గుంటూరు

21:45 - December 18, 2018

గుంటూరు : ఓటరు కార్డులు బ్రెయలీ లిపిలో కూడా ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియా చెప్పారు. వికలాంగులకు ఎన్నికలను చేరువ చేయడంపై వివిధ శాఖలతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని సిసోడియా తెలిపారు. వారిని‌ పోలింగ్‌ బూత్‌లకు చేర్చేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఓటరు కార్డులు కూడా బ్రెయిలీ లిపిలో ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని.. దీన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో 12లక్షల మంది దివ్యాంగులు..
ఏపీలో 12లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు సిసోడియా వివరించారు. వీరిలో ఓటర్లను లెక్కించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ఏపీలో ఐదున్నర లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వీరందరికీ ఓటు హక్కు ఉందో లేదో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వారీగా దివ్యాంగుల లెక్కింపు చేపడతామన్నారు. పూర్తిస్థాయి గణాంకాలతో దివ్యాంగుల జాబితా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళా శిశు, సాంఘిక, దివ్యాంగ సంక్షేమ శాఖల అధికారులు దీనిలో పాల్గొన్నారు.

 

21:50 - December 5, 2018

గుంటూరు : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలో 24 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 10 నుంచి 31 వరకు ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

14:50 - November 30, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా..గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే గా, టీడీపీ నేత అయిన  రావెల కిశోర్ బాబు పార్టీకి వీడ్కోలు పలకనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ సమక్షంలో రావెల జనసేన తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రావెల పవన్‌తో రెండు సార్లు  భేటీ అయ్యారు. పలు ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి రావెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసహనంతో వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వీడుతున్నారనే వార్తలతో టీడీపీ అధిష్టానం కొంతమంది రాజకీయ పెద్దలతో బుజ్జగింపుల రాయబారాలు నడుపుతున్నట్లుగా కూడా సమాచారం. రావెల మెత్తబడతారా లేక జనసేనలోకి వెళేందుకే సిద్ధపడతారా? అనే విషయం తెలియాల్సివుంది. 
 

 

17:07 - November 26, 2018

గుంటూరు : తెలుగుజాతి ప్రయోజనాల కోసం శతృవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని వ్యవస్థల్ని దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.  ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని.. రాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని.. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నం జరుగుతోందని.. తెలుగుజాతి ప్రయోజనాల కోసం శత్రవుతో చేతులు కలిపానన్నారు. కాగా గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతు..చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. 

కాగా ఆనాటి కాంగ్రెస్ పార్టీపై వున్న ఆగ్రహంతోను..తెలుగువారి ఆత్మగౌరవం కోసం దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈనాటి రాజకీయ పరిస్థితుల రీత్యా ఇటు తెలంగాణలోను..అటు కేంద్రంలో కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలను కూడగట్టి థర్డ్ ఫ్రంట్ కు యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి విభజన హామీలు నెరవేర్చకుండా చేస్తున్న నేపథ్యంలో పలు రాజకీయ పరిణామాల మధ్య చంద్రబాబు జాతీయ నేతలను కూడగట్టి మూడవ ఫ్రంట్ కు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ తో పొత్తుల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమనీ.. టీడీపీ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ కాళ్లపై చంద్రబాబు పడవేసారని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు  చేసినట్లుగా భావించవచ్చు.

10:14 - November 26, 2018

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో బృహత్తర నీటిపారుదల పధకానికి శ్రీకారం చుట్టింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం  చేస్తూ నిర్మించే ప్రాజెక్టు మొదటి దశ పనులకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్ధాపన చేయనున్నారు. గుంటూరుజిల్లా నకరికల్ వద్ద ఆయన ఈపనులను ప్రారంభిస్తారు. 
మొత్తం 5 దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.85,100 కోట్లవుతుందుని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేశారు.  తొలిదశలో రూ.6,020 కోట్లతో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, నవయుగ కంపెనీలు  ప్రాజెక్టు పనులు చేపడుతున్నాయి. ప్రాజెక్టు తొలిదశలో 2019కల్లా గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడికాలువ వరకు తీసుకు రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. గోదావరి వరద కాలంలో 73టీఎంసీల  నీటిని నాగార్జునసాగర్ లోకి తీసుకువచ్చి సాగర్ కుడికాలువ కింద ఉన్న 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించనున్నారు. 
గడచిన 4 ఏళ్లకాలంలో సముద్రంలోకి వృధాగా వెళ్లే 254 టిఎంసిల గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కి తీసుకువచ్చి 13 లక్షల ఎకరాల్లో పంటలు వేసుకునేందుకు ప్రభుత్వం కృషి చేసింది. కృష్ణాడెల్టాలో సరైన వర్షాలు లేకపోయినప్పటికీ పట్టిసీమ ద్వారా వచ్చే నీటితో రైతాంగం పంటలు వేసుకుంటోంది. ఇప్పుడు గోదావరి, పెన్నా నదుల అనుసంధానంలో మొదటి దశ పూర్తయితే గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని 82 మండలాలాకు ప్రయోజనం చేకూరుతుంది. 

