ఖమ్మం

21:56 - April 28, 2017

ఖమ్మం : జిల్లాలో టీజేఏసీ రైతు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పాలేరు-కూసుమంచి మధ్య టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ను అరెస్ట్‌ చేశారు. టీ-జేఏసీ రైతు పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులంటున్నారు. ఖమ్మం మిర్చియార్డును కోదండరామ్‌ రేపు సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. కోదండరామ్‌ అరెస్ట్‌ను టీ-జేఏసీ నేతలు ఖండించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:54 - April 28, 2017

ఖమ్మం : మిర్చి రైతు కడుపు మండింది. ఇన్నాళ్లు సహనం వహించిన రైతు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదన్న బాధను తట్టుకోలేక ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పంటను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు.. మార్కెట్‌ యార్డుపై విరుచుకుపడ్డారు. చైర్మన్‌ కార్యాలయంపై దాడి చేసి కుర్చీలు ధ్వంసం చేశారు. మరోవైపు తెచ్చిన పంటకు నిప్పుపెట్టారు.  దీంతో ఖమ్మం మార్కెట్‌ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
రైతుల్లో తీవ్ర ఆవేశం 
రోజురోజుకు పడిపోతున్న మిర్చి ధరలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఖమ్మంలో క్వింటాల్‌ మిర్చి ధర 3 వేలకు పడిపోవడంతో రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మార్కెట్‌కు తెచ్చిన మిర్చిని కొనుగోలు చేయకపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో రైతులంతా ఆందోళన బాట పట్టారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టి రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కుర్చీలు ధ్వంసం చేశారు. ఆగ్రహంతో నిప్పంటించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించారు. 
కలెక్టరేట్ ఎదుట ధర్నా 
మరోవైపు ఆరుగాలం శ్రమించి పంటను పండిస్తే.. వ్యాపారుల కారణంగా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా.. ఒక్క అధికారి తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఊరడింపు మాటలు వద్దని.. పరిష్కారం కావాలని రైతులంతా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఇస్తున్న ధర ప్రకారమైతే పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రావని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే చావే శరణ్యమంటున్నారు. 
పంటను వెంటనే కొనుగోలు చేయాలి : రైతులు
శుక్రవారం ఒక్కరోజే మార్కెట్‌కు 2.5 లక్షల మిర్చి బస్తాలు తరలిరావడంతో ధర పతనమైందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు శని, ఆది, సోమవారాల్లో మార్కెట్‌కు వరుస సెలవులు రావడంతో పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 
రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు 
ఇక రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. సంఘటనాస్థలాన్ని టీ-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క సందర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
రైతుల అండగా నిలిచిన సండ్ర వెంకటవీరయ్య 
అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా రైతుల అండగా నిలిచారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కార్యాలయం ఎదుట మిర్చి రైతులతో కలసి .. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన చేపట్టారు. మిర్చి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే.. ఖమ్మం మార్కెట్‌ యార్డు ఘటన టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. మార్కెట్‌యార్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. 
ఉద్యమాన్ని ఉధృతం చెస్తాం : రైతులు 
మొత్తానికి ఇన్ని రోజులుగా సహనం వహించిన రైతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిర్చిని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

19:32 - April 28, 2017

ఖమ్మం : వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కార్యాలయం ఎదుట మిర్చి రైతులతో కలసి .. టీడీపీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఆందోళన చేపట్టారు. మిర్చి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే..దానికి  ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని  సండ్రా వెంకట వీరయ్య హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కింటాకు పది వేల చొప్పున ఇచ్చి మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.

 

13:35 - April 28, 2017

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల బాధలు కొనసాగుతున్నాయి. మిర్చికి మద్దతు ధర కల్పించాలని మార్కెట్ లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. గత కొంత కాలంగా మిర్చి ధరను తగ్గిస్తూ నేడు 6వేలకు దిగిపోవడంపై ఖమ్మం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర తగ్గింపుపై మార్కెట్ కమీటీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో రైతులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరంగం సృష్టించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. రైతుల ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మద్దతు తెలిపారు. 

12:19 - April 28, 2017

ఖమ్మం : ఆరుగాళం పాటు కష్టపడి పంట పండించారు..తమ కష్టానికి పడిన ఫలితం వస్తుందని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలవుతున్నాయి. తమకు మద్దతు ధర కల్పించాలంటూ రోజుల తరబడి 'మిర్చి' రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం..అధికారులు స్పందించకపోయే సరికి ఆందోళనకు దిగారు. శుక్రవారం మిర్చి యార్డులో ఆందోళనకు దిగారు. రూ.6వేల ధర మాత్రమే పలకడంపై తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తమ ఆవేదనను మార్కెట్ కమిటీ ఛైర్మన్ కు తెలియచేయాలని కార్యాలయానికి వచ్చారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహానికి గురయ్యారు. కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రైతులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. కానీ వారు ఏ మాత్రం వినిపించుకొనే స్థితి లేని పరిస్థితి నెలకొంది. రైతుల ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మద్దతు తెలిపారు.

