గద్దర్

21:28 - November 5, 2017

హైదరాబాద్ : సచివాలయానికి వాస్తు బాగోలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ప్రశ్నించారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్...తన మనవడిని తెలుగు మీడియం స్కూల్లో ఎందుకు చదివించడం లేదన్నారు. టీమాస్‌ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్‌పై కంచ ఐలయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. అటు ప్రజాగాయకుడు గద్దర్‌ సైతం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో జరిగిన టీమాస్‌ ఆవిర్భావ సభలో వక్తలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సచివాలయానికి వాస్తు బాగోలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ప్రశ్నించారు. కొత్త సచివాలయం నిర్మించాలన్న కేసీఆర్ ఆలోచనే తప్పని... దానిపై ఖర్చు పెట్టే బదులు, ఆ నిధులను పత్తి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వినియోగిస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్... తన మనవడిని మాత్రం తెలుగు మీడియం స్కూల్లో ఎందుకు చదివించడం లేదని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వరంగల్‌లోని పత్తి మార్కెట్ ను సందర్శించి, అక్కడి వ్యాపారుల ఆగడాలు బయటపెడతామని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి పత్తి రైతు ఇంట్లో టీమాస్ నిద్ర చేస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ప్రజా గాయకుడు గద్దర్ ప్రదర్శించిన కళారూపం ఆహూతులను ఆలోచింప చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేకున్నా కొత్త సచివాలయ నిర్మాణం చేస్తోందని గద్దర్‌ అన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో నిర్మాణం చేయాలంటే ముందుగా అక్కడి ప్రజల ఆమోదం పొందాలన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఎందరో వీరులు నివాసమున్నారని గుర్తు చేశారు. దళితులు, బహుజనులకు ప్రభుత్వం బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని... స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ జాన్‌ వెస్లీ అన్నారు. ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించకపోతే.. జనవరి నుంచి టీమాస్‌ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా టీమాస్‌ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందన్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ చలోక్తులు, విమర్శలు..ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రశ్నలతో టీమాస్‌ ఆవిర్భావ సభ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 

20:56 - October 17, 2017
06:42 - October 15, 2017

ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో టీ-మాస్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు టీ-మాస్‌ ఫోరం స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రజల భవిష్యత్‌ కోసమే టీ-మాస్‌ ఏర్పడిందన్నారు గద్దర్‌. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చిన నేతలు.. హామీలన్నీ విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తుందన్నారు సాయిబాబు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరముందన్నారు. ఇక ఈ సభలో ఆడపిల్లలపై గద్దర్‌ పాడిన అందరిని అలరించింది. 

17:31 - September 22, 2017

హైదరాబాద్: పాటలతో కదం తొక్కే ప్రజా యుద్ధ నౌక గద్దర్‌..బతుకమ్మ ఆడి సందడి చేశారు. టీమాస్‌ ఫోరం ఆధ్వర్యంలో చదువుల బతుకమ్మ సంబరాలు...హైదరాబాద్‌ సుందరయ్యపార్కులో ఘనంగా జరిగాయి. విద్యార్థినులు, మహిళలు బతుకమ్మ ఆడారు. ఆడపిల్లలను ఎదగనిద్దాం, బతుకనిద్దాం, చదువనిద్దాం అన్న నినాదంతో చదువుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు గద్దర్‌ తెలిపారు. 

08:14 - September 17, 2017

వికారాబాద్ : తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి సమగ్ర అభివృద్ధి జరగాలని టీమాస్‌ నేత , ప్రజాయుద్ధనౌక గద్దర్‌ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మాదిరిగానే...  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా పెన్షన్‌ విధానాన్ని వర్తింపచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీమాస్‌ తెలంగాణ సామాజిక సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వంపై రాజీలేని పోరుచేస్తుందని హెచ్చరించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని కొండా బాలకిష్టారెడ్డి గార్డెన్‌లో టీమాస్‌ జిల్లా ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న గద్దర్‌... హక్కుల సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఇదే సభలో పాల్గొన్న విమలక్క... కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మనుధర్మ శాస్త్రం అమలు చేస్తూ దళితులపై దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం బహుజన బతుకమ్మ గోడ పత్రికను నేతలు ఆవిష్కరించారు. 

17:58 - September 12, 2017

హైదరాబాద్ : కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై ప్రజా గాయకుడు గద్దర్ స్పందించారు. కంచె ఐలయ్యపై బెదిరింపులను ఆయన ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛతోనే రచయితగా ఐలయ్య ఆయన పని చేశారని చెప్పారు. తాను ఆర్యను కాదు...ద్రవిడ్ నని అన్నారు. తెలంగాణలో కోమటోళ్లను ఆర్యవైశ్యలు అనరని... కోమటోళ్లే అంటారని తెలిపారు. మాదిగోడా, మాలోడా, గొల్లోడా అని అగ్రకులాలు వారు దుర్బాషలాడేవారని.. అసభ్య పదజాలంతో తిట్టేవారు...
అవమానకర మాటలతో పిలిచే వారని.. వాటికి తాము ఎలా బాధపడాలని ప్రశ్నించారు. కంచె ఐలయ్యను చంపేప్తామని వేలాది ఫోన్ కాల్స్ రావడం దేనికి సంకేతం అన్నారు. ఇది కుట్ర పూరితంగానే చేస్తున్నారని అన్నారు. చంపేస్తం, నరికేస్తం అనడం భావ్యం కాదని... వీలైతే పుస్తకంపై చర్చ పెట్టాలని, అభిప్రాయాలు తెలపాలని అన్నారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందో లేదో ప్రధాని మోడీని అడుగుతున్నానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:07 - September 9, 2017

