గుజరాత్

06:45 - November 23, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ బలం పుంజుకుంది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. అధికారంలోకి వస్తే పాటీదార్‌ రిజర్వేషన్లపై ప్రత్యేక బిల్లు తెచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు హార్దిక్‌ పటేల్‌ వెల్లడించారు. గుజరాత్‌లో ఓట్లను చీల్చేందుకు బిజెపి 200 కోట్లు ఖర్చు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి మద్దతు లభించింది. పాటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లు పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పటేల్‌ రిజర్వేషన్లపై ప్రత్యేక బిల్లు తెస్తుందని పటేల్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు.

తనని కాంగ్రెస్‌ ఏజెంట్‌గా బిజెపి చిత్రీకరించడంపై హార్దిక్‌ పటేల్‌ మండిపడ్డారు. రాజకీయంగా తనకు ఏ పార్టీతో సంబంధం లేదని... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని తాము సీట్లు కోరలేదని చెప్పారు. పాస్‌ నేతలను ఎన్నికల బరిలో దింపేందుకు బిజెపి డబ్బులు ఆఫర్‌ చేసినా వాటిని తిప్పి కొట్టారని హార్దిక్‌ గుర్తు చేశారు. ఓట్లను చీల్చేందుకు బిజెపి స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపిందని...ఇందుకోసం 2 వందల కోట్ల నిధులు ఏర్పాటు చేసిందని పటేల్‌ ఆరోపించారు. బిజెపికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందంటే... పరోక్షంగా తాము కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినట్లేనని ఆయన స్పష్టం చేశారు.

హార్దిక్‌ పటేల్‌ ప్రకటనపై బిజెపి డిప్యూటి సిఎం నితిన్‌ పటేల్‌ తీవ్రంగా స్పందించారు. ఓ మూర్ఖుడు దరఖాస్తు ఇచ్చాడు....మరో మూర్ఖుడు ఒప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. పటేల్‌ సామాజిక వర్గం ఐక్యతను చెడగొడుతున్నాడని హార్దిక్‌ పటేల్‌పై మండిపడ్డారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి ఇచ్చిన మద్దతు కాంగ్రెస్‌ పార్టీకి ఎంతవరకు లాభిస్తుందనేది వేచి చూడాలి.

07:29 - November 22, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల పంపకాలపై పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితికి కాంగ్రెస్‌కు మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రకటనపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. హార్దిక్‌ పటేల్‌ గురువారం నాటి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చే ప్రకటన మళ్లీ వాయిదా పడింది. అంతకు ముందు నవంబర్‌ 18న గాంధీనగర్‌లో జరిపే ర్యాలీలో కాంగ్రెస్‌ మద్దతుపై ప్రకటన చేస్తామని హార్దిక్‌ పటేల్‌ అన్నారు. కానీ ఏకంగా సభనే రద్దు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై పటేల్‌ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 77 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్దిక్‌ పటేల్‌కు సన్నిహితులైన లలిత్‌ వసోయా, అమిత్‌ థమ్మర్‌లకు మాత్రమే టికెట్‌ లభించింది. మరో 20 స్థానాలు కేటాయించాలని పాస్‌ డిమాండ్‌ చేస్తోంది. 

 

08:35 - November 21, 2017

గుజరాత్‌ : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై పటేల్‌ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ ప్రకటించిన లిస్టులో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న పటేల్‌ సామాజిక కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పటేల్‌ సామాజిక కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో బాహా బాహీకి దిగారు. ఆగ్రహంతో సూరత్‌, అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయాలపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమను సంప్రదించకుండా సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడంపై కాంగ్రెస్‌పై వారు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 77 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఇందులో పటేల్‌ వర్గానికి 23 స్థానాలు కేటాయించింది. ఈ జాబితాలో హార్దిక్‌ పటేల్‌కు సన్నిహితులైన లలిత్‌ వసోయా, అమిత్‌ థమ్మర్‌లకు టికెట్‌ లభించడంపై కాంగ్రెస్‌ తమను మోసం చేసిందని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

 

21:48 - November 17, 2017

ఆహ్మదబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది. 70 మంది పేర్లతో కూడిన ఈ జాబితాలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌తో పాటు నలుగురు మహిళలున్నారు. 70 మంది అభ్యర్థుల్లో 49 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు తిరిగి టికెట్‌ దక్కించుకున్నారు. పాటీదార్‌ సామాజిక వర్గానికి చెందిన 13 మందికి బిజెపి టికెట్‌ కేటాయించింది. వీరితో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కూడా బిజెపి టికెట్‌ దక్కింది.

15:52 - November 15, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి 'పప్పు' అని వ్యాఖ్యనించడాన్ని ఎన్నికల కమిషన్‌ తప్పు పట్టింది. ఎన్నికల ప్రచారం, ప్రకటనల్లో పప్పు అనే పదాన్ని ఉపయోగించకుండా దానిపై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి... రాహుల్‌ను ఉద్దేశించి పప్పు అనే పదాన్ని ముద్రించింది. దాన్ని పరిశీలించిన ఈసీ...పప్పు అనే పదం అభ్యంతరకరంగా ఉందని... ఆ పదాన్ని తొలగించాలని సూచించింది. ఓ రాజకీయ నాయకుడిని అలా పిలవడమంటే... ఆయనను అవమానించడమేనని ఈసీ స్పష్టం చేసింది. గుజరాత్‌లో డిసెంబరు 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

