కార్మికులు

06:35 - May 14, 2018

హైదరాబాద్ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో కార్మిక రాజ్యం రావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు అన్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం నిర్వహించిన మున్సిపల్‌ కార్మికులు.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచారని అన్నారు. తద్వారా వేతన పెంపునకు సంబంధించిన సర్క్యులర్‌ను వారు సాధించుకున్నారని అభినందించారు. మున్ముందు పోరాటాలకు మరింత పదును పెట్టాలని ఆయన మున్సిపల్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. దీనికి హాజరైన సాయిబాబు.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. 

06:34 - May 14, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, వారి ఇబ్బందులన్నీ విన్నామని... రెండు రోజుల్లో వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం టీఎమ్‌యూ నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. ఈ చర్చలకు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. ఇక గుర్తింపు సంఘం టీఎమ్‌యూ తరుపున అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితో పాటు 21 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక వేతన సవరణపై ఎందుకు జాప్యం చేస్తున్నారని కార్మిక సంఘం సభ్యులు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చే వరకు తాత్సారం చేయడం సరికాదని కార్మిక సంఘం స్పష్టం చేసింది.

 

18:12 - May 8, 2018

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు మండలం వెలిమలలో గాడియమ్‌ స్కూల్‌లో మట్టిపెల్లలు పడి మృతి చెందిన కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య జిల్లా కలెక్టర్‌లను కలిశారు. ఎలాంటి భద్రతా పరిమణాలు పాటించకుండా పాఠశాల యాజమాన్యం కార్మికులతో పని చేయిస్తుందని మండిపడ్డారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబీకులకు 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. 

 

06:39 - May 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. వేతనాల సవరణపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జాప్యంపై మండిపడుతున్న కార్మికులు.. ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన నోటీసును కూడా ఆర్టీసీ యాజమాన్యానికి అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో.. మళ్లీ వేతన సవరణ రగడ ఉధృతమవుతోంది. కొన్ని నెలల పాటు స్తబ్దుగా ఉన్న కార్మిక సంఘాలు సర్కారుతో సమరానికి సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించక పోతే ఈ నెల 21 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని టిఎంయూ.. ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. కొత్త పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఉద్యమిస్తున్న వేళ.. ఆర్టీసీ యూనియన్లు కూడా ఇదే అంశంపై ఆందోళన బాట పట్టాయి. తమ డిమాండ్లను నెరవేర్చడంలోఆర్టీసీ యాజమాన్యం జాప్యానికి నిరసనగా.. టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం చలో బస్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది కార్మికులు బస్‌భవన్‌ను ముట్టడించారు.

నిరుడు మార్చి 31 నాటికి.. 2013 పీఆర్సీ గడువు ముగిసింది. 2017 ఏప్రిల్‌ ఫస్ట్‌ నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రావాలి. ఈ క్రమంలో.. ఆర్టీసీ యాజమాన్యం కూడా నాలుగు నెలల క్రితమే కొత్త పీఆర్సీ కమిటీని నియమించింది. అయితే ఓ రెండు మొక్కుబడి సమావేశాలు మినహా.. వేతనాలపై కమిటీ ఎటూ తేల్చలేదని కార్మికులు మండిపడుతున్నారు. వేతనాలు 50శాతం మేర పెంచాలంటూ టీఎంయూ పీఆర్సీ కమిటీకి విజ్ఞప్తి చేసింది. స్పందన లేకపోవడంతో కార్మికులు కన్నెర్ర జేస్తున్నారు.

ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్లకు పైగా ఆదాయానికి గండిపెడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలను నియంత్రించే నాథుడే లేడని ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన నిధులను ఎందుకు విడుదల చేయరని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లాలని వారు నిర్ణయించారు. 

13:36 - May 1, 2018

కర్నూలు : పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాను ఎగురవేసి కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించవద్దంటూ కార్మికనేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

13:23 - May 1, 2018

ప్రకాశం : జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కార్మికులు మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో సీపీఎం నేతలు జెండాను ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లాలో మేడే వేడుకలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం... 

 

12:42 - May 1, 2018

హైదరాబాద్ : కార్మికుల పోరాటాల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి... కార్మిక వర్గం ఎలాంటి పాఠాలు నేర్చుకొంది... పాత అనుభవాలు మనకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి.. 
అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ
మన దేశంలో పారిశ్రామికీకరణ పందొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైంది. అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ, 1843లో బెంగాల్‌ బొగ్గు కంపెనీ, 1854లో బొంబాయిలో తొలి బట్టల మిల్లు, కొలకత్తాలో తొలి జూట్‌మిల్లు ప్రారంభమైంది. ఆ తరువాతే ముడి సరకుల రవాణాకు రైలు మార్గాలను వేశారు. 1890నాటికి వివిధ దేశాలలో పని చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు పంపిన భారతీయ కార్మికుల సంఖ్య ఐదులక్షలు కాగా దేశంలో పారిశ్రామిక కార్మికుల సంఖ్య మూడులక్షలు మాత్రమే... అయితే పోరాటాలు ఏం నేర్పాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి... 
19, 20వ శతాబ్దంలో కార్మికవర్గానికి పాఠాలు
పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది.  దుర్భర పరిస్ధితుల నుంచి బయటపడేందుకు కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితమే సాధించుకున్న హక్కులు, చట్టాలు. తొలి చట్టాలు అమలులోకివచ్చి వందసంవత్సరాలు కూడా గడవక ముందే సంస్కరణల పేరుతో వాటికి చెల్లుచీటీ ఇవ్వటం ప్రారంభమైంది.
150 ఏళ్ల క్రితం 12 గంటల పని 
ఫలితంగా నూటయాభై సంవత్సరాల నాటి దుర్భరపరిస్ధితులైన పన్నెండు గంటల పని, తక్కువ వేతనాలు, యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం పునరావృతం అవుతున్నాయి. ఇదంతా స్వేచ్చావాణిజ్యం, ప్రపంచీకరణపేరుతో జరుగుతోంది. వీటినే నయా ఉదారవాద విధానాలు అని కూడా అంటున్నారు. సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ, సమాజ తిరోగమనానికి కారణమవుతోంది. 
కార్మికులకు దక్కిన లబ్ధి 44 శాతం
గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల ప్రభావం ఎలా ఉందంటే ..  కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6 శాతానికి కి పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన ఉత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటమే. అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా ఉద్యమించాల్సిన రోజులివి.