 

15:32 - April 24, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం దేవునిగుట్టలో గిరిజనులపై పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని సీపీఎం ఖండించింది. పదిహేడేళ్లుగా అడవిలో ఉంటూ, భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులను తరిమికొట్టడాన్ని తప్పుపట్టింది. 2006 అటవీ చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి, భూముల నుంచి తరిమికొడుతారా ? అని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లను తగులబెట్టి, పసు సంపదను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీసుకెళ్లారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

18:03 - April 22, 2017

ఖమ్మం :జిల్లా వైద్యాధికారి విధులను అడ్డుకున్న... స్వాతి హాస్పిటల్‌ యజమాని లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ ఆస్పత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ప్రమాణాలు పాటించడం లేదని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే ఆస్పత్రిని సీజ్‌ చేశామని జిల్లా వైద్యాధికారి చెప్పారు. అయితే ఇన్‌పేషంట్లను దృష్టిలో పెట్టుకుని...ఐదు రోజుల పాటు వారికి ఆస్పత్రిలో చికిత్స జరిగేలా అనుమతి ఇచ్చామని చెప్పారు. 

18:01 - April 20, 2017

హైదరాబాద్: తెలంగాణలో మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని.... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చీ కొనుగోళ్లు జరపాలని కోరారు.. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డును చాడ వెంకట్‌రెడ్డి సందర్శించారు.. మిర్చి రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు..

08:05 - April 19, 2017

ఖమ్మం : ఆడవాళ్లు ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని చెప్పుకునే నేటి సమాజంలో ఆడబిడ్డ పుట్టింది అంటేనే పాపంగా పరిగణిస్తున్న వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తికాదు. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలియగానే కడుపులోనే ఆడబిడ్డను చంపేస్తున్నారు. కాసుల కక్కుర్తితో కొంత మంది వైద్యులు లింగ నిర్థారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తూ ఆడపిల్లల ఊసురు పోసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పెరిగిపోతున్న భ్రూణ హత్యలపై 10 టీవీ ప్రత్యేక కథనం.
చట్ట విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు 
కొన్ని గ్రామాల్లో ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావిస్తున్నారు. కట్న కానుకలకు భయపడి కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్నారు. నిరుపేదలే కాదు బడాబాబులు కూడా భ్రూణ హత్యలకు పాల్పడడం విస్మయాన్ని కలిగిస్తోంది. వైద్యులకు డబ్బు ఆశ చూపి లింగ నిర్థారణ పరీక్షలు చేయిస్తూ ఆడపిల్ల అని తెలియగానే పిండాన్ని పిండేస్తున్నారు. వైద్యులు చట్ట విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలకు పాల్పడడంతో భ్రూణ హత్యలు ఖమ్మం జిల్లాలో ఎక్కువైపోతున్నాయి. 
భ్రూణహత్యలు అరికట్టడంలో అధికారులు విఫలం
ఖమ్మం నగరంలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ భ్రూణహత్యలే పనిగా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యకృత్యంగా మారిన భ్రూణహత్యలను అరికట్టడంలో ఉన్నతాధికారుల మొబైల్ బృందం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గర్భంలోనే ఆడశిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. కానీ జిల్లాలో లింగ నిర్థారణ పరీక్షలు ఎక్కువైనా అధికారులు కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. 
రంగంలోకి వైద్యాధికారులు 
భ్రూణ హత్యలపై ఫిర్యాదులు ఎక్కవ అవడంతో ఎట్టకేలకు వైద్యాధికారులు రంగంలోని దిగారు. నగరంలోని పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో దాడులు నిర్వహించి ఎలాంటి అనుమతి లేని ఆస్పత్రులను సీజ్ చేశారు. లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ కమిషనర్ ఇక్బాల్ తెలిపారు. ఇప్పటికైనా జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భ్రూణ హత్యలపై అధికారులు ఉక్కుపాదం మోపి ఆడపిల్లల బంగారు భవిష్యత్‌ను కాపాడాలని సామాజిక వేత్తలు, మేధావులు కోరుతున్నారు. 

 

17:07 - April 18, 2017

ఖమ్మం : లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసినా పలు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే దాడులు నిర్వహించి ఆసుపత్రులకు తాళాలు వేశారు. శ్రీశ్రీ ఆస్పత్రితో పాటు మీనాక్షి సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆస్పత్రి, స్పందన ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్టన్లు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయా ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. లింగ పరీక్షలు చేస్తున్నారని నిర్ధారించుకున్న అనంతరం ఆసుపత్రులకు తాళాలు వేశారు. పరీక్షలు నిర్వహిస్తూ భ్రూణహత్యలకు కారణమవుతున్న అధికారులను స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న షేక్‌ గఫార్, సంపేట అశోక్‌, అర్వపల్లి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఖమ్మం