కేటీఆర్

06:37 - August 17, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై మంత్రి కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కేటీఆర్‌ వ్యవహారశైలిపై టీ కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు. మంత్రి పై ముప్పేట దాడి ప్రారంభించారు. కేటీఆర్‌ కుసంస్కారానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారంటూ, సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వస్తున్నారని మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో ప్రజల ముఖం చూడని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ తెలంగాణకు వస్తున్నారన్నారని విమర్శించారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ విపరీత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులపై కేటీఆర్‌ నోరు పారేసుకోవడం తగదన్నారు ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్‌. కేటీఆర్‌ కుసంస్కారానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. కేటీఆర్‌ హుందా మరిచి రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. రాజీవ్‌గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ సంస్కారంలేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకోపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. కేటీఆర్‌ స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక అక్కసుతోనే కేటీఆర్‌ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని టీ కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. 

06:33 - August 17, 2018

హైదరాబాద్ : కంటివెలుగు కార్యక్రమం ప్రజావైద్యంలో చారిత్రకమైన ముందడుగు అన్నారు మంత్రి కేటీఆర్. శేరిలింగంపల్లి, చందానగర్‌, హఫీజ్‌పేట్‌లో కంటివెలుగు కార్యక్రమం సెంటర్లను పరిశీలించారు మంత్రి కేటీఆర్‌. ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయించాలన్న సదుద్దేశంతోనే కంటివెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. 

21:16 - August 11, 2018

హైదరాబాద్ : పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూము ఇళ్ల కార్యక్రమము చరిత్ర సృష్టించబోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని కొల్లూరులో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతుందనీ కేటీఆర్‌ అన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఉన్నతాధికారులు డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అలాగే నిర్మాణ సమయంలో కార్మికుల భద్రతకు సంబంధించిన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూము ఇళ్ల కార్యక్రమం దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతుందని కేటీఆర్‌ తెలిపారు. కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతుందన్నారు. దేశంలో ఇప్పటివరకు ప్రైవేట్ రంగం గానీ, ప్రభుత్వం గానీ ఇంత పెద్ద గృహ సముదాయాన్ని ఒకేచోట నిర్మించలేదని తెలిపారు. సకల సౌకర్యాలతో కొల్లూరులోని డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. కొల్లూరులో నిర్మిస్తున్న15,660 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఈ ప్రాంతమంతా పట్టణంగా మారుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతీరోజు మూడుషిఫ్టుల్లో దాదాపు 3,500 మంది కార్మికులు 400 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. మంత్రి ఆకస్మిక తనిఖీపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పరిశీలనతో పనుల్లో మరింత వేగం పెరుగుతుందని.. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవుతాయని లబ్దిదారులు భావిస్తున్నారు. 

20:11 - August 11, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెల్గుదేశం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం బెట్టుకోని ఉన్నరట.. నిన్న ఫ్యాను పార్టీ జగనాలు సారు జనాలకు బహిరంగ ఉత్తరం రాశిండు..మంత్రి కేటీఆర్కు సుక్కలు జూపెడ్తున్నరుగదా జనం.. క్క సీసీ కెమేరా ఉంటే.. ఐదుగురు కానిస్టేబుళ్లతోని సమానం అంట మన నీళ్ల మంత్రి హరీషు రావుగారు అంటున్నడు..పాపం గుడులు గోపురాల పొంటి అయ్యగార్లు భక్తులకు శఠగోపం బెడ్తుంటే.. అయ్యగార్లకే శఠగోపం బెట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదే మా తాగువోతులు.. ఆస్తి అనేది జీవితంల భాగంగని.. జీవితమే ఆస్తిగాదు గదా..? మన్సులకే అన్ని పట్టింపులు లోకంల బత్కే జంతులకు ఏ పట్టింపు ఉండది.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:43 - August 11, 2018
21:15 - August 8, 2018

