కోమటిరెడ్డి

09:25 - June 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూధనాచారితో టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జానారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం స్పీకర్ తో సమవేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వ రద్దుపై కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, తీర్పును అమలు చేయాలని కోరనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కోమటిరెడ్డి, సంపత్ లు వ్యవహరించిన తీరును టి.సర్కార్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. వారిద్దరీ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరకు ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పును చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టి.కాంగ్రెస్ పేర్కొంటోంది. మరి స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

08:16 - June 6, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ సిరిసిల్ల, సిద్ధిపేటలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సొంత నియోజకవర్గాలకే నిధులు గుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. తనకు మంచి పేరు వస్తుందనే కేసీఆర్‌ నల్లగొండజిల్లాకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

పాలనలో కేసీఆర్ వివక్ష..
ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కెసిఆర్ పాలనలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పక్షపాత ధోరణితో దక్షిణ తెలంగాణా అభివృద్ధిలో వెనుకబడి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తపోతల ప్రాజెక్టుకు వేలకోట్ల రూపాయలు మంజూరుచేసిన ప్రభుత్వం.. నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరిచ్చే ఎస్సెల్బిసి ప్రాజెక్టుకు మాత్రం ఒక్కరూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు.

పోరాడితేగాని నల్లగొండకు మెడికల్‌ కళాశాల రాలేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బతుకమ్మ చీరల తయారీకి కేవలం సిరిసిల్ల జిల్లాకే 250కోట్ల ఆర్డర్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇతర జిల్లాల్లో చీరలు నేసే విషయం తెలియదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లాకేంద్రంగా ఉన్న నల్లగొండకు పోరాడితేకాని రాని మెడికల్ కళాశాల .. సిద్దిపేటకు మాత్రం మొదటి విడతలోనే మంజూరు చేసి 750కోట్లు నిధులు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ప్రాంతానికి ఒకరకంగా, మిగతా ప్రాంతానికి మరో రకంగా నిధులు మంజూరు చేస్తూ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. మొత్తానికి మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన కోమటిరెడ్డి.. వార్తల్లో నిలిచారు.

 

13:31 - June 4, 2018

హైదరాబాద్ : హైకోర్టులో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును బెంచ్ డివిజన్ సమర్థించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మోల్యేల సభ్వత్యంపై రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాస్ చేస్తూ టీఆర్ ఎస్ పిటిషన్ వేసింది. 

17:43 - May 24, 2018

హైదరాబాద్ : హైకోర్టు తీర్పు ప్రకారం తమ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించడంతోపాటు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న సంపత్ కుమార్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేకపోతే డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. రాహుల్‌ అనుమతిలో టీఆర్‌ఎస్‌ అరాచకాలపై ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు.

 

20:18 - May 22, 2018

ఊర్లపొంటి దొంగలొస్తున్నరట..? మందిని సంపుతున్నరట.. ఇండ్లన్ని దోస్తున్నరట.. పక్కపొంటి ఊరికాడ దొర్కిండ్రట.. ఇట్ల రకరకాల పుకార్లు శికారు జేస్తున్నయ్ సోషల్ మీడియాల.. అటు పోలీసోళ్లు ఎంత మొత్తుకున్నా జనానికి అర్థమైతలేడు.. ఎవ్వడన్న మాశిన బట్టలు పెర్గిన నెత్తితోని గనిపిస్తె వాన్ని వట్కోని సావగొడ్తున్నరు జనం..

ఆంధ్ర రాష్ట్రంల ఎన్నికల వేడి సుర్వైంది.. అసెంబ్లీ ఓట్లకు ఇంకో యాడాది టైమున్నా..? అన్ని పార్టీలు ఒకదాన్ని మించి ఇంకోటి జనంలకు వోతనేఉన్నయ్.. పొయ్యే రూపం వేరున్నా..? అంతిమ లక్ష్యం మాత్రం జనంతానున్న ఓటును గుంజుకునుడే అన్నట్టు.. తెల్గుదేశం గ్రామదర్శిని అంటున్నది.. వైసీపీ పాదయాత్ర జేస్తున్నది.. జనసేనా బస్సుయాత్ర.. జేడీ లక్ష్మీనారాయణ భరోసా యాత్ర, సీపీఎం లెఫ్ట్ పార్టీలు పిట్రోలు యాత్రలు..

నన్ను విమర్శించే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి లేదు అంటున్నడు నీతికి నిల్వుటద్దమైన శ్రీ నారా చంద్రాలు సారు.. మీరు రాష్ట్రపతి ఎన్నికలళ్ల.. ఉపరాష్ట్రపతి ఎన్నికలళ్ల బీజేపీ అభ్యర్ధికి అనుకూలంగ ఓట్లేశి రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు వెట్టినోళ్లు మీరు నన్నా అనేది అని మస్తు గరమైతున్నడు సారు..

