కాంగ్రెస్‌

22:01 - March 16, 2018

గుంటూరు : ప్రత్యేక హోదాపై రాహుల్‌ గాంధీ మద్దతు పలకాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడాల్సిన రీతిలో పోరాడతామన్నారు. అవిశ్వాసంపై వైసీపీకి క్లారిటీలేదన్నారు. అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదన్న టీడీపీ మళ్లీ అవిశ్వాసం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 

 

18:34 - March 10, 2018

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి హరీష్‌రావుపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గతంలో కేసీఆర్‌ను విబేధించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరుదామనుకున్నది నిజము కాదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత పదవిని ఇవ్వనందునే హరీష్‌రావు వైఎస్‌ఆర్‌ను కలిశారని చెప్పారు. అలాగే 2009 ఎన్నికల తర్వాత.. కేసీఆర్‌, కేటీఆర్‌ను పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని హరీష్‌రావు ప్రయత్నించారని.. అయితే దురదృష్టవశాత్తు వైఎస్‌ఆర్‌ అప్పుడే చనిపోయారని చెప్పారు. 
అవినీతికి పాల్పడ్డ ఈటల :  రేవంత్‌
పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత.. పది జిల్లాల పేరుతో రేషన్‌కార్డులు ప్రింట్‌ చేయించారని.. ఇందులో కోటీ 50 లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఈ రేషన్‌కార్డులన్నీ నిరుపయోగంగా మారాయన్నారు. 

 

19:18 - March 5, 2018

ఢిల్లీ : ఏపీకి న్యాయం చేయాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ఆందోళన చేపట్టారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. చట్టాలు చేసే సభలో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాజ్యసభలో తన వంతు పోరాటం చేస్తున్నట్లు కేవీపీ తెలిపారు. 

 

21:45 - March 4, 2018

హైదరాబాద్ : జాతీయస్థాయిలో మార్పు రావాల్సిన అవసరముందన్న కేసీఆర్‌కు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేదేమీలేదని.. ఖచ్చితంగా నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ కూటమి ఏర్పడాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. ప్రజల ఆశీస్సులతో ఈస్థాయికి వచ్చిన తనకు అందరి మద్దతు ఉంటే... ఖచ్చితంగా కొత్త మార్గదర్శకత్వం సూచిస్తానని స్పష్టం చేశారు గులాబీ దళపతి. 

పది లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని.. తనను పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల దీవెనలు ఉంటే ఈ దేశానికి ఓ కొత్త దశ దిశ చూపిస్తానన్నారు కేసీఆర్‌. జాతీయ స్థాయిలో మార్పు రావాల్సిన అవసరముందని ప్రకటించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీస్థాయిలో నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్‌కు తరలివచ్చారు. ప్రగతి భవన్‌కు వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. దేశంలో పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరముందన్నారు. జాతీయస్థాయిలో నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ పార్టీ అవతరించాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. 

నిన్న కేవలం నాలుగు మాటలు చెబితే దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు కేసీఆర్‌. పశ్చిమబంగా నుంచి మమతాబెనర్జీ ఫోన్‌ చేసి... తన సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. అలాగే జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరన్‌, మహారాష్ట్ర నుంచి కొందరు ఎంపీలు ఫోన్‌ చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పాలన ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినవారు రాజకీయ ఆటలాడుతున్నారే తప్ప వాస్తవ దృక్పథంతో పని చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే.. నాలుగేళ్లలో ఏం జరగలేదన్నారు. చైనా 24 ఏళ్లలోనే అమెరికా తర్వాత అత్యంత బలమైన దేశంగా మారిందన్నారు. చైనాలో అయినప్పుడు.. మన దగ్గర ఎందుకు కాదు. దేశంలో పేదరికం పోవాలంటే కథలు, ఉపన్యాసాలు చెబితే సరిపోదన్నారు. జపాన్‌, చైనా, సింగపూర్‌ ఎలా పైకొచ్చాయో ఈ దేశం కూడా అలా పైకి రావాలి. ధైర్యం, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వందశాతం వచ్చి తీరుతుందన్నారు. 

కేంద్ర ప్రభుత్వానికి దవాఖాన, మున్సిపల్‌ మోరీల వద్ద ఏం పని అని కేసీఆర్‌ ప్రశ్నించారు. వాళ్లు చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలపై అజమాయిషీ చలాయిస్తున్నారన్నారు. రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతున్నారని మాట్లాడుతుంటే జైల్లో పెడతామంటూ బెదిరిస్తున్నారన్నారు. కుంభకోణాలు చేసే వాళ్లు భయపడతారని.. కొందరిని పట్టుకుంటే భస్మమవుతారన్నారు. ఈ దేశంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరముందని... మార్పు రావాలంటే ఎక్కడో ఒకచోట మొదలవ్వాలని అన్నారు. కేంద్రం వద్ద కేవలం పరిమిత అధికారాలు మాత్రమే ఉంచుకుని.. మిగతా అధికారాలు రాష్ట్రానికి ఇస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజల కోసం అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. 