హైదరాబాద్ : భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతు బీమా పథకంలో భాగంగా వివిధ జిల్లాల్లోని రైతులకు మంత్రులు బీమా పత్రాలను పంపిణీ చేశారు. రైతు ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ మరణిస్తే రైతు కుటుంబం వీధిన పడకుండా ఉండటానికి.. ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలను చెల్లిస్తుందని తెలిపారు. మంత్రులు రైతులకు బీమా బాండ్లను పంపిణీ చేశారు. వివిధ జిల్లాల్లో జరిగిన పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్‌రెడ్డిలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని తెర్లుమద్దిలో మంత్రి కేటీఆర్ రైతులకు బీమా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు బంధు, రైతు బీమా పథకాలపై రైతుల అభిప్రాయాలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని కేటీఆర్‌ అన్నారు. రైతు ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ మరణిస్తే.. రైతు కుటుంబం వీధిన పడకుండా ఉండటానికి.. ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలను చెల్లిస్తుందని తెలిపారు. రైతు బీమా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదని.. మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.

నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని శ్రీనగర్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు బీమా పత్రాలు పంపిణీ చేశారు. దేశంలో ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టని ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని పోచారం అన్నారు. రైతులు ఏ రకంగా చనిపోయినా వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు బీమా ద్వారా అందిస్తుందని తెలిపారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ ఎస్‌ మండలంలోని కందకట్ల గ్రామంలో రైతులకు మంత్రి జగదీష్‌రెడ్డి జీవిత బీమా పత్రాలను పంపిణీ చేశారు. తెలంగాణలో గత 60 ఏండ్లుగా జరగని అభివృద్ధి టీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందని జగదీష్‌రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఎకరాకు 4 వేల రూపాయలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తుందని చెప్పారు. అలాగే రైతు కుటుంబాలకు అండగా ఉండటం కోసం 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నామని తెలిపారు. బీమా పత్రాల పంపిణీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని ఆదుకోవటం కోసం 5 లక్షల రూపాయలు చెల్లించటం సంతోషంగా ఉందని రైతులు చెబుతున్నారు. 

13:19 - August 4, 2018

హైదరాబాద్ : దేశం మొత్తం మీద తెలంగాణ పోలీసు శాఖ అద్భుతంగా పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్ లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. నగరంలో విపత్తులు, ప్రమాదాలు సంభవిస్తే డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ పనిచేస్తుందని, ఇలాంటి ఫోర్స్ ఉన్న పాలక సంస్థ జీహెచ్‌ఎంసీ మాత్రమేనన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసం పెంచుతుందన్నారు. 

06:37 - August 4, 2018

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సదస్సులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా మంత్రులు కేటీఆర్, పద్మారావు, జోగు రామన్న, మహేందర్‌ రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌లు ఈత మొక్కలు నాటారు. ప్రభుత్వం మానవీయ ధృక్పథంతో గీత కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. పరిహారం ఇస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో గౌడ భవన్‌ కోసం 5 ఎకరాల స్థలాన్ని, 5 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భవనం పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. 60 ఏళ్లలో రాష్ట్రంలో 22 గురుకుల పాఠశాలలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 261 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. పేదవాడి సంక్షేమం కోసం 43 వేల కోట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