ఏతుల పుంజు ఏతుల పుంజు అంటె ఇన్నరుగని.. ఏతుల పుంజు ఎట్లుంటదో సూశిండ్రా మీరు ఎన్నడన్న..? నల్లగొండ నడిగడ్డమీదున్నది ఆ పుంజు.. ఆ పుంజు ఏతులు జూస్తే.. అవద్దాలు ఆత్మహత్య జేస్కుంటయ్.. మమ్ములను మించిన మొనగాడున్నడా ఈ భూమ్మీద అని..? మరి ఆల్చమెందుకు పాండ్రి సూపెడ్త..

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కాడ ఎక్వేం లేదు.. ఐదే ఎక్రాలు కబ్జా వెట్టి పట్టా జేపిచ్చుకున్నరట మన లీడర్లు.. ఎంత శిగ్గుతక్వ ముచ్చట ఒక్కడొక్కడు వందల ఎక్రాలు కబ్జాలు వెట్టుకుంటున్నరు.. వాడెవ్వడో ఐదే ఎక్రాలు వెడ్తడా..? చేశిన దొంగతనమన్న గట్టిగ జేయరాయే.. ఓ యాభై ఎక్రాలు వెడ్తె మన ముఖ్యమంత్రిగారు పర్వునిలవెట్టినోళ్లు అయితరుగని.. చిన్నచిన్నగ జేస్తారు.. ఆయ్..

ఆంచూర్ రైతులు మళ్లొకపారి మోసపోయిండ్రు మార్కెట్ల.. పోయిన యాడాది గూడ ఇసొంటి మోసమే అయ్యింది ఈసారి గూడ రిపీట్ అయ్యింది.. నిజామాబాద్ జిల్లాల ఆంచూర్ రైతులు చాలమందుంటయ్.. అదే అంచూర్ అంటే మామిడి కాడ ఒర్గుదీశి ఎండవెట్టేది.. మద్దతు ధర దొర్కుతదేమో అని మామిడి చెట్టంత ఆశవెట్టుకోని మార్కెటుకోస్తె మళ్ల గదే దళారీగాళ్లు తల్గి ధర తక్వ జేశి కొంటున్నరట..

ఇదే కన్ఫ్యూజన్ మళ్ల.. నిన్నరాత్రి జగిత్యాల జిల్లాకేంద్రంలున్న సర్కారు దావఖానకు ఇద్దరు గర్భిణీ స్త్రీలొచ్చిండ్రట.. డెలివరీ కోసం ఇద్దరికి ఒక్కటే సారి కాన్పు జేశిండ్రు.. ఇద్దరికి మొగపిల్లలే వుట్టిండ్రు.. మరి ఏడ తేడా వచ్చిందో ఏమో.. మా పిలగాన్ని వాళ్లకిచ్చిండ్రు.. వాళ్ల పిలగాన్ని మాకిచ్చిండ్రని కయ్యం లేశింది.. ఇప్పటికి తేలలే పంచాది..

కోతులకు గూడ కోపం బాగనే ఉండెతట్టుందిగదా..? మన్సులకున్నట్టు.. అవ్విటికి గూడ ఒక్కొక్కపారి బీపీ వెర్గెతట్టుంది.. మన్సులను తంతున్నయ్.. ఇయ్యాళ తాజ్ మహాల్ జూస్తందుకు బైటిదేశం మన్సులొచ్చిండ్రట వాళ్ల మీద వడి కర్శినయట ఇద్దరికి గాయాలైనయంటున్నరు.. మరి అవ్వేమనుకున్నయో ఏమో ఈడ మేముండంగ మీరెట్లొస్తరని కోపానికొచ్చినయో ఎట్లనో గని..? కోతుల కథ జూడుండ్రి..

06:35 - April 28, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు వ్యవహారంలో.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేసిన అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున వాదనలను సుప్రీం కోర్టు న్యాయవాది వైద్యనాథన్ వినిపించారు. కోమటిరెడ్డి, సంపత్‌ వ్యవహారంపై మీడియాలో వచ్చిన నాలుగు వీడియోలను పిటిషనర్‌ కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఫిరాయింపు దారులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిటిషన్ వేసే అర్హత లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది జంధ్యాల వాదించారు. వారి సభ్యత్వ కొనసాగింపే.. స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉండగా.. సభాహక్కులు, నిబంధనలు, విలువలపై వారు స్పందించడం బాధాకరమన్నారు అడ్వకేట్ జంధ్యాల. సభ్యుల వివరణ వినిఉంటే.. సభ్యత్వం రద్దు చేసేవారు కాదేమోనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరువాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

17:28 - April 26, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వ రద్దు కేసులో కోర్టు తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దు కేసులో వారి సభ్వత్వం కొనసాగుతుందని కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేస్తు పిటీషన్ వేశారు. 12మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున వేసిన పిటీషన్ ను కోర్టు విచారించింది. టీఆర్ఎస్ తరపున న్యాయవాది వైద్యనాథన్ తన వాదనలకు వినిపించారు.కోమటిరెడ్డి, సంపత్ ల తరపున న్యాయవాది రవిశంకర్ తన వాదనలు వినిపించగా కేసు విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కారణం లేకుండా సభ్యుడి అసెంబ్లీ సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం కేసును రేపటికి వాయిదా వేసింది. కాగా అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై ఇయర్ ఫోన్ విసిరిన నేపథ్యంలో వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలకు అనుగుణంగా తీర్పుకూడా వెలువడింది. ఈ తీర్పును ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేస్తు పిటీషన్ దాఖలు చేసారు. 

