కోడెల

14:39 - April 19, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు చేయబోయే దీక్షకు మద్దతుగా స్పీకర్‌ కోడెల చేపట్టిన సైకిల్ యాత్రలో ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు చేపట్టిన యాత్రలో యలమంద వద్ద కోడెల సైకిల్‌పై నుండి జారిపడ్డారు. దీంతో ఆయన తలకి స్వల్ప గాయం అయింది. గాయంతోనే స్పీకర్‌ యాత్రను కొనసాగిస్తున్నారు. 

18:22 - April 6, 2018
18:21 - December 28, 2017
09:10 - November 10, 2017

విజయవాడ : నేటి నుండి ఏపీ వర్షాకాల, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో సభ ఏకపక్షంగా సాగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ కోడెల అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల తదితరులు హాజరయ్యారు. మొత్తం పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతిపక్షం హాజరు కాకపోవడంపై టిడిపి తప్పుబడుతోంది. 

15:14 - July 17, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో నిండు అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏపీ స్పీకర్ కోడెల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

ఎందుకు నోటీసులు..
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా అధికార పక్షానికి చెందిన సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పలువురు సభ్యులు ఓటింగ్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కోడెల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌ లో పాల్గొనడం సరికాదని..స్పీకర్ కూడా అందుకు సహకరించారని ఆరోపణలు గుప్పించారు. స్పీకర్ హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని కానీ స్పీకర్ పదవికి ఆయన గౌరవం లేకుండా చేశారంటూ వ్యాఖ్యానాలు చేశారు.

కోడెల ఆగ్రహం..
స్పీకర్‌ను కించపరిచే విధంగా రోజా మాట్లాడారంటూ స్పీకర్ కోడెలకు విషయాన్ని తెలియచేశారు. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్ మొదలైంది.

11:34 - March 16, 2017

విజయవాడ : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు ప్రతిపక్షం ఆందోళనలు చేయడంతో పలుమార్లు సభ వాయిదా పడుతూ వచ్చింది. ఉదయం ప్రశ్నోత్తరాల్లో పోలవరం అంశంపై అధికార..ప్రతిపక్షం మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగన్ కు అవకాశం ఇవ్వలేదని పేర్కొంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. ఎక్సైజ్ మినిస్టర్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఐదు లక్షల కింద రుణాలు అందించడం జరుగుతోందని, ఆరు నేత బజార్లు ఏర్పాటు చేసినట్లు ఇది ఇతర జిల్లాల్లో విస్తరిస్తామన్నారు. 231 కోట్లు పెట్టినా పెన్షన్ 118 కోట్లు ఇవ్వడం జరుగుతోందని, రుణమాఫీ 110 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నేతకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి స్పీకర్ అనుమతినివ్వలేదు. ప్రతి ప్రశ్నకు జోక్యం చేసుకుంటే ఎలా అని సింగిల్ సప్లిమెంటరీకి అనుమతినిచ్చారు. వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

21:22 - March 14, 2017

విజయవాడ : గుండెపోటుతో చనిపోయిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఏపీ అసెంబ్లీ ఘన నివాళులు అర్పించింది. ఆయన మృతికి సంతాపం ప్రకటించింది. అయితే భూమా నాగిరెడ్డికి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభకు హాజరుకాలేదు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఏపీ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ కూడా సభకు హాజరయ్యారు. తన తల్లి మరణం తర్వాత తండ్రి ఎంతో కుంగిపోయారని.. దుఃఖాన్ని దిగమింగుకున్నారని అఖిల ప్రియ ఈ సందర్భంగా చెప్పారు. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలకు తన తల్లిదండ్రులు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానని అన్నారు. భూమా నాగిరెడ్డి జీవితం మొత్తం పోరాట బాటలోనే సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నాగిరెడ్డి మరణం రాయలసీమకు.. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని లోటని అన్నారు. వారి కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రేపటికి వాయిదా..
అలాగే సభలో ఉప ముఖ్యమంత్రి కేసీ కృష్ణమూర్తి, మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాస్‌, బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు భూమాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు. అనంతరం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు భూమా మృతికి సంతాపం ప్రకటించి సభను రేపటికి వాయిదా వేశారు. అయితే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని అధికార పార్టీ రాజకీయం చేసిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. సభకు హాజరై ఉంటే భూమా చేసిన మంచి పనులతో పాటు.. చివరి సమయంలో ఆయన చేసిన తప్పులను కూడా గుర్తు చేయాల్సి వచ్చేదని మీడియాలో చిట్‌చాట్‌లో అన్నారు. కాగా జగన్‌ గైర్హాజరుపై సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పక్షులు, పశువులు కూడా తమ సాటి జీవి చనిపోతే సానుభూతి చూపుతాయని... కానీ జగన్‌ మాత్రం సాటి మనిషిపై సానుభూతి చూపలేకపోయారని సీఎం విమర్శించారు.