13:53 - August 1, 2018

నిజామాబాద్ : ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచకపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ అన్యాయం చేస్తూ వస్తోందని..ప్రస్తుతం తమకు అధికారం ఇవ్వాలని అడుగుతోందని..తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్సే అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ పరిశ్రమకు ఎంపీ కవితో కలిసి ఆయున శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....సీఎం కేసీఆర్ ను గద్దె దించుతామని...ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయని..ఏ కారణం చేత కేసీఆర్ ను గద్దె దించుతారని ప్రశ్నించారు. ఎన్నో సంక్షేమ పథకాలు..పేదలకు..రైతులకు ఎన్నో పథకాలు చేపట్టినందుకు దించేస్తారా ? అని నిలదీశారు. కేసీఆర్ ను గద్దె దించే దాక గడ్డం తీసుకోనని ఒక నేత పేర్కొన్నారని..ఇతను భవిష్యత్ లో సన్నాసుల్లో కలిసి పోవడం తప్ప ఏమి లేదని...గడ్డం పెంచేటోళ్లందరూ 'గబర్బ్ సింగ్' అయిపోతాడా ? డైలాగ్ లు చెబితే ఏం పోదన్నారు.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును బీడు భూములకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బిందెలు పట్టుకుని మహిళలు బయటకు రావద్దనే ఉద్ధేశ్యంతో మిషణ్ భగీరథ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటికి నీళ్లు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతోందని..నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిన ధైర్యం ఉన్న నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని కలుపుకుంటే రూ. 900 కోట్ల రూపాయలు నిజామాబాద్ జిల్లకు వచ్చాయని, నిధులు కూడా సద్వినియోగం అవుతున్నాయన్నారు. మా కొలువులు మాకొస్తాయనే ఉత్సాహంతో యువత ముందుకెళ్లిందని..లక్షా 12వేల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగిందని, అందుకనుగుణంగా ఎక్కువగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రభుత్వం చేయని పని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని...ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ప్రోత్సాహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.

2013-14లో అధికార పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం...ఐటీ ఎగుమతులు రాష్ట్ర వ్యాపితంగా 54వేల కోట్లు మాత్రమేనని, కేసీఆర్ ఆదేశాలతో 1.20 కోట్లకు ఎగుమతులు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు..అందుకనుగుణంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా పలు జిల్లాలో ఐటీ హబ్ లు ఏర్పాటు చేయడం జరుగుతోందని..ఒకే ఒక్క రోజు పలు ఎంవోయూలు చేసుకోవడం జరిగిందని 18 నెలల్లో వేయి ఉద్యోగాలు తగ్గకుండా చూస్తామని పేర్కొన్నారని తెలిపారు. నిజామాబాద్ కు చెందిన ఫణీ అనే వ్యక్తి రెడ్ బస్.ఇన్ సంస్థను ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించారన్నారు. త్వరలోనే నిజామాబాద్ లో విమానాశ్రయం, స్పోర్ట్స్ గ్రౌండ్, బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 

06:34 - August 1, 2018

నిజామాబాద్ : అర్బన్‌ నియోజవర్గంలో ఇవాళ తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. 50 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్‌తోపాటు... మరో 300 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10 గంటలకు కేటీఆర్‌ జిల్లాకు చేరుకోనున్నారు. మాధవనగర్‌ దగ్గర జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌కు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి బైక్‌ ర్యాలీగా కొత్తగా నిర్మించతలపెట్టిన ఐటీహబ్‌ ప్రాంతానికి చేరుకుని భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌ వేదికగా చేపట్టిన బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ సభకు ఎంపీ కవితతోపాటు... జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో... నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన కూడళ్లతోపాటు డివైడర్లలో తాత్కాలిక చెట్లను ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు గుంతల రోడ్లతో అధ్వాన్నంగా ఉన్న రహదారులను అద్దంలా మార్చారు. మంత్రి పర్యటించే రహదారులను గతుకులు లేకుండా చేశారు. నగరంలో ఫ్లెక్సీలను నిషేధిస్తూ మున్సిపల్‌ పాలకవర్గం తీర్మానం చేసిన నేపథ్యంలో.. కాస్తా ఫ్లెక్సీల హడావుడి తగ్గింది. ప్లాస్టిక్‌ రహిత తోరణాలను ఏర్పాటు చేశారు. నగరాన్ని గులాబీ వనంలా మార్చిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. కేటీఆర్‌ స్వాగత ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన దృష్ట్యా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సంఘాల నేతలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపే అవకాశం ఉండడంతో.. ముందస్టు అరెస్ట్‌లకు ప్రణాళికలు సిద్దం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - కేటీఆర్