కృష్ణా

15:20 - April 11, 2018

కృష్ణా : విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం రణరంగంగా మారింది. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య రాజీనామాలపై మాటల యుద్ధం జరిగింది. వైసీపీ కార్పొరేటర్లైన పాల ఝాన్సీ, చందన సురేష్‌, షేక్‌ అసిఫ్‌, మద్దా శివ శంకర్‌లను మేయర్‌ కోనేరు శ్రీధర్‌ సభ నుండి సస్పెండ్‌ చేశారు. బలవంతంగా వీరిని బయటకు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కార్పొరేటర్‌ ఝాన్సీ అస్వస్థతకు గురయ్యారు. మేయర్‌ తీరును నిరసిస్తూ కౌన్సిల్‌ బహిష్కరించి  వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.

16:22 - April 1, 2018

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణకు గురైన దళితుల భూములను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరిశీలించారు. దీని వెనుక అధికారులు, మంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు సీపీఎం అండగా నిలుస్తుందని మధు హామీ ఇచ్చారు. 

16:15 - April 1, 2018

కృష్ణా : పార్టీ మారాలని నిర్ణయించుకున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి బుజ్జగించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి వచ్చిన యలమంచిలి రవితో దాదాపు గంటసేపు చంద్రబాబుతో  సమావేశమయ్యారు. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని.. సముచిత స్థానం కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచన చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో జరిపిన చర్చలతో సంతృప్తి కలిగిందని.. దీంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు స్పష్టం చేశారు. 

12:44 - March 17, 2018

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను హత్య చేసి చోరీకి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను దుండగులు దొంగలు హత్య చేశారు. హత్య అనంతరం ఇంట్లో బంగారం, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీపీ కెమెరాల ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగతనం కోసమే హత్య చేశారా లేక వేరే కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:01 - March 14, 2018

క్రిష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో హెచ్‌ఐఎల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భద్రతను ప్రతి ఒక్కరూ  తమజీవన శైలిలో భాగంగా చేసుకోవాలని వారు సూచించారు. పనిప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. 
 
 

18:19 - March 7, 2018

కృష్ణా : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ఇచ్చే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వరా అంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపట్ల నిర్లక్ష్యం వహిస్తోందంటూ నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో వామపక్షాల ధర్నాపై మరింత సమాచారం  కోసం వీడియో చూడండి..

17:07 - March 4, 2018

కృష్ణా : జిల్లాలోని పెనుగంచిప్రోలులో అగ్ని ప్రమాదం జరిగింది. మునేటి ఒడ్డున తిరుపతమ్మ తిరునాళ్లకు వేసిన పాకలకు నిప్పంటుకుని నాలుగు పాకలు కాలిపోయాయి. స్థానికులు మంటలు ఆర్పివేశారు. 

 

15:54 - March 2, 2018

కృష్ణా : డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ తీరును నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల చిత్ర పరిశ్రమ థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. సర్వీస్‌ ప్రొవైడర్ల విధానాలతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో...డిజిటల్‌ ప్రొవైడర్స్‌ చార్జీలు తగ్గించేవరకు బంద్‌ కొనసాగిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెబుతున్నారు. వీపీఎఫ్‌ ధరలు తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ పాటిస్తామని అంటున్నారు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్ల బంద్‌పై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

 