11:28 - October 3, 2016

గుంటూరు : ఏపీ పాలన ఇక అమరావతి నుండి కొనసాగనుంది. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మించన సంగతి తెలిసిందే. దాదాపు 33 శాఖ ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనునున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆర్థిక, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులు వెలగపూడికి చేరుకున్నారు. వీరికి సిబ్బంది స్వాగతం పలికారు. రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ పాలన కొనసాగుతుందని ఉద్యోగ సంఘ నేతలు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పరిపాలనా కార్యక్రమాలు కొనసాగించేందుకు మాత్రం ఇంకా వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అసెంబ్లీ భవనం వద్ద స్పీకర్ కోడెల..
వెలగపూడి నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ భవనానికి స్పీకర్ కోడెల చేరుకున్నారు. అసెంబ్లీ భవనాన్ని పరిశీలించి సమావేశాల నిర్వాహణ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈ సందర్భంగా కోడెల మీడియాకు తెలిపారు. వెలగపూడికి తరలివచ్చిన ఉద్యోగులకు కోడెల శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నుండి వెలగపూడి సచివాలయం నుండి పూర్తి పాలన జరగబోతోందని, ఇందుకు ఉద్యోగులను అభినందిస్తున్నట్లు తెలిపారు. మెరుగైన పాలన అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. తక్కువ కాలంలో ఐదు బ్లాక్ ల నిర్మాణం జరిగిందని, కొన్ని ఇబ్బందులుంటాయన్నారు.

సమస్యలను అధిగమించి పాలన – యనమల..
వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల చేరుకున్నారు. ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యనమల మీడియాతో మాట్లాడారు. ప్రధాన శాఖ అధికారులు వెలగపూడికి చేరుకున్నారని, సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమస్యలను అధిగమించి పాలన చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండేందుకే అమరావతి నుండి పాలన అందిస్తున్నట్లు యనమల పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:05 - September 10, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షా కాల సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన భేటీలో ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చ చేపట్టకుండానే అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్‌ చేస్తూ.. వైసీపీ సభ్యులు స్పీకర్‌ పొడియం చుట్టముట్టి ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. కొన్ని సందర్భాల్లో వైసీపీ సభ్యులు తీరు రణరంగాన్ని తలపించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును సభా హక్కుల సంఘానికి నివేదిస్తూ అసెంబ్లీ తీర్మానించింది.

అసెంబ్లీలో చర్చకు రాని ప్రజాసమస్యలు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్యల కూడా చర్చకు రాలేదు. ఈనెల 8న ప్రారంభమైన అసెంబ్లీలో మూడు రోజులు కూడా ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో సభా సమయం వృధా అయ్యింది.

ప్యాకేజీ అంశాన్ని ఆయుధంగా మలచుకున్న వైసీపీ
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు రోజు... అంటే ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రతిపక్ష వైసీపీ ఆయుధంగా మలచుకుంది. ప్రత్యేక హోదా ప్రకటించకుండా పాక్యేజీని ప్రకటించిన కేంద్ర తీరును, దీనిని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ... నల్ల చొక్కాలు ధరించి సభకు హాజరైన వైసీపీ సభ్యులు అసెంబ్లీని స్తంభింపజేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే సభలో జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టి చర్చ లేకుండానే ఆమోదించారు. ఆ తర్వాత సభ వాయిదా పడింది.