21:06 - April 9, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వం రద్దుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తమకు లిఖితపూర్వకంగా తెలపకుండా శాసనసభ్యత్వాలను రద్దు చేయడం సరికాదని కాంగ్రెస్‌ సభ్యులు వాదించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో.. ప్రభుత్వం కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను రద్దు చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వీడియో పుటేజీలను కోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రోజు వరకు వాటిని న్యాయస్థానికి అందజేయలేదు.

మరోవైపు తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన విషయం లిఖిత పూర్వకంగా తెలపలేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తాము కోర్టును ఆశ్రయించిన తర్వాత గత నెల 19న గవర్నర్‌ సంతకంతో అసెంబ్లీ వెబ్‌సైట్లో ఉత్తర్వులు పెట్టారని... అయితే అందులో కూడా బహిష్కరణకు కారణాలు వివరించలేదని కాంగ్రెస్‌ నేతలు నివేదించారు. గవర్నర్ ప్రసంగం శాసనసభ సమావేశాల పరిధిలోకి రాదన్నారు. మండలి ఛైర్మన్ కంటికి గాయమైనందున బహిష్కరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని.. అయితే దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ అడిగితే ఇవ్వలేదన్నారు. కాబట్టి గతంలో సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుల ప్రకారం.. బహిష్కరణ ఉత్తర్వులు చెల్లుబాటు కావని వాదించారు.

అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి రాజీనామా తర్వాత.. అసెంబ్లీ తరఫున ఎవరూ వాదనలు వినిపించలేదు. ఈ తరుణంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. బహిష్కరణ వ్యవహారంలో ప్రభుత్వం ప్రమేయం లేదని చెప్పారు. ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని.. అయితే ఆరు వారాలు ఆగాలన్న మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది. 

07:07 - April 4, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కేసులో సర్కారుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి.. ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం పదే పదే మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇప్పుడిక మూడు రోజుల్లోపు వీడియో ఫుటేజీతో కూడిన కౌంటర్‌ దాఖలు చేయకుంటే.. ఈకేసులో ఇక కౌంటరే ఉండదని భావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంటే.. రద్దయిన ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాల్సిన పరిస్థితి తప్పేలా లేకపోవడంతో.. కేసీఆర్‌ సర్కారు ఇరకాటంలో పడింది.
అసెంబ్లీ వాయిదా పడినందున.. సభలో తీర్మానం చేయనిదే ఫుటేజీ ఇవ్వలేమంటూ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ఆగ్రహించిన న్యాయస్థానం, మీరు అసెంబ్లీ సెక్రెటరీ తరఫున వాదిస్తున్నారా అని నిలదీసింది. దీంతో తాను ప్రభుత్వం తరఫున మాత్రమే వాదనలు వినిపిస్తానని, కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. ఇప్పటికే మూడు వాయిదాలు తీసుకున్నందున.. వెంటనే వాదనలు ప్రారంభించాలని న్యాయస్థానం అదేశించింది. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ దాఖలుకు చివరి అవకాశం ఇస్తున్నామంది. కేవలం మూడు రోజుల్లోపే అంటే.. ఈనెల ఆరవ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, ఒకవేళ ఆలోపు కౌంటర్‌ దాఖలు చేయకుంటే.. ఈ కేసులో ఇక కౌంటర్‌ ఉండదని భావించాల్సి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది.

మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో.. సర్కారు ఇరకాటంలో పడ్డట్టే కనిపిస్తోంది. ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నందునే ప్రభుత్వం పదేపదే గడువు కోరుతోందని, న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా చేయడం సర్కారుకు ఒక దెబ్బకాగా.. తాజాగా కౌంటర్‌ దాఖలుకు కోర్టు మూడు రోజుల డెడ్‌లైన్‌ విధించడం మరో దెబ్బగా భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఆరోతేదీన వీడియో ఫుటేజీతో కూడిన కౌంటర్‌ దాఖలు చేస్తుందో లేదో వేచి చూడాలి.

13:20 - April 3, 2018

అనంతరపురం : నల్లమాడలో దారుణం చోటుచేసుకుంది. కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని అల్లుడిపై పగ పెంచుకున్న మామ అతన్ని కిరాతకంగా నరికి చంపాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిని, అల్లుడిని ఆప్యాయంగా ఇంటికి పిలిచిన మామ తెల్లవారుజామున అల్లుడిని నరికి చంపాడు. 

Pages

Don't Miss

Subscribe to RSS - కోమటిరెడ్డి