కేరళ

21:01 - January 14, 2018

ఢిల్లీ : కోట్లాది మంది భక్తులకు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. శబరిమల కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడై దర్శనమివ్వడంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల కొండలు అయ్యప్ప నామస్మరణలో మారుమోగాయి. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.

18:48 - December 19, 2017

కేరళ : ప్రధానమంత్రి నరేంద్రమోది ఓఖీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం మంగళూరు నుంచి ప్రత్యేక మిలటరీ విమానంలో వెళ్లిన ప్రధాని మోదీ మొదట లక్షద్వీప్‌లో కవరత్తిలో పర్యటించారు.  అక్కడ ఆయన ఓఖీ బాధితులను పరామర్శించారు. ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వత ప్రధాని కేరళలోని తిరువనంతపురంకు చేరుకున్నారు. మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్‌ స్వాగతం పలికారు. కేరళలలో మత్స్యకారులను, రైతులను కలుసుకొని వారితో మాట్లాడారు. అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్లిన ప్రధానికి తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, సిఎం పళనిస్వామి స్వాగతం పలికారు.  తమిళనాడులో ఓఖీతో నష్టపోయిన బాధితులను ప్రధాని పరామర్శించారు. 

 

21:42 - December 1, 2017

హైదరాబాద్ : ఓఖి తుపాను తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌ను అతలాకుతలం చేస్తోంది. బలమైన ఈదురుగాలులతో వందలాది చెట్లు నేలకూలాయి. లక్షద్వీప్‌లో ఎగిసిపడుతున్న అలలతో తీర ప్రాంతం భీకరంగా ఉంది. తుపాను ధాటికి ఇప్పటివరకూ 14 మంది మరణించారు. 30 మంది జాలర్లు గల్లంతయ్యారు. వీరిలో 8 మందిని రక్షించారు. తుపాను ధాటికి తమిళనాడులో 10 మంది, కేరళలో నలుగురు మరణించారు.

కేరళకు చెందిన 30 మంది మత్స్యకారులు గురువారం నుంచి కనిపించకుండా పోయారు. వారిలో 8 మంది జాలర్లను నేవీ రక్షించింది. మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లక్షద్వీప్‌లోని కల్పెనీ ద్వీపం సమీపంలో ఐదు జాలర్ల పడవలు మునిగాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. కన్యాకుమారిపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కన్యాకుమారి వద్ద సముద్రం ఉప్పొంగడంతో సుచీంద్రం ఆలయం లోపలికి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. ఆలయంలోని ముఖమంటపం నీటితో నిండిపోయింది.

భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో వందల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఓఖీ తుపాను అరేబియా సముద్రం వైపు మళ్లడంతో పెను తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మినికాయ్‌ దీవులకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఓఖీ 17 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని.... తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

21:30 - November 30, 2017

ఢిల్లీ : తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఓఖీ తుపాను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి వందలాది చెట్లు నేలకూలాయి. ఓఖీ బీభత్సానికి నలుగురు మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓఖీ తుఫానుగా మారింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది.

భారీ వర్షాలకు కన్యాకుమారి జిల్లా అతలాకుతలమైంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీస్తుండడంతో వందలాది చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. కరెంట్‌ లేక పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. తుపాను ధాటికి ఇప్పటివరకు నలుగురు మృతిచెందారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడానికి జిల్లా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తిరునల్వేలి, టుటికొరిన్‌, విరుద్‌నగర్‌, తంజావూర్‌, తదితర జిల్లాల్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

భారీ వర్షం వల్ల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. దీంతో శబరిమల ఆలయంలో గురువారం సాయంత్రం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 7గంటల వరకు దర్శనం నిలిపివేశారు. సన్నిధానం, పంబ వద్ద ఉన్న భక్తులు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని అధికారులు సూచించారు. చెట్ల వద్ద, పల్లపు ప్రాంతాల్లో ఉండరాదని, నదులు, సరస్సులో స్నానాలు చేయవద్దని హెచ్చరించారు. 

07:43 - November 19, 2017

కేరళ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మెచ్చుకున్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రాహుల్‌ చాలా హార్డ్‌వర్క్‌ చేశారని ప్రశంసించారు. గుజరాత్‌, హిమాచల్‌లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని  ఆయన వ్యక్తం చేశారు. ఎర్నాకులంలోని సెంట్‌ థెరిసా కాలేజీలో జరిగిన ఓ సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కేరళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడిఎఫ్ నిర్వహించిన జనసభ నుద్దేశించి మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అనుసరిస్తున్న తప్పుడు విధానాలను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి మద్దతివ్వాలని మాజీ ప్రధాని వామపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

 

20:29 - November 14, 2017

నిన్నియాళ్ల ఫేస్ బుక్కులళ్ల.. వాట్సప్ గ్రూపులళ్ల.. ఒక పోట్వ గిర్రా గిర్రా తిర్గుతున్నది.. కేరళ ముఖ్యమంత్రి ఎందుకు గొప్పోడు.. మన తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు సన్నాసులైండ్రు అనేది కుద్దు అచ్చరాలు రాశి అండ్లిండ్ల తింపుతున్నరు.. నిజంగ కేరళ ముఖ్యమంత్రి మన సీఎంలకంటె తోపా..? తోపైతె ఎట్ల తోపు అనేది ఒక్కపారి జూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