11:52 - April 30, 2018

విశాఖపట్నం : వేతనాలు పెంచాలంటూ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న బ్రాండెక్స్‌ కంపెనీ కార్మికుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. అయితే నాలుగేళ్లుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం అకస్మాత్తుగా వేతనాలు పెంచడంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల అస్త్రంగా కార్మికులను వాడుకుంటున్నాయని ఆరోపిస్తున్నాయి.
10 సంత్సరాల క్రితం ఏర్పాటైన బ్రాండెక్స్‌ కంపెనీ
కనీస వేతనం 10 వేల రూపాయలు ఇవ్వాలంటూ విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్‌ కంపెనీ కార్మికులు నాలుగేళ్లుగా పోరాడుతున్నారు. 10 సంత్సరాల క్రితం ఏర్పాటైన ఈ కంపెనీకి అనుబంధంగా మూడు యూనిట్లు, సీడ్స్‌, క్వాంటమ్‌ సంస్థలలో కలిపి మొత్తం 18వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కంపెనీ ప్రారంభంలో 2వేల రూపాయల వేతనం మాత్రమే ఇచ్చిన కంపెనీ యాజమాన్యం 10 సంవత్సరాల కాలంలో మరో రెండు వేలు మాత్రమే పెంచింది. దీంతో కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 2016 ఏప్రిల్‌లో సమ్మెకు దిగారు.

15 రోజుల పాటు సమ్మె చేపట్టిన కార్మికులు
దాదాపు 15 రోజుల పాటు సమ్మె చేపట్టడంతో ఏప్రిల్‌ 30వ తేదీలోగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కంపెనీ యాజమాన్యం కార్మికులపై పోలీసులతో దాడికి దిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉన్న సమయంలోనే కార్మికులపై దాడులు జరిగాయి. కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న సీఐటీయూ నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత జగన్‌ కూడా వీరి సమ్మెకు మద్దతు పలికారు. అయితే సమ్మెకు దిగొచ్చిన ప్రభుత్వం కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతే ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు కనీసం వేజ్‌ బోర్డు గురించి ప్రస్తావించలేదు ప్రభుత్వం.

27 బ్రాండెక్స్‌ కంపెనీని సందర్శించిన మంత్రి లోకేశ్‌
అయితే తాజాగా ఈ నెల 27న మంత్రి లోకేశ్‌ బ్రాండెక్స్‌ కంపెనీని సందర్శించారు. ప్రస్తుతం కార్మికులకు ఇస్తున్న వేతనానికి అదనంగా 500 వేతనం పెంచాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. మరో రెండేళ్లలో 35 వేల ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటుగా కంపెనీ కోరిన మేరకు రోడ్ల వెడల్పుతో పాటుగా ఫ్లైఓవర్‌ను నిర్మిస్తామని, ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు లోకేశ్‌.

రాజకీయం కోణముందంటు విపక్షాల అనుమానాలు..
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. బ్రాండెక్స్‌ ప్రారంభ సమయంలో 60వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం కేవలం 18 వేల ఉద్యోగాలు కల్పించి చేతులు దులుపుకుందని ఆరోపిస్తున్నాయి. రాజకీయ కోణంలోనే వేతనాల పెంపు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. కార్మికుల వేతనాలు పెంచడం మంచి పరినామమే కాని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేజ్‌ బోర్డును ఎందుకు సమావేశ పరచలేదని ప్రశ్నించాయి. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా 18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. 

11:38 - April 28, 2018

విశాఖపట్టణం : ఎన్ పీఎస్ రద్దు..ఓపీఎస్ సాధన కోరుతూ జిల్లాలో అఖిలపక్ష నేతలు పాదయాత్ర చేపట్టారు. ఎన్ఏడీ కొత్త రోడ్డు నుండి జీవీఎంసీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో 800 మంది కార్యకర్తలు, ఏపీ గురుకులం విద్యాలయాల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:34 - April 26, 2018

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాల మున్సిపల్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవదిక సమ్మె చేపట్టారు. జి.వో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించి, కాంట్రక్ట్ అవుట్ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండవ రోజుకు చేరుకున్న సమ్మెలో సుమారు ఎనిమిది వందల మంది కార్మికులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - కార్మికులు