21:28 - November 14, 2017

గుజరాత్ : రాష్ట్ర ఎన్నికల ముందు పాటీదార్‌ ఉద్యమనేత హర్దిక్‌ పటేల్‌ సెక్స్‌ సీడీ క్లిప్పింగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీడీలో ఉన్నది హార్దిక్‌ పటేలేనని మాజీ అనుచరుడు అశ్విన్‌ అన్నారు. సీడీలో ఉన్నది తాను కానని హార్దిక్‌ పటేల్‌ చెబుతున్నారు. తనపై బురద చల్లేందుకు బిజెపి నీచ రాజకీయాలకు ఒడిగట్టిందని ఆరోపిస్తున్నారు. ఈ సీడీ వ్యవహారంలో దళిత యువనేత జిగ్నేష్‌ మేవాని హార్దిక్‌ పటేల్‌కు అండగా నిలిచారు. శృంగారం అనేది ప్రాథమిక హక్కని...దానికి భంగం కలిగించే హక్కు ఎవరికి లేదని పేర్కొన్నారు. తాజాగా మే 22కు చెందిన ఓ వీడియోలో హార్దిక్‌ పటేల్‌ తన సహచరులతో పాటు ఓ మహిళ కూడా కనిపిస్తోంది.

సోమవారం కూడా మే 18కి చెందిన ఓ వీడియో వెలుగు చూసింది. ఇందులో ఓ మహిళతో హార్దిక్‌ పటేల్‌ ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియో వ్యవహారంపై దళిత యువ నేత జిగ్నేశ్‌ మెవానీ స్పందించారు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని హర్దిక్‌ పటేల్‌కు మద్దతుగా నిలిచారు. ''హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు'' అని జిగ్నేష్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్‌ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్‌ సలహా ఇస్తున్నారు.

ఈ వీడియో క్లిప్‌ను ఒకప్పుడు హార్దిక్‌కు సహచరుడిగా ఉన్న అశ్విన్‌ బయటపెట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో విషయంలో తనకు, బిజెపికి ఎలాంటి సంబంధం లేదని అశ్విన్ సంకడ్‌ సరియా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కనివారే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వీడియోలో ఉన్నది హార్దిక్‌ పటేలా...కాదా...అన్నది తేల్చాలన్నారు. ఈ సిడిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపాలని డిమాండ్‌ చేశారు.

ఈ వీడియోలు ఫేక్‌వనీ...అందులో ఉన్నది తాను కానని....గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లేందుకు నీచ రాజకీయాలకు ఒడిగడుతోందని హార్దిక్‌ పటేల్‌ విమర్శించారు. ఆ వీడియోలో ఉన్నది తానే అయితే ధైర్యంగా ఒప్పుకుంటానని తెలిపాడు. ఎవరు ఏం చేసినా చేసుకోండి.... ఇలాంటి వాటికి తాను భయపడి వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశాడు. నన్ను అవమానించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని హార్దిక్‌ చెప్పాడు.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కావాలని కోరుతూ హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో గుజరాత్‌లో భారీ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. పాటీదార్‌ సామాజికవర్గం రిజర్వేషన్లపై అధికార బిజెపి వెనకడుగు వేయడంతో ఈ ఎన్నికల్లో ఆ వర్గం కమలానికి దూరమైంది. హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో బిజెపి పటేల్‌ను టార్గెట్‌ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

06:33 - November 12, 2017

ఢిల్లీ : జీఎస్టీ స్లాబుల తగ్గింపు నిర్ణయం గుజరాత్‌ ఎన్నికల కోసమే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. అత్యవసరంగా జీఎస్టీ అమలు చేయాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకొచ్చిందో దేశప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుచేశామని అంగీకరించే నైతిక ధైర్యం ఆర్థికమంత్రికి ఉండాలన్నారు. ఈ విషయంలో దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

08:41 - November 11, 2017

జిఎస్‌టి అమలుపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువులను శ్లాబ్‌ నుంచి తప్పిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం శ్లాబు పరిధిలో కేవలం 50 వస్తువులకే పరిమితం చేశారు. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కాట్రగడ్డ ప్రసూన్న (బీజేపీ), కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

12:52 - November 5, 2017

గుజరాత్ : రెండో టీ20లో న్యూజిలాండ్‌ మెరిసింది. టీమ్‌ ఇండియాపై అద్భుత విజయం సాధించింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్‌ 40 పరుగుల తేడాతో గెలుపొందింది.  దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది.  మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌జట్టు 196 పరుగులు చేసింది.  కివీస్‌ బ్యాట్‌మెన్‌ కొలిన్‌ మన్రో వీరవిహారం చేశాడు.  58 బంతుల్లోలనే 109 రన్స్‌ చేశాడు. మార్టిన్‌ గప్తిల్‌ 45రన్స్‌ చేసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. 197 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా... మొదటి నుంచి తడబడింది.  కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ 65 రన్స్‌, ఎంఎస్‌ ధోని 49 రన్స్‌ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ నాలుగు వికెట్లు తీసి భారత్‌ నడ్డివిరిచాడు. కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మన్రోకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సిరీస్‌ 1-1తో సమం కావడంతో మంగళవారం తిరువనంతపురంలో జరిగే మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక రెండు జట్లు చావోరేవో అక్కడే తేల్చుకోనున్నాయి. 

16:27 - October 25, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఏడాది డిసెంబర్‌ 9,14 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంలో జాప్యం జరిగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మరింత సమాచారాన్ని వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - గుజరాత్