08:59 - November 21, 2018

గుంటూరు : వంశోధారకుడు వుంటేనే పున్నామ నరకం నుండి తప్పిస్తాడనే వెర్రి ఆశ ఓ మాతృమూర్తి ప్రాణం తీసింది. ఆరుగురు ఆడపిల్లలను అనాథలను చేసింది. ఒక్కరిద్దరు పిల్లలను కని పెంచేందుకే నానా అవస్థలు పడుతున్న నేటి రోజుల్లో మగపిల్లాడు పుట్టాలనే ఆశతో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి ఆశ నిరాశే అయ్యింది. ఆరు కాన్పులతో శక్తి హరించుకుపోగా తాళలేని ఆ తల్లి అశువులు బాసింది. వంశోద్ధారకుడి కోసం ఆశ చావని ఆమె ఆరో కాన్పులోనైనా పుడతాడని ఆశపడింది. అయితే, అదే ఆమెకు చివరి కాన్పు అవుతుందని ఊహించలేకపోయింది. మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అసువులు బాసింది. గుంటూరు జిల్లా గురజాలలో జరిగిందీ విషాద ఘటన.

స్థానిక ఎస్సీ కాలనీలో నివసిస్తున్న చిలుకూరి మేరీ సునీత అనే 26 మహిళ ఇంటి ఈ విషాదం చోటుచేసుకుంది. రిక్షా కూలిగా కాలం వెళ్లదీస్తున్న నాగేశ్వరరావు పదేళ్ల క్రితం సునీతను వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరికి  ప్రసన్న, ప్రేమవతి,  చంద్రిక, సాగరమ్మ, మరియమ్మ అనే ఐదుగురు అమ్మాయిలు జన్మించారు. అయితే, అబ్బాయి కావాలంటూ పట్టుబట్టిన ఆమె బంధువులు వద్దని వారించినా మరోమారు గర్భవతి అయింది. అనంతరం నవంబర్ 19వ తేదీన సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతూ గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అమ్మాయికి జన్మనిచ్చిన అరగంట తర్వాత శిశువు మృతి చెందింది. అనతరం కొద్దిసేపటికే సునీత కూడా మృతి చెందింది. తాము వద్దని మొత్తుకున్నా వినకుండా అబ్బాయి కావాలని పట్టుబట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆడపిల్ల అయినా..మగపిల్లాడైనా ఒక్కటే అనే భావన సమాజంలో రావాల్సిన అవసరముంది. దీనిపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే కాదు సమాజంలో కూడా రావాలని ఆశిద్దాం.
 

20:36 - November 20, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ ఓట్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,47,019 బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించింది. జిల్లాల వారీగా బోగస్ ఓట్ల సంఖ్యను ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. అత్యధికంగా అనంతపురంలో 3,55,819 బోగస్ ఓట్లు, అత్యల్పంగా కడపలో 91,377 బోగస్ ఓట్లు నమోదు అయ్యాయని తెలిపింది. ఈ జాబితాను అనుమానాస్పద ఓట్ల జాబితా పేరుతో ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
జిల్లాల వారీగా బోగస్ ఓట్ల జాబితా
1. శ్రీకాకుళం -    1,23,233
2. విజయనగరం - 1,10,036
3. విశాఖపట్నం - 2,00,767
4. తూర్పు గోదావరి - 2,04,370
5. పశ్చిమ గోదావరి - 1,24,085
6. కృష్ణా - 1,12,555
7. గుంటూరు - 2,07,209
8. ప్రకాశం  - 1,41,812
9. నెల్లూరు - 2,19,736
10. కడప - 91,377
11. కర్నూలు - 3,13,032
12. అనంతపురం - 3,55,819
13. చిత్తూరు - 3,42, 961

 

15:05 - November 19, 2018

గుంటూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి అయ్యే ఛాన్స్ ఉందని ఆ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తే మూడో ఫ్రంట్‌‌లో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వెలిబుచ్చారు. గతంలో దేవెగౌడ ప్రధాని ఎలా అయ్యారో గుర్తు చేశారు. తక్కువ ఎంపీ సీట్లు గెలిచినా దేవెగౌడ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను నరసరావు పేట నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రాయపాటి తెలిపారు. 
ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీయే నుండి బయటకు వచ్చిన అనంతరం బాబు కేంద్రంపై దాడి తీవ్రతరం చేశారు. మూడో కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు జాతీయ పార్టీ నేతలతో బాబు సమాలోచనలు జరిపారు. నవంబర్ 19వ తేదీ సోమవారం కోల్ కతాకు వెళ్లి మమతతో భేటీ కానున్నారు. మరి రాయపాటి జోస్యం ఫలిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:38 - November 16, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హోంశాఖ నిర్ణయంపై రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. సీబీఐపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చినరాజప్ప తెలిపారు. మేధావుల నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సీబీఐపై ఇప్పటికీ విశ్వాసం ఉందన్నారు. కేంద్ర సంస్థలపై దాడులు చేసే అధికారం ఏసీబీకి లేదన్నారు.  ప్రస్తుతం సాధారణ సమ్మతి మాత్రమే వెనక్కు తీసుకున్నామని తెలిపారు. కేంద్రానికి భయపడే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. 

 

07:40 - November 15, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక చిహ్నంలో ప్రభుత్వం మార్పులు చేసింది. చిహ్నంలోని ఏపీ గవర్నమెంట్‌ అని రాసి ఉన్న ఆంగ్ల పదాలను మార్చింది. తెలుగులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యమేవ జయతే అనే పదాన్ని, పూర్ణకుంభంలోని పదాలనూ తెలుగులోకి మార్చింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - గుంటూరు