చంద్రబాబు

06:54 - June 23, 2018

విజయనగరం : చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్న గజదొంగని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చంద్రబాబును గెలిపిస్తే.. ఆయన రాష్ట్రం కోసం చేసిందేమి లేదని విమర్శించారు. విజయనగరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్ర నెరవేర్చిందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. తరువాత హోదా అంటూ మాటమార్చారని విమర్శించారు. తాజాగా కడప ఉక్కు కర్మాగారంపై ఎంపీలతో డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ.

06:51 - June 23, 2018

విజయవాడ : ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఏఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఆయా పార్టీల అగ్రనాయకుల కదలికలూ దీనికి తగ్గట్లే ఉంటున్నాయి. వైరి పక్షంపై వాడి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవసరం అనుకున్నవారిని కలుపుకు పోయే చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాలక తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టగలడని భావిస్తోన్న పవన్‌ కల్యాణ్‌తో సఖ్యతకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వైసీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందన్న భావనతో.. పవన్‌తో కలిసి వెళ్లాలనే వైసీపీ కిందిస్థాయి నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌కు మంచి మిత్రుడని పేరున్న వైసీపీ ఎంపీ వరప్రసాద్‌.. శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

అటు తెలుగుదేశం అధినాయకత్వం.. పవన్‌ కల్యాణ్‌తో సఖ్యత ఇక అసాధ్యమన్న రీతిలోనే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. గుంటూరు జిల్లా నంబూరులో శుక్రవారం జరిగిన శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చాలా సేపటివరకూ పలుకరించుకోక పోవడం ప్రత్యేకంగా కనిపించింది.

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చివర్లో నవధాన్యాల సమర్పణ వేళ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మొక్కుబడిగా కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీన్నిబట్టి.. తెలుగుదేశం పార్టీ... గత ఎన్నికల నాటి మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ను పూర్తిగా దూరంగా చేసుకున్నట్లే అని అర్థమవుతోంది. ఈ దశలో... ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. పవన్‌ కల్యాణ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగానే భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల పొత్తుల అంశం చర్చకు రాకున్నా.. ఆయా పార్టీల నాయకులు.. మద్దతు సమీకరణలపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ మరే పార్టీతో జతకడుతుందో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

06:47 - June 23, 2018

విజయవాడ : ప్రతిపక్ష పార్టీలన్నీ టీడీపీపై విష‌ప్రచారం చేస్తున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితిపై సమీక్షించిన చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసుల మాఫీ కోసం జగన్‌ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శించారు. వైసీపీ ఉపఎన్నికలు రాకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుని.. రాజీనామాలతో డ్రామా ఆడుతోందన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాయని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు.

12:19 - June 22, 2018
06:54 - June 22, 2018

శ్రీకాకుళం : చంద్రబాబు చెప్పేవన్నీ అవాస్తవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. టీడీపీ పాలనలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని మండిపడ్డారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రాణత్యాగం అవసరం లేదని కేంద్రం ఇచ్చిన హామీలపై చిత్తశుద్ది ఉందని కన్నా తెలిపారు.--

06:50 - June 22, 2018

విశాఖపట్టణం : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 23 వేల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదివేల మంది ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే పోలీసు, ఇతర శాఖల్లో మరో 10 వేల మందిని నియమిస్తామన్నారు. సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో మరో మూడువేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని విశాఖపట్నంలో జరిగిన మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించారు. ముందుగా ఏపీ హెల్త్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత మూడవ విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 9 వేల 54 పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంత మంది లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పట్టాలు ఇచ్చిన చంద్రబాబు... మిగిలినవి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. పట్టాల పంపిణీలో అవినీతికి తావులేకుండా పకడ్బందీ ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు లబ్ధిదారుల దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మత్స్యకారులను ఎస్టీల జాబితాలో, రజకులను ఎస్సీల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. అంతకుముందు ఏపీ హెల్త్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన చంద్రబాబు... అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ తరహాలో విశాఖను ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు. నూతన ఆవిష్కరణకు విశాఖ కేంద్రంగా మారుతున్న విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు మూడు రోజులుగా అలకవహించి విధులకు దూరంగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

