుకొచ్చామన్నట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇటు క‌ల్వకుర్తి ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి పోరుబాట పట్టారు. రాష్ర్ట ప్రభుత్వం తమ నియోజకవర్గానికి సాగునీరు రాకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు అపసోపాలు పడుతున్నారు. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బలంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - కాంగ్రెస్