06:49 - November 12, 2017

హైదరాబాద్ : కాలుష్యం.. కాలుష్యం..! ఇప్పుడు దేశమంతటా ఎక్కడ చూసినా ఇదే మాట. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు మేఘం కప్పేయడంతో.. జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఉంది. ఇది ఢిల్లీ ఒక్కదానికే పరిమితం కాలేదు. దేశంలోని చాలా ప్రధాన నగరాలూ.. ఇదే తరహా కాలుష్యపు కాసారాలుగా మారాయి. అయితే.. కాలుష్యానికి కడు దూరంగా నిలిచిన నగరాలూ లేకపోలేదు. వీటిల్లో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం అగ్రభాగాన ఉండడం విశేషం. దేశంలోనే అత్యల్ప పీపీఎం నమోదైన రాజధానిగా త్రివేండ్రం నిలిచింది.

భారత దేశాన్ని ఇపుడు వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీలో పొల్యుషన్‌ ఎమర్జెన్సీ ప్రకటించారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో అత్యధిక వాయు కాలుష్యం నమోదైంది. ఢిల్లీలో పొల్యుషన్‌ లెవల్ పిఎం 502 స్థాయికి చేరగా... ఘజియాబాద్‌లో రికార్డ్‌ స్థాయిలో 720 పిఎం నమోదైంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుంచి సరి బేసి విధానాన్ని అమలు చేస్తోంది.

ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉంది. ముఖ్యంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో పొల్యుషన్‌లెస్‌ నగరంగా గుర్తింపు పొందింది. పొల్యుషన్‌ లెవల్‌ ఇక్కడ అతితక్కువగా 13 పిఎం మాత్రమే నమోదైంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌, విజయవాడ నగరాలు ఢిల్లీ స్థాయితో పోలిస్తే.. అసలు కాలుష్యం లేదనే చెప్పాలి. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం 50 పీఎంలలోపు కాలుష్యం ఉంటే.. వాతావరణం చాలా బాగా ఉన్నట్లు. ఈలెక్కన, 36 పీఎంలతో హైదరాబాద్‌, 39 పీఎంలతో విజయవాడ, 34 పీఎంలతో రాజమండ్రి, 28 పీఎంలతో విశాఖ.. కాలుష్య రహిత ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. పొరుగున ఉన్న బెంగళూరులో కూడా 22 పిఎంల మేరకే కాలుష్యం ఉంది.

కేరళ ప్రభుత్వం పర్యావరణానికి ప్రాధాన్యతనివ్వడం... అడవుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండడం, పర్యావరణం పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహనను కల్పించడం వల్లే తిరువనంతపురం అతి తక్కువ కాలుష్యం నమోదైన్నది నిపుణుల అంచనా. బెంగళూరులో కూడా పచ్చదనానికి పెద్దపీట వేయడంతో వాయు కాలుష్యం తక్కువ స్థాయిలో ఉంది. హైదరాబాద్‌ కన్నా విజయవాడలో కాలుష్యం 3 పిఎంలు ఎక్కువగా ఉండడం గమనార్హం.  

21:59 - November 11, 2017

కేరళ : ఏపీని టూరిజం హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కేరళ రాష్ట్రం కొచ్చిలో పర్యటిస్తున్నారు. కొచ్చిలో 10వేల సీటింగ్‌ సామర్ధ్యంగల లులు కన్వెన్షన్‌ సెంటర్‌, మాల్‌ను సీఎం సందర్శించారు. 250 గదులు, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారు. ఈ నిర్మాణాన్ని చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. విశాఖలో కన్వెన్షన్‌ సెంటర్‌, మాల్‌ నిర్మాణం త్వరగా చేపట్టాలని లులు గ్రూప్‌ను సీఎం కోరారు. కొచ్చిలోని కన్వెన్షన్‌ సెంటర్‌కు బ్యాక్‌ వాటర్‌ ఫ్రంట్‌ ఉండగా... విశాఖలో కన్వెన్షన్‌ సెంటర్‌కు సముద్రతీరం అదనపు ఆకర్షణ కానున్నదని, ఇందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాలని కోరారు. 

 

15:32 - November 2, 2017

చిత్తూరు : భారత ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని టార్గెట్ చేస్తూ హీరో కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని.. ఉత్తరాదిన ఈ టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో కేరళ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. హిందూ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అరికట్టడంలో యూపీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా విఫలమైందని కమల్ వ్యాఖ్యానించారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:46 - October 24, 2017

న్యూఢిల్లీ : సిబిఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. బిజెపి తన రాజకీయ అవసరాల కోసం  ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కేరళలో క్రైం రికార్డ్ అతి తక్కువగా ఉన్నప్పటికీ...కేరళలో హత్యలపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడి అక్రమ ఆస్తులు, వ్యాపం, బీహార్‌ ల్యాండ్‌ స్కాం, లలిత్‌ మోది, సహారా, బిర్లా, పనామా పేపర్స్‌పై కేంద్రం ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ఏచూరి ప్రశ్నించారు. పనామా పేపర్స్‌లో మోది పేరు కూడా ఉందన్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా బిజెపియేతర పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏచూరి పిలుపునిచ్చారు. నోట్లరద్దుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నవంబర్‌8న వామపక్షాలు బ్లాక్‌ డే పాటిస్తాయని ఆయన తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కేరళ