తనకు మద్దతు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల దీవెనలు ఉంటే ఈ దేశానికి ఓ కొత్త దశ, దిశ చూపిస్తానన్న కేసీఆర్‌... జై తెలంగాణ, జై భారత్‌ అంటూ ప్రసంగాన్ని ముగించడం కొసమెరుపు.

13:49 - February 11, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా మోదీ అసత్యాలు, అబద్దాలు చెప్పి.. ప్రధాని పదవి ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. నిండుసభలో కాంగ్రెస్‌ నేతలను తూలనాడటం సరికాదన్నారు. 

 

08:48 - February 8, 2018

ఢిల్లీ : లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోది కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రసంగించారు. కాంగ్రెస్‌ చేసిన పాపాలే ఇప్పటికీ వెంటాడుతున్నాయన్నారు. రాష్ట్రాలనే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్‌ విభజించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ చరిత్రే విభజించడమని మోది దుయ్యబట్టారు. పార్లమెంట్‌ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. 
టిడిపిని బుజ్జగించేందుకు తెరపైకి విభజన అంశం 
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ఎండగడుతూ మోది ప్రసంగించారు. టిడిపిని బుజ్జగించేందుకు మోది విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారు. వాజ్‌పేయి హయాంలో 3 రాష్ట్రాలను విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని... కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మోది అన్నారు. రాజకీయ లబ్ది కోసం పార్లమెంట్‌ తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు.
12వ శతాబ్దంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందన్న మోడీ
కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించలేదని...12వ శతాబ్దంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని...ప్రజాస్వామ్యం పాఠాలు మాకు వల్లించాల్సిన అవసరం లేదని మోది చెప్పుకొచ్చారు. దేశంలో 90 సార్లు 356 ఆర్టికల్‌ను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ చేసిన పాపాలు 70 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు అనుభవించాల్సి వస్తోందని దుయ్యబట్టారు. సర్దార్‌ పటేల్‌ ప్రధాని అయితే కశ్మీర్‌లోని ఓ భాగం పాకిస్తాన్‌లో ఉండేది కాదన్నారు. దళిత ముఖ్యమంత్రి, అంజయ్య, నీలం సంజీవరెడ్డిలను అవమానించిన ఘనత కాంగ్రెస్‌దని పేర్కొన్నారు. 
తాను చెప్పేది వినే ధైర్యం లేక ప్రసంగాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ సభ్యులు : మోడీ 
తాను చెప్పేది వినే ధైర్యం లేకనే కాంగ్రెస్‌ సభ్యులు తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. పార్టీలు శాశ్వతం కాదు.. దేశమే శాశ్వతమన్న  విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. పార్టీల కతీతతంగా తాము అభివృద్ధి చేపట్టామని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ హయంలో రోజుకు 11 కిలోమీటర్లు మేర రోడ్డు వేస్తే.. తమ హయాంలో రోజుకు 22కి.మీల మేర మూడేళ్లలో లక్షా 20 కి.మీ రహదారులు వేసినట్లు చెప్పారు. ఖర్గే ఎంపీగా ఉన్న బీదర్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం 1020 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ వేసిందని... ఖర్గే రైల్వేమంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని మోదీ డిమాండ్‌ చేశారు.  లక్షకు పైగా పంచాయతీల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. 
ఆధునిక టెక్నాలజీతో ఆధార్‌ మరింత పటిష్టం : ప్రధాని
ఆధునిక టెక్నాలజీతో ఆధార్‌ను మరింత పటిష్టం చేశామని ప్రధాని తెలిపారు. దీంతో ప్రభుత్వ పథకాలు నేరుగా పేదలకు చేరుతున్నాయని, దళారులు, అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందని మోది పేర్కొన్నారు. టిడిపి, వైసిపి ఎంపీలు, కాంగ్రెస్‌ సభ్యుల నినాదాల నడుమ మోది ప్రసంగం కొనసాగింది. 

 

19:55 - February 5, 2018

నల్గొండ : బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఈమేరకు మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అయ్యిందన్నారు. ఈ ప్రయత్నాలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై ఈనెల 10 నుంచి భీమవరంలో జరిగే రాష్ట్ర సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. 