అసెంబ్లీ కార్యదర్శి, సిబ్బంది విధులను అడ్డుకున్న వైసీపీ
రెండో రోజు కూడా పరిస్థితిలో మార్పులేదు. హోదాపై సభలో చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రాసదరావు తిరస్కరించారు. ప్యాకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రకటన చేసిన తర్వాత చర్చకు సిద్ధమని అధికార పక్షం ప్రకటించింది. దీనికి ససేమిరా... అన్న వైపీసీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లిన నిరసన వ్యక్తం చేశారు. సభాధ్యక్ష స్థానంపైకి కాగితాలు విసిరేశారు. స్పీకర్‌ ముందు ఉన్న మైక్‌ను విరగొట్టారు. అసెంబ్లీ కార్యదర్శితోపాటు, సిబ్బందిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు. బెంచీలు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొడియం దగ్గర ఉన్న మార్షల్స్‌ను తోసివేసే ప్రయత్నం చేశారు. వైసీపీ సభ్యులు తీరును అధికార టీడీపీతోపాటు, మిత్రపక్ష బీజేపీ సభ్యలు తీవ్రంగా ఆక్షేపించారు. వైసీపీ సభ్యుల తీరుతో రెండో రోజు కూడా ఏ అంశాన్ని చర్చించకుండానే సభ వాయిదా పడింది.

మూడో రోజు కూడా అదే పరిస్థితి
మూడో రోజు కూడా పరిస్థితిలో మార్పు లేదు. హోదాపై చర్చించాంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సభను స్తంభింపచేశారు. రెండో రోజు తరహాలోనే స్పీకర్‌ పైకి కాగితాలు విసిరారు. కాగితాలను బంతులుగా చుట్టి వేశారు. వైసీపీ సభ్యులు తీరును ఆక్షేపిస్తున్న అధికార, మితక్షపక్ష సభ్యులు ప్రసంగిస్తున్నప్పుడు అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న కెమెరాలకు అడ్డంగా ప్లకార్డులను అడ్డం పెట్టారు. శాసనసభ కార్యదర్శి బెంచిని లాగేశారు. బెంచీలపైకి ఎక్కి నినాదాలు చేశారు.

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు మహిళా మార్షల్స్ తో వైసీపీ దౌర్జన్యం
వైసీపీ సభ్యుల తీరును టీడీపీ, బీజేపీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. మార్స్‌లను పెట్టి సభను నడిపించుకునే పరిస్థితి కల్పించిన వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రవర్తించిన తీరును సభా హక్కుల కమిటీకి నివేదిస్తూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు.

స్పీకర్‌,టీడీపీ, బీజేపీ సభ్యులు విజ్ఞప్తులు పట్టించుకోని వైసీపీ
స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, టీడీపీ, బీజేపీ సభ్యులు పదేపదే విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు తమ పంతాన్ని వీడలేదు. వైఖరి మార్చుకోలేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల అసెంబ్లీ చరిత్రలో ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాకపోవడం ఇదే మొదటిసారి. 

21:37 - September 9, 2016

హైదరాబాద్ : తీవ్ర గందరగోళం మధ్య ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తంగా మారింది. స్పీకర్‌ మైకును, సభలోని వీడియో కెమెరాలను తొలగించే ప్రయత్నం చేయగా.. మార్షల్స్‌ అడ్డుకున్నారు. వైసీపీ సభ్యులు బల్లలపైకి ఎక్కి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండుసార్లు వాయిదా అనంతరం..సభలో పరిస్థితి మారకపోవడంతో స్పీకర్‌ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.

వైసీపీ సభ్యుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వైసీపీ సభ్యుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వాయిదాల పర్వం కొనసాగినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే రెండో రోజు కూడా శాసనసభ వాయిదా పడింది.ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులు.. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. కాగితాలు చించి స్పీకర్‌పై విసిరారు. టేబుల్‌పై ఉన్న స్పీకర్‌ మైక్‌ను తొలగించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మార్షల్స్‌ను నెట్టివేయడంతో తీవ్ర పెనుగులాట చోటు చేసుకుంది. దృశ్యాలు చిత్రీకరిస్తున్న వీడియో కెమెరాను తొలగించేందుకు ప్రయత్నించారు. బల్లలపైకెక్కి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ ఆందోళన
ఉదయం సభ ప్రారంభం కాగానే..హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ సభ్యుల మృతికి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాల్సిందేనంటూ ఆపార్టీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని సూచించారు. ముందు చర్చ.. ఆతర్వాత సీఎం ప్రకటన చేయాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

మార్షల్స్ , వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట
ప్రత్యేక హోదాపై చర్చను కోరుతూ స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన వైకాపా సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మార్షల్స్ , వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని, మార్షల్స్‌పై చేయి చేసుకోవద్దని స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఉద్రిక్తంగా మారడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

శనివారానికి సభ వాయిదా
రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కోడెల