06:33 - June 20, 2018

ప్రకాశం : కర్నాటక ఎన్నికలు బీజేపీ ప్రభుత్వానికి ట్రైలర్‌ మాత్రమేనని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. బీజేపీకి అసలైన సినిమా 2019లో ఉంటుందన్నారు. తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా.. మాడిమసై పోతారని... ప్రధాని మోదీకి కూడా అదే గతిపడుతుందని ఆయన హెచ్చరించారు. దేశంలో బీజేపీ భవిష్యత్‌ గల్లంతైందన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించిన లోకేష్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా చీరాలలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. చీరాలకు ఉదయమే చేరుకున్న లోకేష్‌.... మధ్యాహ్నం వరకు తన పర్యటనను కొనసాగించారు. తొలుత చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చేనేతపురి కాలనీలో చేనేత కార్మికుల గృహాలను పరిశీలించారు. చేనేత మగ్గం నేసిన లోకేష్‌... చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం రామాపురంలో మత్స్యకారులకు బోట్లు, వలలు పంపిణీ చేశారు. 50ఏళ్లు దాటిన మత్స్యకారులకు వెయ్యి రూపాయల చొప్పున పించను పంపిణీ చేశారు.

కొత్తపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన జంజనం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ సభలో లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైసీపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నాటక ఎన్నికలు బీజేపీకి ట్రైలర్‌లాంటివని... 2019లో అసలైన సినిమా ఉంటుందన్నారు. ఏపీ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నిక చేసిన వారే దేశ ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని లోకేష్‌ అన్నారు. వైసీపీ బీజేపీతో చేతులు కలిపి ఆ అభివృద్ధిని అడ్డుకునేందుఉ ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

19:20 - June 19, 2018

పశ్చిమగోదావరి : పట్టిసీమ వల్ల మూడు సంవత్సరాల్లో 5 వేల 500 టీఎంసీల నీరు ఇచ్చామన్నారు మంత్రి దేవినేని ఉమ. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే 8 వేల 500 కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకా 1400 కోట్లు కేంద్రం నుంచి రావల్సి ఉందని మంత్రి తెలిపారు. పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి 12 పంపుల ద్వారా 4 వేల 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జలసిరిలో భాగంగా జానంపేట కుడికాలువలో నీటి ప్రవాహానికి పూజ చేసి హారతి ఇచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని.. సీఎం చంద్రబాబు విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఈ జలసిరి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, కాటమనేని భాస్కర్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

19:19 - June 19, 2018

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యమకారులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అందుకే నాయీ బ్రాహ్మణుల మీద విరుచుకు పడ్డారన్నారు. సమస్యలను పరిష్కరించమని కోరిన వారితో చంద్రబాబు విధానం దారుణంగా ఉందన్నారు. సమస్యను పరిష్కరించకుండా పోలీసులను అడ్డు పెట్టి ఉద్యమకారుల గొంతు నొక్కేస్తున్నారని అంబటి విమర్శించారు. 

15:27 - June 19, 2018

అమరావతి : మధ్యాహ్నాం 3గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అగ్రిగోల్డ్ లో చిన్న మొత్తాల డిపాజిటర్లకు సర్కారు ఖజానా నుండి చెల్లింపులు, హైకోర్టులో ఎలా వ్యవహరించాలి, నిరుద్యోగులకు చెల్లించనున్న నిరుద్యోగభృతి ఎపపటి నుండి చెల్లించాలని అనే పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే ఏపీ సలహాదారుగా వ్యవహరిస్తున్న ప్రరకాల ప్రభాకర్ రాజీనామా విషయాన్ని కూడా క్యాబినెట్ చర్చించనుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - చంద్రబాబు