 

22:00 - February 4, 2018

నల్గొండ : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని లెఫ్ట్‌ నేతలు స్పష్టం చేశారు. రాజ్యాధికారమే లక్ష్యంగా వామపక్షపార్టీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు నల్లగొండలో ఘనంగా మొదలయ్యాయి. అన్ని వామపక్ష పార్టీలతో కలిసి విశాల ఐక్య ఉద్యమాలు నిర్మించనున్నట్టు సమావేశంలో సీపీఎం నాయకులు తెలిపారు.
సీపీఎం మహాసభలు ఘనంగా ప్రారంభం
నల్లగొండ పట్టణం ఎర్రగొండగా మారింది. ప్రధాన వీధులన్నీ అరుణవర్ణశోభితమయ్యాయి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం ఎరుపెక్కింది. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సీపీఎం మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రెడ్‌ వాలంటీర్లు కవాతు 
మహాసభల ప్రారంభసూచికగా నగరంలో సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. రెడ్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. ఎర్రజెండాలు చేతబూని రెడ్‌షట్‌ వాలంటీర్లు నిర్వహించిన కవాతు ప్రధాన వీధుల గుండా సాగింది. స్థానిక సీపీఎం కార్యాలయం దొడ్డికొమురయ్య భవన్‌ నుంచి ప్రారంభమైన ఈ కవాతు...మహాసభలు జరుగుతున్న ప్రాంగణం లక్ష్మీ గార్డెన్స్‌ వరకు కొనసాగింది. ఈ కవాతులో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతోపాటు రాష్ట్ర సీపీఎం నాయకత్వం పాల్గొంది.
బడ్జెట్‌లో సామాన్యులపై పన్నుల భారం : ఏచూరీ
లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులపై పన్నుల భారం మోపారని విమర్శించారు. ధనికులపై పైసా పన్నువేయలేదని... కార్పొరేట్‌ శక్తులకు, సంపన్నులకు మోదీ ప్రభుత్వం వత్తాసుపలుకుతోందని దుయ్యబట్టారు. రైతుల రుణాల మాఫీ చేయమంటే డబ్బులు లేవన్న కేంద్ర ప్రభుత్వం... సంపన్నులు తీసుకున్న రెండు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం సిగ్గుచేటన్నారు.
దళితులు, మైనార్టీలపై పెరిగిన దాడులు : బివి.రాఘవులు  
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు లైంగిక దాడులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ నుంచి భారత దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
వామపక్షాలు అధికారంలోకి రావడం తథ్యం : తమ్మినేని 
రాన్నున్న రోజుల్లో వామపక్షాలు అధికారంలోకి రావడం తథ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నంగా ఎదుగుతున్నామన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా సీపీఎం కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఇందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడిందన్నారు. సీపీఎం మహాసభలు 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భవిష్యత్‌ ఉద్యమ కార్యక్రమాలపై ఈ మహాసభల్లో చర్చించనున్నారు.

 

07:36 - January 10, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కార్‌పై .. కాంగ్రెస్‌ మళ్లీ ధ్వజమెత్తింది. ప్రభుత్వం కరెంట్‌ ద్వారా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుందని.. విమర్శలు గుప్పించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై శ్వేతపత్రంపై విడుదల చేయాలని సవాల్‌ విసిరింది.
నిరంతర విద్యుత్ సరఫరా వెనుక అవినీతి : రేవంత్ రెడ్డి 
కేసీఆర్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కేసీఆర్‌ అమల్లోకి తీసుకొచ్చిన 24 గంటల విద్యుత్‌పై గురి పెట్టింది. నిరంతర విద్యుత్ సరఫరా వెనుక భారీ అవినీతి దాగుందని విమర్శించింది. దివాళా తీసిన విద్యుత్‌ కంపెనీలతో ఎక్కువ రేట్లకు విద్యుత్‌ను కొనుగోళ్లు చేస్తూ వేల కోట్లు స్వాహా చేశారని.. రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్‌లను నిర్వీర్యం చేస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తన సన్నిహితులను సీఎండీలుగా నియమించుకుని.. అడ్డగోలు ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. విద్యుత్‌ కొనుగోళ్లు, సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా.. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ముసుగులో... జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తామని హస్తం నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామంటున్నారు.

 

20:29 - January 8, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైన టీడీపీ, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కులేదని కాంగ్రెస్‌ విమర్శించింది. పోలవరం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మహా పాదయాత్ర రెండో రోజుకు చేరింది.  తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్బాలు ఏమయ్యాయని.. ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - కాంగ్రెస్‌