కోటీశ్వర్లు

06:37 - February 13, 2018

హైదరాబాద్ : దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. 178 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా రికార్డ్‌ సృష్టించగా.. కేవలం 26 లక్షల రూపాయలతో పేద సీఎంగా మాణిక్‌ సర్కార్‌ నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు.

దేశంలోని ముఖ్యమంత్రులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడని ప్రభుత్వేతర సంస్థ అయిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌-ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించింది. రాజకీయ నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక సిద్దం చేశారు.

దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని సీఎంల వివరాలపై ఈ సంస్థలు నివేదికలు రూపొందించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులను ఈ సందర్బంగా పరిశీలించారు. 100 కోట్లకు పైగా ఆస్తులున్నవారిలో ఇద్దరు,.. 10 నుంచి 50 కోట్ల మధ్య ఆరుగురు,.. 10 కోట్ల రూపాయలు ఆస్తులు కలిగిన సీఎంలు 17 మంది ఉన్నట్లు గుర్తించారు. కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తులున్న సీఎంలుగా ఆరుగురు ఉన్నట్లు నివేదికలో తెలిపారు.

అత్యంత ధనికుడైన సీఎంగా చంద్రబాబు రికార్డ్‌ సృష్టించారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 177 కోట్ల ఆస్తులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ 129 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ 48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల 15 లక్షల 82 వేల ఆస్తులు తన పేరున ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఇక అతి తక్కువ ఆదాయం గల సీఎంగా త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రికార్డ్‌ సాధించారు. సీపీఎం పార్టీకి చెందిన మాణిక్‌సర్కార్‌ పేరుపై కేవలం 26 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అలాగే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 30 లక్షలతో రెండో స్థానంలో, జమ్మూకాశ్మీర్‌ సీఎం మెహబుబా ముఫ్తీ 50 లక్షలతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రులపై క్రిమినల్‌ కేసులను కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తేలింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్‌ 22 కేసులతో మొదటి స్థానంలో నిలిచారు.

13:59 - November 22, 2017

హైదరాబాద్ : రోజురోజుకు మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి. ఆస్తుల కోసం కన్నవాళ్లను రోడ్డున పడేస్తున్న ప్రబుద్దులు అనేకమంది ఉన్నారు. చివరి మజిలీలో కన్నవారికి అండగా ఉండాల్సిన పిల్లలు... తమకు పట్టనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పలువురు ఆకలి తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. 

ఈనెల 28, 29, 30 తేదీలలో హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా రానుంది. ఈ నేపథ్యంలో... నగరంలో బిచ్చగాళ్లేవరూ లేకుండా పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. పలువురు బిచ్చగాళ్లను చర్లపల్లిలోని ఆనంద ఆశ్రమానికి తరలిస్తున్నారు. అయితే... ఈ సందర్భంగా పోలీసులకు బిచ్చగాళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయలు బయటపడ్డాయి. 

ఈమె పేరు ఫర్జోనా. లంగర్‌హౌస్‌లో భిక్షాటన చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈమె వివరాలు తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఈమె ఎంబీఏ చదివింది. అంతేకాదు... లండన్‌లో అకౌంట్‌ ఆఫీసర్‌గా కూడా విధులు నిర్వహించింది. ఆమె ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతోంది. అయితే... రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఫర్జోనాకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని రోజులు కొడుకు దగ్గర ఉన్న ఫర్జోనా అనారోగ్యం పాలయ్యింది. బిచ్చమెత్తితో అనారోగ్యం నుండి బయటపడవచ్చని కొడుకు తల్లికి సూచించాడు. దీంతో ఆమె లంగర్‌హౌస్‌ ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 

ఇక మరో మహిళ పేరు రబీయా బసీరా. అమెరికాలో పని చేసిన ఈమె గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌. తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె బిక్షాటన చేపట్టాల్సి వచ్చింది. బసీరా కోటీశ్వరురాలు. హైదరాబాద్‌లో పెద్ద బిల్డింగ్‌ కూడా ఉంది. భర్త చనిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు కూతురు వద్ద ఉంది. ఆ తర్వాత కూతురు కూడా చనిపోయింది. ఆ తర్వాత తన ఆస్తిని దగ్గర బంధువులే కాజేసి ఆమెను రోడ్డున పడేశారు. అల్లుడు కూడా తన పిల్లలను ఈమె వద్దనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక ఆమె మనవళ్ల కోసం భిక్షాటన చేస్తోంది. 

ఇవాంక టూర్‌ నేపథ్యంలో నరగంలో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు చర్లపల్లి జైలులోని ఆనంద ఆశ్రమానికి తరలించారు. ఇలా తరలించిన వారి వివరాలు సేకరిస్తుండగా వీరిద్దరి గురించి బయటపడింది. దీంతో జైలు అధికారులు వాళ్ల కుటుంబ సభ్యులను పిలిపించి... అఫిడవిట్‌ తీసుకుని వారిని ఇళ్లకు పంపించారు. 

Don't Miss

Subscribe to RSS - కోటీశ్వర్లు