15:52 - February 27, 2018

కృష్ణా : నవ్యాంధ్ర రాజధానికి కూతవేటు దూరంలోని ఆ ప్రాంతం కిడ్నీ వ్యాధితో మరుభూమిని తలపిస్తోంది. కృష్ణాజిల్లాలోని  తండాల్లో గిరిజన ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.  వైద్యఖర్చులకు డబ్బులేక... ఆదుకునే నాథుడు కానరాక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్నీ వ్యాధితో ఇంటికొకరు మంచాన పడి ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకునేవారు లేని దుర్భర పరిస్థితుల్లో జీవశ్చవాల్లా గడుపుతున్నారు. సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోని ఈ పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్. 
చావుబతుకుల మధ్య తండాలు
కృష్ణా జిల్లాలోని గిరిజన తండాలు కిడ్నీ వ్యాధితో కుటుంబాలకు కుటుంబాలే కష్టాలకడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం మండలాలు మరో ఉద్దానాన్ని తలపిస్తున్నాయి. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి గిరిజనులు మృత్యువుతో పోరాడుతున్నారు. తాగునీటిలో అధిక స్థాయిలో ఉన్న ఫ్లోరైడ్‌ వల్ల  అమాయక గిరిజనులు రోగాలబారిన పడుతున్నారు.  సుమారు 20 తండాల్లో  ఏ ఒక్కరిని  పలకరించినా కన్నీటికథలే వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. తండాలన్నీ కన్నీటి సంద్రాల్లా మారాయి. వందలాది మంది కిడ్నీ బారిన పడుతుంటే... సుమారు పాతిక మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
తండాల్లో మృత్యు ఘంటికలు
తిరువూరు నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గిరిపుత్రులను కిడ్నీ వ్యాధులు కబళించి వేస్తున్నాయి. దీప్లానగర్, మాన్‌సింగ్, చీమలపాడు, కృష్ణారావుపాళెం కేశ్యా, కృష్ణారావుపాళెంగ్యామా, ఎ.కొండూరు మత్రియా, చైతన్యనగర్‌, ఎ.కొండూరు తండా, కుమ్మరికుంట, రేపూడి, మాధవరం, గొల్లమందల, కంభంపాడు, గోపాలపురం, వల్లంపట్ల, రామచంద్రాపురం, లక్ష్మీపురం, జీళ్ళవుంట, పోలిశెట్టిపాడు తండాల్లో ఈ ప్రాంతంలో సుమారు 25మంది చనిపోయారని గిరిజనులు చెబుతున్నారు.
కిడ్నీ వ్యాధితో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు
సాధారణంగా తాగునీటిలో ఫ్లోరైడ్‌ 1.5శాతం ఉండాలి. కానీ  ప్రభుత్వ ఆర్వో ప్లాంటుల్లోనే 2.4 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కిడ్నీ వ్యాధివల్ల  చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కడుపు కోత తట్టుకోలేక విలిపిస్తుంటే.... మరోవైపు  కాళ్ళు, కీళ్ల  సమస్యలతో  మరికొందరు మంచానపడుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లోని పిల్లలు చదువు మానుకుని కూలీ పనులకు వెళ్తున్నారు. పిల్లల కూలీ డబ్బునే వైద్యానికి ఖర్చు చేస్తున్నా.. అది కూడా ఏ మూలకూ చాలడంలేదని ఆవేదన చెందుతున్నారు
డబ్బులేక ప్రాణాలు కోల్పోతున్న గిరిజనులు
ఆసుపత్రికి వెళ్ళిరావడానికి బస్‌ ఛార్జీలు, మందుల ఖర్చుల నిమిత్తం నెలకు వేలాదిరూపాయలు ఖర్చవుతోంది. వైద్య ఖర్చులను భరించలేక  చెట్టంత మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన వైద్య శిబిరాల్లో 50మందికి రక్త పరీక్ష నిర్వహించగా, 25మందికిపైగా కిడ్నీలు దెబ్బతిన్నట్లు నిర్దాణరణ అవ్వటం సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
పదేళ్లుగా సమస్య తెలిసినా స్పందించని అధికారులు
పదేళ్లుగా వేళ్ళూనుకున్న కిడ్నీ సమస్యగురించి తెలిసినా అధికారులు స్పందించడంలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు....  వ్యాధి నివారణకు మంచినీటి పైప్‌ లైన్లను ఏర్పాటు కూడా చేయలేదు.  ఈ ప్రాంతం రాజధానికి కూత వేటు దూరంలో ఉండడమే కాదు..  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సొంత జిల్లాలోనే ఉండడం గమనార్హం..  రాజకీయనాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే తాము గుర్తుకొస్తామని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని  బాధిత గిరిజనులు కోరుతున్నారు. కిడ్నీ వ్యాధికి  మందులను ఉచితంగా ఇవ్వాలని.. కుటుంబ పోషణ ప్రభుత్వమే భరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

07:27 - February 27, 2018

కృష్ణా :ఆంధ్రపదేశ్‌లో పనిచేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళనబాట పట్టారు. కొన్నాళ్లుగా ప్రభుత్వంపై నిరసన తెలుపుతూనే ఉన్నారు. విజయవాడలో దీక్షలు సైతం చేస్తున్నారు. అయినా వారి సమస్యపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనే లేదు.తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీనిచ్చారు. దీన్ని నమ్మిన విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు టీడీపీకి ఓటేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పలుమార్లు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమను పర్మినెంట్‌ చేయాలని అభ్యర్థించారు. అయినా ప్రభుత్వం మాత్రం రేపు.. మాపు అంటూ దాటవేస్తూ వస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా వారిని పర్మినెంట్‌ చేయలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పోరుబాట పట్టారు.
మూడు కేటగిరీలుగా విభజన
విద్యుత్‌శాఖలోని వివిద సెక్షన్స్‌లో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. స్కిల్డ్‌ , సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ అని కార్మికులను మూడుగా విభజించింది. వీరికి వేర్వేరుగా వేతనాలు చెల్లిస్తోంది. అదీకూడా ప్రభుత్వం వారికి నేరుగా ఇవ్వకుండా ఓ కాంట్రాక్ట్‌ ద్వారా ఇస్తోంది. దీంతో ఒక్కో కార్మికుడిపై 18శాతం జీఎస్టీ, సూపర్‌వైజర్‌ చార్జీలు 10శాతం, సేఫ్టీ అలవెన్స్‌ కింద 4శాతం చెల్లించాల్సి వస్తోంది. ఏపీ వ్యాప్తంగా విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 22,536 మందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తే కేవలం ఏడాదికి 24కోట్లు మాత్రమే ప్రభుత్వంపై భారం పడుతుంది. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. కార్మికుల ఆందోళనలతో ప్రభుత్వం ఓ కమిటీని వేసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. ఆ చర్చలు కూడా విఫలయం అయ్యాయి.విజయవాడ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతున్నారు. వీరి ఆందోళనకు సీపీఎం, కాంగ్రెస్‌, వైసీపీ, జనసేనతోపాటు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరాయి.
నాలుగేళ్లకోసారి వేతనాల సవరణ
వేతనాల సవరణ ప్రతి నాలుగేళ్లకోసారి ప్రభుత్వం చేపట్టాలి. కానీ ఐదేళ్లు అవుతున్నా వేతన సవరణ చేయకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంట్రాక్ట్‌ కార్మికులకు ఆదివారాలు సెలవులు కూడా ఉండడం లేదు. అదనపు గంటలు పనిచేసినా వారికి చెల్లింపులేవీ ఉండవు. కార్మిక చట్టాలకు ప్రభుత్వం యధేచ్చగా తూట్లు పొడుస్తోంది. కార్మికులకు కనీస భద్రత కల్పించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకవాలని... విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు.. టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కృష్ణా