హైదరాబాద్ : తన కళల ద్వారా ప్రజలను కదిలించిన కళాకారుడు గరికపాటి రాజారావు అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. నాటక రంగాన్ని గరికపాటి బతికించారని కొనియాడారు. గరికపాటి రాజారావు వర్దంతి సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సభలో పాల్గొన్న గద్దర్‌.. మాట కంటే పాట, కళ గొప్పదని అన్నారు. కళాకారులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఇదే సభలో పాల్గొన్న నటుడు మాదాల రవి...ప్రజాకళలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్ధంతి సభలో  పీఎన్‌ఎం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 

06:28 - August 10, 2017

రంగారెడ్డి : దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రజా సంఘాలు ఐక్యం కావాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల వేదిక పిలుపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు బొందపెట్టేందుకు ఐద్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీ-మాస్‌ ఆవిర్భావ సభలో ప్రసంగించిన నేతలు చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలనతో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిరాశే మిగిలిందని సామాజిక ప్రజా సంఘాల వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీ మాస్‌ ఆవిర్భావ సభ జరిగింది. తెలంగాణలో పలు ఉద్యమాలు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి. సామాజిక న్యాయం కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ఈ చారిత్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల వేదిక... టీ మాస్‌ ఆవిర్భావ సభను కూడా ఇబ్రహీంపట్నంలోనే నిర్వహించారు.

దొరల పాలనకు వ్యతిరేకంగా..
తెలంగాణలో సాగుతున్న దొరల పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ప్రజా సంఘాలను ఏకం చేయాలని ఈ సమావేశంలో తీర్మానిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకులు పిలుపు ఇచ్చారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్‌ మాయమాటలతో ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని సభలో ప్రసంగించిన నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌, కూతురు కవితలు సాగిస్తున్న దందాలను ప్రశ్నిస్తుంటే.. వీరిరువురు నోరు పారేసుకుంటున్న విషయాన్ని టీ మాస్‌ నేతలు ప్రస్తావించారు. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నింటిని సంఘటితంచేసి... ఐక్య ఉద్యమానికి సిద్ధం చేయాలని నిర్ణయించారు.

టీమాస్ సభలు..
ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో స్కాముల స్వాములు ఎక్కువయ్యారని టీ మాస్‌ నేతలు విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుని దాచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్‌ నిరంకుశంగా పాలిస్తున్నారని ఆరోపిస్తూ, దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలను ఐక్యం చేసేందుకు టీ మాస్‌ సభలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయిచారు. 

21:23 - July 28, 2017

జనగాం : ప్రజా సమస్యలపై సమర శంఖం పూరించింది టీ మాస్..281 ప్రజా, సామాజిక సంఘాలతో కలిసి టీ మాస్ ఆవిర్భవించింది. జనగాం జిల్లాలోని పూర్ణిమా గార్డెన్‌లో టీ మాస్ ఆవిర్భావ సభ జరిగింది. సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ. కంచ ఐలయ్య, గద్దర్, విమలక్కలతో పాటు ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల నేతలు పాల్గొన్నారు. సభకు ముందు టీ మాస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్ని చైతన్య పరుస్తూ ఆట పాటలతో అలరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించి.. దోపిడి వ్యవస్థను అరికట్టేందుకే టీ మాస్‌ను ఏర్పాటు చేశామన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. టీ మాస్‌లో అందరూ చేరాలని పిలుపునిచ్చారు.

 

16:42 - July 28, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా టీ మాస్ ఫోరమ్ పనిచేస్తుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. టీ మాస్ ఫోరమ్ ఆధ్వర్యంలో జనగాంలో నిర్వహించిన ర్యాలీలో గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ తో టెన్ టివి ముచ్చటించింది. తెలంగాణలో ప్రజలందరికీ న్యాయం జరిగేలా సామాజిక తెలంగాణ సాధించి తీరతామని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదన్నారు. ప్రజల శక్తి ఎదుట ఏ శక్తి నిలవలేదని, మాస్ అంటే ప్రజలు పేర్కొన్నారు. నిశబ్దం బ్రేక్ అవుతుందని..ప్రజా సంఘాలు నిప్పులా ఏకమౌతాయన్నారు. సామాజిక తెలంగాణ సాధిస్తామని లక్షలాది మంది ప్రజలు ఏకమౌతున్నారని పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - గద్దర్